|

కాకతీయ సామ్రాజ్యంలో కళకళలాడిన జలాశయాలు

అధర్మపరమైన నంద సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించి మగధ సామ్రాజ్యంపై చంద్రగుప్తమౌర్యుని ప్రతిష్టించిన ఆర్య చాణక్యుడు (క్రీ.పూ. 4వ శతాబ్ది ) ప్రజల యోగక్షేమాన్ని చూచుకోవడమే రాజు యొక్క ప్రధమకర్తవ్యమని ప్రభోదిస్తాడు.

ప్రజా సుఖే సుఖం రాజ్ఞ:
ప్రజానాం చహితే హితమ్!
నాత్మాప్రియం హితం రాజ్ఞ:
ప్రజానాంతు ప్రియం హితమ్!! (అర్ధశాస్త్రం)

cheruvuluప్రజల సుఖమే రాజుకు సుఖం. ప్రజల హితంలోనే రాజు హితం ఇమిడి ఉన్నది తప్పతనకు ప్రియమైంది రాజుకు హితంకాదు. ప్రజలకు ప్రియమైందే రాజుకు హితవైంది. అట్లుకానినాడు రాజు ప్రజాగ్రహానికి గురికాకతప్పదు. ఇది మన్వాదిస్మృతికర్తలు, అర్థశాస్త్రకోవిదులు రాజుకై ఆదేశించిన ఆచరణ యోగ్యమైన ఆదర్శం. ఈ ఆదర్శాలను ముందుంచుకొనే దక్షిణాపథాన్ని పరిపాలించిన శాతవాహన, చాళుక్యాది చక్రవర్తులు, తెలంగాణాలో స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించి సమస్తాంధ్ర దేశాన్ని ఏకచ్ఛత్రంగా ఏలిన కాకతీయ సామ్రాట్టులు ముందుకు సాగినారు.

ధర్మబద్ధమైన పాలనతోబాటు పాడిపంటలతో దేశం సుభిక్షంగా ఉన్ననాడే అన్నవస్త్రాలకు కొదువలేకుండ ప్రజలు సుఖిస్తారన్న వాస్తవాన్ని గ్రహించిన కాకతీయ ప్రభువులు వ్యవసాయానికి నీటివనరులు కల్పించే కొరకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చినారు. తగినంత నీరు లభించక పోవడం వల్లనే సారవంతమైన భూమి ఎంతో సాగుకావడంలేదని వారు గ్రహించినారు.

కేవలం వర్షాధారంగా వ్యవసాయంచేసే భూములు, దేవ మాతృకలని పిలువబడేవి. నదులు, వాగులు, చెరువులు, కాలువలు, చెలిమలు ఆధారంగా సేద్యం చేసే భూములు నదీమాతృకలు. బీడుభూములు ఈ రెండిరటికంటే ఎక్కువగా ఉండేవి. విశాలమైన భూమి కొండలు, గుట్టలు, అడవులు, రాతి నేలలతో కూడి ఉన్నప్పటికీ తెలంగాణాలో నదులు, వాగుల తీరాలలో తేలికగా వ్యవసాయం చేయదగిన భూమి ఎంతో
ఉండిరది. సగటు వర్షపాతం అంతతక్కువకాదు కాబట వానాకాలంలో నదులు, వాగులలో నీరు తగినంత ప్రవహించేది. అయితే వర్షాలు కురిసినప్పుడే చేరిన నీరు కొద్ది దినాల్లోనే వృధా అయిపోయేది. నదీగర్భంలోని చెలిమలు, తీరంలోని చిన్నచిన్న కాలువలు మాత్రమే నదీజలాన్ని వినియోగించుకోవటానికి ఉపయోగపడేవి. ఇవి అనాదిగా ఉన్న స్థితిగతులు.

వర్షంవల్ల లభించిన నీటిని వృథాకానీయకుండా, ఆ నీటిని జలాశయాల్లోకి మళ్ళించి సారవంతమైన భూమిని సాగులోకి తెచ్చి రాజ్యాన్ని పాడిపంటలతో సమృద్ధం చేయవచ్చని కాకతీయులు తెలుసుకొన్నారు. ఆనాడు పెద్ద తటాకాలు నిర్మించడం గొప్ప విజ్ఞానం.

తటాక నిర్మాణాన్ని ధర్మశాస్త్రాలు ఎంతో పవిత్రకార్యంగా భావించినవి. చెరువు నిర్మించడం సప్తసంతానాల్లో ఒకటిగా పేర్కొన్నవి. కుమారుడు, దేవాలయం, తోట, చెరువు, అగ్రహారం, కావ్యం, నిధి అనేవి సప్త సంతానాలు. చెరువు వేయించేముందు జలాధిస్ఠాపన దేవతలైన వరుణదేవుని జలసమృద్ధిని కోరుతూ ప్రతిష్ఠించేవారు. నదీమార్గంలో నది రెండు కొండల మధ్య ప్రవహిస్తున్నచోట రాళ్ళను, మట్టిని వినియోగించి ఆనకట్టకట్టి గొప్ప తటాకాన్ని నిర్మించేవారు. సారవంతమైన భూమికి నీరు అందే చోటును ఎన్నుకొనేవారు.

కాకతీయుల పాలన వ్యవస్థలో సాగునీటి పనులు చూచుకొనే కొరకు ప్రత్యేక శాఖలేకున్నా దేవాలయాలు, చెరువులు, భవన నిర్మాణాలవలెనే మంత్రి, సామంత, మండలాధీశుల పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతుండేవి. మోటుపల్లి, బయ్యారం శాసనాలనను సరించి మొదటి ప్రోలరాజు అరిగజకేసరి అన్న తడ ప్రఖ్యాత బిరుదుమీదుగా ఒక తటాకాన్ని త్రవ్వించి దానికి కేసరితటాకమని పేరు పెట్టినాడు. వరంగల్లు జిల్లా మహబూబాద్‌ తాలూకాలోనికే సముద్రం (కేసరి సముద్రం) గ్రామ సమీపంలో దీనిని గుర్తించవచ్చు. మొదటి పోలరాజు కుమారుడు రెండవ బేతరాజు సెట్టికెరియ, కేసరి సముద్రం అనే రెండు చెరువులు వేయించినట్లు హనుమకొండ శాసనం తెలుపుతున్నది. రెండవ ప్రోలరాజు కూడా కొన్ని సాగునీటి చెరువులు త్రవ్వించి వాటిక్రింద భూములను దానం చేసినట్లు ఇదే శాసనంవల్ల తెలుస్తుంది. రుద్రదేవుడు ఉదయబోడుని పట్టణాన్ని జయించి అక్కడ ఒక పెద్ద చెరువును నిర్మించినట్లు హనుమకొండ శాసనం తెలుపుతున్నది. ఇపుడు హనుమకొండ బస్టాండు వద్ద కనిపించే చెరువును రుద్రదేవుని మంత్రి గంగాధరుడు నిర్మించినట్లు హనుమకొండ శాసనం తెలియజేస్తుంది. తెలుగుచోడుల రాజధానిలైన నెల్లూరు, కృష్ణా జిల్లాలోని గణపురంవంటి ప్రాంతాలలో గణపతిదేవుడు అనేక తటాకాలు నిర్మించినట్లు ప్రతాపచరిత్ర తెలుపుతున్నది. ఈ కాలపు శాసనాలలో గణపతి సముద్రమనే పేరుతో గణపతిదేవుడు స్వయంగా నిర్మించినవి కాని, అతని సామంత, మాండలికులు నిర్మించినవి కాని అనేక తటాకాలు తెలుగు దేశమంతా కనిపిస్తవి.

పాలమూరు జిల్లాలోని బూదపురంలో మల్యాల గుండదండాధీశుడు తల్లిపేర బాచసముద్రాన్ని, భార్య కుప్పాంబపేర కుప్పసముద్రాన్ని, గణపతి దేవుని పేర గణప సముద్రాన్ని నిర్మించినట్లు, బూదపుర శాసనం తెలుపుతున్నది. నాగరకర్నూలులో కూడా కేసరి సముద్రంపేర కాకతీయులనాటి పెద్ద చెరువు పంటలు పండిస్తున్నది. ఆ కాలపు ఈ చెరువులన్నీ తెలంగాణలో ఇప్పటికి సాగునీటి వనరులుగా విశేషమైన పాత్రను నిర్వహిస్తూ భూమిని సస్యశ్యామలం చేస్తున్నవి.

పాకాల చెరువు:

ఈ చెరువు వరంగల్లు తూర్పున 50 కి.మీ. దూరంలో నర్సంపేట తాలూకాలో మానేరు పరీవాహక ప్రాంతంలో ఉన్నది. చెరువు నలువైపుల అడవి వ్యాపించి ఉన్నది. మొత్తం చెరువు కాలువలు 80 చదపు మైళ్ళు పరుచుకొని ఉన్నవి. చెరువు ఎండిపోయిన సందర్భాలు లేవు. ఇందులో మొసళ్ళు కూడా ఉన్నవట. ఈ చెరువు కట్టమీద శాసనం గణపతిదేవ మహారాజు కాలంలో ఆయన మంత్రి బయ్యన నాయకుడు, బాచమాంబల కుమారుడు అయిన జగదాలు ముమ్మడి నిర్మించినట్లు తెలుపుతున్నది.

రామప్ప చెరువు:

వరంగల్లుకు 65 కి.మీ. దూరంలో, ములుగు తాలూకా పాలంపేట సమీపంలో ఈ చెరువున్నది. శా.శ. 1135లో (క్రీ.శ. 1213లో) దీనిని గణపతిదేవుని సేనాని రేచెర్ల రుద్రుడు నిర్మించినట్లు సమీపంలోని శివాలయంలోగల శాసనం తెలుపుతున్నది. ఈ చెరువు ప్రక్కనే ఉన్న సుప్రసిద్ధమైన రామప్ప దేవాలయాన్ని కూడా ఈ చెరువుతోపాటే నిర్మించారు.

ఘనపురం చెరువు :

రామప్ప చెరువు నిర్మించిన కాలంలోనే దీని నిర్మాణం జరిగింది. దీని క్రింద సాగయ్యే భూమి 350 ఎకరాలు.

లక్ణవరం చెరువు :

కాకతీయుల కాలపు పెద్ద చెరువులలో ఇది ఒకటి. లక్ణవరం చెరువు, పాకాల చెరువు, ఖమ్మం జిల్లాలోని బయ్యారం చెరువులకు మూడు పెద్ద వాగులనుండి నీరు చేరుతుంది. ఒక పెద్ద పీఠభూమి ఆయకట్టుగా ఈ వాగులు మూడు దిక్కులకు ప్రవహిస్తున్నవి. గణపతిదేవుని సోదరి, నతవాడి రుద్రుని భార్య మైలాంబ బయ్యారం చెరువును వేయించింది. ఈ సందర్భంగా ఈమె వేయించిన శాసనం కాకతీయ వంశజుల తొలి చరిత్రను తెలుసుకొనే కొరకు ఎంతో ప్రామాణికమైంది.

కుందవరం గ్రామ సమీపంలో తన పేర గణపతి దేవుని మరొక సోదరి కుందమాంబకుంద సముద్రమనే చెరువును వేయించింది. గణపతిదేవుని సేనాని చౌండసేనాని వరంగల్లుకు 12 కి.మీ. దూరంలో కొండపర్తి గ్రామంలో చౌండ సముద్రమనే చెరువును నిర్మించినాడు. ఇతని భార్య మైలమ కరీంనగర్‌ జిల్లా కటుకూరులో ఒక చెరువును వేయించింది. రేచెర్ల వంశానికి చెందిన పిల్లలమర్రి సా మంతులు తమ మాన్యమైన నేటి నల్లగొండ జిల్లాలో ఎన్నో చెరువులను నిర్మించినారు. మాడపల్లికి చెందిన బొల్లయనాయకుడు వివిధ ప్రాంతాలలో ఏడు చెరువులను త్రవ్వించినట్లు తెలుస్తున్నది. వాస్తవంగా వరంగల్లు, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాదు, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో చెరువులేని గ్రామం లేదంటే అతిశయోక్తికాదు. కొన్ని గ్రామాల్లో 4, 5 చెరువుల వరకు ఉన్నవి. మహబూబ్‌ నగర్‌జిల్లాలోని కందూరులో చెరువులు, కుంటలు కలిసి నలభై వరకు ఉన్నవి. వర్షపునీరు వ్యర్థం కాకుండుటకై చిన్నచిన్న వాగులకు, ఓడికలకు అడ్డుకట్టలువేసి పల్లె ప్రజలు ప్రభుత్వ సహకారంతో కుంటలు నిర్మించుకొనేవారు. దీనివల్ల సారవంతమైన నేల కొట్టుకొని పోకుండ ఉండేది. రానురాను వాన తాకిడికి కట్టలు తెగిపోవడంవల్ల, గండిపూడ్చుటకై ప్రభుత్వాలు చొరవచూపక పోవడంవల్ల ఎన్నో కుంటలు, చెరువులు పాడువడిపోయినవి.

కాలువలు:

ఊరంచునుండి నదులు, వాగులు ప్రవహిస్తే పైనుండి కాలువలు త్రవ్వి తీసుకొనివచ్చి, తీరప్రాంత భూములకు నీటిని మళ్ళించి సేద్యం చేసేవారు. వేసవిలో ప్రవాహం లేనపుడు నదినుండి ఇసుకలో కాలువలు తీసి, ఆ ఊట కాలువలద్వారా నీటిని తెచ్చి పంటలు పండిరచేవారు. కర్షకులు గ్రూపులుగా వెళ్ళి, పారలతో ఇసుక చిమ్మి నీరు తెచ్చేవారు. ఇది ఒక సామూహిక ప్రక్రియ. పాలమూరుజిల్లా దుందుభీ నదీ తీరానగల సురభిలోని గండకాలువ క్రింది పొలాన్ని రుద్రమదేవి వద్ద భాంఢాగారికుడైన కరణం రామయ్య ఉమామహేశ్వరంలో కట్టించిన పంచమహాస్థానాలగుళ్ళకు అతని కుమారుడు దానం చేసినట్లు ఉమామహేశ్వర శాసనం తెలుపుతున్నది. మూసీనుండి మూసేటి కాలువ, రావిపాటి కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమ గండకాలువ, ఉటుం కాలువ, చింతలకాలువ మొదలైనవి శాసనాల్లో పేర్కొనబడినవి.

మోట, రాట్నాలు, ఏతాములతో నీరు తోడి పంటలు పండిరచే పద్ధతి కాకతీయులకాలంలో ప్రచలితమై ఉండేది. లోతైన బావులనుండి నీరు చేదే కొరకు మోటకు, రాట్నాలకు ఎద్దులను వాడేవారు. దోసపాడు శాసనం ఒక రాట్నాన్ని అవసరమైన కలపతో, ఎద్దులతో దానం చేసిన విషయం ప్రస్తావించింది. యుద్ధమల్లజినాలయానికి, మధుపేశ్వరాల యానికి కాకతీయ ప్రథమ బేతరాజు, మొదటి ప్రోలరాజు రాట్నాలను దానం చేసిన సన్నివేశాన్ని శనిగరం శాసనాలు తెలుపుతున్నవి. అక్కడనే భీమేశ్వరునికి దండనాయకుడైన కొండమయ్య రాట్నాలను దానం చేసినట్లు మరొక శాసనంలో ఉన్నది. రాట్నాలద్వారా నీటిని అందించినందుకు అయ్యే ఖర్చుకు ధనాన్నో, ధాన్యాన్నో సేకరించి పై దేవతలకు దానం చేసినట్లు ఆ శాసనాలు స్పష్టీకరిస్తున్నవి.కుంటలను దేవతలకు దానం చేసే పద్ధతి ఉండేది. క్రీ.శ. 1108 నాటి వేములవాడ శాసనంలో మహామండలేశ్వర జగద్దేవరసు ఇల్లెందుకుంటను దానం చేసినట్టున్నది. ఒద్దిరాజు చెరువును స్వయంభూమల్లినాథ దేవునికి దానం చేసిన విషయం మగతల శాసనం తెలుపుతున్నది.చెరువులు, కాలువలు నిర్వహించేకొరకు ప్రభుత్వం శ్రద్ధ చూపేది చెరువుకట్టలు, తూములు, కాలువలకు మరమ్మతుల నిమిత్తమై వ్యక్తులను నియమించి, పుట్టికి కుంచం చొప్పున వారికి చెల్లించే విషయం శాసనాల్లో ప్రస్తావితమైంది.