స్వరాష్ట్రంలో ఘనంగా పుష్కరాలు

స్వరాష్ట్రంలో-ఘనంగా-పుష్కరాలుస్వరాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన గోదావరి మహాపుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు సకల సదుపాయాలు కల్పించింది. పుష్కరాలకు తరలివచ్చిన అశేష భక్తజనావళికి సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు, భద్రతాచర్యలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ చర్యలు దోహదం చేశాయి.

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన గత పుష్కరాల సందర్భంగా అప్పటి పాలకులు సదుపాయాులు కల్పించడంలో కూడా తెలంగాణ ప్రాంతం పట్ల వివక్ష చూపారు. చిన్నచూపు చూశారు. పుష్కరాలను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. ఈ వివక్షను ఆనాడే ఉద్యమ నాయకునిగా ఉన్న కె. చంద్రశేఖరరావు ఎండగట్టారు. పాలకులను నిలదీశారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణ రాష్ట్రంలోనే గోదావరి నది పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉంది. కానీ, ఘాట్ల నిర్మాణంలో కూడా అప్పటి పాలకులు తెలంగాణ పట్ల వివక్ష చూపారు. గత అనుభవాలు, నేటి వాస్తవాలు తెలిసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ సారి వచ్చిన గోదావరి మహాపుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రకటించడంతోపాటు, చేతలో కూడా సత్తా చాటారు. గోదావరినది ప్రవహిస్తున్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలో భక్తుల సౌకర్యార్ధం ప్రభుత్వం భారీ ఎత్తున, గతంలో ఎన్నడూ లేనంతగా, 106 పుష్కరఘాట్లను నిర్మించి, అక్కడ భక్తులకు కావలసిన సకల సదుపాయాలు కల్పించింది. పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాన్నింటినీ సుందరంగా తీర్చిదిద్ది విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తలు ఆయా ఆలయాలను సందర్శించేందుకు వీలుగా, ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఫలితంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చినా ఏ ఆలయం వద్ద కూడా భక్తుల దర్శనానికి గానీ, ప్రసాదాల పంపిణీకి గాని ఏ విధమైన ఆటంకం కలుగలేదు.

పుష్కర ఘాట్లు కిటకిట

గోదావరి మహాపుష్కరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం భక్తులతో కళకళలాడింది. పుష్కర ఘాట్లు కిటకిటలాడాయి. తెలంగాణ జిల్లాల నుంచే గాక, ఇరుగు పొరుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా భక్తులు తెలంగాణ పుష్కర ఘాట్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. భక్తులు పుష్కరఘాట్ల వద్ద స్నానాల కోసం లోతు ప్రాంతాలకు వెళ్ళకుండా ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్ళను, పడవలను ఘాట్ల వద్ద సిద్ధంగా ఉంచారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, మరుగుదొడ్ల సదుపాయం కూడా పెద్ద సంఖ్యలో కల్పించారు. స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పారిశుద్ధ్య సిబ్బంది పుష్కర ఘాట్ల వద్ద ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచారు. లక్షలాది మంది జనం తరలివచ్చినా, ఎక్కడా అపరిశుభ్రత కానరాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. పిండ ప్రదానం, గోదావరి మాతకు పూజలు, తదితర కార్యక్రమాల నిర్వహణకోసం పురోహితులకు ప్రభుత్వం ముందుగానే గుర్తింపు కార్డులు కూడా జారీ చేసింది. ప్రతిఘాటు వద్ద అత్యవసర వైద్య సేవలకోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీల్‌చైర్‌ సౌకర్యం కల్పించారు. నిరంతరాయంగా విద్యుత్‌ సదుపాయం కల్పించారు. వృద్ధులు, ఘాట్లలోకి దిగి స్నానం చేయలేని వారికోసం షవర్‌బాత్‌ సౌకర్యం కూడా కల్చించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జల కాలుష్యం ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది. కాలుష్య నియంత్రణ సంస్థకు చెందిన సిబ్బందిని పుష్కర విధులకు కేటాయించింది. పుష్కర ఘాట్లలో నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహింపజేసింది. పుష్కర ఘాట్లకు భక్తులు తరలి వెళ్ళేందుకు వీలుగా, ఆర్‌.టి.సి. ప్రత్యేక బస్సులను నడిపింది. ప్రయాణీకుల, భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ బస్సుల సంఖ్యను అవసరానికి తగ్గట్టుగా పెంచుతూ వచ్చారు. ప్రధాన కేంద్రాలనుంచి పుష్కరఘాట్‌కు ఉచిత బస్సుసౌకర్యం కల్పించింది. భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

భద్రతపై నిరంతర నిఘా

భద్రతపై-నిరంతర-నిఘాపుష్కర ఘాట్లలో సౌకర్యాల కల్పనతో పాటు, భద్రతా చర్యలకు కూడా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా ప్రతినిత్యం అధికారులు, మంత్రులతో సమీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా చూడాలని ఎప్పటికప్పుడు హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, డి.జి.పి అనురాగ్‌ శర్మ హెలికాప్టర్‌లో పుష్కర ఘాట్లను ఏరియల్‌ సర్వే జరిపి, భక్తుల రద్దీకి తగినట్టుగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితులలో వినియోగించేందుకు వీలుగా భద్రాచలం వద్ద ఒక హెలికాప్టర్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. వరుసగా సెలవు దినాలు వచ్చిన సందర్భంగా, భక్తుల రద్దీ మరింత పెరగగదని ముందుగానే ఊహించిన రాష్ట్ర ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

వివిధ జిల్లాలలోని పుష్కర ఘాట్లవద్ద ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. కొన్ని ఘాట్ల వద్ద రాష్ట్ర మంత్రలు కూడా ట్రాఫిక్‌ పోలీస్‌ విధులు నిర్వహించి, ట్రాఫిక్‌ను అదుపు చేశారు. పుష్కరాల 7వ రోజు మధ్యాహ్నం సమయానికే ధర్మపురిలోని పుష్కర ఘాట్లకు ఆరు లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తక్షణం అక్కడికి వెళ్ళవసిందిగా డి.జి.పి. అనురాగ్‌ శర్మను ఆదేశించారు. ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. ఆయా జిల్లా కలెక్టర్లతో సి.ఎం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు.

పోలీసులు పుష్కర ఘాట్ల వద్దే కాకుండా రహదారుల పొడవునా ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేయడంలో విశేష కృషి చేశారు. రాష్ట్రమంతటా పండుగ వాతావరణం పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసేవరకు భక్తులు లక్షలాదిగా పుష్కర స్నానాలు చేశారు. జూలై 18, 19 తేదీలో వరుస సెలవులు కలసిరావడంతో భక్తులు తండోపతండాలుగా గోదావరి పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. గోదావరి తీరమంతా ఇసుకవేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. గోదావరి తీరంలోని మారుమూల పల్లెల్లొ కూడా పుష్కర యాత్రికులతో కళకళలాడాయి. దారి పొడవునా వాహనాలు, రోడ్ల ప్రక్క చెట్లకిందే భోజనాలతో రహదారులన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వయోవృద్ధులు నుంచి చిన్నారుల వరకూ పుష్కర ఘాట్లకు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ముఖ్యంగా యువత గోదావరినదిలో స్నానాలు ఆచరించి పులకించిపోయారు. పుష్కరాల 12 రోజులూ ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా పుష్కరాల విశేషాలే సందడిచేశాయి. పుష్కరఘాట్లవద్ద యాత్రికులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

మోతేలో గవర్నర్‌ దంపతుల పుష్కరస్నానం

మోతేలో-గవర్నర్‌-దంపతు-పుష్కరస్నానంపుష్కరాలు ప్రారంభమైన 7వ రోజున రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతే పుష్కర ఘాట్‌ వద్ద పుష్కర స్నానం చేసి, గోదావరి తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, కలెక్టర్‌ ఇలంబరిది గవర్నర్‌ దంపతులకు స్వాగతం పలికారు. పుష్కర ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ ఈ సందర్భంగా కితాబునిచ్చారు.

తెలంగాణ ఖ్యాతి ఇనుమడించింది.. అధికారుల కృషికి సీఎం ప్రశంసలు

అధికారు-కృషికి-సీఎం-ప్రశంసుగోదావరి మహాపుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా జరిగాయని, దేవుడి ఆశీర్వాదం, అధికార యంత్రాంగం కృషి ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పుష్కరాలు నిర్వహించగలిగామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతృప్తి వ్యక్తం చేశారు.

కొత్త రాష్ట్రమైనా అద్భుతమైన స్ఫూర్తిని ప్రదర్శించి అధికార యంత్రాంగం పని చేసిందని, రాష్ట్ర కీర్తిని చాటిందని సి.ఎం అన్నారు. పుష్కరాలు విజయవంతం కావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ సి.ఎం అభినందనలు తెలిపారు. అధికారుల సూచనలు, సలహాలు పాటించి సంయమనం ప్రదర్శించిన భక్తులకు కూడా సి.ఎం అభినందనలు తెలిపారు. జులై 25న పుష్కరాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కర ఘట్టాలు గల ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలలో పుష్కర విధులలో పాల్గొన్న సిబ్బందికి రెండు రోజులు ప్రత్యేక సెలవు దినాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

ఉత్తమ సేవకు అవార్డు

పుష్కరాలలో అత్యుత్తమ సేవలు అందించిన అన్ని స్థాయిల ఉద్యోగులను గుర్తించి, ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అంచనాలకు మించి భక్తులు పుష్కరస్నానాలు చేశారని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 12 రోజులపాటు పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామని మంత్రి తెలిపారు. అధికారులు పనితీరు అభినందనీయమన్నారు.