తెలంగాణకు హరితహారం

harithaharamరెండవ విడత హరితహారం కార్యక్రమం జూలై 8న రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రారంభమై 10 రోజుల పాటు పండుగలా కొనసాగింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో జూలై 8న మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గవర్నర్‌ నరసింహన్‌ బిహెచ్‌ఇఎల్‌ టౌన్‌షిప్‌లో గల జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో జూలై 10న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. రాష్ట్రమంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం.పి.లు, జడ్పీచైర్మన్‌, కలెక్టర్లు, ఎస్పీలు మొక్కలు నాటి ప్రజలకు నూతనోత్సాహం కల్పించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో కొనసాగి విజయవంతమైంది.

పట్టుబట్టి, జట్టుకట్టి హరితహారాన్ని విజయవంతం చేద్దాం..! – కే.సీ.ఆర్‌ ఉద్ఘాటన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడం అసాధ్యమన్న దానిని సుసాధ్యం చేసి చూపించిన తెలంగాణ గొప్పజాతి, అదే స్పూర్తితో ఇప్పుడు పట్టుబట్టి, జట్టుకట్టి రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి గ్రామంలో రెండవ విడత హరితహారం కార్యక్రమాన్ని జూలై 8న కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేకుండా చేశామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసుకున్నామన్నారు. ఇక హరితహారం విజయవంతం చేసి వానలను తిరిగి రప్పించుకోవాలన్నారు. వానలు హరితవనాల వల్ల వస్తాయి కానీ డబ్బులు పెట్టి కొనలేమన్నారు. కోట్ల రూపాయలు వెదజల్లినా వానలు రావన్నారు. అందువల్ల వనాలు పెంచితేనే వర్షాలు వస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగాలన్నారు. నల్లగొండ జిల్లాలో 5.9 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అతితక్కువ అడువులు ఉన్న జిల్లా నల్లగొండ జిల్లా మాత్రమేనన్నారు. ఈ జిల్లాలో అడవుల శాతం పెంచడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే 10 రోజుల వరకు ఇదే స్పూర్తితో మొక్కలు నాటాలన్నారు. పెట్టిన మొక్కలు వందశాతం బతికించాలన్నారు. అడవులు నశించడంతో అడవుల్లో ఉండే కోతులు గ్రామాలపై పడి అల్లరల్లరి చేస్తున్నాయన్నారు. కోతులు ఊళ్ళో నుంచి పోవాలంటే అడవులు పెరగాలన్నారు. గతంలో ఉన్న అడవులను మనం విచక్షణారహితంగా కొట్టివేయడంతో కోతులకు అడవుల్లో ఆహారం కరువైందన్నారు.

అడవుల్లో ఒకప్పుడు రకరకాల పండ్లు తునికి, రేగి, ఉసిరి, మేడి ఇలా ఎన్నొ జాతుల పండ్లు ఉండేవి. వాటిని తిని కోతులు కడుపునింపుకునేవన్నారు. అడవిలో చెట్లు కొట్టివేతలకు గురికావడంతో పండ్లు కరువై అవి తమ కడుపు నింపుకోవడానికి గ్రామాలపై పడుతున్నాయన్నారు. ఏ ఊరుకు వెళ్ళినా కోతుల బెడద గురించి రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. మనం ఆంజనేయస్వామిగా కొలిచే కోతుల సమస్య జటిలం కాకుండా ఉండాలంటే అడవులు పెరగాలన్నారు. గత సంవత్సరం వర్షాలు లేక కరువు ఏర్పడిందన్నారు. వర్షాలు పడాలంటే అడవులు, పచ్చదనం ఎంతో ముఖ్యమన్నారు. అందుకై మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపుచేయడం ఒక్కటే మార్గమన్నారు.

మన ఇంటిని మనమే బాగుచేసుకోవాలని, ఎవ్వరు వచ్చి బాగుచేయరని గుర్తెరగాలన్నారు. ఈ పదిరోజులు పాఠశాల విద్యార్థి నుంచి సీఎం వరకు 24గంటలు ఈ పనిలోనే ఉండాలని పిలుపునిచ్చారు. చెట్లు పెంచుకోవడమంటే మనల్ని మనం బాగుచేసుకోవడమే అన్నారు. అడవులు ఉన్న చోటనే వర్షాలు పడుతున్నాయని, చెరువులు నిండి అలుగులు పారుతున్నాయన్నారు. దీన్ని గ్రహించి తమ తమ ప్రాంతాలలో వానలు పడాలంటే చెట్లు పెంచాలనే ద్యాస కలిగి ఉండాలన్నారు. హరితహారంపై ప్రజల్లో చైతన్యం తేవడానికి కవులు పాటలు రాయాలని, గాయకులు గళం విప్పాలని పిలుపునిచ్చారు.

విద్యుత్‌శాఖా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని అన్నారు. కృష్ణా, గోదావరిలో మన వాటా సాధించడానికి, ప్రతి నీటిబొట్టును వినియోగంలోకి తేవడానికి ఎంతో కృషి చేస్తున్నాడని ప్రశంసించారు. ప్రాజెక్టుల విషయంలో ఎంతో అవగాహనతో డిజైన్‌లు రూపొందిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో: రాజధాని హైదరాబాద్‌లో జూలై 10న ఒకేరోజు 29లక్షల మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌తో పాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, సినీ తారలు పాల్గొని విజయవంతం చేశారు. మేయర్‌ బొంతు రాంమోహన్‌ పలుచోట్ల మొక్కలు నాటారు. మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, అమల, అల్లు అర్జున్‌ తదితర సినీతారలు, హీరో యిన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ హరితహారాన్ని ప్రజా ఉద్యమంలా నడిపించాలని అన్నారు. తరగిపోతున్న అడవులు వాతావరణంలో మార్పులకు కారణమన్నారు. అందుకే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. పండ్ల మొక్కలు పెంచితే జీవనోపాధి కూడా కలుగుతుందని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా చూడాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

హరిత హారం – ముఖ్యమంత్రి మనోగతం
తెలంగాణ ముద్దు బిడ్డలకు హరితాభివందనాలు…
తెలంగాణకు హరితహారం ఒక అపూర్వమైన కార్యక్రమం భారత దేశ చరిత్రలో తెలంగాణ లిఖిస్తున్న ఆకుపచ్చని అధ్యాయం. ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగాలి. ప్రతి పౌరుడు మొక్కలు నాటి పచ్చదనం కోసం పాటు పడాలి. పట్టుబట్టి జట్టు కట్టి ఎట్లనైతే తెలంగాణను సాధించుకున్నామో అట్లనే కోట్లాది మొక్కలు నాటాలె. ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించాలె.

మనిషి లేకున్నా చెట్టూ చేమ మనుగడ సాగిస్తాయి. కానీ చెట్లు లేకుంటే మనిషి బతుకు ఎడారే. విస్తారమైన అటవీ సంపద తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఉష్ణోగ్రతలు పెరుగకుండా చేసేవి, అతివృష్టి, అనావృష్టిలతో కాలం తప్పకుండా కాపాడేవి చెట్లే. వరదలు వచ్చినప్పుడు నేల కోతకు గురికాకుండా నిలబెట్టేవి చెట్లే. ఒక్క మనిషికే కాదు సకల జీవరాశి మనుగడకు వృక్ష సంపదే మూలం. పుట్టిన నాడు ఊపే ఊయల నుంచి మరణించిన నాడు పేర్చే చితి దాకా మానవ జీవితం చెట్టుతో ముడిపడి వుంది. ఒక చెట్టు నలుగురు మనుషులకు సరిపోయే ప్రాణవాయువునందిస్తుంది. ఒక టన్ను కార్చన్‌ డై అక్సైడ్‌ను తగ్గిస్తుతుంది. క్షమించరాని మానవ తప్పిదాల వల్లనైతేనేమి, అవసరాలు, అనివార్యతల వల్లనైతేనేమి విచక్షణారహితంగా మనం అడవులను నరికివేస్తున్నాం ఫలితంగా తీవ్రమైన ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తాయి. భరించలేనంత స్థాయికి ఉష్ణోగ్రత పెరుగుతున్నది. అన్ని కాలాలు ఎండాకాలాలైపోతున్నయి. వర్షాలు లేక వరుస కరువులు వస్తున్నాయి.

గతంలో తెలంగాణ సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం బృహత్‌ ప్రణాళికలను అమలు చేస్తున్నది. ఒకవైపు మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తూ, మరోవైపు ప్రాజెక్టుల పునరాకృతి కార్యక్రమాన్ని చేపడుతున్నది. దీని కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నది. దీంతో పాటు ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించేందుకు పచ్చదనం పట్ల ప్రజల్లో సోయి పెంచేందుకు, కోట్లాది మొక్కలు నాటేందుకు రూపొందించిన మహత్తర పథకమే తెలంగాణకు హరితహారం. వనం వుంటేనే వానలు ఉంటయి. పైసలు పెట్టి కొనేటందుకు వానలు మార్కెట్లో దొరకవు. ప్రకృతి ఇచ్చే వరం వానలు. చెట్లు నాటితే చెట్ల గాలితో మబ్బులు చల్లపడి వానలు కురుస్తయి. మనం మన అవసరాల పేరుతో అడివి మీద పడుతున్నాం. అడవిలో కోతులు ఊర్లమీద పడుతున్నయి. పంటలను, పండ్ల తోటలను నాశనం చేస్తున్న కోతులు ఇప్పుడు మనకు పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారం వనాలను పునరుద్ధరించడమే. అందుకే ఇప్పుడు మన నినాదం వానలు వాపస్‌ రావాలె… కోతులు అడవికి పోవాలె… వనం ఎక్కడుంటే వానలు అక్కడనే అని మొన్నటి వానలు చూస్తేనే అర్థమవుతుంది. ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో ఎక్కడైతే అడవి వుందో అక్కడనే వానలు పడ్డయి. ఈ పరిస్థితిని గమనించి అందరం అడవులను సంరక్షించడానికి చెట్లను నాటటానికి నడుం కట్టాలె.

తెలంగాణకు హరిత హారం ద్విముఖ వ్యూహంతో సాగే కార్యక్రమం. 1) సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం. 2) ఇదే సమయంలో దీనికి సమాంతరంగా సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం.

తెలంగాణకు హరితహారం ఒక రోజు మొదలై ఒక రోజు ముగిసేది కాదు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఫోటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకునే ప్రచార కార్యక్రమం అంతకంటే కాదు. భావి తరాలకు బంగారు భవితవ్యాన్ని ఇచ్చే గొప్ప బాధ్యత. దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడ జరగనంత స్థాయిలో నాలుగేళ్ళలో 120 కోట్లు, సహజ అడవుల ప్రాంతంలో 100 కోట్లు, హైదరాబాద్‌ నగరంలో 10 కోట్ల మొక్కలు, ఇంకా రహదారుల వెంట, కాలనీలలో, పొలం గట్లమీద, చెరువు కట్టల మీద, ఇంటి ముందు, ఇంటి వెనుక అన్ని చోట్లలో కోట్లాది మొక్కలు నాటుకోవాలి. నాటిన మొక్కను చంటి బిడ్డ వలె సంరక్షించుకోవావలె. పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ పట్టు పట్టాలె. మహిళలు కొంగు నడుముకు చుట్టాలె. యువకులు పిడికిలి బిగించాలె. కవులు కవితలు రాయాలె. గాయకులు గొంతెత్తి పాడాలె. దండిగా వానలు కొట్టాలె. పర్యావరణ హితం కోరే రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలె.

(హరితహారం ప్రారంభసభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రసంగ పాఠం)