గిరిజనానికి అందుబాటులో ప్రభుత్వ వైద్యం

ములుగు జిల్లా లోని ఏటూరునాగారం మండల కేంద్రంలో గిరిజనుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఎ) గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయడమే కాకుండా గిరిజనులు  ఆరోగ్యంగా ఉండేందుకు వారికి మెరుగైన వైద్య సేవలను అందించడానికి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నది. గతంలో గిరిజనులు దట్టమైన అటవీ ప్రాంతాలలో లభించే మొక్కల ద్వారా (నాటు వైద్యం) తీసే కషాయాలతో, దుంపలతో వివిధ వ్యాధులకు గిరిజనులే సొంతంగా చికిత్స చేసుకునేవారు.

కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా గిరిజనులు తమ స్వంత వైద్యాన్ని కనుమరుగు చేస్తూ పాలకులు అందిస్తున్న వైద్య సేవలను పొందడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలోని మంగంపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం వెంకటాపురం( నూగూరు), వాజేడు తదితర మండలాలలోని అడవి సమీప గ్రామాలకు గతంలో వైద్యసేవలు అందని ద్రాక్ష పండులా ఉండేది. నేడు ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు కావడమే కాకుండా చిన్న చిన్న గ్రామాలలో సైతం వైద్య సేవలను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమాన్ని ములుగు, మరో జిల్లాలో ప్రారంభించగా జిల్లాలోని గిరిజనులు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు రక్త నమూనాలు  ఇవ్వడానికి ముందుకు రావడం చెప్పుకోదగ్గ పరిణామం. జిల్లాలో ఇప్పటివరకు 92 శాతం మంది ప్రజలు తమ రక్తనమూనాలను వైద్య సిబ్బందికి అందించారు.

జిల్లా కలెక్టర్‌ ఐటీడీఏ ఇంచార్జి పీవో యస్‌. కృష్ణ ఆదిత్య హెల్త్‌ ప్రొఫైల్‌ పై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సిబ్బందికి సూచనలు చేయడంతో అనతి  కాలంలోనే ఈ ప్రక్రియ ముగింపుకు చేరుకుంది. కాగా ఇంఛార్జి  ఐటిడిఎ పివోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కృష్ణ  ఆదిత్య గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిత్యం గిరిజనులకు ఉచితంగా ప్రభుత్వం వైద్యం అందించడమే కాకుండా అత్యవసర సమయాలలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ అయ్యే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రి ఉండగా రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు,15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, 85 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకున్నారు. గతంలో నామమాత్రంగా ఆంబులెన్స్‌లు ఉండగా అదనంగా వాహనాలను ఏర్పాటు చేయడమే కాకుండా అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు.

8 మాతా శిశు ఆరోగ్యం, ఎపిడమిక్‌  వైద్య బృందాల సేవలు

జిల్లాలో గిరిజన మండలాలైన మంగంపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, గూడూరు, గంగారం,  కొత్తగూడ మండల మండలాలలో 8 మాతా శిశు ఆరోగ్యం, ఎపిడమిక్‌ వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో ఒక వైద్య అధికారితో పాటు స్టాఫ్‌నర్స్‌, సిబ్బందిని నియమించి వారికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు.  ఈ బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని గర్భిణీ స్త్రీలను పరిరక్షించడమే కాకుండా పుట్టిన శిశువు నుండి పిల్లల వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా సీజనల్‌ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. అన్ని రకాల టీకాలను సైతం అందజేయడం జరుగుతున్నది.

మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఐటీడీఏ కృషి,,,
అదనంగా వాహనాలు ఏర్పాటు……
ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ఇంఛార్జి….
పీవో హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందాలి…..
-ఇంఛార్జి పీవో, జిల్లా కలెక్టర్‌
యస్‌. క్రిష్ణ ఆదిత్య

గిరిజనులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి చర్యలు…..

ఇంచార్జి ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య

జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో పూర్తిస్థాయిలో ప్రభుత్వం వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఇంచార్జి  ప్రాజెక్టు అధికారి క్రిష్ణ ఆదిత్య తెలిపారు. జిల్లాలో అధిక ప్రాంతం గిరిజన గ్రామాలతో కూడి ఉందని దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉన్న గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు కావడంతో ఆయా గ్రామాలలో సమయానికి వైద్య సేవలు అందించడానికి వీలు కలుగుతుందని అన్నారు. నిత్యం గ్రామీణ ప్రాంతాలలోని గిరిజనులకు వైద్య సేవలు అందించడానికి 19 ఆస్పత్రులు ఏర్పాటు చేసి 24. వైద్యులతో వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా 340 మంది వైద్య సిబ్బందితో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. అత్యవసర సమయాలలో రోగులను పెద్ద ఆస్పత్రులకు తరలించడానికి ప్రస్తుతం ఉన్న వాహనాలు కాకుండా ఐటీడీఏ ద్వారా మరిన్ని వాహనాలను కొనుగోలు చేసి వాటిలో పని చేయడానికి అర్హులైన గిరిజనులను నియమించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం హెల్త్‌ ప్రొఫైల్‌ను జిల్లాలో ప్రారంభించగా రక్త నమూనాల సేకరణ 92 శాతం పూర్తయిందని, వివిధ పరీక్షలు చేసిన అనంతరం వైద్య సిబ్బంది. గిరిజనులకు, గిరిజనేతరులకు ఆరోగ్య విషయాలను తెలియజేయడానికి రిపోర్ట్లు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం రానున్న వర్షాకాలంలో గిరిజనులు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా గిరిజనులలో అవగాహన కల్పించడం జరుగుతుందని, పలు రకాల వ్యాధులకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజులలో ఆరోగ్య గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ఎవరూ కూడా ఎలాంటి వ్యాధుల బారిన పడిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు నూరు శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెలివరీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కృష్ణ ఆదిత్య వివరించారు.