|

గోండుల గుస్సాడీ నృత్యోత్సవం

By:- డా. ద్యావనపల్లి సత్యనారాయణ

ప్రపంచ వ్యాప్తంగా గిరిజన స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ నృత్యం చేస్తారు. తెలంగాణలో ఉన్న సుమారు డజను రకాల గిరిజన తెగలు కూడా తమ తమ ప్రత్యేక స్థానిక నృత్యాలు చేస్తారు. అయితే గిరిజనులందరు వారి వారి నృత్య రీతుల్లో నిష్ణాతులైనప్పటికీ తెలంగాణలో గోదావరి నదికి ఉత్తరాన నివసిస్తున్న గోండులు మాత్రం వారం రోజుల పాటు ప్రత్యేక నృత్యోత్సవాలను జరుపుకుంటారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందు ప్రారంభమయ్యే ఈ నృత్యోత్సవంలో ప్రధాన ఆకర్షణలుగా గుస్సాడీ వేషధారులు కనిపిస్తారు. కాబట్టి ఈ నృత్యోత్సవాన్ని గుస్సాడీ నృత్యోత్సవం అని కూడా పిలుస్తారు. వీరు తమ పరివారంతో సహా ఆతిథ్య గూడేలకు దండుగా వెళ్తారు. అందరూ కలిసి నృత్యం చేస్తారు.

గుస్సాడీ నర్తకుడు:

సంతానం కోరుకునే వారు, ఆపదల నుంచి విముక్తి కావాలనుకునేవారు తమ గోండు కుల పెద్ద పటేల్‌ను, గుస్సాడీ వేష భూషణల పారంపర్య సంరక్షకుడైన అక్కడ్‌ రోథోర్‌ను కలిసి ‘తాము గుస్సాడీలము కావాలనుకుంటున్నాము. అనుమతించండి’ అని కోరుతారు. వారు తమ వద్దనున్న గుస్సాడీ వేషభూషణాల అందుబాటును బట్టి ఆ సంవత్సరం గుస్సాడీలు కావలసినవారి సంఖ్యను నిర్ణయిస్తారు. వారికి తొమ్మిది రోజుల పండుగ అయ్యేవరకు సహకరించే పోరిక్‌ అనే యువ సహాయకులను ఎంపిక చేస్తారు. వీరు అమ్మాయిల వేషం వేసుకోవలసి ఉంటుంది. గుస్సాడీల వస్తువులను మోసుకుపోవలసి ఉంటుంది.

పోరిక్‌లు గుస్సాడీల శరీరం, ముఖాలను పూర్తిగా తడి బూడిద (గురు నీరు)తో అలలు, వలయాల రేఖలతో అలంకరిస్తారు. జనపనార మీసాలు, గడ్డం ధరింపజేస్తారు. మొలచుట్టూ మోకాళ్ళ వరకు గొంగడి లేదా కాషాయ వస్త్రం చుడుతారు. చీలమండల చుట్టూ గజ్జెలు కడతారు. భుజాల పైనుంచి ఛాతి, వెన్ను మీదుగా ఐ ఆకారంలో పెద్ద ఎడ్ల గంటలు కడతారు. కంఠంలో నెయ్‌ పల్క్‌ హార్‌ అనే పల్లేరు కాయల దండ వేస్తారు. ఎడమ భుజానికి పాసుడి అనే జింక లేదా మేక చర్మం, మక్క మల్లి జోరి అనే జోలె వేలాడదీస్తారు. కుడి చేతిలో గంగారాం సోట అనే రోకలిని పెడుతారు. తలపైన నెమలి ఈకలతో చేసిన మల్‌ జులిన బూర అనే సింగారాల్‌ టోపీని పెడతారు. ఈ టోపీ ముందు భాగంలో కోహ్న్ అనే కొండగొర్రె కొమ్ములు రెండు ఉంచుతారు. ఈ మధ్య ఈ టోపీని జిగేల్‌మనే అద్దపు ముక్కలు, రంగురంగుల ప్లాస్టిక్‌ ముక్కలతో అలంకరిస్తున్నారు.

గుమేల, ఫర్ర, డప్పు, డోల్‌, తుడుం, వెట్టె, పేప్రే, కాలికొం, చబ్బొయ్‌ కోలలు మొదలయిన సంగీత వాయిద్యాలను పోరిక్‌లు మోసుకెళతారు. వీటి శబ్దాలు, గుస్సాడీ శరీరం పైనున్న గజ్జెలు, గంటల శబ్దాలు కలసి గుస్సాడీ నృత్యానికి వినసొంపైన సంగీత నేపథ్యాన్ని ఇస్తాయి. గుస్సాడీ జోలెలో తన వస్తువులు వేసుకుంటాడు. పాసుడిని పడుకునే చాపగా వాడుకుంటాడు.

మొదటి నృత్యం:

అలంకరించిన గోండ్‌ గ్రామం మధ్యలో వేసిన పందిరి క్రింద అక్కడ్‌ రోథోర్‌ ఏత్మసుర్‌ పెన్‌ అని పిలిచే సంగీత వాయిద్యాల సమూహాన్ని పెట్టి పూజించి, తమ వంశ / గోత్ర దేవతను, అక్కడ పెన్‌ అనే దేవతను తమ దండారి పండుగ సజావుగా సాగేటట్లు అనుమతించమని వేడు కుంటాడు. గ్రామ స్త్రీలు కూడా పూజలు చేసిన తరువాత గుస్సాడీలు, పోరిక్‌లు ఆ సంగీత వాయిద్యాలు, గుస్సాడీ వస్తువులను తీసుకుంటారు. ఆ అవకాశం పొందినందుకు వారిని గ్రామస్థులు అభినందిస్తారు. అనంతరం వారికి ఒకే పెద్ద పళ్లెంలో ‘‘పాతి’’ భోజనం వడ్డిస్తారు.

భోజనం తరువాత గుస్సాడీలు, పోరిక్‌లు, గ్రామ యువత తొలి నృత్యం చేస్తారు. వాద్యకారులు సంగీత వాయిద్యాలు వాయిస్తుండగా, పాటవార్‌ వలీర్‌ అనే వారు పాటలు పాడుతుండగా, ఆ శృతి గీతాలకు అనుగుణంగా గుస్సాడీలు, పోరిక్‌ లు నృత్యం చేస్తారు. పోరిక్‌లు తమ ముఖాలకు కోడల్‌ యెహ్వాల్‌ అనే చెక్క ముసుగులను ధరించి యెంద్వాల్‌ అనే నృత్యం చేస్తారు. కొందరు తమను ఏదో శక్తి ఆవహించినట్టుగా నియంత్రించలేనంత ఉగ్రంగా నృత్యం చేస్తారు. అలాంటివారిని మిగతావారు గట్టిగా పట్టుకొని ‘‘నువ్వు శాంతించక పోతే పద్మల్‌ పురి అమ్మవారికి అప్పగిస్తాం’’ అని దేవత పేరు చెప్పి భయపెట్టి శాంతింపజేస్తారు. ఓ పక్కన గ్రామ యువత ప్రత్యేకంగా చచ్చొయ్‌ అనే కోలాటం నృత్యం చేస్తారు.

దండారి ఆతిథ్యం – నృత్యాలు :

ఈ తొలి నృత్యం తరువాత ఒక గ్రామపు గుస్సాడీలు, పోరిక్‌లు మరో ఆతిథ్య గ్రామానికి డప్పు చప్పుడుల మధ్య దండుగా వెళతారు. వీరు వాయించే ఒక ప్రత్యేకమైన డప్పుల వాయింపును విని గుర్తుపట్టి ఆతిథ్య గ్రామస్థులు ఎదురుగా వచ్చి వీరిని ఆహ్వానిస్తారు. గుస్సాడీల చేతుల్లోని రోకళ్లను శంభు మహాదేవుని త్రిశూలంగా భావించి వాటికే అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివుని ప్రతిరూపాలుగా భావించి వారి వస్తువులను, సంగీత పరికరాలను (ఏత్మసూర్‌ పెన్‌) పూజిస్తారు. అనంతరం అందరు కలసి గుస్సాడీ నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు మృష్టాన్న పాతి భోజనం వడ్డిస్తారు. అతిథులు ఒకరిని ఒకరు తాతా, తాతా అని ఆట పట్టించుకుంటూ పోటాపోటీగా భుజిస్తారు. భుక్తాయాసం అయితే తమ రోకళ్లను గట్టిగా నేలకు గుద్దుతూ తేలికై మళ్ళీ భుజిస్తారు.

ఇలా కొంతసేపు జరిగిన తరువాత అసలు నృత్య కార్యక్రమం మొదలవుతుంది. పాటలు, వాయిద్యాలకు అనుగుణంగా గుస్సాడీలు, పోరిక్‌లు నృత్యం చేస్తారు. రాత్రి గడుస్తున్న కొద్దీ వాద్యాల ఘోష, పాటల్లో ఊపు, చూపరుల్లో ఉత్సాహం పెరుగుతుంటుంది. గుస్సాడీలు ఒక్కోమారు చూపరులలోకి చొచ్చుకొనిపోయి తమ రోకళ్లతో వారికి చక్కిలిగింతలు చేస్తారు. గుస్సాడీలలో యువకులైన పోరిక్‌లు తమ నృత్య ప్రావీణ్యం ద్వారా యువతులను ఆకర్షించడానికి ప్రయత్ని స్తారు. ఆకర్షించగలిగిన అమ్మాయిల పేర్లను తమ తల్లిదండ్రులకు చెపుతారు. వరుసైతే వారికి తదనంతరం పెండ్లి జరుగుతుంది.

ఇలా సుమారుగా వారం రోజులపాటు రోజూ ఓపిక ఉన్నంత సేపు నృత్య వేడుకలు జరుపుకుంటారు. ఓపికయిపోయిన తరువాత ఒక ప్రత్యేకమయిన డప్పు చప్పుడు ద్వారా ‘ఈనాటి గుస్సాడీ నృత్యం ముగిసింది’ అనే సంకేతం ఇస్తారు. ఆ తరువాత గుస్సాడీలు తమ వస్తువులను ఒక మంచం లేదా బల్ల మీద (నేల మీద మాత్రం కాకుండా) పెట్టి తాము పాసుడి పైన పడుకుంటారు.

దండారి పండుగలో చివరిదైన తొమ్మిదవ రోజు ప్రజా నాయకులు, ప్రభుత్వ పెద్దలు ఈ వేడుకలో పాల్గొంటారు. ఆ రోజు స్త్రీలు కూడా వలయాకారంలో గుమిగూడి డియాన్‌ యెంద్వాల్‌ అనే నృత్యం చేస్తారు.

ముగింపు ఉత్సవం:

ఆ తరువాత గుస్సాడీలు, పోరిక్‌లు తమ స్వగ్రామానికి వెళతారు. అప్పుడు కోలబోడి అని పిలిచే కోర్కుటుత్సవల్‌ జరుపుతారు. అంటే ఆ గ్రామ దేవరిగాని, ఆకడ్‌ రోథోర్‌ కానీ ఆకి పెన్‌ లేదా అవ్వల్‌ పెన్‌ అనే దేవత ముందు తమ గోత్ర సంఖ్యను తెలిపే పిడికిల్ల బియ్యం పోసి, కోడి పుంజును కోసి, దేవతకు కృతజ్ఞతా పూర్వక మొక్కులు సమర్పించి దండారి ఉత్సవం ముగిసిందని ప్రకటిస్తారు. ఆ తరువాతనే గుస్సాడీలు వారం అనంతరం వేషాలు విప్పేసి స్నానం చేస్తారు. వేష భూషణాలతో ఉన్నపుడు వారిని శివ స్వరూపులుగా భావించి ప్రజలు మొక్కుతారు.

పరిరక్షకుడికి పద్మశ్రీ :

ఇలాంటి నటరాజు స్వరూపమైన గుస్సాడీ నృత్యానికి నాలుగు దశాబ్దాల క్రితం నుంచి పాత ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు గోండు పెద్దలు ప్రచారం కల్పించాలని ప్రయత్నించారు. ఆ జిల్లా ఉట్నూర్‌ సమీప లకెట్టిపేటకు చెందిన కీ.శే. మడాని తుకారాం పిట్టగూడలో గుస్సాడీ నృత్యాన్ని గోండు యువకులకు నేర్పించేందుకు ప్రోత్సహించారు. నేర్పించిన వారిలో ప్రముఖులు కనకరాజు. వీరికి స్ఫూర్తినిచ్చింది వారి మాతామహులు ఆత్రం లచ్చు పటేల్‌, రాజు దగ్గర శిక్షణ పొందిన వందకు పైబడిన గోండ్‌ యువకులలో లయగతులు (స్టెప్స్‌) వెయ్యడంలో సుమారు సగం మంది విఫలం కాగా సుమారు 65 మంది సఫలులయ్యారు. వారు, వారి ప్రశిష్యులు అంతరించే ప్రమాదంలో పడిన గుస్సాడీ నృత్యాన్ని కాపాడారు. కనకరాజు ఈ నృత్యాన్ని 1982లో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ముందు, 2002లో అప్పటి భారత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ముందు ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఇందిరా గాంధీ కాళ్లకు గజ్జెలు కట్టి ఆమెను ఎగిరించిన అనుభూతిని కనకరాజు ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. వీరి ప్రావీణ్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించి 2020లో వీరికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. వీరు ఆ పురస్కారాన్ని 2021 నవంబర్‌ 9న అందుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్‌, సాంస్కృతిక శాఖ అమాత్యులు శ్రీనివాస్‌ గౌడ్‌, పలు సంస్థల నిర్వాహకులు సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం గుస్సాడి నృత్యోత్సవాల నిర్వహణకై నిధులు విడుదల చేస్తూ ఈ అరుదైన నృత్యకళను ఆదరిస్తుండడం ఆనందించదగ్గ విషయం.