|

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సిఎం దిశానిర్దేశం

cmతెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియను కేవలం జిల్లాల విభజనే కాదని, మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాల్సి వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం ప్రధాన లక్ష్యంగా చేపట్టిన జిల్లాల, మండలాల పునర్విభజన క్రమంలో కొనసాగుతున్న కసరత్తు, పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జూన్‌ 8న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన రెండవరోజు జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గత కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కార్యాచరణ ఎంత వరకు వచ్చిందో ఆరా తీశారు.

పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ”దైవ కృపవల్ల అనుకున్న దానికంటే ఎక్కవగానే తెలంగాణలో అభివృద్ది సూచి కనిపిస్తున్నది. కాలం ఇదే విధంగా ప్రజలకు అనుకూలంగా కలిసివస్తే ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2019-20 వరకు బడ్జెట్‌ అంచనా రెండు లక్షల కోట్లకు చేరుకుంటది. ఐదేండ్లకు సహజంగా రెట్టింపు అయితది. అంటే నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటది. అయితే అంచనాలకు మించి మరో లక్ష కోట్లు జమయి 2024 వరకు ఐదు లక్షల కోట్లకు తెలంగాణ బడ్జెట్‌ అంచనా వ్యయం చేరుకుంటది” అని వివరించారు.

తెలంగాణ అభివృద్ధి చక్రవడ్డీ మాదిరి రెట్టింపు అవుతూ అభివృద్ధి వేగం పెరుగుతూ వుంటుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పెరిగే అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో వుంచుకుని పాలనా ఫలాలు ప్రజలకు క్షేత్ర స్థాయిలోకి చేరుకునేలా ప్రణాళికలు రచించడమే ప్రజా ప్రభుత్వం మీదున్న బాధ్యతగా సిఎం అభివర్ణించారు. పరిపాలన ప్రజలకు మరింత చేరువలో వచ్చినప్పుడే అభివృద్ది? ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజన అందులో భాగమేనని సిఎం పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం తాగునీరు, సాగునీరు పునరుద్ధరణే లక్ష్యంగా కొనసాగుతున్న అభివృది? సంక్షేమ కార్యక్రమాలు కొద్ది కాలంలోనే పూర్తవుతాయని పేర్కొన్న సిఎం తదనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఇప్పటినుంచే రూపకల్పన చేయాలన్నారు. ”2024 కల్లా ఐదు లక్షల కోట్లతో ఎంతో రిచ్‌ గా ఉంటాం. మరి ఆ రిసోర్సులన్ని ఎటుపోవాలె? తాగునీరు, సాగునీరు మీద యుద్ధం అయిపోతే తర్వాత పేదరికం కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఇబీసీల్లో ఉన్న ఒక్కొక్క పేద కుటుంబాన్ని టార్గెట్‌ చేసి అభివృది? చేస్తం” అని సిఎం తెలిపారు.

కొత్తగా ఏర్పాటు చేయవలసిన మండలాల గురించి కలెక్టర్లు ఇప్పటిదాక చేసిన కసరత్తును ఒక్కో జిల్లా కలెక్టర్‌ నుంచి ఆరా తీశారు. ఆయా మండలాల్లో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా వున్నాయి. వారితో మాట్లాడిండ్రా? స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించిండ్రా? అని సిఎం కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

మండల కేంద్రానికి దూరంగా వున్న గ్రామాలను గుర్తించి దగ్గరలో వున్న మండల కేంద్రానికి కలిపే సందర్భంలో ప్రజాభిప్రాయం ముఖ్యమన్నారు. ప్రస్తుత జిల్లా నుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క నియోజక వర్గం ఒకటికి మించి జిల్లాలో విస్తరించి ఉందా? ఉంటే ఎట్లా ఉన్నది? అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏమిటి? అన్నీ సమీక్షించాలన్నారు. ఇవన్నీ సమీక్షించిన తరువాత పూర్తి స్థాయి మండలాల సంఖ్య అంచనా వేయడానికి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.

”మీరు మీ కసరత్తు పూర్తి చేయండి. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కూర్చుని చర్చించండి. ఓ ఐడియాకు రండ్రి. ఆ తర్వాత అభ్యంతరాల కోసం ప్రజా ప్రకటన ఇద్దాం. ఆతర్వాత చివరిగా నోటిఫికేషన్‌ జారీ అయితది.” అని అన్నారు.

సుమారు 50 వేల నుంచి 60 వేల జనాభా వుండే ఒక మండలం ఏర్పాటు, సుమారు 20 మండలాలతో జిల్లా ఏర్పాటు, సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్‌ మండలాల ఏర్పాటు, ఒక రెవిన్యూ డివిజన్‌ పరిధిలో 10 నుంచి 12 మండలాలు, రెండు అసెంబ్లి సెగ్మెంట్లు, ఒక అసెంబ్లి సెగ్మెంటుకు 5 నుంచి 6 మండలాలు వుండే విధంగా కసరత్తు చేయాలన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

  • ప్రస్తుతమున్న నియోజకవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని కసరత్తు చేయనవసరంలేదు.
  • బలవంతంగా తమను ఇతర మండలంలో కలిపారన్న భావన ప్రజలకు రాకుండా చూడాలి.
  • ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నం కనుక ఆయా గ్రామాలను వివిధ మండలాలలో కలుపుతున్న, తీసివేస్తున్న సందర్భాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుంది.
  • పెద్ద మండలాలను రెండుగా చేసే అంశాలను పరిశీలించాలి.
  • ప్రజల అవసరాలు, సెంటిమెంట్లను సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకోవాలి.
  • వ్యక్తుల అభిప్రాయాలు, రాజకీయ కోణంలో కాకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలుండాలి.

మారుతున్న కాలంతో మారుతూ అభివృద్ధిని అందుకోవాలని, లేకుంటే తెలంగాణ ప్రగతి సాధ్యం కాదని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్నచిన్న దేశాలు, వాటిలో జిల్లాలను, పరిపాలనా కేంద్రాలను ఉదహరించారు.

తెలంగాణలో మరికొద్ది సంవత్సరాల్లో ఊహించనంత అభివృద్ధి జరుగబోతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ”హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ను భవిష్యత్‌ లో హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షించే పరిస్థితులు వస్తాయి. మీరిట్లనే ఉండిపోతరని ఎందుకు అనుకుంటరు” అని అన్నారు.

సమావేశంలో పది జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అనేక డిమాండ్లపై చర్చ జరిగింది. సాధ్యా సాధ్యాలను పరిశీలించి వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని సిఎం సూచించారు.

సాదాబైనామాల క్రమబద్ధ్దీకరణ, రిజిస్ట్రేషన్ల అంశంలో కూడా సమావేశంలో చర్చించారు. గతంలో జరిగిన సమీక్షను దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి వత్తిడిలకు లోను కాకుండా పురోగతి సాధించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటి సిఎంలు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, చీఫ్‌ సెక్రెటరి రాజీవ్‌ శర్మ, ప్రిన్సిపల్‌ సెక్రటరి నర్సింగ్‌ రావు, సిసిఎల్‌ఎ రేమండ్‌ పీటర్‌, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, సిఎంవో అధికారులు భూపాల్‌ రెడ్డి, స్మితా సబర్వాల్‌, ప్రియాంకవర్గీస్‌, పది జిల్లాల కలెక్టర్లు, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌ రెడ్డి పలువురు పాల్గొన్నారు.