|

గేట్‌వే ఐటి పార్క్‌

By: శ్రీ ముడుంబై మాధవ్‌

హైదరాబాద్‌ నగరంలో మరో భారీ ఐటీ/ ఐటీ ఆధారిత సేవల కార్యాలయాల భవన సముదాయానికి పునాది పడింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కే.టీ. రామారావు, కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి తెలంగాణ రాజధాని నగరం ఉత్తర దిక్కుగా మేడ్చల్‌ సమీపంలోని కండ్లకోయలో గేట్‌ వే ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. వికేంద్రీకృత అభివృద్ధి విధానం అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్మించనున్న ఈ 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఐటీ పార్క్‌ పది వేల మంది ఐటీ నిపుణులకు చోటు కల్పించనున్నది. శంకుస్థాపన నాటికే 90కి పైగా సంస్థలు పార్క్‌ లో తమతమ కార్యాలయాలు నెలకొల్పుతామని ముందుకు వచ్చాయి.

నర్సాపూర్‌ – మెదక్‌, నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌, కరీంనగర్‌ – రామగుండం, వరంగల్‌ – భూపాలపల్లి రహదారుల కూడలిలో ఉన్న మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలో స్థాపితమవుతున్నందున ‘గేట్‌ వే ఐటీ పార్క్‌’గా ఈ భవన సముదాయానికి నామకరణం చేశారు. శాసనసభ్యులు కే.పీ. వివేకానంద్‌, శాసన మండలి సభ్యులు నవీన్‌ రావు, శంభీపూర్‌ రాజు, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేష రంజన్‌, టిఎస్‌ఐఐఎస్‌ ఎండీ నరసింహా రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘‘పశ్చిమ హైదరాబాద్‌ లో ఉన్న సైబర్‌ టవర్స్‌ 5.25 లక్షల చ. అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తే కండ్లకోయ గేట్‌ వే ఐటీ పార్క్‌ 6 లక్షల చ. అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. మరిన్ని ఐటీ పార్కులు ఈ ప్రాంతంలో నిర్మాణం అవుతాయి. ఈ భారీ ఐటీ పార్క్‌కు వేదిక అవడానికి మేడ్చల్‌ ప్రాంతం అత్యంత అనువైనది. పదుల సంఖ్యలో ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలలు, వైద్య విద్య, ఫార్మసీ కళాశాలలు, పాఠశాలలు, పట్టణ ఉద్యానవనాలు, అన్ని సౌకర్యాలతో నివాస ప్రాంతాలు, ఎంఎంటీఎస్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఈ పార్క్‌ కు సమీపంలో ఉన్నాయి. సుమారు 30 వేల మంది యువతీ యువకులు ప్రతీ సంవత్సరం ఈ ప్రాంతం నుండి పట్టభద్రులవుతున్నారు. యువతీ యువకులు, అవసరమైన నైపుణ్యాలు పెంచుకుంటే ఈ ఐటీ పార్క్‌, వారికి అనేక అవకాశాలను కల్పిస్తుంది’’ అని మంత్రి కెటీఆర్‌ శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో పేర్కొన్నారు.

గ్రిడ్‌ పాలసీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి ఐటీ రంగం అద్భుత ప్రగతిని సాధించింది. 2020-21 సంవత్సరానికి లక్ష నలభై ఐదు వేల కోట్ల ఐటీ ఎగుమతులు చేసి బెంగళూరు నగరం తర్వాత దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. దేశపు మొత్తం ఐటీ ఎగుమతులలో తెలంగాణ రాష్ట్ర వాటా సుమారు 11 శాతంగా ఉంది. అదే సమయంలో ఉద్యోగాల కల్పనలో మొత్తం దేశంలోనే హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ మొదటి స్థానంలో ఉంది. ఐదేళ్ల ఐటీ ప్రస్థానం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో 2025 నాటికి ఐటీ ఎగుమతుల విలువను 25 బిలియన్‌ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం మరో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. అందుకు తగ్గట్టుగానే కొత్త ఐటీ, ఐటీ ఆధారిత సేవల సంస్థలు హైదరాబాద్‌ నగరాన్ని తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. అయితే ఐటీ రంగ అభివృద్ధి హైదరాబాద్‌ నగరపు పశ్చిమ ప్రాంతంలో మొదలయ్యి అక్కడే కేంద్రీకృతమయ్యింది. ఇది అక్కడి సహజ వనరులు, మౌలిక సదుపాయాలపై వత్తిడి పెంచింది.