మహా సంకల్పం!
By: దోర్బల బాలశేఖరశర్మ

‘దేశం కోసం’జాతీయ రాజకీయాల్లోకి! ఎనిమిదేండ్లలో తిరుగులేని విజయాలు – మనమే నంబర్ వన్ ఉన్నది ఉన్నట్టు, ఏ మాటకా మాటే మాట్లాడుకోవాలంటే, తెలంగాణ ఈ ఎనిమిదేండ్ల (2014-2022)లోనే చరిత్రలో ఎన్నడూ లేనంత ఘనమైన అభివృద్ధి జాతరకు తెర తీసింది. ‘తిరుగు లేని పంచకళ్యాణి శ్వేతాశ్వంపై మహావేగంగా దౌడు తీస్తున్న బాలవీరుని’ వలె ‘అష్టవర్షాత్ భవేత్ కన్య మన చిన్నతల్లి తెలంగాణ’ విప్లవాత్మక ప్రగతివైపు దూసుకు వెళుతున్నది. రెపరెపలాడే జెండాపై కపిరాజు వలె మన మహానాయకుడు కేసీఆర్! అతి తక్కువ కాలంలో ‘తెలంగాణ ప్రగతిరథం’ ఎవరికీ అందనంత అనితర స్థాయి వేగంతో పరుగులు పెడుతున్న ఈ అమోఘ దృశ్యం ఎంత అపురూపమో అంత అద్భుతం.
ఎనిమిదేండ్లలోనే ఎనభై ఏండ్ల ఘనచరిత్రను నమోదు చేసిన తెలంగాణ తరహాలోనే కేసీఆర్ యావత్ దేశానికే ఒక దిక్సూచి వంటి తనదైన కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. దానిని ఎంత త్వరగా సాధించుకోగలిగితే భారతజాతికి అంత మంచిది.
‘నంబర్ వన్’ ఎలా అయ్యాం ?
ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా భారతదేశం ఇంకా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే ఎందుకు ఉన్నదో అందరం ఒక్కసారి సింహావలోకనం చేసుకోగలిగితే వాస్తవాలు బోధపడుతాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ‘సమతౌల్య అభివృద్ధి నమూనా’ (బ్యాలెన్సుడ్ గ్రోత్ మోడల్) తరహాలో భారత జాతీయ రాజకీయాల చరిత్రలో సరికొత్త ప్రగతి విప్లవ సాధనకు అందరూ సమైక్యంగా కృషి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణలో దానిని నిజం చేసి చూపించాకే దేశం కోసం ప్రతిపాదించడం అభినందనీయం. స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఇంకా మహానాయకులు కన్న కలల సాకారానికి కృషి చేయకపోతే రాబోయే తరాలు మనలను ఎంతమాత్రం క్షమించవు. అందుకే, ‘మేడ్ ఫర్ తెలంగాణ’ (బంగారు తెలంగాణ) నుంచి ‘మేకింగ్ అవర్ ఇండియా’ (సోచో ఇండియా)కు ఆయన తనదైన ‘మహా సంకల్పం’ అత్యంత త్రికరణశుద్ధిగా చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ’ వేదిక సాక్షిగా, ‘దాదాపు అన్ని రంగాలలోనూ తెలంగాణ దేశంలోనే ఎలా నంబర్ వన్ కాగలిగింది’, ‘అతి తక్కువ కాలంలో కేంద్ర సర్కారు ప్రోత్సాహకాలు ఏవీ లేకుండానే ఎన్ని తిరుగు లేని విజయాలను సొంతం చేసుకొన్నది, ప్రస్తుత కేంద్ర సర్కారు ప్రవేశ పెట్టవలసిన అత్యవసర సంస్కరణలను, నిజమైన ప్రజాస్వామిక వాదులు, మేధావులంతా దేశం కోసం తక్షణం పునరంకితం కావాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు ఆయా తీర్మానాల రూపంలో ప్రజల ముందుంచారు.
ప్రజలు ఏం కోరుకుంటారు?

రాజకీయాల లక్ష్యమే అధికార సాధన. ఇది ప్రజాస్వామ్యం కనుక ఎన్నికలే రణరంగం. ‘యుద్ధం’ అన్నాక ప్రత్యర్థులతో ఎత్తులకు పై ఎత్తులు తప్పవు. ఫలితంగా సిద్ధించే గెలుపు-ఓటములూ సహజమే. గెలుపు కోసం ఎంతకైనా తెగించే వారూ కొందరు వుంటారు. దానికన్నా ముందు అసలు ‘గెలిచాక ఎవరైనా ఏం చేస్తారన్నది’ అతి ముఖ్యం. ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు, కాలానుగుణ మార్పులు, వాస్తవిక దృష్టి, దృక్పథాలతో కూడిన విలక్షణ భవిష్యత్ దార్శనికత (విజన్)తో ముందుకు సాగినప్పుడు గెలుపు అంతకంతకూ రాటు తేలుతూ, అభివృద్ధి అసాధారణ వేగాన్ని సంతరించుకుంటుంది. ఇది కదా ఏ ప్రజలైనా కోరుకొనేది!
మాయ మాటలు చెప్పి గెలువడం ఎవరికైనా తేలికే కావచ్చు. ప్రజలు అమాయకులు కానంత వరకే ఎవరి, ఏ తప్పుడు వ్యూహాలైనా పని చేసేవి. ఒకసారి అధికారంలోకి వచ్చి ప్రజావిశ్వాసాన్ని చూరగొన్నాక, సదరు గెలుపు శ్రేణిని నిలబెట్టుకోవడం, మరింత కాలం పాటు దానిని కొనసాగించగలగడం ఆయా ప్రభుత్వాలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే, రాజకీయ నాయకులు ఏదైనా ‘చెప్పింది చేయాలి, చేసేదే చెప్పాలి. చెయ్యలేనిది ఎందుకు చెయ్యలేమో చెప్పాలి. చేసేది ఎలా సాధ్యమో కూడా చెప్పాలి’. ఈ సత్యశీలత అందరికీ అన్ని సందర్భాలలో సాధ్యం కాకపోవచ్చు. కానీ, దానినే త్రికరణశుద్ధిగా నమ్మిన వారికి సత్ఫలితాలు శాశ్వతమవుతాయి. సాధ్యాసాధ్యాలు, నిజానిజాలు అర్థం చేసుకోగలిగిన ప్రజలూ అనవసరమైన కల్లబొల్లి కబుర్లను అస్సలు నమ్మరు. అంతేకాదు, అధికారమే లక్ష్యంగా, విమర్శలే పనిగా పెట్టుకొన్న కుసంస్కారులైన ఎవరో కొందరు ఓట్ల కోసం తాము ఆడే అబద్ధాలు, వినిపించే కట్టుకథలతో అటువంటి తెలివైన ప్రజలను ఎన్నాళ్లో మభ్యపెట్టడమూ సాధ్యపడదు.
వాళ్ల పాపం పండింది కనుకే! మన దేశానికి స్వాతంత్య్రం, హైదరాబాద్ కు విమోచనం, ఆంధ్రప్రదేశ్ అవతరణల తర్వాత సుమారు అర్ధ శతాబ్ది (1947-1997)పాటు దాదాపు అందరు ఏలికలూ ‘తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి’ని నిర్లక్ష్యం చేశారు. (ఇప్పటికింకా భారతదేశంలోని అనేక రాష్ట్రాలు, ప్రాంతాలూ ఈ వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాయి). కొన్ని దశాబ్దాలుగా అయిదేండ్లకోసారి ఎన్నికలు వచ్చిపోతున్నా మహానాయకులు కన్న కలల మాట అటుంచి, మౌలిక వసతులకే తెలంగాణ నోచుకోకుండా పోయింది. పూడిక నిండిన చెరువులు, ఎండిన పొలాలను, కరెంటు కోతలు, బతుకు వలసలు. నిరుద్యోగులు, యువతరం, విద్యార్థుల భవిష్యత్తును కనీసం పట్టించుకొన్న పాపాన పోలేదు. తాతలు, ముత్తాతల కాలం నుంచి మనలను వాడుకొని వదిలేసిన వారు చేసిన పాపం ఊరికే పోతుందా?

రెండు దశాబ్దాల కిందట (2001) పుట్టిన తిరుగు లేని రాజకీయ ఉప్పలం నిజాయితీ, నిబద్ధత, నిఖార్సయిన ప్రజానాయకుడు కేసీఆర్ నాయకత్వంలో మహోద్యమంగా మారింది. ఎప్పటిలా తుస్సుమనక పోగా అసంతృప్తి సెగలను, ఆగ్రహ జ్వాలలను ఏళ్లు గడుస్తున్నా, ఎవరికి ఎంత కష్టం- నష్టం కలుగుతున్నా, ఎవరెన్ని కుట్రలు పన్నినా, అది అలా బుసలు కొట్టడం మానలేదు. చివరాఖరకు యావత్ తెలంగాణ ఒక్కటై, ఒంటికాలిపై నిలబడి ఘోషించిన రోజులు ఇప్పటికీ మనందరి కండ్ల ముందాడుతున్నాయి. ఆ దుర్దశ కాలం పోయి, కేంద్రంలోని పెద్దలు కనికరించే లోపు ఎందరో అమాయకులు తమ ప్రాణాలను సైతం ధార పోయవలసి రావడం అత్యంత దురదృష్టకరం.
ఎన్నో తిరుగు లేని విజయాలు రాష్ట్రమేదైనా, దేశమేదైనా రాజకీయ నాయకుల నుంచి, ప్రత్యేకించి ప్రజాప్రభుత్వాల నుంచి ప్రజలు కోరుకొనేది ప్రగతి రథాన్నే! తన అసాధారణ అవగాహన, ముందుచూపు, దార్శనికతలతో తెలంగాణ ప్రజలందరి హృదయాన్ని గెలిచిన మహా నాయకుడు కేసీఆర్ అనూహ్య రీతిలో ఉద్యమపార్టీని రాజకీయ శక్తిగా మలిచిన ఫలితమే ఇవాల్టి ఈ విషయాలన్నీ! ‘తెలంగాణలో మంత్రి, ముఖ్యమంత్రి కాదగిన ఉన్నత స్థాయి సమర్థులైన నాయకులెవరూ లేరు’ అని వేలెత్తి చూపిన వారి చేతులు పడి పోవడానికి ఎంతో కాలం పట్ట లేదు. 2014 జూన్ 2న అవతరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్ల (2014-2022)లోనే రాష్ట్ర ప్రగతిని నమ్మశక్యం కాని రీతిలో పరుగులు పెట్టించింది. అది ఎంత అమిత వేగమంటే, గడచిన 75 ఏండ్ల స్వాతంత్య్ర భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఏ రాష్ట్రమూ, చివరకు కేంద్రం సైతం సాధించనంత!
రాజకీయాలు, కులమత, వర్గ వాణిజ్య ప్రయోజనాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ గుండెలమీద చెయ్యి వేసుకొని ఆలోచిస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక విషయాలలో గత ప్రభుత్వాలకంటే ఎంత నయమో, ఘనమో బోధపడుతుంది. ఈ ఎనిమిదేళ్ల లోపలే కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు రాష్ట్రంలోని అన్ని రంగాలలోనూ కనీవినీ ఎరుగని ప్రగతిశీల మైలురాళ్లను అధిగమించింది. అనూహ్యంగా కొత్త విప్లవాత్మక ప్రగతి సుసాధ్యమైంది. యావత్ దేశమే కాదు, ప్రపంచమే విస్తుపోయే చారిత్రాత్మక అభివృద్ధి పనులు, సుదీర్ఘకాలంగా పెండిరగ్ లో వున్న మౌలిక వసతులు, పరిష్కారాలు అనేకం తెలంగాణ విజయాల ఖాతాలో పడ్డాయి.
సస్యశ్యామల రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ తెలంగాణ చిత్రమే అసాధారణ మార్పును ప్రదర్శిస్తున్నది. ఊళ్లకు ఎంతో దగ్గరైన జిల్లా కేంద్రాలు, గ్రామీణ రోడ్లతో ఒక్కటైన పల్లెలు, వీధివీధిన భగీరథ జలాలు, కాల్వల్లో పారే కాళేశ్వర జలాలు, నిండుకున్న చెరువులు, పచ్చబడ్డ పొలాలు, పెరిగిన భూముల ధరలు. ఒక్కమాటగా చెప్పాలంటే, మన తెలంగాణ సస్యశ్యామలం దిశగా వేగంగా పరుగులు పెడుతున్నది. విద్య, వైద్యం, కులవృత్తులు, కళ్యాణ కాంతులు. కనిపించని పైరవీలు, రారమ్మంటున్న పర్యాటక ప్రాంతాలు, కొలువుదీరిన కొత్త (డబుల్ బెడ్ రూమ్) ఇండ్లు, యాదాద్రి సహిత ఆధ్యాత్మిక వైభవం, రైతు వేదికలు, వైకుంఠ ధామాల నుంచి హైదరాబాద్ (రాజధాని) నడిబొడ్డున నిర్మాణమవుతున్న మహా సచివాలయం వరకు ప్రతీ ఒక్కటీ దేనికదే ప్రత్యేకం. అన్ని కులాల ప్రజలకు నేరుగా అందుతున్న విలక్షణ సౌకర్యాలు, సంక్షేమ బంధు నిధులు. ఎంత జరిగినా జరగాల్సింది ఇంకా వుంటుంది.
దేశం కోసం ‘మహా సంకల్పం’ మన సంకల్పం మంచిదైనప్పుడు కొందరు విసిరే రాళ్లకు, తగిలే గాయాలకు చలించకూడదు. ఎక్కువ మంది శ్రేయస్సుకోసం తక్కువ మంది చేసే అడ్డదిడ్డమైన విమర్శలను సైతం పక్కన పెట్టేయాల్సిందే. నిజమే, ఇది కలికాలం కనుక ప్రతి ఒక్కరి వల్లా ఏవో కొన్ని తెలిసో తెలియకో తప్పులు జరగడం సహజం. కొన్ని తప్పనిసరి’ తప్పులు కూడా వుంటాయి. పెద్ద పెద్ద పనుల కోసం చిన్నచిన్న సమస్యలూ రావచ్చు. కాకపోతే, ఒక్కటి మాత్రం నిజం, మన దృష్టి మంచిది కానప్పుడు అడుగడుగునా అన్నీ చెడ్డగానే కనబడతాయి.
నాటి నాగార్జున సాగరం నుంచి నేటి కాళేశ్వరం వరకు, అప్పటి మహానాయకుల నుంచి ఇప్పటి మంచి నాయకుల దాకా వున్నది ఒక్కటే ఎజెండా అది ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ మంది ప్రజలకు మేలు చేయడం! ఎనిమిదేళ్లలో ఎన్నో తిరుగు లేని విజయాలను సాధించిన కేసీఆర్ ఈ తొమ్మిదో ఏట, మన దేశం కోసం ‘మహా సంకల్పానికి వచ్చారు. అది ఎంత నిష్కల్మషమో ఆయన మాటలు పదేపదే చెబుతున్నాయి. ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలు తాము గతంలో చేసిన మంచి ఏదైనా వుంటే లేదా చేయబోయేది అయినా చెప్పాలి. అంతేకాని, చేసే వాళ్ల కాళ్లలో కట్టెలు పెట్టకూడదు. ఏ పార్టీ వారైతేనేం, తక్షణం తప్పుడు మాటలు కట్టి పెట్టి గొప్ప ఆలోచనలతో ప్రజల ముందుకు రావాలి. ప్రత్యర్థులను మించిన సమర్థత, నైపుణ్యాలను ప్రదర్శించాలి. అప్పుడే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు.