‘జ్ఞాపకాల వరద’ పాత్రికేయ ప్రముఖుడి అనుభవంతరంగం

tsmagazine
సీనియర్‌ పాత్రికేయులు జీవీఎస్‌ వరదాచారిది వైవిధ్యభరితమైన పాత్రికేయ జీవితం. పాతిక సంవత్సరాల ప్రాయంలోనే ప్రముఖ పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ ప్రశంసల్ని అందుకున్న ప్రతిభాశాలి. ప్రవర్థమాన పాత్రికేయులుగా తొలుత ఆంధ్ర జనత దినపత్రికలో అనంతరం ఆంధ్రభూమి, ఈనాడుల్లో సుదీర్ఘకాలంపాటు కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు, తెలుగు మాధ్యమంలో పత్రికారంగ పాఠ బోధన చేసిన తొలి ఆచార్యుడు కూడా ఆయనే. దిద్దుబాటు ‘ఇలాగేనా రాయడం’వంటి వైవిధ్యభరితమైన రచనలతో తెలుగు పాత్రికేయ జగతికి మంచి బాటలు నిర్మించిన విద్వాంసులు రమారమి ఆరు దశాబ్దాల ఆయన జీవితానుభవాల సంపుటి ‘జ్ఞాపకాల వరద’ అనే పేరుతో వెలువడింది. ఇదొక స్ఫూర్తివంతమైన రచన. ఆదర్శవంతమైన ఆత్మకథకు మంచి నమూనా.

వాస్తవానికి 1950వ దశాబ్ది ప్రారంభంలో పాత్రికేయ వృత్తిలో విద్యా శిక్షకుల గురించి చాలామందికి అవగాహనలేదు. ఈ దశలో శిక్షణ అందించే సంస్థలూ నాడు తక్కువే. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు సుదూరంలో ఉన్న ఆర్మూరులో యువకుడు వరదాచారి అత్యంత ఆసక్తితో పాత్రికేయ విద్యా శిక్షణ పొందారు. అనంతరం హిందూ పత్రిక (మదరాసు)లో మెళుకువలు నేర్చుకున్నారు. అటు తర్వాత ఇక వెనకకు తిరుగవలసిన అవసరం ఏర్పడలేదు. ఈ కార్యక్రమంలో తనకెదురైన అనుభవాలను చూసిన సంఘటనల్ని ఎంతో సంతులనంతో వరదాచారి ‘జ్ఞాపకాల వరద’గా నమోదు చేశారు. ‘జ్ఞాపకాల వరద’తో వరదాచారి ఆదర్శవంతమైన వ్యక్తిత్వం చక్కగా పరిచయమవుతుంది. ప్రత్యేకమైన అంశాన్ని ఈ సందర్భంలో తప్పక ప్రస్తావించుకోవాలి. అది వరదాచారి తన జ్ఞాపకాలలో తరచుగా వర్ణించిన ఆర్మూర్‌. ఆయన స్వస్థలం అది. ఎన్నో సంవత్సరాల క్రితమే ఆయన భాగ్యనగరానికి తరలివచ్చారు. అయినా ఆర్మూర్‌ తాలూకు బాల్య జ్ఞాపకాలు ఇంకా గాఢంగా వరదాచారి హృదయంలో వున్నాయి. చిన్ననాటి ఆర్మూర్‌ యాదుల్ని కథనాత్మకరీతిలో చెప్పారు.