రైతు మోములో ఆనందం చూడాలని..

వ్యవసాయ సీజన్‌ మొదలైందంటే చాలు రైతుల గుండెల్లో గుబులు మొదలవు తుంది. విత్తనం నుంచి కోతకోసి పంటచేతికొచ్చేదాకా పెట్టుబడి పెడుతూనే వుండాలి. ఆ పెట్టుబడి కోసం ఇంతకాలం రైతులు పడరానిపాట్లు పడుతూ వచ్చారు. భారీ వడ్డీలకు అప్పులు చేయడం, కొద్దొగొప్పో భార్యాపిల్లల మెడలో వున్న పుస్తెలతోసహా బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులుతేవడం గ్రామాలలో సర్వసాధారణ దృశ్యం. ఇంత చేసినా, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. కష్టించి పండించిన పంటకు గిట్టు బాటు ధరలులేక పంటను రోడ్లపై పారబోసే రైతుల దైన్యస్థితి దేశవ్యాప్తంగా కొనసాగు తోంది. రైతులు నిరాశ, నిస్పృహలతో అలమటిస్తున్నారు. కానీ, ఈ ఏడాది నుంచి తెలంగాణ రైతన్నలకు ఈ కష్టాలు తీరుతున్నాయి. గ్రామాలలో దృశ్యం మారుతోంది.

స్వయంగా రైతుబిడ్డ అయిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాష్ట్రంలో అన్నదాతల ఆక్రందనలకు చరమగీతం పాడాలని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలని దీక్షబూనారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ నాటినుంచి ఈ దిశలో రైతుల రుణమాఫీనుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ఎక్కడా కనీవినని విధంగా రైతులకు పంట పెట్టుబడిని అందిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూపొందించిన రైతుబంధు పథకం ఈ నెల నుంచి అమలులోకి వస్తోంది.

పంటపెట్టుబడిగా రెండుపంటలకు కలిపి ఎకరానికి 8,000 రూపాయల వంతున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఈ ఏడాది బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది. మొదటి విడతగా వర్షాకాలపు పంటకోసం ఎకరానికి 4,000 రూపాయలు , రెండో విడతగా యాసంగి పంట కోసం మరో 4,000 రూపాయలు అందించనున్నారు. పెట్టుబడి చెక్కులతోపాటు ఈసారి నూతనంగా రూపొందించిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను కూడా రైతులకు అందిస్తున్నారు.

ఈనెల 10న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం కింద ప్రతిగ్రామానికి అధికారుల బృందాలు వెళ్ళి రైతులకు నేరుగా చెక్కులు, పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఏవిధమైన గందరగోళానికి, అవకతవకులకు అవకాశం లేకుండా సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటోంది. ఇటీవల బ్యాంకులలో తగినంత నగదు నిల్వలు లేకపోవడంతో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం రైతుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొంది. పంటసాగుకు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చెక్కులు సిద్ధంచేసినా, బ్యాంకులలో తగినంత నగదు లేకుంటే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం చేకూరదు. అందుకే, రిజర్వుబ్యాంకు, కేంద్రప్రభుత్వం తదితర సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సంప్రదించి రైతులకు ప్రభుత్వం ఇస్తున్న చెక్కులు వెనువెంటనే చెల్లుబాటయ్యే విధంగా తగినంత నగదు నిల్వలు బ్యాంకులవద్ద ఉండేటట్లు చర్యలు తీసుకుంది. అంతేగాక, చెక్కులిచ్చిన రైతులకు వెనువెంటనే నగదు చెల్లించని బ్యాంకులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ హెచ్చరించారు .

ప్రభుత్వం పేదలకు పంపిణీచేసిన భూములకు, ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌ పట్టాలున్న రైతులకు, ఏజెన్సీ ఏరియాలో వ్యవసాయంచేసే గిరిజనేతరులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల సంక్షేమాన్ని ఆశించి ప్రభుత్వం అందిస్తున్న ఈ పెట్టుబడిని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి. బంగరు పంటలు పండించి దేశానికే ఆదర్శంగా నిలవాలి. మన ప్రభుత్వ లక్ష్యాన్ని, ఆశయాలను ప్రంపంచానికి చాటి చెప్పాలి.