బంగారు బాటలో..

బతికి చెడ్డమా? బాగుపడ్డమా??

పధ్నాలుగేళ్ళ ఉద్యమ ప్రస్థానంలో కెసిఆర్‌ సంధించిన ప్రశ్న అది. ఈ ప్రశ్న లక్షలాది మెదళ్ళను కదిలించింది. వలసపాలన ఇంకానా ఇకపై సాగదు అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించే స్థైర్యాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ రగిలించి ముందుకు నడిపించింది.

దశాబ్దాల పోరాటం ఫలించి సొంత రాష్ట్ర కల సాకారమైంది. తెలంగాణ సబ్బండవర్ణాల ఆశలకు ఆకృతి కల్పిస్తూ స్వీయ పాలన ప్రారంభమైంది. పదవులను గడ్డిపోచకన్నా హీనంగా వదలి నిప్పు కడిగిన బంగారంలా నిలబడ్డ నాయకుడి నిజాయితీని, తెలంగాణ తలకెత్తుకుని దీవెనలిచ్చింది. కొత్త రాష్ట్రంలో ప్రారంభమైన సొంతపాలన జనం ఆకాంక్షలకు పెద్దపీటవేస్తూ ఏడాదికాలం పూర్తి చేసుకున్న తరుణం ఇది.

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం పయనంలో ఏడాదికాలం తొలి అడుగే. కాలూచేయీ కూడదీసుకుని, నిన్నటి అవరోధాలను అధిగమిస్తూ రేపటి దిశగా ముందుకు అడుగేయడంలో ప్రభుత్వపాలన గుణాత్మకమైన విజయాలు సాధించగలిగింది.

సామాన్య జనం ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందరికీ అందించే ధ్యేయంతో ప్రభుత్వం సాగిపోతున్నది.

అయితే దశాబ్దాల ఉమ్మడిపాలనలో ధ్వంసమైన మన సంస్కృతీ సంప్రదాయాలను, విలక్షణమైన మన జీవనశైలిని తిరిగి పాదుకొల్పే క్రమంలో విశేషస్థాయిలో కార్యాచరణ మొదలైంది. నిరుపేద, బడుగువర్గాలకు చేయూత అందించడంలో మానవీయ కోణం ప్రాతిపదికగా నిలుస్తోంది. కళ్ళనిండచూస్తే చాలనుకున్న పసివాడిని అక్కున చేర్చుకుని ఆదరించడమే, ప్రాణదానంగా పనిచేసిందన్న సత్యం కొత్త సర్కారు పనితీరుకు అద్దం పడుతోంది.

వీటన్నిటికీ మూలం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అనుసరిస్తున్న ప్రగతిదాయక విధానాలు. అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత గతానికి పూర్తి భిన్నంగా సామాన్యులకు చేరువగా వ్యవహరించే నిబద్ధత. ప్రజలతో ఏర్పాటైన ప్రభుత్వం ప్రజల సేవతో తరించాలనే ఉదాత్త లక్ష్యం అడుగడుగునా ప్రభుత్వ పనితీరులో తొణికిసలాడుతోంది. ఇదే విధానంలో బంగారు తెలంగాణ ఆవిష్కారం సుసాధ్యమనే నమ్మకం వ్యక్తమవుతోంది.