|

తెలంగాణ ఆయురారోగ్యమస్తు!

tsmagazineఆయన కల బంగారు తెలంగాణం. ఆయన ఆలోచన ఆరోగ్య తెలంగాణం. బంగారు తెలంగాణ కల సాకారమయ్యే దారిలోనే ఆరోగ్య తెలంగాణని ఆవిష్కరింప చేశారు కేసీఆర్‌. అవును ఇప్పుడు తెలంగాణ ఆరోగ్యానికి ఐకాన్‌. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆదర్శ రాష్ట్రం.

అది కేసీఆర్‌ కిట్ల పథకం కావచ్చు. పేషంట్‌ కేర్‌ కావచ్చు. నవజాత శిశు సంరక్షణ కావచ్చు. ఆపరేషన్లు లేని సుఖ ప్రసవాలు కావచ్చు. ఇంటింటికీ కంటి పరీక్షలు, ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు కావచ్చు. విద్యార్థినులకు న్యాప్‌కిన్ల, కిట్లు కావచ్చు. హాస్పిటళ్ళకు సదుపాయాలు, ఆఖరకు మరణిస్తే మృత దేహాలను వారి ఇళ్ళ ముంగిళ్ళకు చేర్చే పార్థీవ వాహనాలే కావచ్చు. అన్నీ సగటు జీవి ఆయురారోగ్య ప్రమాణాలను పెంచే అనేక పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలు అవుతున్నాయి. అందుకే ఆరోగ్య సూచీలు, అనేక ప్రభుత్వ సంస్థల సర్వేలు కూడా ఆరోగ్య తెలం’గానం” చేస్తున్నాయి. దేశమే ఇప్పుడు ఆరోగ్య తెలంగాణ వైపు చూస్తున్నది. ఇక్కడి పథకాలు అక్కడ అమలు చేయడానికి అనువైన అవకాశాలు వెతుక్కుంటున్నాయి.

అవును, మనం ఆరోగ్యంగానే ఉన్నామని చెప్పడం కాదు. వాటిని నిరూపించడానికి కొన్నిఆరోగ్య సూచీలుంటాయి. ఆ సూచికలను శాస్త్రీయంగా మదింపు చేసే ప్రక్రియ ఉంటుంది. అలాంటి మదింపుని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల ప్రకారం నీతి ఆయోగ్‌ దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లోని వైద్యశాలల పనితీరుని పరిశీలించింది. శాస్త్రీయంగా ఆయా అంశాలను మదింపు చేసింది.

అలాగే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణను దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కలపగా, గోవా, మణిపూర్‌, మేఘాలయ వంటి రాష్ట్రాలను చిన్న రాష్ట్రాల్లో చేర్చింది. కేంద్ర పాలిత ప్రాంతాలను మూడో విభాగంగా పరిగణించింది.

పెద్ద రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. మొత్తంమీద 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ 11వ స్థానాన్ని దక్కించుకుంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ 21వ స్థానంలో నిలిచింది. చిన్న రాష్ట్రాలే అభివృద్ధికి ఆనవాళ్ళు అని చెప్పిన తెలంగాణ సీఎం కెసిఆర్‌ అభిభాషణకి అక్షరాల తెలంగాణ ముందుండడమే నిదర్శనం.

నీతి ఆయోగ్‌ పరిగణలోకి తీసుకున్న అంశాలు ఇవీ….

నవజాత శిశు మరణాలు, ఐదేళ్ళలోపు పిల్లల మరణాల శాతం , ఆడ-మగ శిశువుల నిష్పత్తి, వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటున్న వారి సంఖ్య, వైద్యశాలల్లో జరిగే ప్రసవాల సంఖ్య, ప్రసవానికి అయ్యే సగటు ఖర్చు, క్షయ వ్యాధి తీవ్రత, హెచ్‌ఐవి కేసులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నది. అలాగే జననాల నమోదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో 24 గంటల వైద్య సేవలు, ఆరోగ్య విభాగంలో ఖాళీలు వంటి ఇతర అంశాలను కూడా నీతి ఆయోగ్‌ విశ్లేషించింది.

నవజాత శిశు సంరక్షణలో నెంబర్‌ వన్‌ గా ఉన్నాం. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు కూడా తీసుకున్నాం. 2014 నాటికి శిశు మరణాల సంఖ్య తెలంగాణలో 25గా ఉంటే, దాన్ని 2015 నాటికే 23కి తగ్గించాం. ఐదేళ్ళలోపు చిన్నారుల మరణాల రేటు కూడా 37 నుంచి 34కి తగ్గింది. మన తెలంగాణ సగటు (30.6శాతం), దేశ సగటు (39.2శాతం) కొంచెం తక్కువ కాగా, ప్రపంచ సగటు (29.3శాతం) కంటే ఎక్కువగా తెలంగాణలో నమోదైంది. ప్రసవాల్లో రెండేళ్ల కిందటి లెక్కల ప్రకారమే మనం 4వ స్థానంలో ఉన్నాం. ఈ మధ్య కేసీఆర్‌ కిట్ల తర్వాత ప్రసవాలు 55శాతానికి పెరిగాయి. ఎంఎంఆర్‌ (మదర్‌ మోర్టాలిటీ రేటు), ఐఎంఆర్‌ (ఇన్‌ ఫ్యాంట్‌ మోర్టాలిటీ రేటు) బాగా తగ్గాయి. టీకాల్లో వందకు వంద శాతం సక్సెస్‌ సాధించాం. కాబట్టి లింగ నిష్పత్తి కూడా సమతుల్యత కచ్చితంగా సాధ్యమవుతుంది. వైద్య సిబ్బంది కొరత తీర్చడానికి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 10వేల ఉద్యోగాల భర్తీ కొద్ది నెలల్లో జరగబోతున్నాయి. 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు అవనువైన ప్రాథమిక వైద్యశాలల గుర్తింపు జరుగుతున్నది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది.

కేసీఆర్‌ కిట్లు, గర్బిణీలకు (ఆడ పిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12వేలు) ఆర్థిక సహాయం, వైద్య సహాయం, ఉచితంగా ప్రసవాలు, 102 వాహన సేవలు, పెరిగిన 104, 108 వాహన సేవలు, 108 టూ వీలర్‌ సేవలు, టీకా బండీలు, ప్రభుత్వ దవాఖానాల్లో డయాలసిస్‌ కేంద్రాలు, ఐసియూలు, వంటి ఎన్నో సదుపాయాల కల్పన నిరంతర ప్రక్రియలా కొనసాగుతున్నది. 10వేల బెడ్లు, లక్ష గులాబీ, తెల్ల రంగు, రెండు రంగుల దుప్పట్లు, మంచాలు, సెలైన్‌ స్టాండ్లు, సైడ్‌ బాక్సులు, సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, ఆటో అనలైజర్లు వంటి ఆధునిక పరికరాలు అందించడం జరిగింది. అన్ని సబ్‌ సెంటర్ల నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్‌, జిల్లా హాస్పిటల్స్‌, టీచింగ్‌ హాస్పిటల్స్‌ వరకు ఆధునీకరించడం, అవసరమైన భవనాలు నిర్మించడం జరిగింది.

అనేక కొత్త పథకాలు

ఇక ఇప్పుడు ఉచిత ప్రాథమిక పరీక్షలను నిర్వహించబోతున్నాం. ఇంటింటికీ కంటి పరీక్షలు, ఇంటింటికీ మధుమేహం, బీపీ చెకప్‌లు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డ వాళ్ళకి అవసరమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నాం. 590 హెల్త్‌ అండ్‌ వెల్‌ నెస్‌ సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తొలి విడత గ్రేటర్‌లో 40, ఆరు జిల్లాల్లో 50 సెంటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది. ఇవేగాక హైదరాబాద్‌ మహా నగరంలో బస్తీ దవాఖానాలను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ప్రతి 3000-5000 జనాభాకు ఒక ఉచిత పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.

ఆరోగ్య పరంగా బాగా వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యత నిస్తున్నాం. ఆదిలాబాద్‌, ఆసీఫాబాద్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలున్నాయి. సర్కార్‌ బడిపిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థినుల ఆరోగ్య ప్రొఫైల్‌ తయారు చేసి, వారికి అవసరమైన సానిటరీ న్యాప్‌కిన్స్‌, కిట్లను అందచేసే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 8,9,10వ తరగతులు చదువుతున్న 7,90,425 మంది బాలికలకు ఈ సదుపాయం లభించనుంది.

ఆయుః ప్రమాణంలోనూ మనమే ది బెస్ట్‌

భారతీయ వైద్య పరిశోధన మండలి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆరోగ్య సూచికలు, గణాంకాల సంస్థ సంయుక్తంగా చేపట్టిన సర్వేలోనూ ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పెరుగుతున్న వ్యాధులు, సంభవిస్తున్న మరణాలను, అందుకు కారణాలను మదింపు చేసి 26 ఏళ్ళ కాలాన్ని తీసుకుని లెక్కలు కట్టింది. ఆ సంస్థల తాజా నివేదిక ప్రకారం 2016 నాటికి తెలంగాణ ఆయుః ప్రమాణం 71.3 ఏళ్ళుగా ఉంది. 1990నాటికి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇది కేవలం 61గా నమోదైంది. తెలంగాణలో పురుషుల ఆయుః ప్రమాణం 69.4గా నమోదు కాగా, స్త్రీల ఆయుః ప్రమాణం 73.2
సంవత్సరాలుగా నమోదైంది.
tsmagazine
ఈ ఏడాది ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు

ఈ ఏడాది వేసవిలోనే రాష్ట్రమంతటా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నాం. రక్తపోటు, మధుమేహం, కొలస్ట్రాల్‌, హిమోగ్లోబిన్‌, కాలేయ, మూత్ర పిండాల, దంత వ్యాధులను గుర్తించి తగు వైద్యం అందించబోతున్నాం. ఆర్‌బిఎస్‌ కె, 104 వాహన సేవలను ఇందుకు ఉపయోగించుకుంటాం. ఇదంతా 100 రోజుల ప్రణాళికగా సిద్ధమవుతున్నది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. నిజంగా ఇవన్నీ పరిగణలోకి వచ్చే విధంగా తాజా లెక్కలు కడితే ఖచ్చితంగా తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ ఆరోగ్య రాష్ట్రంగా కనిపిస్తుంది. ఇప్పటికే మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమవుతున్నది. ఈ ఆరోగ్య అసిధారా వ్రతం నిరంతరం కొనసాగాలని ఆశిద్దాం.

మార్గం లక్ష్మీనారాయణ