|

ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ

By: కన్నెకంటి వెంకట రమణ

ఇప్పటికే పలు రంగాల్లో చరిత్ర సృష్టించిన తెలంగాణా రాష్ట్రం ఉద్యోగాల కల్పనలోనూ – దాదాపు 80,230 ఉద్యోగాల నియామకం చేపట్టడం ద్వారా, దేశంలో మరో చరిత్రకు నాంది పలికింది. ఈ క్రమంలోనే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు పది లక్షలకు పైగా ఉద్యోగార్థులైన యువతీ, యువకులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు చేపట్టని ఉచిత శిక్షణా కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ  విభాగాలు చేపట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని  హైదరాబాద్‌ మొదలుకుంటే మండల కేంద్రాల వరకూ కాంపిటీటివ్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే యువతీ, యువకులతో  అన్ని గ్రంథాలయాలు, విద్యా సంస్థలు, ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లు, స్వచ్ఛంద సంస్థల ఇనిస్టిట్యూషన్‌లు కిటకిట లాడుతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన 80,000  పైగా ఉద్యోగాలను పొందేందుకై  కనీసం 10 లక్షల మంది యువత చదువుల్లో, ప్రిపరేషన్లలో బిజీగా ఉన్నారు. ఇక, దాదాపు 26 లక్షల మంది నిరుద్యోగ యువత టిఎస్‌పిఎస్‌సి వెబ్‌ సైట్‌లో నమోదు చేసుకున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రతి జిల్లా కేంద్రాలలోనూ, డివిజన్‌, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వంలోని వివిధ  శాఖలు, విశ్వ విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలూ, ప్రజా ప్రతినిధులు ఉచిత కోచింగ్‌ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటన్నింటికీ నిరుద్యోగ యువతనుండి పెద్ద ఎత్తున స్పందన కూడా లభిస్తోంది. ఇది, ఎంతదాకా అంటే, ఒక్క పోలీసు శాఖ నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్‌ క్యాంప్‌లకు విపరీతమైన స్పందన లభించింది. ఒక్కో కేంద్రంలో ఒక వెయ్యి మందికి శిక్షణనివ్వాలని పోలీస్‌ శాఖ నిర్ణయించుకోగా  6,000 మందికి పైగా  దరఖాస్తు చేస్తున్నారు. దీనితో, ఈ  విభాగం స్క్రీనింగ్‌ పరీక్షను నిర్వహించాల్సి వచ్చింది. అలాగే ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌, డీఎస్పీ స్థాయిలో కూడా అన్ని చోట్లా ఉచిత కోచింగ్‌ను అందజేస్తుండగా ఈ అన్నింట్లో కలిపి 10 లక్షల మంది యువత ఈ కోచింగ్‌ సెంటర్లలో బిజీగా  ఉన్నారు.  ఇంతటి, సమాన సంఖ్యలో ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలోనూ ఉద్యోగాలకి శిక్షణ పొందుతూ బిజీగా ఉన్నారు.

ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులకై ఇన్నాళ్లూ వేచివున్న కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్క సారిగా 80 వేలకు పైగా ఉద్యోగాల నియామకం చేస్తున్నట్టు ప్రకటించగానే ప్రతీ ఒక్క నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ సాధన అనే లక్ష్య సాధన దిశలో  నిమగ్నమయ్యాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్‌.సి., ఎస్‌,టీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కోటీ యాభై లక్షలు కేటాయించింది. ఒక్కో అభ్యర్థికి ఉచిత స్టడీ మెటీరియల్‌ అందచేయడంతోపాటు భోజన ఖర్చులకై రోజుకు రూ. 70 లను కొన్ని శాఖలు అందచేస్తున్నాయి. బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో లక్షా ఇరవై వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిళ్లున్నాయి. ప్రతీ నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేకంగా బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి శిక్షణనిచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణనివ్వడానికి ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. ఎస్సీ అభ్యర్థులకు రాష్ట్రంలో ఉన్న 33  సెంటర్ల ద్వారా శిక్షణనిస్తున్నారు. ఎస్టీ అభ్యర్థులకు ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం, హైదరాబాద్‌లలో ఉన్న శిక్షణ కేంద్రాల ద్వారా పది వేల మందికి శిక్షణనిస్తున్నారు.    

కాగా,  పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ నియోజకవర్గాల్లోని కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లలో సొంతంగా ఉచిత కోచింగ్‌ సెంటర్లు నడుపుతున్నారు. తమ నియోజక వర్గాల్లో కనీసం రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.  ఉద్యోగావకాశాలను ఆశించే వారికి మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, అఫ్జల్‌గంజ్‌లోని స్ట్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీలలో ప్రిపేర్‌ అవుతున్న వందలాది మంది నిరుద్యోగ యువత సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీ రూ. 5ల భోజన ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది.