మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు
జలవిజయం సాధించిన కే.సీ.ఆర్
కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించిన మేరకు, మల్లన్నసాగర్ సభానంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ నుంచి తెచ్చిన గోదావరి జలాలను స్వామివారి అభిషేకానికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

గోదావరి జలాలు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. చెప్పినట్లుగానే.. నేడు గోదావరి జలాలతో మల్లన్న పాదాలను అభిషేకం చేస్తున్నామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ జీవనాడి మల్లన్నసాగర్ అనీ, ఇది రాష్ట్ర ప్ర‘జల’ హృదయమని, మన ప్రాంతాన్ని జలాలతో అభిషేకం చేసే సాగరమని సీఎం పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంతోపాటు సస్యశ్యామల తెలంగాణను కూడా చూస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన అతి భారీ జలాశయం మల్లన్న సాగర్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరమైన ఘట్టమని, ఈ మహాయజ్ఞంలో పని చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం ధన్యవాదాలు తెలియజేశారు.

కేవలం మూడేళ్ల కాలంలోనే నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 58 వేల మంది కార్మికులు పని చేస్తున్నపుడు కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారి, దాదాపు 600 పైగా కేసులు వేశారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీర్లు రిటైరైనా కూడా ఈ ప్రాజెక్టు కోసం పని చేశారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఎండనక, వాననక, రాత్రింబవళ్లు కష్టపడి పని చేశారని కొనియాడారు.

భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడామని సీఎం పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో మనసు పెట్టి ముందుకు పోయామని, మంత్రి హరీశ్ రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. భూములు కోల్పోయిన వారి త్యాగం వెలకట్టలేనిదని, ముంపునకు గురైన గ్రామాల భూనిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. నిర్వాసితుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, మంజూరు చేయాలి. ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి అని మంత్రి హరీశ్ రావుకు, అధికారులకు సీఎం సూచించారు. మల్లన్నసాగర్ కేవలం సిద్ధిపేట జిల్లాకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

‘‘ఆరునూరైనా సరే.. భారత దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు, చివరి రక్తపు బొట్టు ధారపోసి అయినా సరే, ఈ దేశాన్ని చక్కదిద్దుతాను, ముందుకు పోతాను’’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఇందుకోసం దేవుడు తనకిచ్చిన సర్వశక్తులూ ఒడ్డుతానని, సకల మేథోసంపత్తిని ఉపయోగిస్తానని సీఎం అన్నారు.

ఈ దేశంలో దుర్గార్మమైన వ్యవస్థ నడుస్తున్నదని, దీంతో దేశం కూడా దారితప్పి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మతకల్లోలాల పేరిట విధ్వంసం సృష్టిస్తూ చిచ్చు పెడుతున్నారని, ఈ దుర్మార్గాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు, మతాల పేరు మీద చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి పరిస్థితులుంటే పరిశ్రమలు రాకుండా, వెనక్కి పోయే ప్రమాదం కూడా ఉన్నదని సీఎం హెచ్చరించారు. కుల, మత కల్లోలాల క్యాన్సర్‌ను ఈ దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలకు చేటు చేసే వారిని ఎక్కడికక్కడ నిలదీసి ఎదుర్కోవాలని సీఎం పిలుపునిచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాలు బాగు పడాలంటే.. కేంద్రంలో కూడా ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. దేశ పురోభివృద్ధి కోసం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు.
బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారింది. మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ నుంచి లక్షా 50 వేల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌లో దిగుతున్నాయి. ప్రతి రోజూ 580 వరకు విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. తెలంగాణలో ఎక్కడికి పోయినా ఎకర భూమి 20 లక్షలకు పైగానే ఉంది. మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంది. అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం అన్నారు.
మల్లన్నసాగర్‌తో మారిపోనున్న తెలంగాణ ముఖచిత్రం

కొమరెల్లి మల్లన్న సాగర్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన రిజర్వాయర్. ఎక్కువ నీటి నిలువ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ కూడా ఇదే. దీని నీటి నిలువ సామర్థ్యం 50 టీ.ఎం.సీ.లు. దీని తరువాత 15 టీ.ఎం.సీ.ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ కొండ పోచమ్మ సాగర్. మిగతా రంగనాయక సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు వీటికన్నా తక్కున నీటి నిలువ సామర్థ్యం కలిగినవే. ఇలాంటి కీలకమైన రిజర్వాయర్ సంపూర్ణంగా పూర్తి కావడంతో దీన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతికి అంకితం చేశారు. ఈ రిజర్వాయర్ గురించి చెప్పాలంటే ఉత్తర తెలంగాణ ప్రజలకు నిరంతరం సాగునీరు, భాగ్యనగర్ ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక వాడలకు నీటి వసతి కల్పించే కల్పతరువు అని పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. ఇంతటి మహత్తర జలాశయం అయినా కూడా ఈ నిర్మాణానికి ఆటంకాలు తప్పలేదు. ముంపు గ్రామాల ప్రజలు, ఇతర వ్యక్తులు వేసిన కోర్టు కేసులతో కొంత జాప్యం జరగగా, అన్ని ఆటంకాలను అధిగమించి చివరకు అపర భగీరథుడు, రైతు బాంధవుడు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితం అయ్యింది.
సిద్ధిపేట జిల్లా తొగుటకొండపాక మండలాలలో నిర్మించిన ఈ జలాశయం సముద్రమట్టానికి 557 మీటర్ల ఎత్తులో నిర్మించారు. దీనిద్వారా 11.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చెల్‌మల్కాజిగిరి, నల్లగొండ, జనగామ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలోని భూములన్నీ సస్యశ్యామలమవుతాయి. ఇక హైదరాబాద్‌కు తాగు నీరు అందిస్తుంది. భవిష్యత్తులో 30 టీఎంసీల తాగునీరు భాగ్యనగరానికి, 16 టీఎంసీల నీరు పారిశ్రామిక అవసరాలకు తరలించాలని సంకల్పించారు. భాగ్య నగరానికి తాగునీరు అందించడానికి మంగోలు గ్రామం వద్ద భారీ నీటి శుద్ధి కేంద్రం, పంప్‌హౌజ్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడ నీటిని శుద్ధి చేసి లకుడారం గ్రామం వద్ద హైదరాబాద్ పైపులైన్‌కు అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మల్లన్నసాగర్ జలాశయం నుంచి కొండపోచమ్మ సాగర్, అక్కడి నుంచి గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. మరో కాల్వ ద్వారా హల్ది వాగునుంచి మంజీర నదిలోకి, అక్కడి నుంచి నిజాంసాగర్‌కు తరలిస్తారు. ఇక ఈ రిజర్వాయర్‌లో ఎల్లవేళలా నీరు ఉండే విధంగా ప్రణాళికలు రచించారు. మిడ్‌మానేరు నుంచి అన్నాపూర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల మీదుగా ఎత్తిపోతలతో పాటు, అదనపు టీఎంసీ కాలువ నిర్మాణానికి కూడా నిధుల ఖర్చు అంచనాలు రూపొందిస్తున్నారు. ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ జలాశయానికి 22.6 కి.మీ. బండ్ నిర్మాణం జరిగింది. దీన్ని ప్రజలను ఆకర్షించే విధంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇలా అటు సాగునీటి అవసరాలు తీరుస్తూ, ఇటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుస్తూ, మరోవైపు పర్యాటక కేంద్రంగా ప్రజలను ఆహ్లాదపరుస్తూ బహులార్ధ సాధక ప్రాజెక్టుగా మల్లన్నసాగర్ తెలంగాణ ప్రజల బతుకులు సార్ధకం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.