బీసీలకు అండగా ప్రభుత్వ ఎజెండా!
By: గంగాడి సుధీర్

ఆత్మగౌరవమే మానవ వికాసానికి అత్యున్నత సూచి, ఆదిమ సమాజాల నుండి అభివృద్ధి సమాజాల వైపు సాగుతున్న మానవ జీవన ప్రస్థానంలో మనిషికి గుర్తింపుని, సంతుష్టిని కలిగించేది ఆత్మగౌరవమే. కారణాలేవైతేనేం వెనుకకు నెట్టేయబడిన వర్గాలు ఈ ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాయి. కుల సహితంగా విభజింపబడిన అఖండ భారతావని అనాదిగా ఈ విభజనని కొనసాగిస్తూ వస్తోంది, ఏర్పడ్డప్పుడు ఏవిధంగా, ఎందుకు, ఏ ప్రయోజనం కోసం ఏర్పడ్డాయో కానీ వృత్తులుగా స్థిరీకరించబడ్డాయి అని చెపుతున్న కులాలు నేటి ఆధునిక సమాజంలోనూ వర్గ వ్యవస్థగా అసమగ్ర అసమానతలను సృష్టించాయి. విద్య, సమాన అవకాశాలు అన్నింటికీ మించి ఆత్మాభిమానానికి అసలు సూచికైన ఆత్మగౌరవం కొన్ని సమాజాలకు దూరంగా నెట్టేయబడుతూ వచ్చింది, దీని పర్యవసానంగా అన్ని అవకాశాల్ని అందరికీ అందకుండా చేసి కొన్ని వర్గాలను అనివార్యంగా గాఢాంధకారంలోకి నెట్టేశాయి.
నిజానికి స్వతంత్య్ర భారతం పేదరికం కన్నా దాని అసలు మూలాలైన కుల వ్యవస్థపై పోరు చేయాల్సి వచ్చింది, ఈ క్రమంలో విశాల భారతాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన స్వతంత్య్ర పోరాట వీరులు రాజ్యాంగం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు తోడ్పాటునందించి, తద్వారా సమానత్వాన్ని సృష్టించేందుకు సమగ్ర విధానాల్ని రూపొందించారు, కానీ దురదృష్టవశాత్తు ప్రధానంగా పాలకుల నిర్లక్ష్యం ఇతరత్రా అనేక కారణాలు నేటికీ రాజ్యాంగ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాయి. ఆర్టికల్ 340 ద్వారా రాజ్యాంగబద్దంగా ఏర్పడిన తొలి ఖేల్కర్ కమిషన్ (1953) మొదలు 26 ఏళ్ల తర్వాత ఏర్పడిన మండల్ కమిషన్ (1979) అప్పుడప్పుడు సిపార్సు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘాల రాజ్యాంగబద్ద ప్రతిపాదనలనే అమలు చేయమని డిమాండ్ చేసే దుస్థితిలో ఇంకా ఉన్నాం అనేది విస్మరించలేని సత్యం, భరించలేని అన్యాయం.
యావత్ జనాభాలో 52శాతం అని ఒకరు 55 శాతం అని మరొకరు, కాదు కాదు 41 శాతమే అని ఇండియన్ శాంపిల్ సర్వే వంటి జాతీయ సంస్థలే బీసీ లెక్కల్ని అంతా ఇంతా అనే ఉజ్జాయింపులెందుకు, 1961 జనాభా లెక్కల్లోనే అసలు బీసీల జనాభా ఎంత, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని సమగ్రంగా మదింపు చేసి వారికి అందించాల్సిన అవకాశాలెన్నో లెక్క తీయాలని తొలి కమిషన్ చెప్పినా… కేంద్రంలో పాలకులు మారుతున్నా ప్రతిపక్షంలో బలంగా కోరిన అంశం ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి కొరగానిది ఎందుకు అవుతుందనేది ఏ రాజకీయ విశ్లేషకులూ చెప్పలేని చిక్కుముడిగా మిగిలిపోతోంది.
నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మినహా 1985 వరకూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఒక సెల్ గా ఉన్న బీసీలు తర్వాత సోషల్ జస్టిస్ శాఖలో కలిసారు కానీ ఇప్పటికీ కనీసం మంత్రిత్వ శాఖకు కూడా నోచుకోకుండా పడి ఉన్నారు.
ఈ పరిస్థితులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు కాదు, ఏదో పైపై ఉజ్జాయింపులతో బీసీల కోసం పనిచేస్తున్నట్టు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడా కొనసాగాయి. సమస్య ఏర్పడిన ప్రతీసారి ఏదో పరిష్కారాన్ని కామా రూపంలో అందించాయి కానీ వాటికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగలేదు, వీటికి సిన్సియర్‌గా పుల్‌స్టాఫ్ పెట్టే ప్రయత్నాలు తెలంగాణలో 2014 జూన్ 2 నుండి ప్రారంభమయ్యాయని నేటి ఫలితాల్ని చూస్తుంటే అనిపిస్తుంది. దశాబ్దాలుగా బీసీలు బలంగా కోరుకుంటున్న బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ జనగణన, బీసీ మంత్రిత్వ శాఖల కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు వెరవకుండా అత్యంత బలంగా డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే, కేంద్రం పరిష్కరించాల్సిన అంశాలపై కొట్లాడుతూనే మూడున్నరకోట్ల రాష్ట్ర జనాభాలో మనవద్ద కూడా యాభైశాతానికి మించి బీసీ జనాభా ఉన్నారని సాధికారికంగా సకల జనుల సర్వే ద్వారా తేల్చడమే కాకుండా ఈ వెనుకబడిన వర్గాలను విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు కేసీఆర్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ సారథ్యంలో సమర్థుడైన అధికారి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కృషితో చిత్తశుద్ధితో జరుగుతున్నాయి.

తెలంగాణ ఏర్పడే నాటికి అరకొర నిధులతో కేవలం 19 బీసీ గురుకులాలు పనిచేస్తుంటే, విద్యలేకపోతే జ్ణానం రాదు, జానం రాకపోతే బలహీన వర్గాల్లో చైతన్యం వెల్లివిరియదు అన్న మహాత్మా జ్యోతీబాపూలే మాటల్ని ఆదర్శంగా తీసుకొని ఆ మహనీయుని పేరున బీసీ గురుకుల విద్యాలయ సంస్థను వజ్ర సంకల్పంతో ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు బీసీ గురుకులాలను 281కి పెంచి అందులో మహిళా డిగ్రీ కాలేజీతో పాటు 138 గురుకులాలు ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకూ విద్యనందిస్తుండగా 142 హైస్కూల్ స్థాయి వరకూ విద్యనందిస్తున్నాయి. తెలంగాణకు పూర్వం తూతూ మంత్రపు మెస్ చార్జీలతో కేవలం 7580 మంది విద్యార్థులుంటే నేడు ప్రతీ ఒక్కరిపై సాలీనా 1లక్షా 25వేలు ఖర్చు చేస్తూ 1లక్షా 42వేల మందికి పైగా విద్యార్థులు కార్పోరేట్‌కు దీటుగా వేలాది డిజిటల్ బోర్డులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబులు, విశాల ఆటస్థలాలు, నెలకు నాలుగు సార్లు చికెన్, రెండుసార్లు మటన్, పాలు, గుడ్లు, మంచి పౌష్టికాహారం ఇలా సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందుకుంటున్నారు.
నీట్, ఐఐటీ వంటి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు, ఆటల్లో సైతం అదే స్థాయిలో రాణిస్తూ అథ్లెటిక్, కరాటే మరియు సెయిలింగ్ చాంపియన్లుగా అవతరించడమే కాదు ఇండియన్ నేవీ, ఆర్మీలో సెలక్టయి దేశమాత రక్షణ సేవలో తరిస్తున్నారు. 2150 అంకిత భావం గల సిబ్బందికి అదనంగా ఈ ఏడాది బీసీ సంక్షేమ శాఖలో ప్రభుత్వం భర్తీ చేయబోయే 4311 ఉద్యోగాల ద్వారా మరింత నాణ్యమైన సేవలకు ఆస్కారం కల్పిస్తోంది ప్రభుత్వం, బీసీ గురుకులాల్లో బీసీ, ఈబీసీలతో పాటు ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎంబీసీలకు 5 శాతం సీట్లను సైతం కేటాయించింది ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి వందల కోట్ల నిధుల్ని ప్రతీ ఏటా బీసీ గురుకులాలకు కేటాయిస్తున్న కేసీఆర్ సర్కార్ ఈ ఏడు 774 కోట్లను కేటాయించింది. ఈ నిబద్ధతను, కష్టాన్ని సద్వినియోగం చేస్తూ మెరికలైన బీసీ బిడ్డలు రాష్ట్ర సగటు ఫలితాల్లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవే కాకుండా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా 701 హాస్టళ్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 46,457 మంది విద్యార్థులు సన్నబియ్యంతో పోషకాహారాన్ని తింటూ విద్యనభ్యసిస్తున్నారు, వీరికోసం ఈ ఏడు 331 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
బీసీలకు నాణ్యమైన విద్య అందినపుడే సమర్థవంతంగా అవకాశాల్ని సృష్టించుకొని సమాజ అంతరాల్ని చెరిపేయ గలరని నమ్మిన ప్రభుత్వం అందుకు ఉన్నత విద్యలోనూ అండగా నిలబడుతోంది, స్కాలర్‌షిప్పులు, మెయింటెనెన్స్ ఫీజులు, ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం కింద ఈ ఏడు వేలాది విద్యార్థులకు 1316 కోట్లను ఖర్చు చేయబోతోంది.
ఏ ప్రభుత్వం సాహసించని విధంగా ఒకేసారి దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో 91,142 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మెజార్టీ వాటాను బీసీలకు దక్కెలా చేసిందీ ప్రభుత్వం, 80,039 ఉద్యోగాల భర్తీ జరగబోతున్న సందర్భంలో ఇందులో 25 శాతం బీసీ రిజర్వేషన్లతో పాటు బీసీ ఈ కోటాను కలుపుకొని 29 శాతంగా 23,211 ఉద్యోగాలు నేరుగా బీసీ బిడ్డలకు రాబోతున్నాయి, వీటితో పాటు 50 శాతం ఓపెన్ కోటాలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచే బీసీ బిడ్డలు మరో 20,000 వేల ఉద్యోగాలతో రాబోయే రోజుల్లో 43వేల పై చిలుకు బీసీ బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులు కాబోతున్నారు. ఇందుకు సుశిక్షితులైన అధ్యాపక బృందంచే, అత్యుత్తమ మెటీరియల్తో శిక్షణ అందించేందుకు బీసీ మంత్రిత్వ శాఖ సమగ్ర చర్యల్ని చేపట్టింది. 11 బీసీ స్టడీ సర్కిళ్లకు అదనంగా మరో నాలుగు స్టడీ సర్కిళ్లతో పాటు అన్ని నియోజవకర్గాల కేంద్రాల్లోనూ 104 బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసింది. మొన్ననే వీటికోసం ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్ 1 కోచింగ్ మొదలుపెట్టింది, అతి త్వరలోనే ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు ప్రభుత్వం వెలువరించే ప్రతీ నోటిఫికేషన్‌కి శిక్షణ అందించాలనే ప్రణాళికలతో ఉంది, 50 వేల మంది ప్రత్యక్ష బోధనలో లక్ష మంది హైబ్రిడ్ మోడ్‌లో మరింత మందికి ఆన్‌లైన్ విధానంలో సమగ్ర శిక్షణను అందించబోతున్నాయి. ఇప్పటికే 2వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ సభ్యులు ఈ ఏడు ఇబ్బడి ముబ్బడిగా పెరగబోతున్నారు. ఇందుకోసం కేవలం ఈ ఏడే రూ. 50 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 05 ఏళ్ల వయసు సడలింపులను పదేళ్లపాటు పొడిగిస్తూ ఉత్తర్వులను సైతం వెలువరించింది కేసీఆర్ సర్కార్.

ఈ విధంగా గడిచిన ఎనిమిదేళ్లలో బీసీల విద్యాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల్ని ఖర్చు చేసిన ప్రభుత్వం కేసీఆర్ సర్కార్. ఆత్మగౌరవ నినాదంతో సుధీర్ఘ కాలం పాటు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి ఆత్మగౌరవం విలువెంతో తెలుసు. అందుకే బీసీలు ఆత్మగౌరవంతో ఉన్ననాడే నిజమైన పాలన అందుతుందని నమ్మి హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున దాదాపు 6వేల కోట్ల విలువ గల స్థలాల్ని బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించడం కేసీఆర్ కే చెల్లింది, ఇంతవరకూ బీసీల కోసం మాట్లాడిన రాజకీయ వర్గాలన్నీ ఈ సాహసోపేత నిర్ణయంపై ఏం మాట్లాడలేని సంకట స్థితిలోకి వెల్లాయి. ఐటీ ఇండస్ట్రీలు, ప్రపంచస్థాయి కంపెనీల మధ్య సగర్వంగా బీసీ ఆత్మగౌరవ భవనాలు నిలబడబోతున్నాయి. దాదాపు 41 కులాలకు, 96 కోట్ల నిధులను, 88 ఎకరాలను కోకాపేట, ఉప్పల్ బగాయత్, ఇతర ప్రధాన ప్రాంతాల్లో కేటాయించడమే కాకుండా కొన్ని భవనాల నిర్మాణం సైతం ముగింపు దశకు చేరుకున్నాయి. ఎంబీసీల కోసం ప్రత్యేకంగా పది ఎకరాలు, పదికోట్లను సైతం కేటాయించింది. ఈ కుల సంఘాల నిర్మాణంలో సైతం ఆయా కులసంఘాలకే ప్రాధాన్యం ఇచ్చి వారి సారస్వత, చారిత్రక వారసత్వం తెలిపే విధంగా డిజైన్లు చేసుకొని నిర్మించుకొనే స్వేచ్ఛను సైతం ప్రభుత్వం అప్పగించింది, వీటిలో వసతి, డార్మిటరీ, బోజన శాలలు, సమావేశ మందిరాలు, పంక్షన్ హాళ్లు, హాస్టల్ వసతి వంటి సౌకర్యాలను సమకూరుస్తోంది. ఇలా ఇప్పటికే 19 కుల సంఘాలు ఏకగ్రీవమై అనుమతి పత్రాలను అందుకొన్నాయి. ఏకగ్రీవం కాని సంఘాలకు సైతం ప్రభుత్వమే అద్భుతమైన భవనాల్ని నిర్మిస్తామని ప్రకటించింది. ఇందుకోసం వరుసగా బడ్జెట్లో నిధుల్ని కేటాయిస్తూ పనుల్ని పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం.
జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు అత్యంత ప్రధానమైన ఖర్చు పెళ్లి ఖర్చు, మిగతా వర్గాలకు దీటుగా ఘనంగా కూతురి పెండ్లి చేయాలనే తపన ఉండి అందుకు తన ఆర్థిక స్తోమత సరిపోక కూతురి పెళ్లి భారం గుండెల్ని మెలేసే ఎన్నో కుటుంబాల్ని ఉద్యమంలో చూసిన నాయకుడు కేసీఆర్, ఆ బాధను పారద్రోలాలనే దృఢ సంకల్పం నాడే తీసుకున్న నేత ముఖ్యమంత్రి అయ్యాక తీసుకొచ్చిన మరో మహత్తర పథకం కళ్యాణ లక్ష్మీ, షాదీముభారక్. ఇప్పటివరకూ ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 52 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి మేనమామయ్యాడు కేసీఆర్. 2016లో బీసీలకు తొలుత 51వేలు అందించిన జన నేత పెరిగిన ఖర్చుల్ని తట్టుకునే విధంగా 75,116ల మీదుగా నేడు లక్షా 116 రూపాయలకు పెంచాడు. 2016-17లో 136.66 కోట్ల నుండి 2017-18లో 386.82 కోట్లు, 2018-19లో 690.73 కోట్లు, 2019-20 లో 694.17 కోట్లు, 2020-21 లో 1320.32 కోట్లు, కరోనా సంక్షోభ సమయంలోనూ 2021-22 లో 1200.69 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా 1850 కోట్లు కేటాయించడమే కాకుండా ఈ మధ్యే ఏక మొత్తంలో నిధుల్ని సైతం విడుదల చేశారు. ఇలా బీసీ, ఈబీసీల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆరేళ్లలో 6,279 కోట్లను ఖర్చు చేసిన ఏకైక సర్కార్ దేశ చరిత్రలో మనది మాత్రమే.
మహనీయులు కాంక్షించిన విధంగా అన్నిరంగాల్లో బీసీల కోసం విశేష కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం బీసీల విద్యా అభివృద్ధి, సామాజిక అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్దికి సైతం విభిన్న ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది, ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ల అమలుతో పాటు ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది ఉద్యోగాల్ని సృష్టించింది, ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్‌తో పాటు అనేక నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ఉపాధి మార్గాల్లో సమాజంలో అత్యధికులైన బీసీలూ లబ్ధిపొందుతారనేది జగమెరిగిన సత్యం.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో యువ మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలతో ఈ రోజు తెలంగాణ అన్ని రకాల ఇండస్ట్రీలకు హబ్‌గా మారింది, ఐటి, ఫార్మా, లాజిస్టిక్ తదితర రంగాలతో పాటు వృత్తిపర నిపుణులైన బీసీలకు ఉపయోగపడే టెక్స్ టైల్స్, చేతి వృత్తులు బలపడుతున్నాయి. కాకతీయ మెగా టెక్ట్స్ టైల్స్ పార్కు, సిరిసిల్ల మరమగ్గాల ఇండస్ట్రీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 527 నేత సహకార సంఘాల్లోని నేతన్నలకు అనేక సంక్షేమ పథకాల్ని అమలుచేస్తోంది. ఒకనాడు ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నలు నేడు బంగారు బతుకమ్మ చీరల్ని నేస్తూ ఆడబిడ్డల మొఖాల్లో చిరునవ్వులై విరబూస్తున్నారు. నూలు, రసాయన రంగులపై సబ్సీడీ అందించే చేనేత మిత్ర పథకం ద్వారా 24 కోట్లు, నేతన్నకు చేయూత ద్వారా 27వేల మందికి 113కోట్లు, చేనేత కార్మికుల రుణమాఫీ పథకము, నేతన్నలకు బీమా, మగ్గముల ఆధునీకరణ పథకము, పావలావడ్డీ పథకము, చేనేత వస్త్రాల కొనుగోలు పథకము, మరమగ్గాలకు 50 శాతం విద్యుత్ రాయితీ, గ్రూప్ ఇన్సూరెన్సు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంతర్జాతీయ ప్రదర్శనల్లో మన నేతన్నల ఉత్పత్తులు పెట్టే విధంగా ప్రోత్సాహకం, కేంద్ర పథకాల్ని సమర్థవంతంగా అమలు చేయడం, వీటికి అదనంగా అంతరించిపోతున్న మనవైన అరుదైన తేలియా రుమాల్, ఆర్మూర్ పట్టుచీరలు, పీతాంబర పట్టుచీరలు, సిద్ధిపేట గొల్లభామలు, హిమ్రు చేనేతలను వెలికి తీసి ఆధునికత జోడిరచి మార్కెట్‌ను పరిశోధించే కార్యక్రమాలను సైతం మొక్కవోని దీక్షతో చేస్తోంది ప్రభుత్వం.
రాష్ట్రంలో ఉన్న నాలుగున్నర లక్షల గౌడ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంది, నీరా పాలసీతో పాటు హరితహారంలో ఈత, తాటి వనాల అభివృద్ధి చేస్తుంది. ప్రమాదవశాత్తు నష్టం జరిగితే సత్వరమే ఆర్థిక సాయం చేయడంతో పాటు గౌడన్నలకు బీమా కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ.
రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎంబీసీల గుర్తింపే జరగలేదు, బాంకు లింకేజీతో మాత్రమే ఆర్థిక సహాయం అరకొరగా అందేది, కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంబీసీల కోసం ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు జరిగింది,100 శాతం సబ్సిడీతో రుణాలు, ఈ-ఆటో రిక్షాల్ని అందించింది, 14వేల మందికి పైగా 71 కోట్ల నిధులతో రుణాలు మంజూరు చేయడమే కాక ఈ సంవత్సరమే బీసీల, ఎంబీసీల అభివృద్ధికి 600 కోట్లకు పైగా అత్యధిక నిధులతో కార్పోరేషన్లతో పాటు 11 ఫెడరేషన్లను సైతం బీసీ సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. వృత్తి పని చేసుకొనే దాదాపు లక్ష కుటుంబాల రజకులు, నాయీబ్రాహ్మణులకు ఆలంబనగా 250 యూనిట్ల ఉచిత కరెంటును అందించడమే కాక 350 మాడర్న్ దోబీఘాట్ల నిర్మాణం, ఆధునిక యంత్రాలతో కూడిన లాండ్రీ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. 3500 మంది కుమ్మరి కులస్థులకు మాస్టర్ ట్రైనింగ్ అందించడమే కాక మట్టివినాయకులు, మట్టి దీపాంతాల తయారీతో ఇటు ఆ కుటుంబాలకు స్వయం ఉపాధితో పాటు అటు పర్యావరణ పరిరక్షణ సైతం చేస్తుంది ప్రభుత్వం. భట్రాజు సోదరులకు, కృష్ణబలిజ పూసల కులస్థులకు, మేదర, సగర, ఉప్పర, వడ్డెర, వాల్మీకిబోయ, విశ్వబ్రాహ్మణులకు సైతం ఆర్థిక సాయం అందిస్తూ వస్తుంది ప్రభుత్వం.

జనాభాలో యాభై శాతం కన్నా ఎక్కువ ఉన్న వెనుకబడిన వర్గాలకు, సమాజ ప్రగతిలో అంతకన్నా ఎక్కువ పాత్ర అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం, 1975 లో ఏర్పడిన బీసీ సంక్షేమ శాఖకు గతంలో ఎన్నడూ లేనివిధంగా గుర్తింపు నిధుల్ని కేటాయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమాజంలో అత్యధికులైన బీసీ ల పట్ల ఎనలేని ప్రేమని చూపిస్తారు. వారి మానవతా హృదయం, సాంఘిక సంస్కరణల ఫలితమే నేడు మన రాష్ట్రం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో బీసీల వాటాని సగర్వంగా తీసుకోగల్గుతోంది. ఉద్యమ వీరుడిగా ఆత్మగౌరవ నినాద సృష్టికర్తగా తెలంగాణ నాయకుడు సీఎం కేసీఆర్ సారథ్యంలో బీసీలందరు ఆత్మగౌరవంతో, సమున్నత విద్యా పారంగతులై సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారు. ఇటు వ్యవసాయ సంస్కరణలు మెదలు, అటు గ్రామీణ పంచాయతీరాజ్, ఇండస్ట్రీ, రెవెన్యూ తదితర అన్ని రంగాల్లోనూ బీసీలు న్యాయబద్దమైన వాటాని సాదించుకుంటున్నారు. ఈ ప్రగతిని ఇలాగే కొనసాగిస్తూ బీసీల అభివృద్ధే ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి మనమందరం జేజేలు పలుకాలి, ఆ ప్రగతిలో భాగస్వాములవ్వాలి.