హరిత విజ్ఞాన వేదం!

By: ఎం. నారాయణ శర్మ

‘వృక్షవేదం’ చెట్లకు సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన సాహిత్య సంకలనం. భారతీయ సాహిత్యం ప్రకృతి ప్రేమకు, విజ్ఞానానికి, రక్షణకు, ఉపయోగాలకు సంబంధించిన అనేక విషయాలను ప్రోదిచెసి ఉంచింది. అందులోని కొన్ని రత్నాల అన్వేషణా ఫలితం ‘వృక్షవేదం’. ‘గ్రీన్‌ ఛాలెంజ్‌ కోసం’ ఎం.పి. సంతోష్‌ కుమార్‌ ఆలోచన మేరకు ప్రాచీన భారతీయ భాషలలో ప్రధానంగా ప్రాకృతం, సంస్కృతం మొదలైన భాషల్లోని కవిత్వంలో చెట్లకు సంబంధించిన ప్రస్తావనలను దేశపతి శ్రీనివాస్‌ సంపాదకులుగా సంకలనం చేశాం. ఈ శ్లోకాల సేకరణకు సంబంధించిన పరిశోధనబాధ్యత నేను తీసుకున్నాను.

వేదం అనే పదానికి ‘‘విదంతి ప్రాప్నువంతి జ్ఞానం ధర్మం చానేన’’ – (దేనివలన ధర్మాన్ని తెలుసుకుంటున్నమో, జ్ఞానం పొందుతున్నామో అది వేదం) వృక్షవేదం అనడం వల్ల వృక్షాలవల్ల తెలుసుకున్న జ్ఞానం, పొందిన జ్ఞాన ధర్మం అని అర్థం. ప్రకృతిని ఎలా ప్రేమించాలో పరోపకారంకోసం ఎలా జీవించాలో చెట్లు చెబుతాయి. అలాంటి విషయాలను ఇందులో చేర్చాను. ప్రాచీన సాహిత్యం ప్రధానంగా సంస్కృతాన్ని ఇష్టంగా చదవడంవల్ల, అనేక సార్లు చెట్లను కావ్యాల్లో ఉదహరించిన తీరు, వర్ణన, వాటి ఉపయోగాలు సౌందర్యం చాలా ఆకర్షించేది. గొప్పభావాన్ని వ్యక్తం చేసే ప్రతి శ్లోకం వేరుగా ధారణలో నిలుస్తుంది. బహుశః సంస్కృతభాషా సాహిత్యానికున్న ప్రత్యేకత కావొచ్చు. అందువల్ల చెట్లను గురించిన శ్లోకాలను సంకలనం చేయడానికి పెద్దగా కష్టపడలేదనే చెప్పాలి. కాని ఈ శ్లోకాలను ఒక చోట చేర్చిన తరువాత కొంత ఆశ్చర్యం కలిగింది. పూర్వీకులు చెట్లను గురించి చేసిన ఆలోచనలు, వాళ్లకున్న విజ్ఞానం. అందులోని రకాలను అంటే పొదలు, తీగలు, వృక్షాలు, మొక్కలు, కాయలు కాచేవి, కాయనివి ఇలా చాలావాటిని ప్రాచీనులు వేరువేరుగా గమనించారు. ఇలాంటి విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.

ప్రాకృతం సంస్కృతానికన్నా ప్రాచీన భాష అనే చెప్పాలి, చాలా మంది పండితుల నమ్మకం కూడా అది. గాథా సప్తశతి లాంటి వాటిలో ఋతువులను, ఆ క్రమంలో చెట్లు వాటికుండే రకరకాల స్థితులు, వాటిపట్ల ఆ కాలపు వాళ్లకుండే ఎరుక. ఇవన్నీ గొప్పగా కనిపిస్తాయి. ఈ  సంకలనంలో విజ్ఞానమే కాకుండా సౌందర్యం, ఉనికి మానవుణ్ణి ఎంత ఆనంద వివశుణ్ణి చేస్తాయో కూడా చెప్పేందుకు కొన్ని శ్లోకాలను ఏర్చి కూర్చాను. నిజానికి ఇంకా అనేక శ్లోకాలు లభించాయి. కాని ఒకే కవివి, ఒకే కావ్యంలోనివి అనే ఆలోచనతో కొన్నిటిని మాత్రమే ఇందులో చేర్చాము. అన్నిటినీ ఎత్తిరాస్తే ఒక బృహద్గ్రంథమే తయార వుతుంది. ఇంకా తెలుగులో ఇతర భారతీయ భాషల్లోనూ ఇలాంటివి ఎన్నో లభిస్తాయి. వాటన్నిటినీ చేసే ప్రయత్నం లోనూ ఉన్నాం. వృక్షవేదం అన్నందుకు ఇందులో వేదకాలానికి సంబంధించిన వాక్యాలతోనే సంకలనాన్ని ప్రారంభించాం. ఫోటోలు ఈ శ్లోకాల సౌందర్యాన్ని మరింత పెంచాయి. ఈ సంకలనంలో నన్ను భాగం చేసినందుకు మిత్రులు దేశపతి శ్రీనివాస్‌కి కృతజ్ఞుణ్ణి.

కోటి వృక్షార్చన

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 68వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో కోటి వృక్షార్చన జరిగింది. హరిత అభిమాని అయిన సీఎంకు పుట్టినరోజు కానుకగా రాష్ట్రంలోని మంత్రులు, ప్రముఖులు, ప్రజలు ఒక్క గంటలో కోటి వృక్షాలను నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పుట్టినరోజు సందర్భంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ మొక్కను నాటే కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు నాడు కోటివృక్షార్చన జరపాలని పిలుపునిచ్చిన సందర్భంగా దాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎం.పి. సంతోష్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి ముప్ప వరపు వెంకయ్యనాయుడుతో సహా పలువురు ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల్లో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, సదా నంద గౌడ, అర్జున్‌ ముండా తదితరులు, ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌, కర్ణాటక సీఎం బి.ఎస్‌. యడ్యూరప్ప, తమిళనాడు సీఎం పళనిస్వామి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ, అభిమానాలు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. సీఎం పుట్టిన రోజున ఆయన అభిమానులు రాష్ట్రంలో పలు ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు జరిగాయి. సీఎం అభిమానులు బల్కంపేట ఎల్లమ్మకు రెండున్నర కిలోల బంగారు చీరను బహూకరించారు. యాదాద్రి లక్ష్మినరసింహ్మ స్వామి ఆలయంలో అర్చకులు సుదర్శనారసింహ మహాయాగం నిర్వహించారు. భాగ్యనగరంలోని జలవిహార్‌లో సీఎంకు 67 సంవత్సరాలు నిండి నందున 67 కిలోల కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపు కున్నారు. ముఖ్యమంత్రి జీవితచరిత్రపై త్రీడీ డాక్యు మెంటరీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏపీలోను వేడుకలు

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుక లను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అభిమానులు జరుపుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూల మొక్కలతో కేసీఆర్‌ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్‌ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా  శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు.