|

గోదావరి ‘జల’హారతి

  • తెలంగాణకు కాళేశ్వర గంగ కనువిందు
  • చిన్న అవరోధం లేకుండా విజయవంతమైన వెట్‌రన్‌
  • ఆది నుంచి ఇదే రీతిన రికార్డులు సృష్టిస్తున్న వరప్రదాయిని
  • వరుస వెట్‌రన్‌లతో నీటి విడుదలకు సిద్ధమవుతున్న ప్రాజెక్టు

తెలంగాణను సస్యశ్యామలం చేయనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తొలి మోటారు వెట్‌రన్‌ విజయవంతమైంది. సీఎం కేసీఆర్‌ రీడిజైనింగ్‌ ప్రతిభ… తెలంగాణ ఇంజినీర్ల సామర్ధ్యానికి ‘జల’హారతి పట్టినట్లుగా గోదావరి పరవళ్లు అందరికీ కనువిందు చేశాయి. రాష్ట్ర సాగునీటిరంగమంటే కాళేశ్వరం ప్రాజెక్టు ముందు… ఆతర్వాత… అనే రీతిలో రాష్ట్రంలో ఏకంగా 40 లక్షల ఎకరాల బీడు భూముల్లో సిరులు పండించనున్న ప్రాజెక్టు త్వరలోనే సాకారం కానుందనే భరోసాను తెలంగాణ రైతాంగంలో కల్పించింది. దేశ సాగునీటి రంగానికే దిక్సూచిలా నిలిచిన ప్రాజెక్టు పనులు ఒకవైపు శరవేగంగా కొనసాగుతుండగా… మరోవైపు భారీ మోటార్ల వెట్‌రన్‌ల ప్రక్రియను అధికారులు ప్రారంభించడంతో ఈ వర్షాకాలంలోనే గోదావరిజలాలు తెలంగాణ బీడు భూముల్లో పారించేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల చేపట్టి భారీ ఎత్తున చెరువులను నింపేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు స్పష్టమైన ఆదేశాలు, లక్ష్యాలు నిర్ధేశించారు. అందుకు అనుగుణంగా పనుల్లో వేగాన్ని పెంచిన అధికారులు… నీటి విడుదలకు ముందుగా అన్నిరకాలుగా సాంకేతిక సంసిద్ధతపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా నంది మేడారం పంపుహౌజ్‌లోని 124.4 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న మోటార్ల వెట్‌రన్‌ను ఇంజినీర్లు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఏప్రిల్‌ 17వ తేదీన ఈ ప్రక్రియను ప్రారంభించగా… అడుగడుగునా అన్నిరకాల సాంకేతిక జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగారు. వెట్‌రన్‌ కోసం ఇంజినీర్లు అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీటిని వదిలింది మొదలు… 1.1 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వ, సుమారు 9.534 కిలోమీటర్ల మేర నిర్మించిన జంట సొరంగాలు దాటుకుంటూ గోదావరిజలాలు సర్జ్‌పూల్‌లోకి చేరాయి. ఆ తర్వాత నిర్ణీత స్థాయిలోకి నీటిమట్టం చేరే వరకు ఇంజినీర్లు రెండుసార్లు నీటి విడుదల నిలిపివేశారు. ఎప్పటికప్పుడు లీకేజీల లోతైన పరిశీలన జరిపారు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను వినియోగించారు. ఆ తర్వాత ఎలాంటి సమస్యలేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఏప్రిల్‌ 24న ఉదయం వెట్‌రన్‌ చేపట్టారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ మధ్యాహ్నం 12.03 గంటలకు పూజలు చేసి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి నందిమేడారం చేరుకున్న స్మితా సబర్వాల్‌ అండర్‌టన్నెల్‌కు చేరుకున్నారు. పదిహేను నిమిషాలపాటు టన్నెల్‌లోని పంప్‌హౌస్‌ను పరిశీలించిన తర్వాత ప్రత్యేక పూజలుచేశారు. పూజల్లో నీటిపారుదలశాఖ అధికారులు, ఆరో ప్యాకేజీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పూజల అనంతరం మధ్యాహ్నం 12.03 గంటలకు కంప్యూటర్‌ ద్వారా నందిమేడారం పంప్‌హౌస్‌లోని 124.4 మెగావాట్ల మోటర్‌ వెట్‌రన్‌ను స్మితా సబర్వాల్‌ ప్రారంభించారు. వెట్‌రన్‌ ప్రారంభించిన కొద్దిసేపటికే నిర్ధేశిత 200 ఆర్పీఎం (రెవల్యూషన్స్‌ పర్‌ మినిట్‌-ఒక నిమిషానికి మోటర్‌ తిరిగే చుట్లు)కు చేరుకొని సర్జ్‌పూల్‌ నుంచి నీటిని ఎత్తిపోయడం మొదలుపెట్టింది. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు స్మితా సబర్వాల్‌తోపాటు నీటిపారుదలశాఖ అధికారులు నందిమేడారం డెలివరీ సిస్టర్న్‌ (నీరు వెలుపలికి వచ్చే ప్రాంతం) వద్దకు చేరుకొని పంప్‌హౌస్‌ నుంచి వస్తున్న నీటికి ప్రత్యేక పూజలుచేశారు. నందిమేడారం పంపుహౌస్‌లో 124.4 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న ఏడు మోటర్లను అమర్చాల్సి ఉండగా.. ఇప్పటివరకు నాలుగు డ్రైరన్‌ కూడా పూర్తిచేసుకున్నాయి. మరో రెండు పురోగతిలో ఉన్నాయి. కాగా మొదటి మోటారు వెట్‌రన్‌ విజయవంతం కాగా… మరుసటి రోజు ఏప్రిల్‌ 25వ తేదీన రెండో మోటారు వెట్‌రన్‌ను కూడా ఇంజినీర్లు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో రెండు మోటార్ల ద్వారా 3200 క్యూసెక్కుల చొప్పున సిస్టర్న్‌ రిజర్వాయర్‌లోకి ఎగిసిపడిన గోదావరి పరవళ్ల కమనీయ దృశ్యాలు అందరినీ కనువిందు చేశాయి.

కొండంత ఆత్మస్థయిర్యం…

ఏదైనా బృహత్తర ప్రాజెక్టుకు ముందు సాంకేతికంగా సంసిద్ధం కావడం… అందులో మొదటి ప్రయత్నంలో విజయవంతం అవడమనేది విశేషం. తాజాగా కాళేశ్వరం వెట్‌రన్‌లోనూ తెలంగాణ ఇంజినీర్లు ఇదే ప్రతిభను కనబరిచారు. ఇలాంటి పరీక్షల్లో సాంకేతిక సమస్యలు ఎదురవడం, ఇంజినీర్లు వాటిని గుర్తించి చర్యలు తీసుకోవడం సర్వ సాధారణం. కానీ తాజా ప్రక్రియలో అలాంటి చిన్న అవాంతరాలు కూడా ఎదురుకాకపోవడంతో ప్రాజెక్టు ఇంజినీర్లలో నూతనోత్తేజాన్ని నింపినట్లయింది. ముఖ్యంగా ఎండనక, వాననక… రేయింబవళ్లు శ్రమిస్తున్న ఇంజినీర్లకు ఈ విజయం కొండంత ఆత్మస్థయిర్యాన్ని నింపినట్లయింది. అదే సమయంలో ఇంజినీర్లపై ఎంతో నమ్మకాన్ని ఉంచిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు శుభపరిణామమైంది. అందుకే వెట్‌రన్‌ విజయవంతం కాగానే సీఎం కేసీఆర్‌ నేరుగా కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది అందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా వెట్‌రన్‌ విజయవంతంగా పూర్తవడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవడమే కాదు… తెలంగాణ ఇంజినీర్ల సామర్ధ్యాన్ని మరోసారి చాటినట్లయింది.

వెట్‌రన్‌ ప్రక్రియలో ముఖ్యాంశాలు…

  • వెట్‌రన్‌ నిర్వహించిన మోటార్ల సామర్ధ్యం – 124.4 మెగావాట్లు
  • మోటారు డిశ్చార్జి సామర్ధ్యం – 3200 క్యూసెక్కులు
  • నీటిని ఎత్తిపోసింది – 105 మీటర్లు

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ మోటారు వెట్‌రన్‌ దరిమిలా ఈ ప్రాజెక్టు ప్రస్థానంలో చోటుచేసుకున్న కీలక అంశాలను ఒకసారి పరిశీలిస్తే…

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానం ఇలా…

జులై, 2015లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని సీఎం కేసీఆర్‌ రీడిజైనింగ్‌కు శ్రీకారం చుట్టారు. అదే ఏడాది ఆగస్టులో 29 రోజుల పాటు 112 గంటలు, 3550 చదరపు కిలోమీటర్ల పరిధిలో అధునాతన లైడార్‌ సర్వే చేపట్టారు. ఆపై చకాచకా జరిగిన పరిణామాలతో 2016 మార్చి 8న తెలంగాణ-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటు తర్వాత జరిగిన బోర్డు సమన్వయ, స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో రెండు రాష్ట్రాల ఇంజినీర్ల మధ్య విస్తృతంగా సాంకేతిక చర్చలు జరిపారు. ముంపుపైనా సంయుక్త సర్వే చేసి, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హరీశ్‌రావు, గిరీష్‌ మహాజన్‌ భేటీతో డిజైన్లపై ఓ సూత్రప్రాయ నిర్ణయానికొచ్చి… ఆపై అధికారుల సంప్రదింపులతో తుది డిజైన్‌ను రూపొందించారు. అందుకు అనుగుణంగానే 2016 ఆగస్టు 23న తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ల సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య చారిత్రక అంతర్రాష్ట్ర ఒప్పందం సాకారమైంది. ఈలోగానే తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీతో పాటు మిగిలిన అన్నారం, సుందిల్ల బ్యారేజీలు, పంపుహౌస్‌ టెండర్లను కూడా పూర్తి చేయడం మరో విశేషం.

ఇలా ఈ అన్ని ప్రక్రియలు జరిగేందుకు కేవలం తొమ్మిది నెలల సమయం మాత్రమే పట్టింది. సాగునీటి అధ్యాయంలో కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, నీటిపారుదల శాఖకే దక్కింది. ఆపై శరవేగంగా జరుగుతున్న పనులతో పాటు కేవలం ఏడాది వ్యవధిలోనే కేంద్ర జల సంఘం నుంచి పది రకాల అనుమతులు సంపాదించడమనేది దేశంలో కేవలం కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే సాధ్యమైంది.

తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల శ్రేయస్సు దృష్ట్యా నిధుల కొరత లేకుండా ఉండేందుకు కార్పొరేషన్‌ ఏర్పాటు తదనుగుణంగా చేసిన కృషితో ఆర్థిక సంస్థలు ముందుకొచ్చి రుణాలు ఇవ్వడంతో కాళేశ్వరం పథకం పనులు పరుగులు పెడుతున్నాయి.

ఈ క్రమంలో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌లు, పంపుహౌజ్‌ పనులు చివరి దశకు చేరుకోవడం… కీలకమైన భారీ మోటార్లు ఒక్కొక్కటిగా డ్రైరన్‌ పూర్తి చేసుకొని, వెట్‌రన్‌కు కూడా సిద్ధమవడం విశేషం.

తాజాగా నంది మేడారం పంపుహౌజ్‌లోని 124.4 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న మోటారు వెట్‌రన్‌ విజయవంతంగా పూర్తవగా… అత్యంత కీలకమైన, ఆసియాలోనే అతి పెద్దదైన 139 మెగావాట్ల బాహుబలి మోటారు వెట్‌రన్‌కు అధికారులు సిద్ధమవుతుండటం మరో విశేషం.

ఈ క్రమంలో వర్షాకాలంలో కాళేశ్వరం నీటి విడుదలతో ఏడాది పొడవునా చెరువుల్లో జలకళ నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం, అందుకు అనుకూల అడుగులతో నీటిపారుదల శాఖ పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది.

మన రికార్డులను మనమే అధిగమిస్తూ…

గత దశాబ్దంన్నరగా ఆసియాలోనే అతి పెద్ద లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ వేదికగా నిలుస్తూనే ఉంది. 2000-01 ప్రాంతంలో నల్లగొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పూర్తయినపుడు… వంద మీటర్ల ఎత్తులో నీటిని లిఫ్టు చేయడంతో ఆసియాలోనే అతి పెద్ద లిఫ్టు ఇరిగేషన్‌గా పరిగణించారు. ఆ ప్రాజెక్టులో ఒక్కో మోటారు సామర్ధ్యం 18 మెగావాట్లు. అలాంటివి నాలుగు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 30 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న మోటార్లను ఏర్పాటు చేయడంతో ఆసియాలో అతి పెద్ద లిఫ్టు ఇరిగేషన్‌గా కల్వకుర్తి నిలిచింది. ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 30, 120, 139 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న మోటార్లను వినియోగిస్తున్నారు. అయితే నీటిని ఎత్తిపోసిన మోటార్లను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటే… తాజాగా కాళేశ్వరం పథకంలోని నంది మేడారం పంపుహౌజ్‌లో 124.4 మెగావాట్ల మోటారు ప్రస్తుతానికి రికార్డుగా నిలిచింది. వచ్చే నెలలో రామడుగు పంపుహౌజ్‌లోని బాహుబలి మోటారు ఈ రికార్డును తిరగరాయనుంది. ఆసియాలోనే అతి పెద్ద లిఫ్టు ఇరిగేషన్‌ మోటారుగా చరిత్రకెక్కనుంది. దీని తర్వాత కూడా తెలంగాణనే ఈ రికార్డును సొంతం చేసుకోనుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఏకంగా 145 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న మోటార్లను వినియోగించనున్నారు. అంటే మరి కొంతకాలంలో కాళేశ్వరం రికార్డును పాలమూరు-రంగారెడ్డి అధిగమించనుందన్నమాట.

కాళేశ్వరం నీటి వినియోగం ఇలా…
అంశాలు నీటి పరిమాణం టీఎంసీల్లో…

– గోదావరి నుంచి మళ్లింపు 195
– ఎల్లంపల్లి ప్రాజెక్టు కమాండ్‌ ఏరియా నుంచి
వచ్చే అదనపు గోదావరి జలాలు
20
– ఎల్లంపల్లి వద్ద నీటి లభ్యత 215
– చెరువుల ద్వారా 10
– ఇరిగేషన్‌ రీఛార్జి ద్వారా భూగర్భజలాలు 25
– ఆవిరి నష్టాలు 10
– ప్రాజెక్టుకు నికర నీటి లభ్యత
(ఎల్లంపల్లించెరువులు, భూగర్భజలాలు)
250
– నీటి ఆవిరి నష్టం 10
మొత్తం 240

జిల్లాలవారీగా ఆయకట్టు వివరాలిలా ఉన్నాయి…

జిల్లా ఆయకట్టు ఎకరాల్లో…
కరీంనగర్‌ 800
రాజన్న సిరిసిల్ల 1,41,205
సిద్దిపేట 3,80,399
మెదక్‌ 2,59,808
యాదాద్రి 2,32,993
నల్లగొండ 29,169
నిజామాబాద్‌ 1,67,800
జగిత్యాల 19,500
కామారెడ్డి 2,34,000
సంగారెడ్డి 1,80,026
నిర్మల్‌ 1,00,000
మేడ్చల్‌ 50,000
పెద్దపల్లి 30,000
మొత్తం 18,25,700
స్థిరీకరణ 18,82,970
ఆయకట్టు స్థిరీకరణ 37,08,670

పలు ప్రధాన ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఇలా…

నిజాంసాగర్‌ 2,34,330
సింగూరు 40,000
ఎస్సారెస్పీ-1 9,68,640
ఎస్సారెస్పీ-2 4,40,000

రైతుల తలరాత మార్చే కాళేశ్వరం
మెదడును కరిగించి రీడిజైనింగ్‌ చేశాం: సీఎం కేసీఆర్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని నంది మేడారం పంపుహౌజ్‌లో ఇంజినీర్లు చేపట్టిన మొదటిపంపు వెట్‌రన్‌ విజయవంతం కావడంపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న పంపుతో 105 మీటర్ల మేర ఎత్తునకు నీటిని ఎత్తిపోసే ప్రక్రియ అనుకున్నది అనుకున్నట్లుగా విజయవంతం కావడం అత్యంత ఆనందకరమైనదిగా సీఎం అభివర్ణిం చారు. ఇంతటి భారీ సామర్ధ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్‌, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ముఖ్యంగా కాళేశ్వరం పథకం అనేది తెలంగాణ రైతుల తలరాతను మార్చే వరప్రదాయిని అని స్పష్టం చేశారు. ‘తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మెదడును కరిగించాం. అనేక రకాలుగా ఆలోచించాం. ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మరో గత్యంతరం లేదని తీర్మానించుకున్నాం. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్‌ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశాం. రక్షణ శాఖ అనుమతి తీసుకొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లైడార్‌ సర్వే నిర్వహించి, పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశాం. గోదావరి నుంచి నీటిని తోడటానికి గతంలో ఎన్నడూలేని విధంగా 139 మెగావాట్ల భారీ సామర్ధ్యం కలిగిన పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్‌ చేశాం. గతంలో తెలంగాణలోని ఎత్తిపోతల పథకాల కంటే ఎక్కువ ఎత్తులో అంటే 120 మీటర్ల ఎత్తులోనూ నీటిని పంపింగ్‌ చేసేలా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ రూపొందించాం. ఈ ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడానికి ఇంజినీర్లు, అధికారులు విదేశాలకు కూడా వెళ్లారు. సంపూర్ణ అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతో పనులు చేపట్టారు. భగవంతుడి ఆశీస్సుల వల్ల అన్నీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగాయి. ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజినీర్లకు హృదయపూర్వక అభినందనలు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ నెలలో వరుస వెట్‌రన్‌లు…

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఇటీవల చేపట్టిన వెట్‌రన్‌ విజయవంతం కావడంతో ప్రాజెక్టు ఇంజినీర్లు మిగిలిన పంపుహౌజ్‌ల్లోనూ ఎత్తిపోతల పరీక్షలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌ ఫోర్‌షోర్‌లో కన్నెపల్లి వద్ద నిర్మించిన పంపుహౌజ్‌ మొదలు… అన్నారం, సుందిల్ల వద్ద కూడా లిఫ్టు చేసి ఎల్లంపల్లిలో జలాల్ని పోయనున్నారు. అక్కడి నుంచి మళ్లీ లిఫ్టు చేసి మేడారం రిజర్వాయర్‌ ఆపై రామడుగు పంపుహౌజ్‌లో లిఫ్టు చేసి ఎస్సారెస్పీ వరద కాల్వ తద్వారా మిడ్‌ మానేరకు జలాల్ని తరలించాల్సి ఉంటుంది. ఇందులో ఎల్లంపల్లి-మేడారం రిజర్వాయర్‌ మధ్యలో నంది మేడారం పంపుహౌజ్‌లో ఇటీవల ఇంజినీర్లు వెట్‌రన్‌ పూర్తి చేశారు. ఇక ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బరాజ్‌ ఫోర్‌షోర్‌లో వెట్‌రన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే ఐదో తేదీన ఇందుకు సంబంధించి ప్రక్రియ మొదలుకానుంది. కన్నెపల్లి పంపుహౌజ్‌లోని సర్జ్‌పూల్‌ నింపే ప్రక్రియను ఐదో తేదీన ప్రారంభించి… దాదాపు వారం రోజుల తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్‌లోని తొలి మోటారు వెట్‌రన్‌ చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ పంపుహౌజ్‌లో 40 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న పదకొండు మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఏడింటిని ఇప్పటికే బిగించగా మరో రెండు పురోగతిలో ఉన్నాయి. అయితే పూర్తయిన ఏడింటిలో ఆరు మోటార్లకు వెట్‌రన్‌ చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. మే మొదటి వారంలో వెట్‌రన్‌ల పర్వానికి శ్రీకారం చుట్టనున్న ఇంజినీర్లు ఒక్కొక్కటిగా అన్నింటినీ పూర్తి చేశారు. ఆతర్వాత సుందిల్ల పంపుహౌజ్‌లో తొమ్మిది మోటార్లకుగాను నాల్గింటిని ఇప్పటికే బిగించారు. వీటికి వెట్‌రన్‌ చేపట్టనున్నారు. అనంతరం అన్నారం పంపుహౌజ్‌లో ఎనిమిదింటికిగాను ఆరింటిని బిగించారు. వీటికి అధికారులు వెట్‌రన్‌ చేపట్టనున్నారు. అంటే మే మొదటి వారంలో వెట్‌రన్‌ ప్రక్రియ మొదలై…ఒక్కొక్కటిగా దాదాపు 16 మోటార్లకు ఎత్తిపోతల పరీక్ష నిర్వహించనున్నారు.

కాగా మేడారం రిజర్వాయర్‌ – రామడుగు పంపుహౌజ్‌లో మధ్యలో నిర్మించిన సొరంగం లైనింగ్‌ పనులు పూర్తికాగానే రామడుగు పంపుహౌజ్‌లోని 139 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న మోటార్ల ఎత్తిపోతల పరీక్షకు ఏర్పాట్లు మొదలుపెట్టనున్నారు. మే చివర్లో బాహుబలి మోటార్ల వెట్‌రన్‌ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మోటారు ఆసియాలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం మోటారు కావడంతో దీని వెట్‌రన్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.

– గుండాల కృష్ణ