|

ప్రభుత్వం ఇచ్చిన భూమిలో బంగారు పంటలు

By: యన్‌. భీమ్‌ కుమార్‌, ఆదిలాబాదు

ఒకప్పుడు వారంతా దినసరి కూలీలు. రోజువారీ సంపాదనతో కాలం వెల్లదీసేవారు. ఇపుడు వారంతా మూడు ఎకరాల చొప్పున సాగు భూములకు యజమానులుగా మారారు. రైతులుగా మారి ఆ మూడు ఎకరాలలో రెండు పంటలు పండించడంతో వ్యవసాయం వారికి లాభదాయకంగా మారడమే కాకుండా స్వీయ సాధికారిత సాధించారు. దళితుల సాధికారత లక్ష్యంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళితులకు 3 ఎకరాల పథకం వారి జీవితాల్లో ఈ మార్పును తీసుకువచ్చింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూమి కొనుగోలు పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఆదిలాబాద్‌ జిల్లాలో 206 కోట్ల రూపాయలతో 4675 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, 1832 మంది భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు పంపిణి చేశారు. అంతే కాకుండా 3975 ఎకరాలలో పంటల సాగుకు పెట్టుబడిగా 763 లక్షల రూపాయలను 1504 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. 

ఇందులో భాగంగానే మూడు సంవత్సరాల క్రితం ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖా(కె) గ్రామంలో ప్రభుత్వం ఒకే చోట 99 ఎకరాల సాగు భూమిని కొనుగోలు చేసి ఆ గ్రామంలోని 33 మంది దళిత మహిళలకు పంపిణి చేసింది. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఆ సాగు భూముల్లో పత్తి, కంది పంటలను సాగుచేసుకుంటూ, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరలకు తమ పంట దిగుబడులను విక్రయించి లబ్దిదారులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఎవరిపై ఆధారపడకుండా, ఎవరి సాయం తీసుకోకుండా డబ్బును పొదుపు చేసుకుంటు పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు వంటి అవసరాలను తీర్చుకుంటున్నామని లబ్ధిదారులు కాంబ్లీ లక్ష్మి, భాగ్యశ్రీ తెలిపారు. మొదటి సంవత్సరంలో 25 నుండి 40 వేల రూపాయలు మిగులుబాటు అవుతే, రెండో యేడాది 50 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు సంపాందించామని ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన మహిళా రైతులు పేర్కొంటున్నారు. 

ఇలా ప్రతి ఒక్క దళిత కుటుంబం తమ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటే ప్రభుత్వం లక్ష్యం నెరవేరినట్లే.