|

కవిత్వ జీవనది గోరటి వెంకన్న

By:  డా. కోయి కోటేశ్వర రావు

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవిత్వ జీవనది గోరటి వెంకన్న. కృష్ణా, గోదావరి లాగా వెంకన్న పాట గూడా మరో మహానదీ ప్రవాహమై ప్రజాహృదయ క్షేత్రాలను పండించింది. అద్వితీయమైన పాటల నక్షత్రాలతో సమకాలీన కవిత్వానికి నవజీవన తేజస్సును తాత్త్విక ఓజస్సును అందించాడు వెంకన్న. పదకవితల గతిలో, యక్షగానాల శ్రుతిలో బైరాగుల కిన్నెర తత్వాల ఒరవడితో చెరిగిపోతున్న పల్లె ఆనవాళ్ళను, శిథిలమవుతున్న మానవ సంబంధాలను అద్భుతంగా దృశ్యమానం చేసిన అసాధారణ కవి గోరటి వెంకన్న. నేల గుండెలదిరేలా చిందేసి నింగి చెవులు మారు మ్రోగేలా ప్రజాపోరాటాల ఆశయాలను గానం చేసి, తెలుగు పాటకు జాతీయ స్థాయిలో విశేషమైన ప్రఖ్యాతిని సమకూర్చిన అపురూప వాగ్గేయకారుడు వెంకన్న. మూడు దశాబ్దాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక పరిస్థితులకు వెంకన్న కవిత్వం అక్షరదర్పణంగా నిలుస్తుంది. మూలాలను రక్షించకుండా ఫలాలు భక్షించాలని పరుగులు తీస్తున్న కాలానికి తల్లివేరు ఎరుకను వెంకన్న మహోన్నతంగా ప్రబోధించాడు. వెల్లు వెత్తుతున్న ప్రపంచీకరణ ప్రభావానికి ప్రత్యామ్నాయంగా దేశీయ సంస్కారాన్ని, గ్రామీణ సాంస్కృతిక గరిమను వేయి గొంతుకలతో చాటి చెప్పాడు. ‘‘తాజ్‌ మహల్‌ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూళ్ళే మిన్న’’ అంటూ అఖిల విశ్వానికి తెలియజేశాడు. సహజ సుందర శోభితమైన, బహుళార్థ భరితమైన ప్రకృతిని కోటి కన్నులతో దర్శించి, మేటి పాటలు రచించి, ప్రకృతి కేంద్రంగా మానవ జీవన ప్రమాణాలను నిర్దేశించి, పశుపక్ష్యాదుల కార్యాచరణ ఆధారంగా నైతిక సూత్రాలను నిర్ధారించాడు.

పాలమూరు మెట్టప్రాంతసోయితో, విప్లవ దళితోద్యమాల ఉమ్మడి స్పృహతో తన తండ్రి అపరధనుర్దాసు నరసింహ కళా వారసత్వంతో కవిగా, గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, దూసుకువచ్చిన గోరటి వెంకన్న అత్యంత ప్రామాణికమైన, ప్రభావశీలమైన గేయకవిత్వంతో తెలుగు సాహిత్యంలో మిగిలిపోయిన ఖాళీలను సమర్థవంతంగా భర్తీ చేశాడు. తెలంగాణ భాషా వికాసానికి ప్రాణచైతన్యాన్ని అందించాడు. వస్తు వైవిధ్యంతో రూపవైశిష్ట్యంతో తెలుగు గేయకవిత్వంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చాడు. ‘‘కాలేకడుపుల మీద రాళ్ళు గొట్టే రాజ్యమిది’’ అంటూ పాలక వర్గాల క్రూరత్వాన్ని ఎండగట్టి ‘‘ఎగదిగేసే మత, కుల కుంపటులారి / మమతపూలు రెక్కతొడిగి విరియాలని మనసారా పిలుపు నిచ్చాడు. మను ధర్మానికి వ్యతిరేకంగా పాటల ఈటెలను సంధించాడు. ‘‘ఆశనెరుగని ఆది వాసులు / అడవిదారికి దివిటీ వెలుగలని’’

‘‘పందులె తన బంధు బలగంగ / కష్టసుఖాలను కలబోసుకొని బ్రతికే’’ ఎరుకల నాగన్న, ‘కురులకు కులుకునేర్పే మంగలన్న’, ‘కల్ల కపటమెరుగని గొల్ల కురుమ వనిత’, యాదవ ఎలమంద, పిండిగిర్ని సుబ్బయ్య, ఇల్లు బాసిపోయిన రైతన్న, మాదిగ తాతయ్య, మాలసెన్నయ్య, పరక సేపలకు గాలాలేసే ముస్లిమ్‌ పోరలు, బ్యాగరి బాలక్క, తలారి రామక్క, సలువాది సాయక్క సబ్బండ వర్ణాల సమస్త శ్రామికులను తన పాటల్లో వెంకన్న రమణీయంగా చిత్రించాడు. రైతులతో పాటు ప్రధానంగా వ్యవ సాయ కూలీలు, చేతి వృత్తుల శ్రామికులు, దళిత బహుజనుల సమ్మి ళిత జీవన స్థితిగతుల కోణంలో నుండి వెంకన్న పల్లె అస్తిత్వాన్ని తేట తెల్లం చేశాడు. అందు వల్లనే తల్లి రక్తం బిడ్డలో ప్రవహించి నంత సహజంగా పల్లె తత్వం వెంకన్న పాటల్లో ప్రతి ఫలిస్తుంది.

నా ఊరు, నా ప్రాంతం, నా సంస్కృతి, నా భాష అనే అహంకార దర్శనం, ఆత్మగౌరవ విశ్వాసం వెంకన్న పాటల నిండా పరిమళిస్తుంది. పల్లె పట్ల అపారమైన బెంగ, పల్లెవాసుల బతుకుపట్ల ఎడతెగని దిగులు ఈ కవి మనసు నిండా ఆవరించి ఉంటుంది. ‘‘నీ ఆట ఏమాయెరో  ఓరన్న నీ పాట ఎటుబాయెరో మాయన్నా’’ అంటూ గ్రామీణ కళా రూపాల గొప్పతనాన్ని, అవి అందించిన సాంస్కృతిక చైతన్యాన్ని, ఆ కళాకారుల అసామాన్య ప్రతిభా పాటవాలను తలచుకొని దు:ఖిస్తాడు. ఆ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఒక్కొక్కసారి సేదతీరు తాడు. పదిలమైన పల్లె అడుగు జాడలు అంతరించి పోతున్నాయన్న వలపోతను వెంకన్న సమున్నతంగా తన కవిత్వంలో అక్షరబద్ధం చేశాడు.

సెరువు, వాన, వాగు, అడవి వెన్నెలతో పాటు పశు పక్ష్యాదుల తీరు తెన్నులను సహృదయహృదయాను రంజకంగా చిత్రిక పట్టాడు. ‘‘జువ్వి కొమ్మన గువ్వల రాగాలు’’, ‘‘పంచె వెన్నెల రామసిలుకలు’’ పరికిపిట్ట, బురకపిట్ట, తీతువు, ‘విసురుగాలి తాకి ఈల వేసే  సెలిమ’, ‘ఈత కమ్మల గాలి దరువు’, ‘తెప్పల మాటున వెన్నెల తాళం’, ‘చిరుగాలి పాటకు ఎగసి దరువేసే చినుకులు’ లాంటి పరవశాత్మకమైన పరిసరాలు, నవనవోన్మేషమైన పదబంధాలు వెంకన్న కవిత్వంలో దర్శన మిస్తాయి. వాన, ‘కోడిపుంజు జుట్టు కొంటెగ తాకిందని’, ‘పరికిపిట్ట ముక్కుపాసిని కడిగిందని’, ‘ఎద్దు నూపరాన్ని ముద్దాడిందని’, ‘తాబేలు పెండ్లికి తలనీరు పోసిందని’, ‘సౌడు భూములను తాకిదౌడు తీసిందని’, ఈతసెట్టు లొట్టి మూతిని కడిగిందని, దుందుభి తలకంటి దుమ్మంత కడిగిందని వర్ణించిన తీరు కవి పండిత విమర్శకులతో పాటు సామాన్య మానవుడిని కూడా అబ్బుర పరుస్తుంది. ‘చేపకేమో నీటిపులుసును తాపింది, / ‘కొంగకేమో విందుకోరిక రేపింది’ అంటూ పరస్పర శత్రువులైన చేప, కొంగలకు వాన ఆకలి తీర్చుతుందన్న కవి ప్రతిభకు తలలూపని వారెవరుండరు. ప్రాచీన కవిత్వంలోని వర్ష వర్ణనకు వెంకన్న వాన వర్ణనకు ఎంతో వ్యత్యాసముంది. కృత్రిమత్వం లేశమైనా లేని సజీవమైన, ఔచితీ బంధురమైన వర్ణనా నైపుణ్యం వెంకన్న పాటల్లో కనిపిస్తుంది.

వెంకన్న రాసిన ప్రకృతి కవిత్వంలో ఆలంకారిక దృష్టితోపాటు జీవకారుణ్య స్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణాస్పృహ కూడా విశేషంగా చోటుచేసుకుంది. ‘కొంగమ్మ’, ‘పిట్ట బతుకు’ లాంటి పాటల్లో పక్షుల్లోని నైర్మల్యాన్ని, త్యాగనిరతిని, మానవుడు అలవరచుకొని, తన లోలోపల మలినాలను తొలగించుకోవాలని కవి హితవు చెప్పాడు. ‘అలచంద్రవంక’ గేయ కవిత్వం ప్రకృతి రమణీయ కతకు, బహుముఖీన ప్రకృతి ఔన్నత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

 గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఉన్నతంగా కవిత్వీకరించడంతో పాటు వెంకన్న గ్రామీణ జీవన విధ్వాంసాన్ని కూడా తన రచనల్లో విస్తృతంగా చిత్రించాడు. సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా, ప్రపంచీకరణ పెను తుఫాన్‌ కారణంగా విచ్ఛిన్నమవుతున్న చేతి వృత్తి కార్మికుల కష్టనష్టాలను,  దగ్ధమవుతున్న బడుగు జీవుల బతుకు వెతలను, పతనమవుతున్న దేశీయ సాంస్కృతిక విలువలను వెంకన్న ఎంతో ప్రతిభావంతంగా అక్షర బద్ధం చేశాడు. ‘‘పల్లే కన్నీరు పెడుతుందో’’ అనే పాట ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమానికి నాందిపలికింది. కుల, మత, వర్గ, లింగ వివక్షల అగ్ని కీలల్లో ప్రపంచీకరణ ఆజ్యం పోస్తుందని, తద్వారా ఆ వివక్ష నెదుర్కొంటున్న ప్రజాజీవితం అల్ల కల్లోలమవుతుందని వెంకన్న పాటల ద్వారా ప్రచారం చేశాడు. ఎంతో చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కల్గిన ‘పల్లె కన్నీరు పాట’ గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రజా సమూహాలను చైతన్య పరచి, పాలక వర్గాల పీఠాలను తారుమారు చేసింది. ‘అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తే’, పాట రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క కోటి మందిని కదిలిస్తుందని గోరటి వెంకన్న పాట నిరూపించింది.

తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవ ప్రాభవాలను సరళంగా, శిల్ప సుందరంగా, కలమారా గళమారా గానం చేయడంలో వెంకన్న కీలకమైన పాత్ర పోషించాడు. ఉత్తేజభరితమైన, ఉద్వేగ పూరితమైన, తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమానికి వెంకన్న ఊపిరిపోశాడు. గ్రామీణ జనులను, నగరవాసులను, మేధావులను ఉద్యమాభిముఖంగా మళ్ళించడంలో వెంకన్న పాట బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు, తెలంగాణ సాహిత్య పరిణామ క్రమాన్ని వేగవంతం చేసింది.

వచన కవితకు పాటకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి వెంకన్న ప్రజల పాటకు కావ్య గౌరవాన్ని కల్పించాడు. సంత, గల్లీ సిన్నది, లాంటి పాటలను కథా గేయ కావ్యాలుగా., నల్లతుమ్మ, సెరువు, వెన్నెల, సీకటి బయలు, వంటి గేయాలను దీర్ఘ కవితలుగా విశ్లేషించవచ్చు. ‘‘ధూళి అంటని నీలి దుప్పటి నా సెరువు’’, ‘‘పిడిలేని వెండి కొడవలివోలె నెలవంక’’, ‘‘అమాస సీకటి కొండలు కోసే / వెన్నెల ఏరులు కావాలి’’ వంటి తాజా అభివ్యక్తులు, ‘‘పుప్పడి మించిన ఇసుక రేణువులు’’, ‘‘కుంకుమ కన్న మెత్తని దుక్కులు’’ ‘‘పరుసుకున్న ఇసుక తిన్నెలు పత్తిపాన్పులకన్న మెత్తన’’ మొదలైన వినూతన ఖండికలు ఇందుకు తార్కాణంగా పేర్కొనవచ్చు.

ప్రాచీన సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలను అధ్యయనం చేసిన గోరటి వెంకన్న తనలోని పండితుడిని దగ్ధం చేసుకొని ‘‘బడిపలుకుల భాషను త్రోసిరాజని, తెలంగాణ జీవ భాషకు తన పాటల్లో పట్టాభిషేకం చేశాడు. స్వతంత్రమైన మాత్రాఛందో గమనంతో వెంకన్న తన పాటలను జవనాశ్వంలా కదం తొక్కించాడు. యతులు, ప్రాసయతులు, ప్రాసలు, అనుప్రాసలు సందర్భాను సారంగా, సహజ సిద్ధంగా వెంకన్న పాటల్లో అలవోకగా ఒదిగిపోతాయి. అంగీకార యోగ్యమైన సనాతన దృష్టి, ఆమోద యోగ్యమైన ఆధునిక దృష్టి కలగలిసిన సమ్మోహన తాత్విక శైలితో వెంకన్న తన గేయాలకు పుటం పెట్టుకోవడం వల్ల ఆబాల గోపాలానికి ఆయన పాట సామాజిక ఇతిహాసమై   అలరారుతుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గోరటి వెంకన్నను కోరి వరించాయి. భారతదేశంలో అత్యున్నత మైన కబీర్‌ సమ్నాన్‌ పురస్కారాన్ని గూడా స్వీకరించిన వెంకన్న తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసాడు. 

యువ పురస్కారం తగుళ్ళ గోపాల్‌కు..

బాల పురస్కారం దేవరాజు మహారాజుకు…

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి తగుళ్ళ గోపాల్‌ ఎంపికయ్యారు. ఆయన రచించిన కవితా సంపుటి ‘దండ కడియం’కు ఈ అవార్డు దక్కింది. మరో పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం దేవరాజు మహారాజు రచించిన ‘నేను అంటే ఎవరు’ అనే నాటకానికి దక్కింది.

యువ పురస్కారానికి ఎంపికైన తగుళ్ళ గోపాల్‌ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కలకొండ. ప్రస్థుతం నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్‌లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తగుళ్ళ గోపాల్‌ మాట్లాడుతూ తన స్వగ్రామం కలకొండలో తన అనుభవాలు, జ్ఞాపకాలు, కష్టజీవుల జీవన విధానం, ప్రజల కష్టసుఖాలే ‘దండ కడియం’ రాయడానికి ప్రేరణ, స్పూర్తి అని చెప్పారు. ఒక పల్లెటూరి పిల్లగాడి జీవన విధానాన్ని అందులో ప్రతిబింబించేలా రచన చేసినట్లు తెలిపారు. ఒకరకంగా ఇది తన ఆత్మకథ అని పేర్కొన్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారానికి ఎంపికైన దేవరాజు మహారాజు పూర్వ వరంగల్‌ జిల్లా జనగామ తాలూకా కోడూరులో జన్మించారు. కాకతీయ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్నారు. ఆయన తెలంగాణ మాండలికంలో రాసిన ‘గుండె గుడిసె’కు మంచి పాఠకాదరణ లభించింది. ఆయన మొట్టమొదటి కవిత పాలు ఎర్రబడ్డాయి. ఇవే కాకుండా రాజముద్ర, మధుశాల, నీకు నాకు మధ్య ఓ రంగుల నది తదితర మొత్తం 85కు పైగా రచనలు చేశారు. ఎన్నొ అవార్డులు అందుకున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం ముఖ్యమైనవి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు

ప్రముఖ కవి, శాసన మండలి సభ్యులు గోరెటి వెంకన్నకు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’ అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ‘బాల సాహిత్య పురస్కారం’ విభాగంలో, ‘నేను అంటే ఎవరు?’ నాటకం రచయిత దేవరాజు మహారాజుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల కూడా సీఎం హర్షం వ్యక్తం చేశారు, శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరో విభాగం యువ పురస్కారం  కింద ‘దండ కడియం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి రచయిత తగుళ్ళ గోపాల్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.

గోరటి వెంకన్న,  దేవరాజు మహారాజు, తగుళ్ళ గోపాల్‌ ముగ్గురు తెలంగాణ బిడ్డలకు కేంద్ర సాహిత్య అవార్డులు దక్కడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు రావడం ద్వారా తెలంగాణ సాహితీ గరిమను మరోసారి ప్రపంచానికి చాటిందని సీఎం ప్రశంసించారు.

————————————————————–

మా గోరటి వెంకన్న

ఏ గాలి చెరిపెయ్యలేని

పాలపుంత

ఏ నలుపులేని

పున్నమి వెన్నెల

ఏ మచ్చలేని అలచెంద్రవంక

మా గోరటివెంకన్న

        అతడు

        ఆరున్నొక రాగమైతే

        చినుకులు చెరువులై

        నదులై పోటెత్తుతవి

        బీడు పొలాలు వాకిట్లో

        పంట కల్లాలై పరుచుకుంటవి

        ఆ కలంలోని సిరా

        తత్వకవుల స్వేద జలం

అతడు నడిచొస్తుంటే

భూదేవతమ్మ బోనమెత్తుకొచ్చినట్లే

దేవసిరిమల్లెలజి

రాగాలు రాసిపోసినట్లే

సద్దులబతుకమ్మ చల్లగా నవ్వినట్లే

        అతడు

        అందెలు చిటుకేస్తే

        పాలపిట్ట పరుగుపరుగున పరుగెత్తుకొస్తది

        నెలవంక

        పోరు సైరన్‌ మోగిస్తది

        సామ్రాజ్యవాదంపై యుద్ధానికి

        బరిగీసి దండుకడ్తది

అస్తిత్వం కోసం

అగ్గిగొంతై జ్వలిస్తడు

దురాచార అందకారాలపై

పెను జ్వాలై రగిలిపోతడు

అరాచక దోపిడి గుండెలమీద

పిడుగుల తుఫానులై కురుస్తడు

        బైరాగిలా

        సంతలోని దుఃఖాన్ని వలపోస్తడు

        సంచార సౌందర్యాన్ని జొన్నకంకుల్లా కళ్ళముందు ఆరబోస్తడు

        హరిదాసులా ఏకునాదం మీటుతూ

                అపర సిద్దయోగై బోధచేస్తడు

        ఏ పట్టింపులు లేని పాలకొమ్మ

        మా గౌరారం వెంకన్న

దుందుభి వాగు

దోసెడు నీళ్లు తాపినందుకేమో

ఊరూరా పెద్దవాగు పేగుతడై ప్రవహిస్తడు

అతడు నడువకపోతే

తోవ చిన్నబుచ్చుకుంటది

పాడకపోతే

చీకటికి చిర్రెత్తుకొస్తది

        దున్న ఇద్దాసు జ్ఞాన తత్వాలు

        హనుమద్దాసుల భక్తి గీతాలు

        నిండు కల్లుకుండలా

        కడుపునిండా కమ్మని సంకీర్తనలకు

        నడిచే సూర్యుడు చిందేస్తడు

        వెలిగే చంద్రుడు కోలాటమేస్తడు

పలుగురాళ్ళల్ల

కవిత్వానికీ నాగలికట్టి

పాలమూరు పదాలతో

కోట్లచరణాలను కొండ్రేసినాడు

ఆ హరిశ్చంద్రుడులా

సత్యానికి కాటికాపరి

        తెలంగాణ తడిని తెలుగు నుడికారాన్ని

        జానపద వోయ్యారాల్ని జీరగోంతులో ఒంపుకొని

        మట్టి భాషల మలీదలను

        మొహబ్బతుగా పంచి

        ప్రపంచానికి షర్బత్‌ లా తాపిన

        ఈతరం కాలజ్ఞాని మా వెంకన్న

గల్లీచిన్నది గరీబోల్లకథ పెద్దది

పేదరికపు ఆత్మ గీతం

కొంగమ్మకు వెండిరెక్కలు తొడిగిన భాషా సౌందర్యం

పాటపాడేటి పిల్లలు ఆటలాడేటి పిల్లల

పాట బాలల జాతీయగీతం

నల్లతుమ్మచెట్టుకు కావ్యగౌరవమైన

వెన్నెల వెలుగుల రేలపూతలు

వల్లంకి తాళం, పూసిన పున్నమి

వెంకన్న కవిత్వపు పూదోటలు

        ఆకాశం

        ఈ నేలకు కానుకగా ఇచ్చిన ఇంద్రధనుస్సు

        మా గోరటివెంకన్న

–  వనపట్ల సుబ్బయ్య