హరహర మహాదేవ..

హరహర-మహాదేవ..21

గౌరీప్రియాయ రజనీశకళాధరాయ – కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ – దారిద్య్రదు:ఖ దహనాయ నమశ్శివాయ

ఎవరికి ఏ కష్టంవచ్చినా ప్రార్థించేది ఆ పరమశివుణ్ణే. అన్ని జీవరాసులకు ప్రాణభూతమైన ఆ పరమేశ్వరుణ్ణి ‘శివుడు’ అనడానికి కారణం ఆయన లోకాలన్నింటికీ మంగళాలను ప్రసాదించేవాడు. అందుకనే ఆ మంగళమూర్తిని ‘శివ’ నామంతో స్మరిస్తుంటాం.

సృష్టిలోని చరాచర ప్రపంచానికంతా మంగళప్రదుడైన ఆ శివునికి సంబంధించిన పర్వదినాన్ని ‘శివరాత్రి’ పర్వదినంగా మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటుంటాం. ప్రతి నెలా కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య ముందటి చతుర్దశిని ‘మాస శివరాత్రి’గా భావించే మనం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం ‘మహా శివరాత్రి’గా సంభావించి స్వామిని సేవించుకోవడం ఆనవాయితి. లోకంలోని శివాలయాలన్నీ శివరాత్రి పర్వదినంనాడు భక్తులతో క్రిక్కిరిసి ఉండటానికి ప్రధాన కారణం శివభక్తి.

శివభక్తులకు ప్రధాన పర్వదినం ‘మహాశివరాత్రి’. భారతదేశంలోని ప్రధానమైన పండుగల్లో శివరాత్రికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మాఘబహుళ చతుర్దశి రోజున పరమశివుని రూపమైన లింగం ఉద్భవించిదన్నది భారతీయుల విశ్వాసం. శివుని జన్మనక్షత్రమైన ‘ఆరుద్ర’తో చంద్రుడు కూడి ఉన్న రోజుగా దీన్ని గుర్తించారు.
శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన యీ మహాశివరాత్రినాడు భక్తులు ఉదయాన్నే నిద్రలేచి, స్నానాది కాలకృత్యాలు తీర్చుకొని ఆ రోజంతా నిరాహారులై ‘ఉపవాసం’ చేస్తూ స్వామివారి సమీపస్థులై రాత్రంతా ‘జాగారం’ పేర నిద్రపోకుండా మేల్కొని శివసంబంధ భజనలను, శివకథా శ్రవణంచేస్తూ, శివాభిషేకలూ, శివ పూజలతో గడిపి తమ భక్తి ప్రపత్తుల సహకారంతో, అచంచలమైన భగవద్విశ్వాసంతో స్వామి సేవలో పునీతులవుతారు.

దేశంలోని అన్ని దేవాలయాల్లోనూ ఈ శివరాత్రి మహోత్సవాలు సకలవైభవాల సమాహారంగా, సంపూర్ణ భక్తి పారవశ్య పారమ్యంగా సాగిపోతుంటాయి. మహాకవి పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్ర వంటి మహాగ్రంథాలు దీనికి సాక్ష్యాలు. శివభక్తులు శివరాత్రి నాడు సిద్ధం చేసిన భస్మం (విభూతి) పరమ పవిత్రంగా భావిస్తారు.

శివపురాణాంతరతమైన ‘విద్యేశ్వర సంహిత’ శివరాత్రి మహాత్యాన్ని గురించి సూతమహాముని సత్రయాగం చేస్తున్న ముని సత్తములకు వివరించినట్లు తెలిపింది. పరమశివుని గురించిన ప్రసక్తిని, ఆ శివుని వాహనమైన నందికేశ్వరునికి బ్రహ్మపుత్రుడైన సనత్కుమారునికి జరిగిన సంభాషణను ఆ సనత్కుమారుడు వేదవ్యాస మహర్షికి విపులీకరించాడు. ఆ పరమేశ్వరుని వృత్తాంతం శివుని మహత్తును విస్తృతంగా చెబుతున్నది.

బ్రహ్మ, విష్ణువులకు జరిగిన యుద్ధం, బ్రహ్మను శిక్షించడం, బ్రహ్మకు వరాలను ప్రసాదించడం, కామధేనువు, మొగలిపూవువంటి వాటికి ఇచ్చిన శాపాల విషయాలతోపాటు ఈ విద్యేశ్వర సంహిత మహాశివరాత్రి వ్రతకథను గూడా విశదంగా వివరించింది. ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తూ పరమశివుడే కైలాసశిఖరంపై పార్వతీ సమేతుడై ఉన్నప్పుడు ఆ తల్లి ప్రశ్నకు సమాధానంగా వివరించాడు. ఇందులో మొదటిజాములో, రెండవజాములో, మూడో జాములో జరిగిన నాలుగు జింకలు, ఒక కిరాతుని కథను వివరించి సూర్యోదయ సమయందాకా ఎదురుచూచిన కిరాతుడు తనకు తెలియకుండానే శివరాత్రి జాగరణ చేయటంవల్ల కలిగిన పుణ్యం, దాని ఫలితాలను ఈ కథ విపులంగా చెప్పింది.

ఈ వృత్తాంతాలతోబాటు శివరాత్రి పూజావిధానాలు, రుద్రాభిషేక వివరాలు, విశిష్టతలు, పంచాక్షరీ మంత్రమైన ‘నమశ్శివాయ’ (న, మ, శి, వా, య) ప్రాశస్త్యం, మృత్యుంజయ మహామంత్ర వైశిష్ట్యం (ఓం త్య్రంబకం యజామహే సుగంధిం, పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయ మామృతాత్‌), శివ సహస్త్ర నామస్త్రోత్రం వంటి పలు అంశాలు ఇందులో మనకు దర్శనమిచ్చి ఆ పరమ శివుని దర్శించుకోగలిగే మార్గాన్ని సుగమం చేస్తుంది. సర్వకాల సర్వావస్థల్లో లోక కల్యాణం కలిగించే ఆ మహాదేవుని శివరాత్రి పర్వదినాన సేవించుకునే అదృష్టాన్ని ‘శివపురాణం’ కలిగిస్తుంది.

మనదేశంలో అడుగడుగున ఆ స్వామికై నిర్మించిన శివాలయాలు కొల్లలు. కాశ్మీరంనుండి కన్యాకుమారివరకు ఉన్న ఈ వేదభూమిలో వెలసిన ‘ద్వాదశ జ్యోతిర్లింగ’ క్షేత్రాలు మనకు శివభక్తిని రెండిరతలుగా చేయడంతోబాటు ఆసేతు శీతాచలం దర్శించే గొప్ప జాతీయ చైతన్యాన్ని కూడా కలిగిస్తాయి.

మన తెలంగాణా రాష్ట్రంకూడా పలు శివక్షేత్రాలకు నెలవు. శివరాత్రి సందర్భంగా మనకు అందుబాటులో ఉన్న శైవ క్షేత్రాల దర్శనం పుణ్యప్రదం. ఆ వివరాలను గురించి మనం తెలుసుకోవడం, ఆ శివుణ్ణి తెలుసుకోవడమే.
‘పుణ్యగుణ భూమ యీ తెలంగాణ సీమ’ అని ఒక కవీశ్వరుడన్నట్లు తెలంగాణా నేలపై అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. అనేక రాజవంశాలపాలన కొనసాగిన తెలంగాణ భూభాగంపై పలుదేవాలయాల నిర్మాణం కొనసాగి దైవ సన్నిధానాల సంఖ్య పెరిగింది.

పదిజిల్లాల్లోనూ అనేక శివాలయాలు మనం దర్శించు కోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణాలోని అనేక శివుని ఆలయాలు పవిత్రమైన శివనామంతో హోరెత్తిపో తుంటాయి. సర్వపాపహారమైన శివనా మస్మరణ లోకాన్ని పావనంచేసే మూల మంత్రంగా గుర్తించిన నాటి కాకతీయుల నుండి నేటివరకు ఆలయ నిర్మాణాలు, ప్రతిష్ఠలు జరుగుతూనే ఉండడం తెలం గాణా చేసుకున్న అదృష్టం.

పది జిల్లాల్లో ప్రధానంగా చెప్పుకోవ లసింది వరంగల్లు జిల్లా. ఒకనాటి తెలుగునేలను సర్వంసహాధిపత్యంతో పాలించిన పాలకులైన కాకతీయులకు రాజధాని నాటి ఓరుగల్లే నేటి వరంగల్లు.

త్రిలింగ దేశంగా పేరెన్నికగన్న తెలుగునేలపై ఉన్న మూడు ప్రధాన శివక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వరం తెలంగాణా భూమిలో ఒక భాగం. ఆరు మతాల్లో ఒకటిగా లోకంలో వ్యాప్తిచెందిన శైవానికి కాకతీయ రాజ్యం ఆటపట్టైంది. కాకతీయులు శైవమతాన్ని విశేషంగా ఆదరించారు కనుకనే పలు శివాలయాలు ఈ నేలలో చోటు చేసుకున్నాయి. కాకతీయుల గురువుగా ప్రసిద్ధుడైన ‘విశ్వేశ్వర శంభువు’తోపాటు మరికొందరు మాన్యులు కాకతీయ రాజ్యంలో శైవమతానికి పెద్ద పీటవేశారు.

కాకతీయుల కాలంనాడు దాదాపు ఐదువేలకుపైగా శివాలయాలున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు మనకు ప్రధానంగా కనిపిస్తున్న వేయిస్తంభాలగుడి, రామప్ప దేవాలయం, స్వయంభూదేవాలయాలతో బాటు, కొడవటూరులోని సిద్ధేశ్వరాలయం, కొమరవెల్లిలోని మల్లికార్జునస్వామి ఆలయం, అయినవోలులోని మల్లికార్జునాలయం, పాలకుర్తిలోని సోమేశ్వరస్వామి ఆలయం, హనుమకొండలోని సిద్ధేశ్వరాలయంవంటి పలు ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి.

రామప్ప దేవాలయం వరంగల్లు జిల్లా పాలంపేటలో ఉన్నది. కాకతీయ గణపతి దేవచక్రవర్తి దగ్గర సేనానిగా ఉన్న రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని 1213 ప్రాంతంలో శ్రీముఖనామ సంవత్సరం చైత్ర శుద్ధ అష్టమి, ఆదివారంనాడు పుష్యమీ నక్షత్రం ఉన్న సమయంలో ఇక్కడ లింగ ప్రతిష్ఠ జరిగినట్లు తెలుస్తున్నది. అపురూప శిల్పకళావైభవంతో నేటికీ ఒక ప్రత్యేక దర్శనీయ స్థలమై వెలుగొందుతున్న రామప్ప దేవాలయం వరంగల్లుకేకాదు యావత్తు తెలంగాణాకు తలమానికమైన ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇక్కడి రామప్ప చెఱువు, ఇక్కడి ‘నాగిని’ శిల్పులు నాటివారి దూరదృష్టికి గొప్ప నిదర్శనాలు.

కాకతీయుల కాలంనాటి మరో ప్రసిద్ధ దేవాలయం వేయిస్తంభాలగుడి`దీన్నే రుద్రేశ్వరస్వామి ఆలయంగా వ్యవహరిస్తారు. ఇది త్రికూటాలయం. వేయిస్తంభాల మంటపంతో కూడిన ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుని రూపం అపురూపం. ఎత్తైన పానవట్టంపై ఎత్తైన లింగాకారంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటాడు. మహాశివరాత్రి పర్వదినం పరమవైభవంగా సాగే యీ ఆలయంలో ‘నంది’ కాకతీయులకు ఒక ప్రత్యేకతను సంతరించిపెట్టింది.

ఇంకా కోటలో కాకతీయుల కళాతోరణాల దగ్గర కొలువై ఉన్న ఈ స్వయంభూ దేవుడు, సిద్ధేశ్వర గుట్టపై వెలిసిన సిద్ధేశ్వరస్వామి వంటి పలు శివాలయాలు మనకు వరంగల్లులో దర్శనమిస్తాయి. జిల్లా వ్యాప్తంగా అనేక శివాలయాలు నేటికీ శివభక్తుల నిలయాలై విరాజిల్లుతున్నాయి.

కరీంనగర్‌ జిల్లాలో ‘వేములవాడ రాజరాజేశ్వరస్వామి’ ఆలయం సుప్రసిద్ధం. అదేవిధంగా కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామి ఆలయం కూడా మిక్కిలి పేరుగాంచిన క్షేత్రం… ఇవిగాక ఓదెలలో మల్లికార్జునస్వామివంటి మరికొన్ని శైవక్షేత్రాలు యీ జిల్లాలో ఉన్నాయి. మనం ఇంతకుపూర్వం చెప్పుకున్నట్టుగా త్రిలింగాలలో ఒకటైన కాళేశ్వరం పవిత్ర గోదావరితీరంలో వెలసిన దివ్యశైవక్షేత్రం విశాలమైన ప్రాంగణం కలిగి ఉన్న ఈ దేవాలయంలో కాళేశ్వరస్వామి, ముక్తేశ్వరస్వామి ఇరువురు ఒకే పానవట్టంపై వెలసి భక్తులకు అభయ ప్రదానం చేస్తుండటం విశేషం. ఈ ప్రాంగణంలోకి ఇతర పరివార దేవతల ఆలయాలు కూడా విశేషంగా ఆకర్షిస్తాయి. మహాశివరాత్రి పర్వదినంనాడు భక్తులు అశేష సంఖ్యలో ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానంచేసి స్వామిని సేవించి పునీతులవుతుంటారు.

కరీంనగర్‌జిల్లాలోని మరో ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడలో వెలసిన ‘శ్రీ రాజరాజేశ్వరస్వామి’ ఆలయం. అనేకమైన ప్రాంతాలనుండి దూరాలను లెక్కజేయకుండా భక్తులు స్వామిని సేవించి ఆయన కృపకు పాత్రులై తరిస్తుంటారు. కోడె మొక్కులు, తలనీలాల సమర్పణవంటి ప్రత్యేకతలున్న ఈ ఆలయ పరిసరాల్లో భీమేశ్వరస్వామి ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం వంటి పలు దేవాలయాలు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. మహాశివరాత్రి పరమ వైభవోపేతంగా ఇక్కడ నిర్వహింపబడుతుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపురంలోని ‘బాల బ్రహ్మేశ్వరాలయం’ పుణ్యప్రదమైన శైవక్షేత్రం. అద్భుత శిల్ప నిర్మాణ సమన్వితమైన తొమ్మిది ఆలయాలు ‘నవబ్రహ్మ’ ఆలయాలుగా ప్రసిద్ధిచెందాయి. అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠంగా ఇవి ప్రముఖమై నిలిచింది.

జోగుళాంబ’గా వెలసిన ఈ శక్తి కొలువై ఉన్న యీ క్షేత్ర పరమపావని ‘తుంగభద్ర’ తీరక్షేత్రం. సృష్టికర్తయైన ‘బ్రహ్మ’ పరమేశ్వరునికై తపమాచరించిన క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. చాళుక్య రాజుల ఆలయ నిర్మాణ పద్ధతులను ఇక్కడి దేవాలయ నిర్మాణాల ద్వారా తెలుసుకోవచ్చు. మహా శివరాత్రికి ఇక్కడికివచ్చి భక్తులు స్వామిని అభిషేకించి పూజించి పునీతులౌతుంటారు. ఈ జిల్లాలోని మరో సుప్రసిద్ధశైవక్షేత్రమైన ‘‘శ్రీ ఉమా మహేశ్వరక్షేత్రం’’ శ్రీశైలానికి ఉత్తర ద్వారమైతే, అలంపురం పశ్చిమద్వారంగా ప్రసిద్ధి చెందింది. నల్లగొండ జిల్లాలోని ‘‘ఛాయసోమేశ్వరాలయం’, ‘నిజామాబాదులోని ‘నీల కంఠేశ్వరాలయం’, మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే దట్టమైన అటవీ ప్రాంతంలోఉన్న ‘‘సలేశ్వరం’’, రంగారెడ్డి జిల్లాలోని ‘కీసరగుట్ట’ ఆలయంవంటి ఎన్నెన్నో శివాలయాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల రాకతో జనసంద్రంగా మారుతుంటాయి.
తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ప్రతి క్షేత్రానికీ ప్రత్యేక చరిత్ర ఉంది. లోతుగా అధ్యయనంచేస్తే క్షేత్ర చరిత్ర మనకు తెలుస్తుంది.

‘ముక్తితోబాటు చరిత్ర జ్ఞానాన్ని భక్తితోబాటు మన భూమి పవిత్రతను అవగతం చేసుకోవడం అత్యావశ్యకం. ఆ దిశగా తెలంగాణా ప్రజలు పురోగమించాలన్న సదాశయాన్ని వచ్చిన శివరాత్రి సంకల్పంగా భావించి తరించాలి. ఆ పరమశివుని కృప మనందరిపై ఉండాలని ఆశిద్దాం.

‘‘బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగమ్‌।
జన్మజ దు:ఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్‌॥’’