|

గాంధీ రచనలు నాలో ఉత్సాహం నింపాయి

By: డా. నాగసూరి వేణుగోపాల్‌

(భారత కమ్యూనిస్టు విధానాలను ఆచరణను ఎంతగానో ప్రభావితం చేసిన పుచ్చలపల్లి సుందరయ్య (1 మే, 1913-19 మే, 1985) 1956లో గాంధీ జ్ఞానమందిరం వారి ఆహ్వానంపై హైదరాబాదు గాంధీ భవన్‌లో గాంధీ గురించి ఒక స్మారకోపన్యాసాన్ని చేశారు. ఆ తేదీ పూర్తిగా అందుబాటులో లేదు. బేధాభిప్రాయాలు వుంటూ వచ్చాయి. అయితే వారి వ్యాసాలను శ్రద్ధగా చదివాను అనే ప్రజాస్వామ్య దృష్టి, …నేను వెలిబుచ్చే అభిప్రాయాలు ఈ విషయంపై ఇకముందు జరగబోయే చర్చలకు ప్రాతిపదికగా వుంటాయనే ఉద్దేశ్యంతో ఈ సమావేశంలో ప్రసంగించడానికి అంగీకరించాను అనే భవిష్యద్దృష్టి, ….మా కన్నా కాంగ్రెస్‌ వాదులే గాంధీ సిద్ధాంతాలను ధిక్కరిస్తున్నారు అనే వాస్తవ దృష్టి ఈ ఫ్రసంగంలో మనకు కనబడుతుంది. అలాగే ….గాంధీ దేశానికి ఏమీ చేయలేదని, ఆయన ప్రవచనాల నుంచి నేర్చుకుని ఆచరించేదేమీ లేదని మేమనుకోవడం లేదని నేను వేరే చెప్పనవసరం లేదు అని ఘంటాపథంగా సుందరయ్య ప్రకటించడం గమనార్హం. తొలి నుంచి గాంధీ రచనలతో ఆకర్షించబడి గాంధీ విధానాలను పరిశీలించి పుచ్చలపల్లి సుందరయ్య చేసిన ఈ ప్రసంగం ఎంతో చారిత్రక విలువ కలది. ఆ ఉద్దేశ్యంతో ఈ విలువైన ప్రసంగాన్ని ఇక్కడ అందిస్తున్నాం.)

సామాన్య ప్రజల దృష్టిలో గాంధీయిజానికీ, కమ్యూనిజానికీ ఉత్తర, దక్షిణ ధృవాలకున్నంత దూరముందనీ, గాంధీయిజం అహింసా విధానాన్ని అవలంబిస్తే కమ్యూనిజం హింసావాదాన్ని నమ్ముతుందని, గాంధీవాదులు ఆధ్యాత్మికవాదులైతే, కమ్యూనిస్టులు భౌతిక వాదులని భావించబడుతుంది. దేశంలోని రాజకీయ జీవితంలో కూడా గాంధీ రాజకీయాలకు, కమ్యూనిస్టు రాజకీయాలకు హస్తిమ శకాంతర భేదముందని, అసలు మనదేశంలో కమ్యూనిజానికి తావేలేదని కూడా భావించబడుతున్నది.

అలాంటప్పుడు గాంధీ భవనంలో గాంధీ జ్ఞాన మందిరం వారి ఆధ్వర్యాన జరిగే ఈ సభలో నన్ను ఉపన్యసించమని అడినప్పుడు కొంచెం తటపటాయిం చాను. అయినా ఈ సమితివారు నాకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని మరొకసారి ఈ విషయాన్ని గురించి మననం చేసుకునే అవకాశం కలిగింది. నేను వెలిబుచ్చే అభిప్రాయాలు ఈ విషయంపై ఇక ముందు జరగబోయే చర్చలకు ప్రాతిపదికగా వుంటాయనే ఉద్దేశ్యంతో ఈ సమావేశంలో ప్రసంగించ డానికి అంగీకరించాను.

1925-30 సంవత్సరాల మధ్యకాలంలో ప్రజాసేవ చేయాలని, దేశసేవ చేయాలని నాలో ఉత్సాహం కలిగిందంటే అది గాంధీగారి రచనలను, వ్యాసాలను  చదవడం వల్లనే. అలా చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను కూడా. నిజానికి కమ్యూనిస్టుపార్టీలో అనేకమంది ఆయన రచనలను చదవడం ద్వారానే ఉత్తేజితులయ్యారు. ఆ అయిదు సంవత్సరాల్లో  ఖద్దరు గురించి, అస్పృశ్యతా నివారణ, హిందూ – ముస్లిం ఐక్యత, స్వదేశీ ఉద్యమం గురించి, సత్యాగ్రహం గురించి, మద్యపాన నిషేధం గురించి ఒకటేమిటి ఆయన వ్రాసిన రచనలన్నీ చదివాను.

కాని 1930 నాటికి కొన్ని అనుమానాలు పొడచూపడం ప్రారంభించాయి. గాంధీ గారి పద్ధతుల ద్వారా, గాంధీగారి విధానాల ద్వారా దేశ స్వాతంత్య్రాన్ని సాధించగల్గినా నూటికి తొంభైమందిగా వున్న కార్మిక, కర్షక, మధ్యతరగతి ప్రజల ప్రభుత్వంగా అది ఉంటుందా? ఒకవేళ స్వాతంత్య్రం సిద్ధిస్తే అది బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులతోనో లేక భారత పెట్టుబడిదారులతోనో రాజీపడటం ద్వారా వచ్చే స్వాతంత్య్రమే అవుతుందేమోనని అనుకోవడం జరిగింది.

1948లో గాంధీజీ చనిపోయేవరకు ఆయనతో మాకు అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు ఉంటూ వచ్చాయి. అయితే వారి వ్యాసాలను శ్రద్ధగా చదివాను.

1928లో నేను బాలభట సంఘంలో ఉండేవాణ్ణి. కానీ గాంధీజీ సభలకు వెళ్ళడానికి ఎప్పుడైతే నాకు అభ్యంతరం కలుగజేశారో అప్పుడు ఈ సంస్థ సామ్రాజ్యవాదులకు అనుకూలమైన సంస్థ అని భావించి ఇక ఒక్క క్షణం కూడా అందులో ఉండకూడదని ఇవతలకు వచ్చేశా. ఆ విధంగా గాంధీగారి రాజకీయాలకు దగ్గరగా వచ్చాను.

నూరు సంవత్సరాల సామ్రాజ్య వ్యతిరేక పోరాటంలో స్వాతంత్య్రం కోసం కృషి చేసినవారిలో గాంధీజీ అందరికన్నా అగ్రగణ్యులు, ముందున్న మహావ్యక్తి. గాంధీజీ ముందు దాదాభాయ్‌, గోఖలే, రనడే, తిలక్‌ మొదలగు మహామహులు కాంగ్రెసు సంస్థకు పునాదులు వేసి పనిచేసినవారున్నారు. కొంతమంది ఉద్యో గస్తులను, అధికారులను భయోత్పాతం కలుగజేయటం ద్వారా వారిని తరిమి వేయగలమని అనుకున్న ‘టెర్రరిస్టు’లున్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టుపార్టీ ఏర్పడి ప్రజల్లో పనిచేస్తూ వచ్చింది. ఈ మహావ్యక్తుల ఉద్యమాలు స్వాతంత్య్ర సము పార్జనలో ముఖ్యపాత్ర వహించాయి. కానీ వీరందరికన్నా, ఉద్యమాలన్నింటికన్నా తలమాణికంగా గాంధీజీ ఉంటూ వచ్చారు. గాంధీజీలో ఉన్న ప్రత్యేకత ఏమటి? ఇలా తలమాణికంగా వుండటానికి కారణం ఏమిటి?

సామాన్య ప్రజలలో చైతన్యాన్ని కలిగించి వారందరూ కూడా పాల్గొనడానికి వీలయ్యే ఒక కార్యక్రమాన్ని ఇచ్చి ముందుకు నడిపించడంలోనే గాంధీజీ గొప్పతనం ఉంది. మనం సాధించిన స్వాతంత్య్రం గాంధీజీ కలలుగన్న స్వరాజ్య మేనా? ఒకరిని మరొకరు పీడిరచే, ఒక వర్గాన్ని  మరొక వర్గం దోచుకునే వ్యవస్థకు స్వస్తి చెప్పి, సామాన్య ప్రజలకు పూర్తి స్వాతంత్య్రాన్ని ఇచ్చిన స్వరాజ్యమేనా? ఈ రోజున కాంగ్రెస్‌ అగ్రనాయకులు నిర్వహిస్తున్న సహకార సర్వోదయ సోషలిజమేనా ఈ స్వరాజ్యం?

స్వాతంత్య్రం సంపాదించడానికి గాంధీయిజం పునాదులు వేసింది. స్వాతంత్య్రం అనే మన ఆశయాన్ని సాధించడంలో గాంధీజీ యొక్క ప్రముఖ పాత్రను కమ్యూనిస్టులు గుర్తిస్తారు. కాని అంతవరకు మాత్రమే. గాంధీజీ సిద్ధాంతాలు అంతకు మించి ముందుకు పోవడానికి తోడ్పడవు. కమ్యూనిస్టు పదజాలం ద్వారా వివరించాల్సి వస్తే సమాజం అంతర్గత వర్గాలుగా విభజింపబడి ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో అన్ని వర్గాలవారూ పాల్గొన్నారు.

ఈ పోరాటానికి వ్యక్తులుగా ఎవరు నాయకత్వం వహించారన్నది చూసి నట్లయితే మొదట గాంధీజీ, ఆ తర్వాత నెహ్రూ అని చెప్పవచ్చు. కాని వర్గరీత్యా చూస్తే బూర్జువా వర్గం లేక ధనికవర్గం అని చెప్పాల్సి వస్తుంది. ఇతర వర్గాలు కూడా స్వాతంత్య్రం కోసం కృషి చేశాయి. కాని నాయకత్వం ప్రధానంగా బూర్జువా వర్గానిదే.

దేశాన్ని స్వాతంత్య్రం వైపుకు తీసుకొని పోవడంలోనైతేనేమి, ప్రజలందరినీ పోరాటంలోకి సమీకరించడంలోనైతేనేమి గాంధీజీ సిద్ధాంతాలు ప్రాముఖ్యత వహించాయి. కానీ ఆ సిద్ధాంతానికి పరిమితులున్నాయి. విదేశీ పెత్తనం పోవడానికి మాత్రమే పరిమితమైంది. కానీ నూటికి 90 మందిగా వున్న సామాన్య ప్రజానీకం నిజంగా స్వాతంత్య్రం కలుగజేయడానికి ఈ సిద్ధాంతాలు చాలవు.

నేనిదివరకే చెప్పినట్లు గాంధీ సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది.

మనదేశంలో మాలలను దూరంగా, అంటరానివారుగా చూసినట్లే దక్షిణాఫ్రికాలో కూడా తెల్లవారు నీగ్రోలను తదితర జాతుల వారిని దూరంగా వుంచేవారు. ఈ జాతి విద్వేష విధానాన్ని రూపుమాపి సమానత్వం సాధించడం కోసం గాంధీజీ సత్యాగ్రహ, సహాయ నిరాకరణ రూపాల్లో పోరాటం సాగించారు. హృదయ పరివర్తన ద్వారా సాధించాలన్నారు గాంధీజీ. ఆ పోరాటంలో అనేకమంది పాల్గొన్నారు.

అలాగే 1917లో భారతదేశంలో మొదటిసారిగా బీహార్‌లోని చంపారన్‌లో బ్రిటీష్‌ తోట యజమానులకు వ్యతిరేకంగా ‘నీలి ఆకు రైతులు’ పోరాటం (ఇండిగో స్ట్రగుల్‌) నడిపారు. ఆ తర్వాత జరిగిన సత్యాగ్రహ పోరా టాలు ముఖ్యంగా 1920-22, 1930-34, 1940-45 సంవత్సరాల్లో మూడు దశల్లో జరిగాయి.

1920-22లో ఈ సత్యాగ్రహ పోరాటాన్ని గాంధీ – ఇర్విన్‌ ఒడంబడిక జరిగిన తర్వాత కూడా విరమింప చేయడం సరికాదని మా అభిప్రాయం. మళ్ళీ మన బలాలను సమీకరించుకోవడానికి తాత్కాలికంగా విరమిస్తే సరిగా ఉండేది. అది కూడా ప్రజలకనుకూలమైన షరతు లతో విరమించి ఉండాల్సింది. అయితే 1924లో, 1934 లోనూ అంతకు ముందు జరుగుతూ వచ్చిన పోరాటాలు విరమించడం సరి అయినదేనని నా అభిప్రాయం. ఆ రోజుల్లో మన  ఉద్యమం బలహీన పడినప్పుడు శత్రువుదే పై చేయిగా ఉన్నప్పుడు విరమించ బడడమొక్కటే మార్గం.

ఈ విధంగా 1927, 31 సంవత్సరాల్లో ఉద్యమాలు ఉచ్ఛస్థాయిలో ఉన్నప్పుడు పోరాటాలు విరమించడం అంటే ఆ ఉద్యమాలకు పరిమితులు పెట్టడమే అవుతుంది. ప్రాథమిక దశల్లో ప్రజల్లో చైతన్యం కలిగించి కదలించ డానికి మాత్రమే ఈ సత్యాగ్రహ పోరాటాలు ఉపకరిం చాయి. వెనుకబడి తలెత్తుకోలేని ప్రజానీకాన్ని వారు పాల్గొనేటటువంటి కార్యక్రమం ఇవ్వడమే ఈ పోరాటాల ప్రాముఖ్యత.

1945 నాటికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి ప్రపంచ పరిస్థితులు మారాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు బాగా బలహీనపడ్డారు. దేశంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పోరాటం, అనే రాష్ట్రాల్లో కార్మిక, కర్షక పోరాటాలు, స్వదేశీ సంస్థానాల్లో తిరుగుబాట్లు – ఇవన్నీ బ్రిటీష్‌ సామ్రాజ్య వాదాన్ని బలహీనపరచి, వారు స్వాతంత్య్రం ఇచ్చేలా చేయడానికి దారి తీశాయి.

అయితే స్వరాజ్యం వచ్చినా బ్రిటీష్‌ వారి ఆర్థిక పెత్తనం అలాగే వుందని, ఆర్థిక పెత్తనం అలాగే వున్నంతకాలం అది సంపూర్ణ స్వరాజ్యం కాదనే మీమాంసలు వుండనే వున్నాయి.

ఆర్థిక ప్రాబల్యం వున్నా, నేటి ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా బ్రిటీష్‌వారు భారతదేశాన్ని తామనుకున్నట్లు తమ పిడికిలిలో ఉంచుకోలేకపోయారు. కాగా కేవలం గాంధీగారి అహింసా సిద్ధాంతాలతో ఏకీభవించనివారు కూడా స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అలాగే మనకు స్వాతంత్య్రం వచ్చిం దంటే ఆనాటి ప్రపంచ పరిస్థితుల ప్రాబల్యం కూడా లేక పోలేదు. కాగా కేవలం కాంగ్రెస్‌ పార్టీ కృషి వలనే స్వాతం త్య్రం వచ్చిందనటం కూడా సత్యదూరం. అయితే కాంగ్రెస్‌ పార్టీ ప్రాముఖ్యం ఉందనీ మాత్రం అంగీకరిస్తాం.  

(మిగితా వచ్చే సంచికలో..)