ప్రజల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి నింపిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ రాష్ట్రమంతటా ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపుతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా, జాతి గర్వపడేలా ఉత్సవాలను జరుపుకున్నారు. 15 రోజుల పాటు జరుపుకున్న ద్విసప్తాహ వేడుకల్లో ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలన్నింటినీ ప్రజలు విజయవంతం చేశారు. ముఖ్యంగా సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలంతా స్వచ్చందంగా పాలొన్గి తమ దేశభక్తిని చాటుకున్నారు . విద్యార్ధులకు గాంధీ సినిమా ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా మారింది. ద్విసప్తాహ వేడుకల్లో జరిగిన రక్తదాన శిబిరంలో సుమారు 18,300 యూనిట్ల రక్తం సేకరించడం ఒక రికార్డు. ప్రతి ఇంటిపై జాతీయ జెండ రెపరెపలాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, కోటి 20లక్షల జాతీయ పతాకాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రభంజనాన్ని సృష్టించింది. జాతిని మేల్కొలిపేలా, స్వతంత్య్ర పోరాటంలో పాల్గొని దాస్య శృంఖలాలు తెంపిన మహనీయుల వృత్తాంతాలను ప్రజలకు తెలియచేసేలా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు పండిత, పామరులను ఆలోచింపచేశాయి. జాతినుద్దేశించి సీఎం కేసీఆర్‌ చేసిన ఉత్సవాలప్రారంభ, ముగింపు ఉపన్యాసాలు ప్రజలను ఆలోచింపచేశాయి. ప్రతీప శక్తులను ఎదుర్కోవడానికి, జాతి సమైఖ్యత దెబ్బతినకుండా చూడడానికి యువత, మేధావులు చేయాల్సిన కర్తవ్యాల గురించి ముఖ్యమంత్రి చేసిన ఉద్బోధ దేశ యువతను ఉత్తేజితులను చేసింది. మొత్తంగా వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు రాష్ట్రంలో అత్యంత వైభవంగా, దేశభక్తి పూరితంగా జరగడమే కాక, దేశ ప్రజలందరినీ మేల్కొలిపే విధంగా జరిగాయి.

తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 8 నుండి 22 వరకు రెండు వారాల పాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రజల్లో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని నింపే విధంగా జరిగాయి. పక్షం రోజులు జరిగిన ఈ వజ్రోత్సవాల్లో ప్రజల ఇండ్ల పైన, కార్యాలయాలపైన ఎగురవేయడానికి కోటి 20 లక్షల జెండాల పంపిణీ కార్యక్రమం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్యాలయ భవనాలు, చారిత్రక ప్రదేశాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించడం, సామూహిక జాతీయ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు, గాంధీ సినిమా ప్రదర్శనలు, ప్రత్యేక హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, పుస్తక ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్‌ వంటి అనేక కార్యక్రమాలు ప్రజల్లో అలనాటి స్వాతంత్య్ర పోరాట పటిమను పాదుకొలిపాయి. పరాయి పాలన నుంచి విముక్తం చేయడానికి నాటి మహానుబావులు ఎందరో బలిదానాలు చేసిన తీరు, ఇప్పుడు మనమనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరి త్యాగాలతో సాధ్యమైందో ఇప్పటి తరానికి కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఈ వజ్రోత్సవాలను ద్విగిణీకృతోత్సాహంతో నిర్వహించి విజయవంతం చేశాయి. 

కమిటీ ఏర్పాటు

రాష్ట్రంలో వజ్రోత్సవాలను విజయవంతం చేయ డానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపీ కే.కేశవరావు ఛైర్మన్‌గా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. కే.కేశవరావు ఆధ్వర్యంలో కార్యక్రమాల రూపకల్పన జరిగి విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

అట్టహాసంగా ప్రారంభమైన వజ్రోత్సవ వేడుకలు – పాల్గొన్న సీఎం కేసీఆర్‌
మహాత్ముని స్ఫూర్తితో ముందుకు సాగాలి : సీఎం కేసీఆర్‌

ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచి, మహాత్మునిగా పేరు తెచ్చుకున్న గాంధీని ఆదర్శంగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం నగరంలోని హెచ్‌ఐసీసీలో ప్రారంభించారు. మొదట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తిని పెంపొందించే వివిధ కళారూపాల ప్రదర్శనను తిలకించారు. తరువాత ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులు మహాత్మాగాంధీని తమకు ఆదర్శంగా ప్రకటించుకున్నారని అన్నారు. గాంధీజీ స్వతంత్ర సముపార్జన సారథి మాత్రమే కాదు. యావత్‌ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతి దూత, విశ్వమానవుడని కొనియాడారు. 

తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న కాలంలో.. ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌కు వచ్చారని, ఢిల్లీలో పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించారని తెలిపారు. ఆ ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలకు భారతీయుల గుండెలు పులకించి పోయా యన్నారు. వ్యక్తిగా తాను కూడా చాలా గర్వపడ్డానని తెలిపారు. ‘గాంధీ కనుక ఈ ప్రపంచంలో పుట్టి ఉండకపోతే.. ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’ అని ఒబామా పేర్కొన్నాడని తెలిపారు. అతనే కాకుండా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి రక్త మాంసాలతో పుట్టి ఈ భూమ్మీద నడయాడతాడని అనుకోలేదంటూ..వ్యాఖ్యానించారని,  మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ‘జీసెస్‌ నాకు జీవిత సందేశాన్నిస్తే.. గాంధీ దాన్ని ఆచరణలో చూపారని  కొనియాడారని, దక్షిణాఫ్రికాలో రెండున్నర దశాబ్దాలకు పైగా తాను జరిపిన పోరాటానికి స్ఫూర్తి ప్రదాత మహాత్మాగాంధీ అని నెల్సన్‌ మండేలా పేర్కొన్నాడని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలియచేశారు. అందుకే గాంధీ విశ్వమానవుడయ్యారని, ఆ విశ్వమానవుడిని కన్న గడ్డ నా భరతజాతి. అటువంటి జాతికి వారసులం మనమందరం అని గర్వపడాల్సిన రోజు ఇదని సీఎం పేర్కొన్నారు. ‘స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే కాంక్షతో.. గొప్ప పేరున్న బారిష్టర్‌గా ఉండి, చాలా సంపాదించుకోగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం వహించడానికి నడుం కట్టి, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరిపాడని, అదే స్ఫూర్తితో తన జాతి విముక్తి కోసం పోరాడేందుకు ఇక్కడికి వచ్చారని, భరతమాత కన్న గొప్ప బిడ్డ మహాత్మాగాంధీ అని ప్రశంసించారు. 

మహాత్ముడు ఏనాడైనా మహాత్ముడేనని, మహాత్ముడి దేశంగానే భారతదేశం ఉంటుందని నమ్మే వాళ్లలో నేనూ ఒకణ్ణి అని సీఎం పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్‌ దగ్గర ఎవరో ఓ రెడ్డిగారు మహాత్మాగాంధీకి గుడి కట్టించిన సందర్భాన్ని మనం చూశాం. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ‘ఐయామ్‌ ఫ్రం ఇండియా’ అని అంటే.., ‘ఆర్‌ యూ ఫ్రం గాంధీస్‌ కంట్రీ, ది గ్రేట్‌ మ్యాన్స్‌ కంట్రీ’ అని ప్రశంసిస్తుంటే గర్వ పడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అంతటి గొప్ప వ్యక్తి, విశ్వమానవుడైన మహాత్ముడిని ఈ మధ్య కాలంలో కొందరు కించపరిచే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. తాను ప్రాథమిక పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుంచి నేటి వరకు వందలు, వేల సందర్భాల్లో ‘స్వతంత్ర భారత్‌కీ జై.. మహాత్మాగాంధీకీ జై’ అని నినాదం చేసినామని, కోటానుకోట్ల మంది ప్రజలు గాంధీ పటాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగిన దేశం ఇదని పేర్కొన్నారు. జాతిపితగా మనమే బిరుదాంకితుడిని చేసుకొన్న గొప్ప మానవతావాదిని మనమే కించపరచడం వాంఛనీయం కాదన్నారు. ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదని, అటువంటి వెకిలి, మకిలి ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా మనమంతా ఏకోన్ముఖంగా ఖండించాలని, మన మహాత్ముడి కీర్తిని మరింత విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉన్న భారత జాతిని చీల్చేందుకు జరుగుతున్న కుట్రలను ఐక్య కంఠంతో నిలువరించాలన్నారు. ఆ దుష్ట ప్రయత్నాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని దేశ ప్రజలను కోరారు. 

ఎన్నో ప్రయాసలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కష్టాలకు ఓర్చి ఈనాడు మనం అనుభవిస్తున్న భారతదేశం మనకు అందించబడిందని, ఒక కూర్పు వెనుక ఎంత ప్రయాస ఉంటదో, ఎన్ని త్యాగాలు ఉంటాయో, ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో గాంధీ సినిమాలో చూపించారని అన్నారు. అందుకే ఈ వజ్రోత్సవాల్లో విద్యార్థులకు ఆ సినిమాలు ఉచితంగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆ సినిమాలో బ్రిటిష్‌ ముష్కరులు.. అందరినీ సమాధి చేసే పరిస్థితి ఉంటది. మీరు ‘ఝుoడ్ కే ఝుoడ్ ఏక్ తరహ్ మత్ జావో’ అని చెపుతారు. ఝుoడ్ అంటే గ్రూప్‌.. అంతా ఒక్కదిక్కు పోకండి.. ‘నలుదిక్కులా పొమ్మన్నా కూడా మేం భయపడమని, గుండుకు ఎదురుగా గుండెను పెట్టి పోరాడిన జలియాన్‌వాలాబాగ్‌ ఉదంతం చూశామన్నారు.

‘చంపండిరా ఇంకా ఎంతమందిని చంపుతరో.. ఎంతమందిమైనా చస్తాం కానీ మా స్వేచ్ఛా వాయువులు పీల్చే దాకా ఈ జెండా దించ’బోమని వందేమాతరమంటూ నినదిస్తూ వేలమంది బిడ్డలు నేలకొరిగారని, భగత్‌సింగ్‌ లాంటి త్యాగధనులు స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసారని అన్నారు. ఈ దేశ స్వేచ్ఛ కోసం, మన భవిష్యత్తు కోసం.. ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొంటూ రాజ్యాంగం నీడలో.. చట్టాల పరిధిలో.. మనలను మనమే పరిపాలించుకొనే స్థితిని తీసుకువచ్చిన ఆనాటి స్వాతంత్య్ర యోధులందరికీ భారతీయుల తరఫున, తెలంగాణ తరఫున హృదయపూర్వక నివాళులు, జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు.

పేదరికం ఎంతవరకు దేశంలో ఉంటదో.. అప్పటివరకు ఆక్రందనలు, అలజడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. పేదరికాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుందని అన్నారు. ఈ వాస్తవాన్ని మనమందరం గ్రహించాలన్నారు. ఆ దిశగా ప్రతిజ్ఞబూని కదలాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. 

కొన్ని ప్రతీప శక్తులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని చూసి మనం చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని పారదోలిన గడ్డ ఇదని పేర్కొన్నారు. మనలోపల ఏదైనా బ్లాక్‌షీప్‌ వస్తే దాన్ని తీసి పారేసే శక్తి ఈ దేశానికి ఉన్నదని బలంగా నమ్మే వాళ్లలో నేను ఒకడినన్నారు.  భారతదేశంలో జాతిని చీల్చడానికి జరుగుతున్న కుట్రలను ముక్త కంఠంతో ఖండించాలని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా. ఈ జాతిని, దేశాన్ని కచ్చితంగా కాపాడుకోవాలె. స్వాతంత్య్ర స్ఫూర్తిని, జరుగుతున్న అభివృద్ధిని మరింత ద్విగుణీకృతం చేసేలా ముందుకు పోవాలె. అవసరమైతే.. తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో వెళ్లి పనిచేయడానికి మనందరం కూడా సంసిద్ధులం కావాలని పిలుపునిచ్చారు.

అనేక సందర్భాల్లో ఇక్కడినుంచి అనేకమంది బిడ్డలు స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. మనవాళ్లకు చాలామందికి తెలియదు, ఉప్పు సత్యాగ్రహంలో మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తో పాటు వేల మంది తెలంగాణ యువకులు పాల్గొన్నారని తెలిపారు. ఇవేవీ ఇప్పటివాళ్లకు తెలియవు. మనమంతా అద్భుతమైన, ఉజ్వలమైన భారత నిర్మాణం వైపు పురోగమించాలి. ప్రపంచమంతా నేర్చుకొనేలా ముందుకు సాగాలి. అందుకు మీ  అందరి కృషి దోహదపడాలి. ఈ స్వతంత్ర వజ్రోత్సవ దీప్తితో అడుగు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్‌, ఎంపీ కే.కేశవరావు స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ప్రసంగించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

జెండాల పంపిణీ కార్యక్రమం

రాష్ట్రం మొత్తంలో కోటి 20లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేశారు. వాటిని ప్రజలు తమ ఇళ్ళపైన, వాహనాలకు, కార్యాలయాలపైన ఎగురవేశారు. దీనితో రాష్ట్రమంతా జాతీయ జెండాలతో రెపరెపలాడిరది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఉత్సావాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కే.కేశవరావు, మంత్రి సబితారెడ్డి, సీఎస్‌ సోమేష్‌కుమార్‌తో కలిసి మహేశ్వరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం అనేది మూడక్షరాల మాట కాదని, ఎందరో మహనీయుల త్యాగ ఫలితమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కూడా మరో స్వాతంత్య్ర పోరాటం లాంటిదే అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ముందుకు నడిపి విజయం సాధించారని కొనియాడారు. ఈ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల్లో మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్వహించారు.

సామూహిక జాతీయగీతాలాపన ` ఆబిడ్స్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

ఈ వేడుకలలో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన (జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 16న నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్‌ వార్డులు, ముఖ్యమైన ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్‌ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్‌ స్థలాలలో  16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. సంబంధిత గ్రామ పంచాయతీలలో, స్థానిక మున్సిపల్‌ వార్డులు,  ట్రాఫిక్‌ జంక్షన్‌లలో సామూహిక గానం కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం మొత్తంలో 95.23 లక్షల మంది సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. 

ఆబిడ్స్‌ కూడలిలో జాతీయగీతాలాపన చేసిన సీఎం కేసీఆర్‌

సామూహిక జాతీయ గీతాలాపనలో సీఎం కేసీఆర్‌ స్వయంగా పాల్గొన్నారు. భాగ్యనగరంలోని ఆబిడ్స్‌ కూడలిలో ఆయన పాల్గొని జాతీయగీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనడంతో ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉన్నట్లుగా ఆగిపోయి జాతీయగీతాన్ని ఆలపించారు. యావత్‌ రాష్ట్రంలో ఒకేసారి జాతీయగీతాన్ని ఆలపించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు జరిగాయి. నగరంలోని 75 పార్కుల్లో వజ్రోత్సవ సంగీత విభావరి నిర్వహించారు. ఎల్‌.బి. స్టేడియంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు నిర్వహించిన 1462 ఫ్రీడమ్‌ రన్‌లలో దాదాపు 5లక్షల మంది పాల్గొన్నారు. 13,605 ఫ్రీడమ్‌ ర్యాలీల్లో 18 లక్షల మంది పాల్గొన్నారు.  రాష్ట్రమంతటా ముగ్గుల పోటీలు, రక్తదాన శిబిరాలు, ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

రవీంద్ర భారతిలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 

స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పిలుపు మేరకు స్ఫూర్తిమంతంగా నిర్వహించింది. ఊరు, వాడా అన్న తేడా లేకుండా అన్ని చోట్ల గడప, గడపన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మన జాతీయ పండగను దేశభక్తిపూర్వకంగా 15 రోజుల పాటు ఆనంద సందోహాల మధ్య తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్వతంత్య్ర సమరయోధులు, మహనీయులు, వారి త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అందేలా, వాటి స్ఫూర్తి అర్థమయ్యేలా, దేశభక్తిని పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక, వక్తృత్వ పోటీలు, కవితా పోటీలు, సమ్మేళనాలు, సాహిత్య, సామాజిక నృత్య కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు, సదస్సులు, చిత్రలేఖనం, ఛాయాచిత్ర ప్రదర్శనలు, క్రీడలు, మొక్కలు నాటడం, జాతీయ జెండాను ఎగురవేయడం లాంటి కార్యక్రమాలతో దేశభక్తి మరింత ద్విగుణీకృతం చేసే విధంగా 75 వసంతాల వజ్రోత్సవ స్ఫూర్తి వెలుగులను అందించే విధంగా ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో, నృత్యాలతో, దేశభక్తి గీతాలాపనలతో రవీంధ్రభారతి వేదిక కళకళలాడిరది. స్వతంత్య్ర స్ఫూర్తిని రేపటి తరానికి అందించే విధంగా జరిగిన కార్యక్రమాలు ఆబాల గోపాలాన్ని ఆధ్యంతం అలరింపచేశాయి. 

మహాత్మాగాంధీ సత్యం, అహింసా మార్గాలను నేటి యువతరం వద్దకు తీసుకెళ్ళే విధంగా ఎల్‌.బి.స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ఆకట్టుకుంది. తెలంగాణ సాహిత్య అకాడమీతో సహా పలు పుస్తక ప్రచురణ సంస్థలు వాటి ప్రచురణలను అందుబాటులో ఉంచారు. ఈ పుస్తక ప్రదర్శనను తిలకించిన పుస్తక ప్రియులు, యువకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా రవీంధ్రభారతి వేదికగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. గురు కళాకృష్ణ బృందం, 75మంది పేరిణి నృత్య కళాకారులతో చేసిన వందేమాతరం నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. పిడమర్తి క్రాంతి బృందం, రాఘవరాజ్‌ మంగళ్‌భట్‌ బృందాలు స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని పెంపొందించే విధంగా చేసిన నృత్యం ఆకట్టుకుంది. పద్మశ్రీ ఆనంద శంకర్‌ జయంత్‌ బృందంచే విశ్వకవి రవీంద్రుని గీతాలలోని దేశభక్తి అంశాలతో కావ్యాంజలి నృత్య నీరాజనం సమర్పించారు. అదేవిధంగా సాహిత్య అకాడమి సారధ్యంలో జరిగిన కవిసమ్మేళనం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రామాచారి శిష్య బృందంచే, పుణ్యభూమి మనదేశం నమోనమామి అన్న పాటల కార్యక్రమం రసజ్ఞులైన ప్రేక్షకులను అలరించింది. అలాగే భారతమాతకు జేజేలు, సుశీల, ఎస్పీ శైలజ సారధ్యంలో సినీ దేశభక్తి గీతాలాపన ఆకట్టుకుంది. సారేజహాసె అచ్చా హిందూసితా హమార సంగీత, నృత్యాలను ప్రభుత్వ, సంగీత నృత్య కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. 

ఎల్‌.బి. స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో ప్రముఖ నృత్యకారిణి దీపికారెడ్డి ఆధ్వర్యంలో వజ్రభారతి రూపకల్పన, రaాన్సీలక్ష్మీబాయి వీరోచిత పోరాట దృశ్యాలు స్వాతంత్య్ర పోరాట సన్నివేశాలతో బ్రిటిష్‌వారి అరాచకాలు తెలిపే నృత్యాలు కళాకారులు కళ్ళకు కట్టినట్లుగా పాత్రల్లో లీనమై చక్కగా ప్రదర్శించారు. వార్సీ బ్రదర్స్‌ అందించిన కవ్వాలీ రసజ్ఞులను మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా ప్రముఖ స్వర మాంత్రికుడు శంకర్‌ మహదేవన్‌ తనదైన రీతిలో భక్తి, దేశభక్తి గీతాలను ఆలపించి అశేష ప్రజానీకాన్ని ఓలలాడించాడు. 

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యునికేషన్స్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పారామంలో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు జరిగింది. భారత స్వాతంత్య్రోద్యమం, హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన విశేషాలతో కూడిన చిత్రాలు ప్రదర్శించడం జరిగింది. ఇందులో కుమ్రంభీం, చాకలి ఐలమ్మ, అల్లూరి సీతారామరాజు, స్వామి రామానంద తీర్థ, టంగుటూరి ప్రకాశం పంతులు తదితర పోరాట యోధుల, స్వాతంత్య్ర సమరయోధుల ఛాయా చిత్రాలను 50కి పైగా ప్రదర్శించారు.  ఆ తరం యోధుల గురించి తెలుసుకుని నేటి యువత స్ఫూర్తి పొందాలని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ సౌత్‌జోన్‌ ఎస్‌. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. 

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కవిసమ్మేళనం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని అడిషినల్‌ కమీషనర్‌ మహాత్మాగాంధి చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న కవులు దేశభక్తి ఉప్పొంగేలా మువ్వన్నెల జెండా గొప్పతనాన్ని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలాల ను కవితా రూపంలో ఆలపించి కవితా ప్రతిభను చూపి ఆకట్టుకున్నారు. 

అనాధ శరణాలయాలు, ఆసుపత్రులలో పండ్లు, స్వీట్ల పంపిణీ

భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద  ఎత్తున పండ్లు, స్వీట్లు పంపిణి చేశారు. సీఎస్‌ సోమేష్‌కుమార్‌ అమీర్‌పేట్‌ సమీపంలోని శిశు విహార్‌లో పిల్లలకు పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధ శరణాలయాలు, ఆసుపత్రులలో ఉండే వారికి పండ్లు, స్వీట్లు పంచడం  ద్వారా  వారిలో ఒక మానసిక  స్ధైర్యాన్ని  కలుగచేయడంతోపాటు వారిలో స్వతంత్ర స్ఫూర్తిని కలిగించేందుకు దోహదపడుతుందని  తెలిపారు. శిశు విహార్‌లో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్లి వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. శిశువిహార్‌లో ఉంటున్న అవిభక్త కవలలు వీణా, వాణిలను కలసి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. దివ్యాంగులు, బాల బాలికలు ప్రదర్శించిన ఫాన్సీ డ్రెస్‌ పోటీలు, పాడిన పాటలను తిలకించారు.

విజయవంతమైన ప్రత్యేక హరితహారం

వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక హరితహారం కార్యక్రమం విజయవంతమైంది. ఆగష్టు 21న నిర్వహించిన హరితహారంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 18,963 ప్రాంతాలలో ప్రజలు 37,66,963 మొక్కలు నాటారు.

రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచుకునే లక్ష్యంతో హరితహారం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.  ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం 7.6 శాతం పెరిగింది. ఈ పెంపుదలతో ఇప్పటి వరకు ఆ విస్తీర్ణత 31.6 శాతానికి చేరింది. రానున్న రోజుల్లో పచ్చదనం పెరిగి ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రంగా శోభిల్లనున్నది. అడవులను రక్షించాలి… పచ్చదనం పెంచాలి… అనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాష్ట్రవ్యాప్తంగా  ‘‘హరితహారం’’  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 264 కోట్ల మొక్కలు నాటారు. ఎనిమిదవ విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా చేపట్టిన  ఈ కార్యక్రమం వల్ల లక్ష్యానికి మరింత చేరువైంది.  

అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖ అధికారులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ నేలంతా పులకరించే విధంగా పల్లెలు, పట్టణాలు, సామూహిక ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు.   

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన  అటవీ సంరక్షణ, పునరుజ్జీవ చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం,  పర్యావరణం  పరిఢవిల్లుతున్నది. ప్రభుత్వం  చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండంతో  దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శరాష్ట్రంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల అధికారులు ఈ హరితహారం కార్యక్రమం  వివరాలను అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో అటవీ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా ఉన్నది. రాష్ట్రంలో పచ్చదనం పెరిగి పర్యావరణం సమతుల్యం కావడానికి ఈ హరితహారం కార్యక్రమం ఎంతో దోహదపడనున్నది.

గాంధేయవాదమే తెలంగాణను సాధించింది : వజ్రోత్సవ ముగింపుసభలో సీఎం కేసీఆర్‌ 

గాంధేయ వాదమే తెలంగాణను సాధించిందని, గాంధీ అనుసరించిన శాంతి, అహింస, సౌభ్రాతృత్వ భావనల కొనసాగింపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. గాంధీ బాటలోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ… నాటి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. ‘‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’’ ముగింపు వేడుకలు హైదరాబాద్‌లోని ఎల్‌.బీ. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తరువాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. 

స్వతంత్ర భారత వజ్రోత్సవాల అపురూప ఘట్టాన్ని ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పదిహేను రోజులపాటు తెలంగాణ నిర్వహించిన తీరు యావత్‌ దేశాన్ని ఆకర్షించిందని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వజ్రోత్సవాలు నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏండ్లయినా.. దేశం అనుకున్నంతగా పురోగమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేష శక్తులు కులం, మతం పేరుతో దేశ ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయని బాధను వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తూ మౌనం వహించడం సరికాదన్నారు. మేధావి వర్గం అర్థమైనా, అర్ధంకానట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. అద్భుతమైన ప్రకృతి సంపద, మానవ వనరులు మనకు ఉన్నాయన్నారు. పేద, ధనిక, కులం, మతం తేడా లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందని యువతకు పిలుపునిచ్చారు. సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలని కోరారు. గాంధీ గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారని, గాంధీ గురించి ప్రపంచమే గొప్పగా చెబుతుందని, అలాంటపుడు ఈ అల్పుల మాటలు ఎంత? అని వ్యాఖ్యానించారు. 

గాంధీ సినిమాను 22.37 లక్షలమందికి పైగా పిల్లలు చూశారని, నాకెంతో గర్వంగా, సంతోషంగా ఉన్నదని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. సినిమా చూసిన విద్యార్థుల్లో 10శాతం పిల్లలు గాంధీని ఆదర్శంగా తీసుకున్నా దేశం ఎంతో పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర స్ఫూర్తి గురించి ఈతరం పిల్లలకు తెలియాలనే ఈ సినిమాను చూపించామని పేర్కొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో దాదాపు కోటి మందికి పైగా ఒకేసారి పాల్గొని విజయవంతం చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీ ఛైర్మన్‌, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డిలతో సహా, భాగస్వాములైన జిల్లా కలెక్టర్లను, అన్నిశాఖల అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ అభినందించారు. 

రాష్ట్ర ప్రజల్లో స్వతంత్ర పోరాట స్ఫూర్తిని కలిగించిన వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు – సీ.ఎస్‌ సోమేశ్‌ కుమార్‌

అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సీ.ఎస్‌. సోమేష్‌ కుమార్‌  మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నింపేందుకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రూపొందించి అమలు చేసిన  స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవాలు విజయవంతమయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, ప్రతీ విద్యార్థి, ఉద్యోగి, యువకులతోపాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ ఇంటి పండగలా భావించి మమేకమయ్యారని అన్నారు. వేడుకల ముగింపు కార్యక్రమంలో  సీ.ఎస్‌ ద్విసప్తాహ వేడుకల నివేదిక సమర్పించారు. 

దేశంలో మరెక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 546 సినిమా హాళ్లలో గాంధీ సినిమాను చూపించడం ఒక చారిత్రకమని, ఈ సినిమాను దాదాపు 22.37 లక్షల విద్యార్థులు చూశారని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో గాంధీ సినిమాను విద్యార్థులకు చూపించడంపట్ల దేశంలోని అనేక రాష్ట్రాల అధికారులు తమకు ఫోన్‌ చేసి అడిగారని వెల్లడిరచారు. అన్ని మండల కేంద్రాలతోపాటు అన్ని నగరాలలో నిర్వహించిన 1462 ఫ్రీడమ్‌ రన్‌ లలో దాదాపు 5 లక్షల మంది పాల్గొన్నారని అన్నారు. ఎంప్లాయిస్‌తో 13,605 ఫ్రీడమ్‌ ర్యాలీలు నిర్వహించగా వీటిలో 18 లక్షల మంది పాల్గొన్నారని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు దాదాపు 1.20 కోట్ల జాతీయ పతాకాలను ఉచితంగా అందచేశామని తెలిపారు. ప్రతీ ఇంటిపై ఎగురవేసిన ఈ జెండాలన్నీ మన రాష్ట్రంలో తయారు కావడం సంతోషకరం అని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హరిత హారం 18,963 లోకేషన్‌లలో 37,66,963 మొక్కలు నాటడం జరిగిందని పేర్కొన్నారు.

అబిడ్స్‌లోని నెహ్రూ చౌరస్తాలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని.. ఈనెల 16న, నిర్దేశిత ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేసి జాతికి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారని, ఇదే సమయానికి మొత్తం రాష్ట్రంలో 95.23 లక్షలమంది సామూహిక గీతాలాపన చేశారని తెలిపారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర స్ఫూర్తిని తెలిపే ప్రత్యేక  పుస్తక ప్రదర్శన నిర్వహించామన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు సంయుక్తంగా ఆగష్టు 21 వ తేదీన గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని 75 పార్కుల్లో  వజ్రోత్సవ సంగీత విభావరి నిర్వహించినట్టు సీ.ఎస్‌ వివరించారు. సాంస్కృతిక శాఖ ద్వారా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం నిర్వహించడం  జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తి కల్గిందని వివరించారు.

ఈ ముగింపు వేడుకల్లో శాసన మండలి ఛైౖర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 

ఆకట్టుకున్న వజ్రోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు

స్వతంత్ర భారత స్వర్ణోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్బంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ పద్మశ్రీ దీపికా రెడ్డి శిష్య బృందంచే భారత స్వాతంత్రోద్యమ ఘట్టాలను తెలిపే శాస్త్రీయ నృత్యం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఖవ్వాలి కళాకారులు వార్సీ బ్రదర్స్‌ ఖవ్వాలి, పద్మశ్రీ శంకర్‌ మహదేవన్‌ సంగీత విభావరి సమావేశానికి హాజరైన వారిలో హుషారు నింపాయి. ముందుగా ప్రారంభ  కార్యక్రమంలో దీపికా రెడ్డి శిష్య బృందంచే స్వాతంత్రోద్యమ పోరాట ఘట్టాలను తెలుపుతూ అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం,  బ్రిటీష్‌ అధికారి డల్హౌసీ అరాచకాలు, మొదటి సిపాయిల తిరుగుబాటు, తెలంగాణలో స్వతంత్ర ఉద్యమ పోరాటాలను తెలిపే సంఘటనలను ఈ శాస్త్రీయ నృత్యంలో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించారు. అనంతరం ప్రముఖ ఖవ్వాలి సోదరుల బృందంచే దేశభక్తి, జాతీయ సమైఖ్యత పూరిత కవ్వాల్స్‌ ఆలపించారు. లెహరాయియాహై తిరంగా అనే కవ్వాల్‌తో ప్రారంభించి, సారాజహాసే అచ్చా, హిందూ సీతా హమారా అనే పాటను కవ్వాల్‌ రూపంలో అద్భుతంగా ఆలపించి సభను ఉర్రూతలూగించారు. హిందూ, ముస్లీమ్‌, క్రిష్టియన్‌ భాయి భాయి అంటూ దేశ సమైక్యతను తెలిపే కవ్వాల్‌ను అద్భుతంగా ఆలపించారు. అనంతరం, జాతీయ స్థాయిలో ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ గణేష్‌ స్తుతితో ప్రారంభించిన సంగీత విభావరిలో తెలుగు, హిందీలలో సూపర్‌ హిట్‌ అయిన పాటలను ఆలపించారు.

జాతి గర్వించే ప్రముఖులకు, ప్రముఖుల వారసులకు సన్మానాలు 

స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు  సురవరం ప్రతాపరెడ్డి వారసుడు సురవరం అనిల్‌ కుమార్‌ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు, అంబేద్కరిస్టు అజయ్‌ గౌతమ్‌, కొమురం భీం వారసుడు కొమురం సోనేరావు, కల్నల్‌ సంతోష్‌ బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్‌, వెయ్యి ఎకరాలకు పైగా భూములను దానం చేసిన భూదాన్‌ రాంచంద్రారెడ్డి తనయుడు అరవింద్‌ రెడ్డి,  హరితహారంలో లక్షలాది మొక్కలు నాటిన వనజీవి రామయ్య, రావెల్ల వెంకట్రామారావు తనయుడు రావెల్ల మాధవరావు, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఆకుల శ్రీజ, మహ్మద్‌ హుసాముద్దీన్‌, సంగీత దర్శకులు శంకర్‌ మహదేవన్‌, కె.ఎం.రాధాకృష్ణ, ప్రముఖ నాట్య కళాకారిణులు అలేఖ్య పుంజాల, వైష్ణవి విఘ్నేష్‌, సంగీత, నాటక అకాడమీ ఛైర్‌ పర్సన్‌ దీపికారెడ్డి, ఖవ్వాలీ నిర్వాహకులు వార్షీ బ్రదర్స్‌ తదితరులను ఘనంగా సన్మానించారు.

విద్యార్ధులకు ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శన – ఇతర రాష్ట్రాల ఆసక్తి

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకని ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనను నిర్వహించింది. ఈ ప్రదర్శనను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో ప్రారంభించారు. రాష్ట్రం లోని 546 సినిమా హాళ్ళ ద్వారా దాదాపు 22.37 లక్షలకు పైగా గాంధీ సినిమాను ఉచితంగా చూశారు . ఇంత పెద్ద స్థాయిలో ఉచితంగా సినిమా ప్రదర్శించడం దేశంలోనే ఇది మొదటిసారి. గాంధీ సినిమా ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుండి అద్భుతమైన స్పందన రావడంతో, ఛత్తీస్‌ఘఢ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ చిత్రప్రదర్శన ఏర్పాటు చేసిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నేటి తరం పిల్లలను స్వాతంత్య్ర పోరాటంపై చైతన్యవంతం చేసేందుకు, జాతిపిత మహాత్మాగాంధీ బయోపిక్‌ను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించగా, తెలంగాణ ప్రభుత్వం గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనను ప్రారంభించింది. ఆగష్టు 09 నుండి 11 వరకు, ఆగస్టు 16 నుండి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 546 థియేటర్లలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ప్రదర్శించారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో ప్రదర్శించబడింది. రోజుకు 2.50 లక్షల మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 22.37 లక్షల మంది స్కూలుకు వెళ్లే పిల్లలు సినిమా చూశారు. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జాతిపిత జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన గాంధీ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఆకట్టుకున్న చారిత్రక భవనాలు, కార్యాలయాలు, జంక్షన్ల వజ్రోత్సవ అలంకరణ

భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆగష్టు 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్‌ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్‌ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను వినూత్నంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ తోపాటు రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం నెలకొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపు మేరకు తమ తమ కార్యాలయాలు, వ్యాపార సంస్థలను స్వచ్చందంగా అలంకరించుకున్నారు. ప్రధానంగా హైదరాబాదులోని చార్మినార్, మొజాంజాహి మార్కెట్‌, కాచిగూడ, సికిందరాబాద్‌ రైల్వే స్టేషన్‌లు, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, అసెంబ్లీ, హైకోర్ట్‌, బీఆర్కేఆర్‌ భవనం, జీహెచ్‌ఎంసీ, సీడీఎంఏ కార్యాలయ భవనాలపై చేసిన విద్యుద్దీపాల అలంకరణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నగరంలోని అనేక మాల్స్‌ వినూత్న రీతిలో అలంకరించారు. వీటితోపాటు, సుప్రసిద్ధ రామప్ప ఆలయం, వేయిస్థంబాల గుడి, లాంటి అనేక దేవాలయాలను కూడా ఆకట్టుకునేలా అలంకరించారు.