|

పేదల దేవాలయాలు ప్రభుత్వ ఆసుపత్రులు

  • అందుబాటులో ఉచిత పరీక్షలు

By: ఎస్‌. శ్రీనివాస రావు, భద్రాద్రి కొత్తగూడెం

పూట గడవడమే గగనమైన నిరుపేదలు అనారోగ్యానికి గురయితే,  ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తే అనవసర పరీక్షలు చేయించడంవల్ల పేద ప్రజలకు మూలిగే నక్క మీద తాటికాయ పడిన పరిస్థితిగా ఉండేది. పైవేట్‌ ఆసుపత్రుల్లో  వైద్యంతో రోగం మాట ఎలాఉన్నా వైద్యపరీక్షలకే పేద కుటుంబాలు వున్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకుని, అప్పులపాలు అవుతున్నాయి.’’ ఆపరేషన్‌ సక్సెస్‌… పేషెంట్‌ డెడ్‌’’ అనే నానుడి చాలా ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు సరిపోతుంది.

వైద్యం అత్యంత ఖరీదైన సేవగా మారింది. వైద్యసేవలు, మందులకు సగటున ప్రతి కుటుంబం తమ ఆదాయంలో 20 నుంచి 30శాతంఖర్చు చేస్తూ, ఆర్థికంగా కోలుకోలేక కునారిల్లి పోతున్నారు. ఖరీదైన కార్పొరేట్‌ వైద్య సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అందచేయాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర రావు నిరుపేదలకు మరింత మెరుగైన వైద్య సేవలతో పాటు, అవసరమైన పరీక్షలను ఉచితంగా అందించేందుకు తెలంగాణ డయాగ్నోష్టిక్స్‌ను మొదటగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలలో 19 చోట్ల తెలంగాణ డయాగ్నోస్టిక్‌ పరీక్ష  కేంద్రాలను  నెలకొల్పింది. ఈ కేంద్రాలకు మారుమూల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఏరియా హాస్పిటల్స్‌ను అనుసంధానం చేసింది.

పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు గత ఏదేండ్లలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. హైదరాబాద్‌ తో పాటు జిల్లా, ఏరియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కార్పొరేట్‌ స్థాయి వసతులు పెరిగాయి.  నిరుపేదలకు కార్పోరేట్‌ వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులోకి  తెచ్చింది. 

వ్యాధినిర్ధారణకు అవసరమైన వైద్య పరీక్షలను మరింత సులువుగా అందించాలనే ఆశయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ డయాగ్నోస్టిక్‌ టెస్టింగ్‌ కేంద్రాలతో పేదలకు ఎంతో భారం తొలగింది. ఈ కేంద్రాలలో దాదాపు 48 రకాల పరీక్షలు నిర్వహించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో 38 లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణ డయాగ్నిస్టిక్స్‌ హబ్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఈ హబ్‌ను లాంఛనంగా ప్రారంభించి పేదలకు ఉచిత రక్త పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. 

నిరుపేదలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలన్నీ ప్రభుత్వ ల్యాబ్‌లలో చేస్తున్నారు. అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి  ప్రతిరోజూ 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి నాలుగు రూట్ల ద్వారా రోగుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. శాంపిళ్ళ తరలింపులో వేగాన్ని పెంచేందుకు మరో రెండు రూట్లను ఏర్పాటు చేయనున్నారు. 

హబ్‌ ప్రారంభం నుంచి రోజూ సుమారు 300 మంది నుండి రక్త పూతలు సేకరించి, మరుసటి రోజు రోగ నిరార్ధణ పరీక్షలు చేసి, రిపోర్టులను రోగుల  మొబైల్‌కి మెసేజ్‌ చేస్తున్నారు. ఇవే పరీక్షలు ప్రైవేటు ల్యాబ్‌లో  చేస్తే కనీసం  7 నుండి 10 వేలు రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి. కరోనా ప్రొ ఫైల్‌ పరీక్షలు కూడా టి హబ్‌ లో చేస్తున్నారు. మార్చి 10న జిల్లాలో తెలంగాణ రోగ నిర్ధార్ధణ పరీక్ష కేంద్రం ప్రారంభమైంది. జిల్లాలో ప్రస్తుతం నాలుగు వాహనాలు ఏర్పాటు చేసి, పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి రక్త నమూనాలు సేకరించి హబ్‌ కు తరలించి పరీక్షలు చేస్తున్నారు. హబ్‌లో షుగర్‌, బ్లడ్‌ పీఛర్స్‌, లివర్‌, కిడ్నీ, కోలెస్ట్రాల్‌, డెంగి,  లిపిడ్‌ ప్రొఫైల్‌,  విడీఆర్‌ఎల్‌, ఆర్‌ఎ, సీఆర్పి ర్యాపిడ్‌ టెస్టు హెచ్‌ఐబిఎవన్సీ, కోవిడ్‌ ప్రొఫైల్‌ డిడైమర్‌, పెర్టిన్‌,  ఎల్డీహెచ్‌ తదితర పరీక్షలు చేస్తున్నారు.

హబ్‌ ప్రారంభం నుంచి అక్టోబర్‌ వరకు జిల్లాలో 16,502 మంది నుండి 27,114 నమూనాలను సేకరించి 47165 పరీక్షలు నిర్వహించారు.  

హబ్‌ లో రూ.1.50 కోట్ల రూపాయలతో ఎంతో విలువైన అధునాతన పరికరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రస్తుతం నాలుగు వాహనాల ద్వారా నాలుగు రూట్లలో ప్రతి రోజు శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఇల్లెండు, పాల్వంచ, ఆళ్లపల్లి, కొత్తగూడెం. నాలుగు రూట్లుగా ఏర్పాటు చేసి ప్రతి రోజూ 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి రక్త పూతలు సేకరించి, హబ్‌ కు పంపుతున్నారు. మరో రెండు రూట్లలో ` అశ్వారావుపేట, మణుగూరు, దమ్మపేట, భద్రాచలం ప్రాంతాల నుంచి కూడా రెండు వాహనాల ద్వారా నమూనాలు సేకరణ చేయనున్నారు.  మొత్తం 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి   రక్త పూతలు సేకరించి, హబ్‌ కు పంపనున్నారు.

మారుమూల గ్రామాలున్న ఈ జిల్లాలో ఆదివాసీ గిరిజన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు  అందు బాటులోకి తెచ్చేందుకు  జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తీసుకున్న ప్రత్యేక చొరవ సత్ఫలితాలను ఇస్తోంది. రక్త నమూనాలు పరీక్షలు నిర్వ హించడం ద్వారా మహమ్మారి వ్యాధులను ముందుగానే పసిగట్టేందుకు డయాగ్నిస్టిక్స్‌ హబ్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. వేల రూపాయల విలువ చేసే పరీక్షలు నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తేవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.