పచ్చదనంతోనే పరిపూర్ణత.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్
By: రాఘవ
పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ‘‘హరా హైతో భరా హై’’ అనే గొప్ప నినాదంతో 17 జూలై 2018న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారి, దాని లక్ష్యాన్ని చేరుకుంటున్నది.

సమాచారం విశ్వవ్యాప్తమవుతున్న గ్లోబల్ కమ్యూనికేషన్ యుగంలో ప్రతి వార్త, ప్రతి సంఘటన క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరుకుంటున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్‌ల పేరుతో నిర్వహించే కార్యక్రమా లెన్నో ఉన్నాయి. 10 ఇయర్స్ ఛాలెంజ్, బర్డ్ బాక్స్ ఛాలెంజ్, కికి ఛాలెంజ్, ఫ్లవ్ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ ఇలా మొదలుపెడితే చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సరదా కోసం, మరికొన్ని టైంపాస్ కోసం.. ఇందులో కొన్ని సామాజిక స్పృహ రగిలిస్తే, మరికొన్ని ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాయి. కొన్ని ఛాలెంజ్‌లు మూన్నాళ్ల ముచ్చటైతే.. ఇంకొన్ని నిరంతరం విస్తరిస్తూ మానవాళి సేవలో ముందుంటాయి. ఇదే కోవలోకి వచ్చే వినూత్న కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్. పచ్చదనంతోనే పరిపూర్ణత సాధ్యమవుతుందనే వాస్తవికతతో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేడు ఖండాంతరాలకు వ్యాపించి, పచ్చదన విప్లవమై ముందుకు సాగుతున్నది. ఒక వ్యక్తి మొక్కను నాటడంతో పాటు.. మరో ముగ్గురు వ్యక్తులను మొక్కలు నాటమని చెప్పడమే ఈ ఛాలెంజ్ లక్ష్యం. పుడమిపై పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్దేశ్యం. ఈ భూమిపై ఒక మనిషి మనుగడ సాగించాలంటే, కనీసం మూడు మొక్కలు అందించే ఆక్సిజన్ అవసరమవుతుందని శాస్త్రవేత్తల అంచనా. ఈ సూత్రీకరణతోనే గ్రీన్ ఇండియా లక్ష్యం పెట్టుకున్నది.
రోజురోజుకూ భూమిపై పచ్చదనం తరిగిపోతుండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటున్నది. ఫలితంగా మానవులతో పాటు సమస్త జీవకోటి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. వర్షాభావ పరిస్థితులు, అతి ఉష్ణోగ్రతలు, ఇతర పర్యావరణ సమస్యల నుంచి బతికి బయట పడాలంటే, భూభాగంలో కనీసం 33 శాతం పచ్చదనం ఉండి తీరాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం అటవీ భూమి ఉంది. అయితే ఈ భూభాగంలో కూడా వివిధ కారణాల వల్ల అడవులు క్షీణించాయి. 33 శాతం పచ్చదనం ఉండాలన్న లక్ష్యం నెరవేరాలంటే అటవీ భూము ల్లో వందకు వంద శాతం సమృద్ధిగా అడవులు ఉండడంతో పాటు, జనావాస ప్రాంతాల్లో కూడా విరివిగా చెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ‘‘నేను కూడా పర్యావరణ పరిరక్షణ కోసం నా వంతు కృషి చేయాలనుకున్న క్రమంలోనే ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’’ పుట్టింది’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్.




విశ్వనగరంగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అతి తక్కువ సమయంలోనే అన్నివర్గాల వారిని ఆకర్షిస్తున్నది. దీంతో సామాన్యులు మొదలు.. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులు, సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. వారు మూడు మొక్కలు నాటడమే గాకుండా, మరో మూడు మొక్కలు నాటాలని తమ సన్నిహితులకు ఛాలెంజ్ విసురుతున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కేవలం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పుట్టినరోజైన ఫిబ్రవరి 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ‘‘కోటి వృక్షార్చన’’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించడమేగాకుండా, విశ్వగురు వరల్డ్స్ లో స్థానం దక్కింది. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు సీఎం కేసీఆర్ రుద్రాక్ష మొక్కను నాటగా, ప్రకృతి ప్రేమికులు కోటి మొక్కలు నాటారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్, ప్రముఖ సినీ నటీనటులు చిరంజీవి సహా, షట్లర్లు క్రీడాకారులు సైనానెహ్వాల్, పివి సింధూ నుండి పుట్టినరోజు సందేశాలు వచ్చాయి. రాష్ట్ర మంత్రులందరూ ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. ఆ రోజున ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పయాంగ్ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు.
‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎప్పటికైనా మరింత పెరుగుతుంది. పర్యావరణాన్ని పెంపొందించడం, రక్షించడంలో భాగంగా మన చుట్టూ ఉన్న వారందరినీ ప్రోత్సహిస్తూనే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేసినందుకు సంతోష్ కుమార్, అతని బృందాన్ని నేను అభినందిస్తున్నాను.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘‘కేసీఆర్‌కి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా కోటి మొక్కలు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం, ఈ ఆలోచన తక్షణమే నచ్చగానే, నేను కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రజా ప్రతినిధులతో, వివిధరంగాల నిపుణులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారితో మాట్లాడాను. వారందరి భాగస్వామ్యంతో అది ఒక్కసారిగా విజయవంతమైంది. కోటి వృక్షార్చన విజయం మా హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేసింది’’ అని ఎంపీ సంతోష్ కుమార్ చెప్పారు.

అలాగే, మున్సిపల్, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కె.తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఎ స్మైల్ ఛాలెంజ్’ కింద 2,042 ఎకరాల కీసర రిజర్వ్ ఫారెస్టును ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్నారు. ఒక వ్యక్తి మొత్తం అడవినే దత్తత తీసుకొని, సంరక్షించడమనేది బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. ఎంపీ సంతోష్ అడవి సంరక్షణ బాధ్యతలు తీసుకునే సందర్భంగా చేసిన ప్రమాణం మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే ప్రముఖ సినీనటుడు బాహుబలి ప్రభాస్ 1,650 ఎకరాల కాజీపల్లి రిజర్వు ఫారెస్టును సంరక్షించడానికి ముందుకొచ్చారు. ముంబాపూర్ – నల్లవెల్లి రిజర్వు ఫారెస్టులోని 2,543 ఎకరాల్లో పర్యావరణాన్ని, పచ్చదనాన్ని కాపాడటానికి హెటెరో ఫార్మా అంగీకరించింది. ఇలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తన ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లను దాటింది.
పచ్చదనం పెంపు కోసం ఒక మొక్కతో ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం నేడు ఎందరికో స్ఫూర్తినిస్తున్నది. పచ్చదనం పరిఢవిల్లడానికి తోడ్పడుతున్నది. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు పచ్చదనం పెంపు కోసం ముందుకొస్తున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఎందరో ప్రముఖులను, జాతీయ నాయకులను, కేంద్ర మంత్రులను కలిశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటున్న ఫొటోలను, వీడియోలను, ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రతిస్పందనను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇలా ప్రతి సందర్భాన్ని సమయస్ఫూర్తిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం వినియోగిస్తూ, ఛాలెంజ్ లో ఎందరినో ఇందులో భాగస్వాములను చేశారు. దీంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనూహ్యంగా ఊపందుకున్నది.
2020 వేసవిలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్, బృందంలోని సభ్యులంతా లాక్‌డౌన్ రూపంలో అనూహ్యమైన సవాలును ఎదుర్కొన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు.. లాక్‌డౌన్ సమయంలో తమ పంటలను ఎలా అమ్ముకోవాలి అంటూ వారికి కాల్ చేశారు. బాల్యం నుంచే రైతులు, రైతు కూలీల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన ఎంపీ సంతోష్ కుమార్ రైతులకు సేవలందించడానికి చేపట్టాల్సిన కార్యాచరణలో మునిగిపోయారు. అలాగే, దేశంలో బత్తాయిని అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. లాక్ డౌన్ సమయంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, రోగ నిరోధకశక్తిని పెంచేందుకు బత్తాయిని కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్లు, వ్యక్తులు కూడా ముందుకొచ్చి 200 మెట్రిక్ టన్నుల బత్తాయిలను కొనుగోలు చేశారంటే.. ఆ రైతులకు, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చినట్లయింది. రైతాంగానికి అవసరమైన ఆహారాన్ని అందేలా ఎంపీ కార్యాలయం నుంచి ప్రయత్నాలు చేశారు. కరోనా నిరోధానికి పనిచేసిన ఫ్రంట్ లైన్ పారిశుధ్య ఉద్యోగులకు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టారు.

‘‘లాక్ డౌన్ మాకు చాలా విలువైన పాఠాలు నేర్పింది. లాక్ డౌన్ సమయంలో వాహనాల రాకపోకలు ఆగిపోయి, ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం బాగా తగ్గింది. అన్న వాతావరణ నిపుణుల నివేదికలు. కార్బన్ కారకాలను తగ్గించే, చెట్లు, నీరు, ఇతర సహజ వనరుల సంరక్షణ ప్రాముఖ్యతను నేర్పాయి. అయితే, ఇది ఒక్క రోజులో చేసే పని కాదు. ప్రతి ఒక్కరూ, ప్రతి నిమిషం జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉంది.’’ అని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.

మన ప్రాచీన గ్రంథాలు, వేదాల్లో పేర్కొన్న విశిష్టమైన మొక్కలు, చెట్ల ప్రాముఖ్యత, వాటిలోని ఔషధ, చికిత్సా గుణాలను వివరించే ‘‘వృక్ష వేదం’’ పుస్తకాన్ని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రూపొందించడం జరిగింది. ప్రాచీన గ్రంథాలు, వేదాల్లో రాయబడిన సమాచారం అంతా ఈ పుస్తకంలో సంకలనం చేసి, సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలుగులో అందంగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. చెట్లు, మొక్కలు, పరిశుభ్రమైన వాతావరమే మానవజాతి నిజమైన సంపద.. అని గొప్పగొప్ప సాధువులుఉల్లేఖించిన శ్లోకాలు మనకు ఆసక్తికరమైన జీవిత పాఠాలను వివరిస్తాయి.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎలా పాల్గొనాలి?
- మీరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగం కావాలనుకుంటే మీకు స్వాగతం –
- మీ ఇల్లు, పార్క్, బాల్కనీ లేదా మరేదైనా ప్రదేశంలో 3 మొక్కలు నాటండి. మీ సెల్ఫీ చిత్రాలను 90003 65000 సెల్ నంబకు వాట్సాప్ చేయండి. చిత్రాలను పంపిన వెంటనే, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని మీకు సందేశం వస్తుంది.
- దీన్ని డౌన్‌లోడ్ చేయండి, మీ సెల్ఫీలను అప్‌లోడ్ చేయండి. ఇంకేముంది? మేం దానిని మా అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తాం.. అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్ రెడ్డి చెప్పారు.
- అందుకే మీ కోసం, మనందరి కోసం, భవిష్యత్ తరాల కోసం మీరు ఒక మొక్కను నాటండి, దానిని సంరక్షించండి.
ఇటీవలికాలంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ముఖ్యాంశాలు
1. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఇంతింతై వటుడింతై అన్న విధంగా నాలుగో ఏట అడుగుపెట్టింది. 2021 జూలై 4న ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న తన 58వ పుట్టినరోజు సందర్భంగా ఒక గంటలో మిలియన్ మొక్కలు నాటే అపూర్వమైన భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
2. మహబూబ్‌నగర్ జిల్లా అంగన్‌వాడీ, మెప్మా, స్వయం సహాయక సంఘాల మహిళలు 10 రోజుల్లో 2.08 కోట్ల విత్తన బంతులను తయారు చేశారు. భారతదేశంలోనే అతిపెద్దదైన 2097 ఎకరాల కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో డ్రోన్ల సహాయంతో నాటారు. మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ నిర్వహించిన ఈ సీడ్ బాల్ ప్లాంటేషన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించగా, దాన్ని ఎంపీ సంతోష్ కుమార్‌కు అంకితం చేశారు.
3. జులై 24న టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.టి. రామారావు పుట్టినరోజు జిఐసిని నిర్వహించి, ఒకే రోజు 3 కోట్ల మొక్కలు నాటుతున్న ‘‘ముక్కోటివృక్షార్చన’’ విజయవంతంగా నిర్వహించబడిరది. రాష్ట్రవ్యాప్తంగా 3.30 కోట్ల మొక్కలు నాటడం ద్వారా ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువగా దీన్ని విజయవంతం చేశారు.
4. జూలై 27, 2021: బిగ్ బి అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటడం ద్వారా జీఐసిలో పాల్గొన్నారు. సంతోష్, జీఐసీ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
5. ఫిబ్రవరి 17, 2022: సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన తండ్రి దివంగత శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను అభివృద్ధి చేయడానికి సుమారు 1,100 ఎకరాలను చెంగిచెర్ల ఫారెస్ట్ బ్లాక్‌ను దత్తత తీసుకున్నారు.

