పాండితీ సౌహృదం గంగాపురం హరిహరనాథ్

డాక్టర్ శ్రీరంగాచార్య 

కాలం చాలా విలువైనదేగాక జగద్భక్షకమూ అతి భయంకరం గూడా అందుకేప్రతి జీవీ కాలపురుష ప్రస్తావన చేస్తారు. జగద్భక్షక కాలపురుషుని ప్రభావంలో పడి – ఆత్మీయ మిత్రుడు సహాధ్యాపకుడైన డా॥గంగాపురం హరిహరనాథ్‌ మాయమైతారని భావించలేదు. వారికేదో స్వల్ప అనారోగ్యం సంభవించి ఓషధీ సేవ చేస్తున్నట్టు మాకు తెలిసినట్లే వారి శివైక్యవార్త తెలిసి ఎంతకుమిలిపోయినామో! తెల్పలేను. ఆయనది ఒక విచిత్ర వ్యక్తిత్వమేగాదు అతి విచిత్ర భక్షణాది వ్యవహారపరిపూత సౌమనస్యం.

హరిహరనాథ్‌ ఉస్మానియాలో ఎం.ఏ. చేస్తున్నపుడు మేము పరిచయమైనాము. తర్వాత వారు జడ్చర్లలోని ఓరియంటల్‌ కాలేజీ, ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఓరియంటల్‌ కాలేజీల్లో స్వల్ప కాలం పనిచేసి అనంతరం జోగిపేట డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులైనారు. ఆ కాలేజీలో (మొదట ప్రయివేటు తర్వాత ప్రభుత్వ కళాశాల) సుఖాని కన్నా శ్రమనే ఎక్కువగా అనుభవించినారు. దీనికొక ఉదాహరణం చెబుతాను. కళాశాల ప్రభుత్వ వశమైన తర్వాత జరిగిన వార్షిక పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టకుండా నిరోధించినందుకు ఆ శిష్యులంతా వీరిపైన శిలావర్షం (గుట్ట పలుగురాళ్లు) కురిపిస్తే అందరూ ‘కాందిశీకులుగా’ పరుగెత్తినారు. హరిహరనాథ్‌ అప్పుడు ప్రిన్సిపాల్‌, గోపాల కృష్ణారావు పరీక్షలను నిర్వహించే అధికారి. కఠిన నీతి నియమాలకాదర్శమూర్తి కాబట్టి విద్యార్థులు వీరినే పరమఘోరంగా మర్దిస్తే, చావు బ్రతుకుల మధ్య ఉస్మానియా వైద్యశాలలో చేర్చినారు. వీరి ఆరోగ్యం గూర్చి ప్రతిరోజూ వింత వింత సమాచారాలు వస్తుండేవి. ఆనాడు ఉస్మానియా వీసీగా వున్న ‘హషీం వలి’ వీరిని ప్రతి రోజూ వెళ్లి చూచి వచ్చే సహృదయుడు. జోగిపేట కాలేజీ వ్యవహారం వీరికే గాదు ప్రభుత్వ ఉన్నతాధికారులు మొదలైన వారికి కనువిప్పుగలిగించి వారి యందు ‘కింకర్తవ్యం’ అనే భావనను దృఢం చేసిన పుణ్య వేళా విశేషం వలన ఉస్మానియా విశ్వ విద్యాలయ పరిధిలోనున్న (అన్ని జిల్లాల్లో, ప్రతి కాలేజీలోను ఎంతో శ్రమించి చూచి వ్రాసే తీరు (కాపీ) లేకుండా చేసి ఈ దేశానికుత్తమ విద్యావంతులైన యువకులనందించ గలిగినారు. ఇదొక విశేషమేయైనా ఆనాడు జోగిపేట విద్యార్థుల దాడికి గురియైన గోపాలకృష్ణరావు, హరిహర నాథుల ధీ ధైర్యాలు ఎంతో గొప్పవి. ఈ జంట క్షీరనీర న్యాయ జీవితం గడిపినవారు.ఇప్పటికీ గోపాల కృష్ణారావు హరిహరనాథ్‌ కుటుంబంలో వున్న ఒక పెద్ద మనిషి. జోగిపేట కాలేజీ ప్రభుత్వ సంస్థయైన తర్వాత అక్కడి అధ్యాపకులను బదిలీ చేస్తే హరిహరనాథ్‌ పాలెంలోని ఓరియంటల్‌ కాలేజీకి, గోపాలకృష్ణరావు స్థానిక డిగ్రీ కళాశాలకు బదిలీయై యథాపూర్వం బంధువర్గ నిర్విశేషులుగానే వున్నారు.

మా హరిహరనాథ్‌ (1984 నుండి) మా కాలేజీలో దాదాపు 10సంవత్సరాలకు పైగా పనిచేసినారు. అధ్యాపకునికుండే ఏ మెరమెచ్చాలు కూడా వీరియందుడేవి గావు. సామాన్య గ్రామీణ విద్యార్థులకనువైన రీతిలో ఛందోలంకారాలు, సాహిత్య విమర్శ బోధిస్తుంటే మా విద్యార్థులంతా అవనత శిరస్కులై శ్రద్ధాళువులుగా పాఠాలు విన్న దాని ఫలం అనంతర కాలంలో ఎట్లా ఉపయోగపడిందో నేటికీ మననం చేసుకోవడం ఒక విశేషం. నేను ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న ఒక సమయంలో జరిగిన వార్షిక పరీక్షలయందు తక్కువ విద్యార్థులున్న హాలుకీయన్ను ఇన్విజిలేటర్‌గా వేసి స్టేషనరీ మొదలైన వాటినిచ్చి పంపితే ఈయన ఆ వేసవిలో డ్యూటీ చేయటం భరించలేక ధోవతిని పైకి చెక్కి షర్టును విడిచి ఒక దగ్గర తగిలించి బయట పచార్లు చేస్తూ పరీక్ష వ్రాయిస్తుంటే చూడడానికి వెళ్లిన నేను ఆశ్చర్యపడ్డాను. 

ఈయన దూరంగా ఒక చెట్టు క్రింద కుర్చీలో నిద్రాళువు, హాల్లో విద్యార్థులు – నేను వచ్చింది గూడా గమనించలేని శ్రద్ధతో పరీక్ష వ్రాయటం (కాపీ అనేదే లేదు) ఆశ్చర్యం అనిపించింది. హరిహరనాథ్‌ని లేపి మాట్లాడి పరీక్షలు నిర్వహించినాం. ఇక్కడ ఆనాటి మా విద్యార్థుల సత్‌ ప్రవర్తన గురుభక్తి అనేవి అభినందనీయాలు.

ఈయన ఒక తెలుగు సంస్కృతాలే గాదు. మంచి ఇంగ్లీషు వచ్చినవాడు హిందూ పత్రిక ఈయన కెంతో యిష్టం. దాన్ని అనుదినం ఆద్యంతం చదివే వాడు. గుండేరావు హర్కారే సన్నిధి, వీరిని ప్రాకృత భాషా విశారదుని చేసింది. ఊళ్లోవారు (మేడిపూర్‌) బంధువులు వస్తే కాస్తా మాట్లాడి అవిశ్రాంత పఠనం చేస్తుండే ఈయన నిత్య విద్యార్థియే గాదు, ఏ విద్యార్థి ఎప్పుడు వెళ్లి ఏదడిగినా ఆ విషయాన్ని కూలంకషంగా వారికి చెప్పి సంతృప్తి పరచడాన్ని శిష్యులు గొప్పగా చెప్పుకుంటారు. 

మా కళాశాలలో మేము సహోద్యోగులం. ఇండ్ల వద్ద ఆత్మీయతా మూర్తి మత్వాలు, హరిహరనాథ్‌ సాహచర్యం కారణంగా పాలమూరు జిల్లాలోనే గాదు బయట కూడా ఎందరో పెద్దలను సేవించిన అదృష్టవంతుణ్ణి, నేనూ గంగాపురం నృహరి దీక్షితులు. హనుమత్‌ శర్మ, సురభి శర్మ వంటి వేదమూర్తులను మహానుభావులనే గాక పల్లెర్ల వినాయకరావు, గంగాపురం శ్రీహరినాథ్‌ మొదలైన స్నేహమే రూపుదాల్చిన వారిని సందర్శించి మిత్రుడనయినాను. హరిహరనాథ్‌ను చూస్తే ఇంత విద్వత్తుగల వాడని ఇన్ని భాషలు తెలిసిన వాడని గమనించడానికి వారి విజ్ఞాన విశాల కూపంలోకి దిగి ‘కృతతీర్థః పయసామివాశయః’ (మెట్లు గలిగిన సరస్సులోనికి సులభంగా దిగినట్లు నీతి శాస్త్రం కూడా విషమమైన మనుష్యుని గ్రహిస్తుంది) అనే దాన్ని సార్థకం చేసుకోవలసిన అవసరం వుండేది. తన బిడ్డలను కుమారులను విద్యావంతుల చేసి అర్ధాంగియైన ఇందిరాదేవి (అక్కగారి బిడ్డయే) ఒరియంటల్‌ ఎంట్రన్స్‌ నుండి ఎం.ఏ. దాకా విద్యావతిని చేసి అనంతర కాలాల్లో తనకిష్టమైన ‘శాసన సాహిత్యం’ గూర్చి ఉస్మానియాలో పరిశోధింపచేసి పిహెచ్‌డీ పొందునట్లు చేసి సంతృప్తి చెందిన విద్యాతపస్వి.

బి.ఎన్‌. శాస్త్రి మహబూబ్‌నగర జిల్లా సర్వస్వం (1992) సిద్ధం చేస్తున్నప్పుడు వీరితో ఒక వ్యాసం వ్రాయించడానికి మేము పడిన శ్రమ చెప్పరానిది. కానీ ఎంతో విలువైన వ్యాసం తయారు చేసి యిచ్చినారు. అదే పాలమూరు విద్యద్వరులనే పెద్ద రచన. ఇది నా-న్యతో దర్శనీయ ప్రతిభా సమున్మేష విశేష విషయ సముపేత రచన. వీరుగాక వేరెవ్వరు వ్రాసినా ఈ ‘జిగి’ రాక పోయేది. నాడు పత్రికల్లో జి. కృష్ణ వంటి మహానుభావుడు ఈ వ్యాసాన్ని ఎంతగా మెచ్చుకున్నా ఆయనలో మార్పు లేదు. ‘మూసీ’ మొదలైన పత్రికల్లో వచ్చిన వీరి వ్యాసాలు ఇప్పటికీ మన శిరః కంపాని కనువుగా వుంటాయా లేదా అనే ఆలోచన వారికనవసరం. ఆయన రచన ఆయనది. ఆ వ్యాసాలన్నిటినీ, పరిశీలించవచ్చు.

తమ పితృపాదులు నృసింహదీక్షితుల గూర్చి గొప్ప పుస్తకం వెల్వరించి వైదిక సాహిత్య లోకానికెంతో మేలు చేసిన ప్రతిభావంతుడు. రామరాజు పర్యవేక్షణలో ఆంధ్ర మహాభారతం శాంత రసపోషణ అనే అంశం గూర్చి పరిశోధన చేసి భారతం లోని రస చర్చ చేసినవారిని ఎక్కడా విమర్శించక తన రీతి తానుగా లేఖనం చేసి డాక్టరయిన హరిహరనాథ్‌ ఒక ధీర ధిషణామూర్తియని నాయభిప్రాయం.

కళాశాలయందు మేము పాఠబోధన, పరీక్షల నిర్వహణ గూర్చి ఎంత వాదించుకున్నా అవన్నీ తరువాత ‘పరమార్ధేననగృహ్యతాం వచః’ (ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటలను పరమార్ధంగా గ్రహించవద్దు.) అనే సూక్తికి ప్రతీకలుగానుండేవి. ఇదంతా ఆనాడు అధ్యాపక వృత్తిలోనున్న మా అంతరాంతరంగాలు, హరి హరనాథ్‌ స్వగ్రామం ‘మేడిపూరు’ నాగర్‌కర్నూలు నుండి కల్వకుర్తికి వెళ్లే మార్గంలో ‘దుందుభి’ (డిండిపాలు) నదీ తీరంలో వుండేది. కొన్నేళ్లీయన తన భూముల్లో వ్యవసాయం చేయించుకుంటూ పాలెం`మేడిపూరా సంచరించేవాడు. వారి వ్యవసాయం అక్షరాలా ’బ్రాహ్మణ సేద్యం’గా ప్రసిద్ధమయింది. వారితోపాటు నేను మేడిపూర్‌, గుండూరు, తాడూరు గ్రామాలను చూచి వారి బంధువులు. జ్ఞాతులను చూచినాను. గుండూరు హనుమత్‌ శర్మ అస్తమించిన రోజు మేమంతా వెళ్లి వారికి చివరి వీడ్కోలు జరిపివచ్చి తొందర్లోనే ‘దుందుభి’ పేరున ఒక స్మారక సంచికను తీసినాం. దానిలో హరిహరనాథ్‌ ‘ఖడ్గ సృష్టి’ వ్యాసం కలదు. అది ఎంతో విశేష విషయ భరితం. హనుమచ్ఛర్మ ‘దుందుభి’నదీ కావ్య కర్త. అది చాలా ఖ్యాతిగాంచింది. వీరు హరిహరనాథ్‌కి అన్న వరుస, గొప్ప వేద సంస్కృతాంధ్ర పండితుడు. ‘ఆనాడు బి.ఎన్‌. శాస్త్రి శివరాం, పల్లెర్ల రాంమోహన్‌ సంపాదకత్వంలో తయారైన ఈ సంచిక పాలమూరు కల్వకుర్తి ప్రాంత శాసన చరిత్రల పరిచయం. ఇది తయారు కావడానికి నాడు హరిహరనాథ్‌ శ్రమ పరుపురానిది. ప్రారంభంలో చెప్పినట్లు కాలో2వ్యయం నిరవధిః’ వ్యక్తులంతా గతానుగతికులే ` ‘సరిగ మనుష్య దేహ మొక సత్రము ` అందరమందులో ముసాఫిరులము’ గదా! ఇవన్నీ తెలిసిన మా హరిహరనాథ్‌ ఒక వ్యాసం వ్రాయాలంటే ‘కట్టె చింతపండును నాన బెట్టి పులుసును పిండి’నట్లే వుండేది. ఐనా ఆ శ్రమను వారి రచన మరిపించి మురిపించేది. నా పాలెం ఉద్యోగ జీవితంలో గొప్పవారి పరిచయం స్నేహానురాగాలు లభించి ధన్యుని చేసినాయి. అందుకే మన పూర్వులు ‘జననాంతర సౌహృదాని’ అన్నారు.

భ్రాతృనిర్విశేషులైన మా హరిహరనాథ్‌ అక్షర చిరంజీవి’ నమోమహద్భ్యః