ఆరోగ్య తెలంగాణ

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది ఆరోక్తి. కానీ, నేటి సమాజంలో ఆ భాగ్యం కొందరికే పరిమితమవుతోంది. ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిపోయింది.  పేదలకు జబ్బుచేస్తే  నయం చేసుకోవడానికి ఉన్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకోవడమో, అప్పుల పాలవడమో జరుగుతోంది. రోగం కంటే రోగపరీక్షల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బాధలన్నింటికీ చరమగీతం పాడి ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు అమలుచేస్తోంది. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నసదుపాయాలు, అందిస్తున్న వైద్యసేవలు, ఆస్పత్రుల పనితీరును విశ్లేషించి మెరుగు పరచడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు, అన్నిరకాల వైద్యసేవలు మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది.తొలిదశలో ప్రభుత్వ ఆస్పత్రులలో అధునాతన వైద్య పరికరాలు, డయాలసిస్‌ కేంద్రాలు, బస్తీదవాఖానాల  సంఖ్య పెంపు, అవసరమైన మందులను అందుబాటులోకి తేవడం, మౌలిక సౌకర్యాల కల్పన వంటి పలు చర్యలు తీసుకుంది. ఈ ముందస్తు చర్యలు తీసుకున్న కారణంగానే ఇటీవల కరోనా ప్రబలిన సమయంలో కూడా ఇతర రాష్ట్రాల కంటే  మన రాష్ట్రంలో మెరుగైన చికిత్సను  అందించగలిగాం.ఫలితంగా బాధితులు, మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకో గలిగాం.

ఇప్పుడు రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలతో వైద్యసేవలను మరింత విస్తృత పరిచే బృహత్తర కార్యక్రమాలు అమలు జరుపుతోంది.రాష్ట్రంలో వైద్యకళాశాలల సంఖ్య భారీగా పెంచుకో గలిగాం.కొత్తగా ఏర్పాటుచేయనున్న ఏడు మెడికల్‌ కళాశాలలకు అవసరమైన ఏడువేలకు పైగా పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరుచేసింది. దీనికి తోడు వివిధ ప్రాంతాలలో కొత్త ఆస్పత్రుల నిర్మాణం, మరికొన్నింటిలో పడకల సంఖ్యపెంపు వంటి చర్యలు చేపట్టింది. వరంగల్‌ లో 33 అంతస్తులతో, అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న ఆస్పత్రికి ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు. అక్కడి ఎం.జి.ఎం ఆస్పత్రిని కూడా మాతాశిశు కేంద్రంగా తీర్చిదిద్దుతామని  కె.సి.ఆర్‌ ప్రకటించారు.

హైదరాబాద్‌ నగరం నలువైపులా నాలుగు అధునాతన ఆస్పత్రులను నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యరంగంలో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీ కూడా జరుగుతోంది.దేశ చరిత్రలోనే ప్రథమంగా అన్ని జిల్లా కేంద్రాలలో 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందించే డయాగ్నసిస్‌ కేంద్రాల ఏర్పాటు నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కొన్ని కేంద్రాలు ఇప్పటికే పనిచేయడం ప్రారంబించాయి.

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా, ఆరోగ్య తెలంగాణ వైపు ప్రభుత్వం అడుగులు వేయడం శుభ పరిణామం.