ప్రివీ కౌన్సిల్‌ నుంచి సుప్రీం కోర్టు దాకా…

By: మంగారి రాజేందర్‌

భారత దేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్య్రం వచ్చింది. 26 జనవరి 1950 రోజున భారత దేశం గణతంత్ర దేశంగా మారిపోయింది. ఆ రోజు నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం 28 జనవరి 1950వ రోజు నుంచి తన పనులు ప్రారంభించింది.

సుప్రీంకోర్టు రాక ముందు మన దేశంలో ఫెడరల్‌ కోర్టు వుండేది. ఆ కోర్టు గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1935 ప్రకారం అమల్లోకి వచ్చింది. ఈ ఫెడరల్‌ కోర్టు కన్నా ముందు మన దేశానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం లాంటి ప్రీవీ కౌన్సిల్‌ వుండేది. ఇది బ్రిటీష్‌ కాలంలోని మాట. సుప్రీంకోర్టుని స్థాపించక ముందు మన దేశంలోని అత్యున్నత కోర్టు ఫెడరల్‌ కోర్టు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బ్రిటీష్‌ వారసత్వం ద్వారా మనకి న్యాయవ్యవస్థ వచ్చింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ మన దేశాన్ని పరిపాలించినప్పటి నుంచి ఈ న్యాయవ్యవస్థ వుంది. ఈ వ్యవస్థ ప్రకారం ప్రొవిన్షియల్‌ రాజధానుల్లో హైకోర్టులు వుండేవి. వాటిని చార్టర్‌ హైకోర్టులని పిలిచేవాళ్ళు. బొంబే, మద్రాస్‌, కలకత్తా నగరాల్లో ఈ హై కోర్టులు 90 సంవత్సరాలు పని చేశాయి. ఈ కోర్టులలో బ్రిటీష్‌ వాళ్ళు కొంత మంది భారతీయులు న్యాయమూర్తులుగా పని చేసేవారు.

ఈ హైకోర్టుల అప్పీళ్ళని ప్రివీ కౌన్సిల్‌ వినేది. దీన్ని జ్యుడిషియల్‌ కమిటీ ఆఫ్‌ ప్రివీ కౌన్సిల్‌ అని పిలిచేవారు. 200 సంవత్సరాలు ఈ ప్రివీ కౌన్సిల్‌ అప్పీళ్ళని విన్నది. ఇదే తుది ట్రిబ్యునల్‌గా (కోర్టు) పిలువబడింది. నిజానికి ఇది కోర్టు కాదు. ‘న్యాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అన్న ప్రాతిపదికన ఈ కౌన్సిల్‌ని ఏర్పాటు చేశారు.

బ్రిటీష్‌ రాజుకి సలహా ఇవ్వడం కోసం ఈ కౌన్సిల్‌ని ఏర్పాటు చేశారు. ఆ కౌన్సిల్‌ తీర్పులని వెలువరించదు. ఉత్తర్వులను జారీ చేసేది. వాటి సభ్యులని బ్రిటీష్‌ పార్లమెంట్‌ నియమించేది. వాళ్ళు తప్పక నైపుణ్యం వున్న న్యాయవాదులు కావాల్సిన అవసరం లేదు. భారత దేశం నుంచి చాలా తక్కువ అప్పీళ్ళని ఈ కౌన్సిల్‌ వినేది. 10,000 రూపాయల కన్నా విలువైన సివిల్‌ కేసులని, బలమైన న్యాయపరమైన విషయాలు వున్నప్పుడు మాత్రమే ప్రివీ కౌన్సిల్‌ స్వీకరించేది.

జాతీయ ఉద్యమం బలపడుతున్న తరుణంలో ప్రివీ కౌన్సిల్‌కి వ్యతిరేకంగా అభిప్రాయాలు మొదలయ్యాయి. డిల్లీలో జాతీయ కోర్టుని ఏర్పాటు చేయాలని 1921వ సంవత్సరంలో హరిసింగ్‌ గౌర్‌ ఓ ప్రతిపాదనని చేశాడు. ప్రివీ కౌన్సిల్‌ అనేది ఓ సలహా మండలి మాత్రమే. అది ట్రిబ్యునల్‌ కాదు. కోర్టూ కాదూ అన్న వాదనని అతడు లేవనెత్తాడు. సంక్లిష్టమైన విషయాలను అది విచారించడం లేదని, బ్రిటీష్‌ ఆదిపత్యంలో వున్న మిగతా దేశాల్లో జాతీయ కోర్టులు వున్నాయని అతను వాదించాడు. ఈ భావనని మొదట ప్రముఖమైన నాయకులు వ్యతిరేకించారు. చివరికి మహమ్మద్‌ అలీ జిన్నా ఈ ప్రతిపాదనని సభలో బలపరిచాడు. అంతే కాదు ఈ కౌన్సిల్‌ వల్ల హిందూ ‘లా’ ని చంపేసింది. ముస్లిం ‘లా’ ని నరికి వేసిందని కూడా అన్నాడు. మోతీలాల్‌ నెహ్రూ నివేదికలో జాతీయ కోర్టు ఆవశ్యకత గురించి పేర్కొన్నాడు.

1930వ సంవత్సరంలో జాతీయ కోర్టు ఏర్పాటు గురించి చర్చలు బాగా జరిగి, 1933వ సంవత్సరంలో ఫెడరల్‌ కోర్టు, సుప్రీం కోర్టు ఏర్పాటు గురించి సిఫారస్‌ చేయడం జరిగింది. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా చట్టం, 1935లో ఈ సిఫారస్‌ సాక్షి కింద ఆమోదించి ఫెడరల్‌ కోర్టు ఏర్పాటు చేయాలని నిబంధనని ఏర్పరిచారు. సుప్రీంకోర్టు ఏర్పాటును అంగీకరించలేదు. ఈ విధంగా ప్రివీ కౌన్సిల్‌ను పూర్తిగా తొలగించలేదు.

ఈ విధంగా ఏర్పాటు చేసిన ఫెడరల్‌ కోర్టు పరిధిని కూడా చాలా తక్కువగా ఏర్పాటు చేశారు. కేంద్రానికి భారతీయ బ్రిటీష్‌ రాజ్యానికి గల భేదాలను పరిష్కరించడానికి పరిమితం చేశారు. క్రిమినల్‌ కేసుల అప్పీళ్ళు యధావిధిగా ప్రివీ కౌన్సిల్‌కే వెళ్ళేవి.

మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత 28 జనవరి 1950, ఉదయం 9.45 నిమిషాలకు భారత సుప్రీంకోర్టు ప్రారంభమైంది. జస్టిస్‌ హరిలాల్‌ కానియా ప్రధాన న్యాయమూర్తిగా సయ్యద్‌ ఫజల్‌ అలీ, యం. పతంజలి శాస్త్రి, మెహర్‌ చాంద్‌ మహాజన్‌, బిజన్‌ కుమార్‌ ముఖర్జియా, ఎస్‌.ఆర్‌. దాస్‌ సుప్రీంకోర్టు న్యాయ మూర్తులుగా నియమితులయ్యారు. వీరందరి సమీక్షలలో అదే విధంగా అలహాబాద్‌, బాంబే, మద్రాస్‌, ఒరిస్సా, అస్సాం, నాగ్‌పూర్‌, పంజాబ్‌, సౌరాష్ట్ర, పాటియాలా, ఈస్ట్‌ పంజాబ్‌ రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులతో పాటు, హైదరాబాద్‌, మైసూర్‌, మధ్యభారత్‌ దేశాల (అప్పుడు అవి స్వతంత్ర ప్రాంతాలు) ప్రధాన న్యాయమూర్తులు కూడా ఆ ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు.

తేది. 29`10`1954 రోజున భారత తొలి రాష్ట్రపతి డా॥ రాజేంద్ర ప్రసాద్‌ సుప్రీంకోర్టు భవనం కోసం 17 ఎకరాల స్థలంలో శంకు స్థాపన చేశారు. గణేశ్‌ బికాజీ దిలోలికర్‌ అన్న ఆర్కిటెక్ట్‌ ఇండో, బ్రిటీష్‌ పద్ధతిలో సుప్రీంకోర్టు భవనానికి రూప కల్పన చేశారు. భవన నిర్మాణం 1958లో పూర్తయింది. అప్పటి నుంచి సుప్రీంకోర్టు కొత్త భవనంలో పనిచేయడం ప్రారంభించింది. న్యాయానికి కొలమానం అయిన త్రాసు మాదిరిగా సుప్రీం కోర్టు కన్పిస్తుంది. కుడి ఎడమ వైపున రెండు త్రాసులుగా కన్పిస్తాయి.

సుప్రీంకోర్టు మన దేశంలోని అత్యున్నత కోర్టు. అదే చివరి కోర్టు. రాజ్యాంగ పరంగా కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకి వుంది. ఆర్టికల్స్‌ 124 నుంచి 147 వరకు వున్న వాటిల్లో సుప్రీంకోర్టు స్వతంత్రతని, పరిధిని అధికారాలని పద్ధతులని చెప్పారు.

భారత రాజ్యాంగం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి కాకుండా 7గురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో వుండాలి. పార్లమెంట్‌ ఈ సంఖ్యని పెంచవచ్చు. సుప్రీంకోర్టు ప్రారంభం అయిన రోజు ఆరుగురు న్యాయమూర్తులే వున్నారు. సుప్రీంకోర్టు ప్రారంభం అయిన రోజుల్లో అందరు న్యాయమూర్తులు కూర్చొని కేసులని విచారించేవారు. పని భారం పెరగడంతో 1956లో 11గా, 1980లో 14గా, 1978లో 18గా, 1980లో 26గా, 2009లో 31గా న్యాయమూర్తుల సంఖ్యని పెంచారు. అదే విధంగా ఇద్దరు ముగ్గురుతో కలిసి బెంచీలు ఏర్పాటు చేయడం మొదలైంది.

రాజ్యాంగంలోని 145వ ఆర్టికల్‌ ప్రకారం కోర్టు నియమాలని 2013లో తయారు చేశారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టులోని భాష ఇంగ్లీషు. సారనాథ్‌లోని సింహం బొమ్మ, దాని మీద చక్రం, చక్రంలో 24 వూచలు, సింహం బొమ్మ క్రింద ‘ధర్మం ఎక్కడైతే వుంటుందో అక్కడే విజయం’ వుంటుందన్న మాటని ఏర్పాటు చేశారు.

సుప్రీం కోర్టు తోటలో ఇత్తడి శిలను ఏర్పాటు చేసి 20 ఫిబ్రవరి 1980 రోజు ఏర్పాటు చేశారు. దాని ఎత్తు 210 సెంటీమీటర్లు. బిడ్డకు ఆశ్రయం ఇస్తున్న మహిళా మూర్తి బొమ్మ, ఆమె చేతిలో తెరిచిన పుస్తకం. దాని అర్థం ` ఆమె తల్లి భారతి, ఆ బిడ్డ భారత రిపబ్లిక్‌ తెరిచిన పుస్తకం అందరికీ సమాన న్యాయం. ఈ ప్రతిమ ఉద్దేశ్యం.

17 జులై 2019 నాడు మరో అదనపు భవనాన్ని భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఆ స్థల విస్తీర్ణం 12.19 ఎకరాలు.

1.1.2021 నాటికి సుప్రీంకోర్టు ముందు వున్న కేసుల సంఖ్య 65,080. కోవిడ్‌ కారణంగా కేసుల సంఖ్య తగ్గలేదన్న వాదన కూడా వుంది.

సుప్రీంకోర్టు ప్రారంభంలోనే గోపాలన్‌, లాంటి ప్రాముఖ్యం గల కేసులని పరిష్కరించి తాను బలమైన శక్తి అని నిరూపించింది. కాల గమనంలో అలా అన్పించడం లేదని కొందరి అభిప్రాయం. చూద్దాం కాలం ఇంకా ఏమి చెబుతుందో.