జమ్మివనం కానున్న తెలంగాణ

ఊరుఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు..

  • బందు శ్రీకాంత్‌ బాబు

తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో పెంచాలనే ఉద్దేశ్యంతో ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ ను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఆవిష్కరించారు. 

వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ఠ కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించింది. అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ తరపున ‘ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు’ నినాదాన్ని సంతోష్‌ కుమార్‌ తీసుకున్నారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమం మొదలవుతుందని బేగంపేటలో జరిగిన పోస్టర్‌ విడుదల సందర్భంగా ఎం.పీ ప్రకటించారు. ఇప్పటికే ఇరవై వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్ధం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమంలాగానే దీనిని కూడా విస్తృతంగా ప్రచారం చేయటంతో పాటు, ప్రతీ ఊరిలో-ప్రతీ గుడిలో జమ్మి వృక్షం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత తరానికి జమ్మి చెట్లు అంటే కేవలం దసరా రోజు మాత్రమే గుర్తుకు వస్తుందని, పురాణ కాలం నుంచి మన చరిత్రలో జమ్మికి ప్రాధాన్యత ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వేదకాలం నుంచీ నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో, గుడిలో, బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన ఎం.పీ సంతోష్‌ కుమార్‌ కు అభినందనలు తెలిపారు. తమవంతుగా ప్రతీ ప్రాంతంలో జమ్మి మొక్క నాటేలా, రక్షించి పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

జమ్మి చెట్టు ప్రాధాన్యత- పూర్తి వివరాలు
శమీ శమయతే పాపమ్‌ శమీ శత్రు వినాశినీ!

తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పు కోవచ్చు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా, ఔషధంగా ఎంతో ప్రాధాన్యం గలది. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. దసరా నాడు సాయంత్రం పాలపిట్టను చూడటానికి గుంపులు గుంపులుగా వెళతారు. ఇదే సందర్భంలో జమ్మి పూజ చేస్తారు. శమీ శమయతే పాపమ్‌ శమీ శత్రు వినాశినీ!/ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! అని చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. ఆ తరువాత బంధు మిత్రులకు జమ్మి ఆకులు చేతిలో పెట్టి నమస్కరిస్తుంటారు. కొందరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. ఒకరి కొకరు పలుకరించుకోని వారు కూడా దసరానాడు ఈ పచ్చని ఆకులను చేతిలో పెట్టి నమస్కరించుకొని విభేదాలు మరిచిపోతారు. జమ్మి తెలంగాణ ప్రజల్లో వెల్లివిరిసే సౌహార్దతకు ప్రతీక. 

శ్రీ రాముడు లంకపై యుద్ధానికి వెళ్ళే ముందు శమీ వృక్షాన్ని పూజించాడని చెబుతారు. పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి పెడతారు. తమకు విజయం సిద్ధించాలని జమ్మి చెట్టుకు పూజిస్తుంటారు. పలు రాష్ట్రాలలో జమ్మిని పూజించే సంప్రదాయం ఉన్నది. మైసూరు దసరా ఉత్సవాలలోనూ శమీ  వృక్షాన్ని పూజిస్తారు. జమ్మిని దుర్గామాత స్వరూపంగా కూడా భావిస్తారు. ఓమ్‌ ఇభవక్త్రాయ నమః, శమీ పత్రమ్‌ సమర్పయామి అంటూ విఘ్నేశ్వరుడికి శమీ పత్రాలను సమర్పిస్తారు. జమ్మిని పూజిస్తే శని పీడ విరగడవుతుందనే నమ్మకం కూడా ఉన్నది. నిప్పును పుట్టించడానికి శ్రేష్టమైనది కనుక దీనిని అగ్నిగర్భ అని కూడా అనేవారు. 

జమ్మి చెట్టు భారత ఉపఖండంలో, పశ్చిమాసియాలో పెరుగుతుంది. ఎంతటి కరువు కాలంలో అయినా తట్టుకొని నిలువడం ఈ చెట్టు ప్రత్యేకత. అందువల్ల ఈ చెట్లు ఉంటే కనీస హామీగా భావిస్తారు. కరువు కాలంలో పశువులకే కాకుండా, మనుషులకూ ఆహారంగా ఉపయోగపడుతుంది. ఔషధంగా కూడా ఉపయోగకరం. కొన్ని ప్రాంతాలలో ఈ చెట్టు నీడన గిరిజన పెద్దలు సమావేశాలు జరుపుకునేవారు. ఈ చెట్టు సగటు ఆయుర్దాయం 120 ఏండ్లు. వేర్లు ముప్ఫై మీటర్ల లోతు వరకు పోతాయి. ఏ మాత్రం తేమ లేని ఎడారి ప్రాంతాలలో కూడా ఈ చెట్టు తట్టుకుని నిలుస్తుంది. ఎడారుల్లో పెనుగాలులను నిలువరిస్తుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో జమ్మిని జాతీయ వృక్షంగా ప్రకటించారు. అక్కడ జమ్మి చెట్టును కొట్టివేస్తే నేరం. భూమి సారం కొట్టుకొని పోకుండా నిలుపుతుంది కనుక తోటల్లో ఈ చెట్లను నాటుకోవాలని ప్రజలకు పిలుపునిస్తుంది. 

బహ్రైన్‌లో దాదాపు 500 ఏండ్ల వయసున్న జమ్మి చెట్టు ఉన్నది. షరాజత్‌ అల్‌ హయత్‌ (జీవన వృక్షం) అనే పేరున్న ఈ చెట్టును చూడటానికి ఏటా దాదాపు 65 వేల మంది పర్యాటకులు వస్తుంటారు. 9.75మీటర్ల ఎత్తున ఈ చెట్టు వేర్లు  సుమారు యాభై మీటర్ల లోతు వరకు ఉన్నాయి. 2009లో ఈ చెట్టును ప్రపంచ ఏడు కొత్త ప్రకృతి వింతల జాబితాలో చేర్చారు. అరేబియా ఏడారిలో ఏ మాత్రం తేమ లేని నేలలో ఇది వేళ్ళూనుకొని పెరగడం ఒక పెద్ద వింత. చుట్టూరా ఒక నీటి చుక్క ఉండదు, ఒక్క గడ్డి పరక కూడా మొలవదు. అయినా ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ చెట్టుకు నీరు ఎలా వస్తుందనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయం. జమ్మిచెట్టు విశిష్టతకు ఈ జీవ వృక్షమే ప్రత్యక్ష ఉదాహరణ. 

జమ్మి చెట్టుకు ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి నాంది పలికిన ఘనత ఉన్నది. 1730లో మార్వాడ్‌ (రాజస్థాన్‌) రాజు తన రాజభవనం నిర్మాణంలో రాళ్ళ మధ్య బంక వాడటం కోసం చెట్లు కొట్టుకు రమ్మని ఆదేశించారు. ఎడారిలో దట్టంగా ఉన్న జమ్మి చెట్లు ఉన్న ఖేజాడ్లీ గ్రామం దగ్గరికి రాజభటులు వచ్చారు. అన్ని కాలాలలో తమకు ప్రాణం నిలిపే చెట్లను నరుకుతున్నారని తెలిసిన అమృతాదేవి అక్కడకు వెళ్ళి అడ్డుకున్నది. జమ్మి చెట్టును కౌగలించుకొని సర్‌ సాంటే రుఖ్‌ రహో తో భీ సస్తో జాణ్‌ (చెట్టును కాపాడ టానికి తలనైనా పణంగా పెట్టవచ్చు) అని నినదించింది. రాజభటుల గొడ్డలి దెబ్బకు ఆమె తల తెగిపడిరది. ఆమె ముగ్గురు బిడ్డలు ఆసు, రత్ని, భాగుబాయి కూడా చెట్లను అలుముకున్నారు. వారి ముగ్గురి తలలు తెగిపడ్డాయి. 

ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల బిష్ణోయి తెగవారంతా దండులా కదిలివచ్చారు. జమ్మి చెట్ల రక్షణకు వాటిని అలుముకున్నారు. వృద్ధులు, మహిళలు, నవ దంపతులు, పిల్లలు అనే తేడా లేకుండా చెట్లను హత్తుకున్నారు. 363 తలలు తెగిపడ్డాయి. కర్కశ రాజభటుల హృదయం చలించింది. వారికి తలలు నరకడానికి చేతులాడలేదు. వెనుదిరిగిపోయి రాజుకు వివరించారు. వెంటనే రాజు చెట్లను నరకడాన్ని నిలిపివేయించాడు. చిప్కో అంటే హత్తుకోవడం. చెట్లను హత్తుకోవడమనే ఈ ఉద్యమం 1973లో ఉత్తరాఖండ్‌లో సాగింది. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో మహిళలే ప్రధాన పాత్ర వహించారు. ఈ ఉద్యమం ప్రపంచపర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైంది. ఇప్పటికీ రాజస్థాన్‌లో జమ్మి చెట్టుకు ప్రాధాన్యం ఉన్నది. జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనాన్ని పెంచుతున్నారు. ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వాములం అవుదాం. మొక్కలు నాటుదాం. మన పిల్లలకు నివాస యోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అప్పగిద్దాం.