జాతీయ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్న గురుకుల విద్యార్థులు

తెలంగాణలోని గురుకుల విద్యార్థులు పోటీ పరీక్షల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎంబీబీఎస్‌ తదితర జాతీయ ప్రవేశ పరీక్షల్లో సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి విద్యార్థులు ఎంపికవుతున్నారు. గత ఏడాది తెలంగాణ గురుకులాల నుంచి 80 మంది పోటీపరీక్షల్లో ఎంపిక కాగా ఈ సంవత్సరం 135  మంది విద్యార్థులు సీట్లు సంపాదించుకున్నారు. టాపర్లందరూ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే కావడం, వారు గురుకులాల్లో చదివి తన ప్రతిభకు పదనుపెట్టి గొప్ప గొప్ప కార్పోరేట్‌ కళాశాల విద్యార్థులతో పోటీపడి సీట్లు సంపాదించడం గురుకులాలలో విద్యార్థు లకు చక్కని బోధన లభిస్తుందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నది.

ఈ సందర్భంగా గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న షెడ్యూల్ట్‌ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ రాష్ట్రం సాధిస్తున్న విద్యారంగ ప్రగతిని చూసి దేశమే అబ్బురపడుతున్నదన్నారు. గురుకులాల్లో నాణ్యమైన ఇంగ్లీష్‌ విద్యను అందించడం వల్లనే జాతీయ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల ఛైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ దేశంలోనే అతి కష్టమైన ఐఐటీ,నీట్‌ పరీక్షల్లో సీట్లు సాధించడం అసాధారణ విషయమని విద్యార్థులను ప్రశంసించారు. కార్య క్రమంలో అదనపు కార్య దర్శి  ఉమాదేవి, ఆర్‌సీవో డాక్టర్‌ శారద తదితరులు పాల్గొన్నారు.