అవార్డులు అందుకుంటున్నఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి
By: ఎం. డి. యాకూబ్ పాషా, ఖమ్మం
‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అనేది ఒకప్పటి మాట. ఆధునిక, కార్పోరేట్ తరహా వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం ద్వారా ప్రభుత్వ రంగ వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించి దీనిని తిరగ రాసింది నేటి మన రాష్ట్ర ప్రభుత్వం.

ఖమ్మంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, పరిసర జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్, ఇతర జిల్లా సరి హద్దులో ఉన్న ప్రాంతాల ప్రజలకు కూడా కార్పోరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నది. గతంలో అరకొర వసతులతో ఉన్న ఈ జిల్లా ప్రధాన ఆసుపత్రిని ప్రభుత్వం గత 7 ఎండ్ల కాలంలో ఆధునీకరించి, నూతన వైద్యపరికరాలను సమకూర్చడం జరిగింది. దీంతో మరింత మెరుగైన వైద్యసేవలను అందిస్తూ ఈ ఆస్పత్రి ఇప్పటికే 3 సార్లు కాయకల్ప అవార్డును స్వంతం చేసుకున్నది. ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చగా, జిల్లా కలెక్టర్ నిరంతర పర్యవేక్షణలో ప్రయివేటు ఆసుపత్రులకు ధీటుగా ఈ జిల్లా ప్రధాన ఆస్పత్రి కార్పోరేట్ స్థాయి వైద్యసేవలను అందిస్తున్నది.
220 పడకల నుండి 550 పడకలకు పెంచడంతోపాటు, మహిళా శిశువైద్య సేవలకుగాను ప్రత్యేకంగా రూ. 3.50 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రతిరోజు సుమారు 600 మందికి పైగా గర్బీణీలకు, చిన్నారులకు వైద్య సేవలందుతున్నాయి. ప్రతినెల దాదాపు 7 వందలకు పైగా ప్రసవాల సంఖ్య పెరిగింది. కేవలం గత సంవత్సరంలోనే 7132 మందికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కె.సి.ఆర్ కిట్స్‌ను అందించడం జరిగింది.

జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 2015 సంవత్సరాని కంటే ముందు ఆక్సిజన్ బెడ్స్ ఏమీ లేవు. ప్రస్తుతం 3 వందల ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం 35 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్, కార్డియాలజీయూనిట్స్, నెఫ్రాలజీ యూనిట్స్, గైనకాలజీ డిపార్ట్మెంట్, అనస్థీషీయా, ఇ.ఎన్.టి, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, పాధ్యాలజీ, డెంటల్ డిపార్ట్మెంట్, సైక్రియాటిక్, న్యూరోసర్జన్, బ్లడ్ బ్యాంక్ పాథ్యాలజీ, ఐ.సి.యు, ఎస్.ఎన్.సియు, ఎన్.ఆర్.సి విభాగాలకు సంబంధించి 68 మంది డాక్టర్లు, 159 మంది నర్సింగ్ సిబ్బంది, 37 మంది పారా మెడికల్ సిబ్బంది, ఆరుగురు ఐ.డి.ఎస్పీ సిబ్బంది, 17 మంది బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, 14 మంది పాలిటీవ్ కేర్ సిబ్బంది
ఉన్నారు. ప్రతిరోజు దాదాపు 15 వందల మంది ఓ.పి., 150 మంది ఇన్ పేషెంట్లకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించబడుచున్నాయి.
2014 సంవత్సరం కంటే ముందు కేవలం 800 మంది ఓ.పి. 84 మంది ఇన్ పేషెంట్లు మాత్రమే వైద్య సేవలు పొందేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ రంగ వైద్యసేవల్లో తెచ్చిన ఆధునిక విధానం వల్ల జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల 41 లక్షల ఖర్చుతో 206 జనరల్ సర్జరీలు, 146 ఆర్థోపెడిక్ సర్జరీలు, 408 క్యాటరాక్ట్ సర్జరీలు, 69 ఈ.ఎన్.టి సర్జరీలు, 2471 ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది.
సుమారు రూ.90 లక్షలతో 13.కె.ఎల్ లిక్విడ్ ఆక్సిజన్ జనరేటెడ్ ప్లాంట్ ఆసుపత్రిలో నెలకొల్పడం జరిగింది. దీనితోపాటు ఒక్కొక్కటి 32 లక్షల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు అత్యవసర సదుపాయాలతో ప్రజలకు వైద్యసేవలందించేందుకు అందుబాటులో ఉంచారు.
జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులు వివిధ రోగనిర్ధారణ పరీక్షలకు ప్రయివేటు డయాగ్నిస్టిక్ కేంద్రాలలో డబ్బులు వెచ్చించి పరీక్షలు చేయించుకొని ఆర్ధిక ఇబ్బందులు పడకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే 2.25 కోట్ల వ్యయంతో తెలంగాణ డయాగ్నిస్టిక్ హబ్, 2 కోట్ల 15 లక్షలతో సి.టి.స్కాన్‌ను ఇటీవలే ప్రజలకు అందు బాటులోకి వచ్చింది. ఈ హబ్ ద్వారా 57 రకాల వివిధ రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసి వ్యాధి నిర్ధారణ అనంతరం పేషెంట్ సెల్ ఫోన్ తో పాటు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జిల్లా కేంద్రం నుండే రిపోర్టులు పంపబడుతున్నాయి. దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల 78 లక్షల ఖర్చుతో ఆర్టి.పి.సి.ఆర్, డెంగ్యూ ర్యాపిడ్, డెంగ్యూ ఎలీసా, మలేరియా, టైఫాయిడ్, సి.టి స్కాన్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు ఉచితంగా అందించడం జరిగింది.
పిల్లలకోసం కోవిడ్ ప్రత్యేక వార్డు
కరోనా క్లిష్ట సమయంలో ఈ ఆసుపత్రి వైద్యులు అందించిన సేవలు అభినందనీయంగా నిలిచాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేకంగా 320 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి దాదాపు 25,157 మంది రోగులకు కరోనా చికిత్సలో భాగంగా 3546 మందికి అక్సిజన్ ద్వారా, దాదాపు 9 వందల మందికి పైగా వెంటిలేటర్ల ద్వారా అందించిన వైద్య సేవలతో సంపూర్ణ ఆరోగ్య వంతులుగా కోలుకున్నారు. కోవిడ్ మూడవ దశ తీవ్రత చిన్నపిల్లలపై ప్రభావం చూపు తుందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి పిల్లల కోవిడ్ ప్రత్యేక వార్డును 40 పడకలతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అందు బాటులోకి తేవడం జరిగింది.