హైదరాబాద్‌లో వారసత్వ కట్టడాలు

హదియా వృక్షం (ఏనుగు చెట్టు)

ఇది గోల్కొండ కోటవద్ద నయాఖిల్లా దగ్గర ఉన్నది. ఇది ఆఫ్రికన్‌ లూవోటూ దీని ఎత్తు 79 అడుగులు, కాండం చుట్టు కొలత 25 మీ. ఉంటుంది. దీన్ని కుతుబ్‌షాహీ నాటినట్లు చెబుతారు. దీన్ని పోలిన వృక్షం రాజ్‌భవన్‌లోని బోన్సాయి గార్డెన్‌లో ఉంది.

సెల్యులార్‌ జైల్‌ (1858)

ఇది సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఉన్నది. 2260 చ.గ. విస్తీర్ణంలో మూడు అంతస్థులుగా ఉన్న దీని నిర్మాణానికి రూ. 4.71 లక్షలు అయ్యింది. గోథిక్‌ శైలిలో శిలువ ఆకారంలో నిర్మించారు. 1994 నుంచి దీన్ని ఉపయోగించడంలేదు. ప్రస్తుతం ప్రాదేశిక సైన్యం ఇన్ఫ్రాంటీ 125 బెటాలియన్‌ ఆధీనంలో ఉన్నది. దీని నమూనా ఆధారంగా 50 ఏండ్ల తర్వాత అండమాన్‌లో కాలాపానీ జైలును నిర్మించారు. 1997లో ఇంటాక్‌ హెరిటేజ్‌ అవార్డును పొందింది.

పైగా టూంబ్స్‌

సంతోష్‌నగర్‌ నుంచి డీఆర్డీఎల్‌ వెళ్లేదారిలో ఉన్నవి. పైగా వంశస్తులు అసఫ్‌జాహీ రాజ్యంలో 1724-1948 వరకు సైనిక కమాండర్లుగా ప్రధాని సలహాదారులుగా పనిచేశారు. పైగా వంశం లోని ఎనిమిది తరాలకు చెందిన 32 మంది కులీనుల సమాధులే పైగా టూంబ్స్‌. ఈ సమాధులు టరిబాష్‌, గ్రీక్‌, మొఘల్‌ నిర్మాణ శైలి కలయికలో ఆకర్షణీయంగా తయారు చేశారు. ఈ సమాధులను వారసత్వ భవనాల జాబితాలో చేర్చారు.

నిజాం మ్యూజియం

పురానా హవేలీలోని వసంత మహల్‌. హైదరాబాద్‌ సంస్కృతికి చెందిన భిన్న వస్తు రూపాలు ఇక్కడ ఉన్నాయి. కావున ఈ మ్యూజియంను మ్యూజియం ఆఫ్‌ ది సిటీ అని కూడా పిలుస్తారు. 2002లో ప్రారంభించిన ఈ మ్యూజియంలో నిజాం వంశస్తులు ధరించిన దుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు ప్రదర్శనకు ఉంచారు. 

ఉర్దూ ప్యాలెస్‌ (1931)

దీన్ని సయ్యద్‌ మొయినుద్దీన్‌ ఖాద్రీ జోరి నిర్మించారు. ఇది నిమ్స్‌ దవాఖాన వద్ద ఉన్నది. దీన్ని ఐవాన్‌-ఏ-ఉర్దూ అని వ్యవహరిస్తారు. దీని ముఖద్వారం ఎల్లోరా గుహలోని విధంగా ఒంపు తిరిగి వివిధ పూల ఆకృతులతో అలంకరించి ఉంది. ఈ ప్యాలెస్‌ గ్రంథాలయంలో 40 వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి.

గన్‌ ఫౌండ్రీ (1786)

ఫ్రెంచి జనరల్‌ అయిన మాన్షియర్‌ రేమండ్‌ దీన్ని అబిడ్స్‌లో నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల పొడవైన ఫిరంగులు, ఆయుధ సామాగ్రి తయారు చేసేవారు. దీనికి అనుగుణంగా పెద్ద ఇనుప కొలుములు నిర్మించారు. దీన్ని పురావస్తు శాఖ సంరక్షించి వారసత్వ నిర్మాణంగా పదిలపరుస్తుంది.

కుతుబ్‌షాహీ సమాధులు

ఇవి గోల్కొండ దగ్గర ఉన్నాయి. హిందూ పర్షియన్‌ శైలిలో నిర్మించారు. 30 సమాధులు ఒకేచోట ఉన్నాయి. 5వ గోల్కొండ సుల్తాను మహ్మద్‌ కులీ సమాధి అతిపెద్దది.

మహబూబియా కళాశాల

ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ నిర్మించారు. స్త్రీ విద్యవ్యాప్తి కోసం దీన్ని నిర్మించారు. దీని నిర్వహణ కోసం ప్రతి నెల రూ.1000 కేటాయిస్తూ ఒక సంస్థను ఏర్పాటు చేశారు.

షాహీ ఖజానా

ఇది చార్మినార్‌ దగ్గరున్న మోతీగల్లి. దీన్ని ఆరో నిజాం నిర్మించాడు. దీని ముఖద్వారం పైనాపిల్‌ నమూనాలతో అలంకరించి ఉన్నది. నిజాం కాలంలో ఖజానా కార్యాలయంగా పటిష్టమైన గదులతో భారీ ఇనుప తలుపులతో దీన్ని నిర్మించారు.

దారుషిఫా (1595)

ఈ యునాని వైద్యశాలను మొహ్మద్‌ కులీకుతుబ్‌షా నిర్మించారు. ఇది పురాణా హవేలీ వద్ద మూసీనది ఒడ్డున ఉన్నది. ఇది 6000 చ.గ. విస్తీర్ణంలో రెండంతస్తులుగా ఉన్నది. ఉర్దూలో దారుషే అంటే నిలయం, షిఫా అంటే చికిత్స. దేశంలో మొదటి ఇన్‌ పేషెంట్‌ దవాఖానగా పరిగణిస్తారు. 420 ఏండ్ల తర్వాత కూడా మంచి స్థితిలోనే ఉన్న ఈ భవనం వారసత్వ కట్టడంగా మిగిలింది.

అగ్ని దేవాలయం

దీన్ని 1904, అక్టోబర్‌ 16న అబిడ్స్‌లోని తిలక్‌రాజ్‌ వద్ద ఇండో యూరోపియన్‌ శైలిలో నిర్మించారు. ఇది పార్శీల ప్రార్ధనా మందిరం. 2002లో ఈ దేవాలయానికి హుడా-ఇన్టాక్‌ వారసత్వ అవార్డు లభించింది.

చర్చిల్‌ బంగ్లా (1875)

యాప్రాల్‌ చౌరస్తాలో (గోల్ఫ్‌ మైదానం ఎదురుగా) ఉన్నది. 1896లో విన్‌స్టన్‌ చర్చిల్‌ సైనిక అశ్వదళంలో పనిచేస్తున్న సమయంలో సికింద్రాబాద్‌లో ది రీ ట్రీట్‌ అనే పేరుతో భవంతిలో నివసించేవారు. తరువాతి కాలంలో విన్‌స్టన్‌ చర్చిల్‌ బ్రిటన్‌ ప్రధానిగా 1940-45, 1951-55 మధ్య పనిచేశారు. భవంతి ముందున్న చలవరాతి పలకపై ఈ విషయాలు లిఖించి ఉన్నాయి.

చార్‌కమాన్‌

సుల్తాన్‌ మహ్మద్‌ కులీకుతుబ్‌షా దీన్ని నిర్మించారు. ఇది చార్మినార్‌కు ఉత్తరంగా ఉన్నది. చార్మినార్‌కు 250 అడుగుల దూరంలో నాలుగు కమాన్లను నిర్మించారు. వీటినే చార్‌ కమాన్‌ అంటారు. ఒక్కో కమాన్‌ ఎత్తు 60 అడుగులు, 36 అడుగుల వెడల్పు, 6 అడుగుల మందం కలిగి ఉన్నది. ఈ నాలుగు కమాన్ల మధ్యలో గుల్జార్‌ హౌస్‌ అనే నీటి ఫౌంటేన్‌ ఉన్నది.

నిజాం కాలేజీ

ఇది లాల్‌ బహదూర్‌ స్టేడియం ఎదురుగా ఉన్నది. దీన్ని 1887లో స్థాపించారు. హైదరాబాద్‌ కళాశాల, మదర్సా-ఏ-అలియాను కలిపి నిజాం కళాశాలగా మార్చారు. దీని మొదటి ప్రిన్సిపాల్‌ డా. అఘోరనాథ్‌ చటోపాధ్యాయ. నిజాం కళాశాలగా మారకముందు ఇక్కడ మద్రాస్‌ యూనివర్సిటీకి అనుబంధంగా మెట్రిక్యులేషన్‌ పరీక్షలను నిర్వహించేవారు. 1987లో రామకృష్ణ ప్రసాద్‌ అనే విద్యార్థి మొదటిసారిగా ఈ విద్యాసంస్థ నుంచి పరీక్షలకు హాజయ్యాడు. నిజాం కాలేజీ ఉన్న ప్రాంతాన్ని గతంలో అసద్‌ బాగ్‌ అనేవారు. ఇది నవాబ్‌ ఫఖ్ర్‌-అలీ-ముల్క్‌ నివాసంగా ఉండేది.

జూబ్లీహాల్‌

ప్రదేశం – పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్మించినది – మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (7వ నిజాం). నిర్మించిన కాలం – 1937. నిర్మాణ శైలి – ఇండో పర్షియన్‌. నిజాం తన సిల్వర్‌జూబ్లీ వేడుకల సందర్భంగా దీన్ని నిర్మించారు. కాబట్టి దీనికి జూబ్లీహాల్‌ అని పేరు వచ్చింది. దీనిలో నిజాం దర్బార్‌ నిర్వహించారు. 

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌

ఏర్పాటు – 1924. విస్తీర్ణం – 150 ఎకరాలు. నిజాం రెవెన్యూ సంచాలకుడైన వేక్‌ఫీల్డ్‌ చొరవతో బ్రిటిష్‌ అధికారులు, రాజవంశీయులు విద్యకై దీన్ని స్థాపించారు. 1950లో జాగీర్ధారీ వ్యవస్థ రద్దు కావడంతో దీన్ని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌గా మార్చి అందరికీ విద్యావకాశం కల్పించారు.

ఉస్మానియా యూనివర్సిటీ

ఏర్పాటు – 1919, ఆగస్టు 7 (అబిడ్స్‌లోని ఒక అద్దె భవనంలో). స్థాపించింది – నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (1917లో యూనివర్సిటీ స్థాపనకు ఫర్మానా చేశారు). విశ్వవిద్యాలయ నిర్మాణానికి సర్‌ ప్యాట్రిక్స్‌ గేట్స్‌ కమిటీ అడిక్‌మెట్‌లో 1400 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. విశ్వ విద్యాలయ భవనాల రూపకల్పనకు కృషి చేసినవారు నవాబ్‌ యార్‌ జంగ్‌, సయ్యద్‌ అలీ రజా. 

ఆర్ట్స్‌ కాలేజ్‌

రూపశిల్పి – జాస్పర్‌ (బెల్జియం ఆర్కిటెక్చర్‌) శంకుస్థాపన చేసినది – మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. శంకుస్థాపన – 1934, జూలై 5. నిర్మాణ కంపెనీలు, హ్యూమ్స్‌ పైప్‌ కంపెనీ, హైదరాబాద్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు. నిర్మించిన కాలం – ఐదున్నర ఏండ్లు, 35 వేల మంది కార్మికులు-ప్రారంభించినది – 1939, డిసెంబర్‌ 5 (7వ నిజాం). ప్రధాన భవనం 110 మీటర్ల వెడల్పు, 119 మీటర్ల ఎత్తుతో రెండస్తులతో నిర్మించబడిన ఈ భవనానికి గులాబిరంగు రాతిని వాడారు.

లెజిస్లేటివ్‌ అసెంబ్లీ

నిర్మించినది – మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ (6వ నిజాం). నిర్మించిన కాలం  1905-1913. నిర్మాణశైలి – రాజస్థానీ, పర్షియన్‌ శైలి. దీన్ని వైట్‌ జెమ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అని కూడా వ్యవహరిస్తారు. అసెంబ్లీ ప్రాంగణంలోని గ్రంథాలయంలో 20 వేలకుపైగా పుస్తకాలు ఉన్నాయి.

విక్టోరియా మెమోరియాల్‌ (1890)

హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఉన్నది. దీన్ని 6వ నిజాం మీర్‌ మహమ్మద్‌ అలీఖాన్‌ నిర్మించాడు. 1905లో విక్టోరియా మెమోరియల్‌ ఫర్‌ ఆర్ఫన్స్‌ అనే పేరుతో అనాథ బాలల వసతి ఏర్పాట్ల కోసం దీన్ని కేటాయించారు. 1953, జనవరి 19న నెహ్రూ సందర్శించి ఆర్ఫన్స్‌ అనే పదాన్ని తొలగించి విక్టోరియా మెమోరియల్‌ హోం ఫర్‌ చిల్డ్రన్స్‌ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది.

బ్రిటిష్‌ రెసిడెన్సీ (1803)

బ్రిటిష్‌ ఐదో రెసిడెంట్‌ అయిన కిల్‌ ప్యాట్రిక్‌ రెండో నిజాం కాలంలో దీన్ని నిర్మించాడు. యూరోపియన్‌ శైలిలో ఉన్నది. దీని ముఖద్వారానికి ముందు 50 అడుగుల ఎత్తున్న ఆరు భారీ స్తంభాలతో కూడిన మంటపం ఉంది. బ్రిటిష్‌ రాచరికాన్ని తెలిపేలా కూర్చుని ఉన్న సింహాల ప్రతిమలు మెట్లకు ఇరువైపుల ఉన్నాయి. ఈ భవంతిని 1949 నుంచి మహిళా కళాశాలగా ఉపయోగిస్తున్నారు.

మక్కా మసీదు

సుల్తాన్‌ మహ్మద్‌ కులీకుతుబ్‌షా (1617లో) పునాది వేశాడు. బైతుల్‌ అతీఖ్‌ అని ఈ మసీదుకు పేరుపెట్టారు. దీని నిర్మాణాన్ని ఔరంగజేబ్‌ పూర్తిచేశాడు. ఇది పూర్తిగా రాతితో నిర్మితమైంది. కొన్ని మట్టి ఇటుకలను మక్కా నుంచి తెచ్చి నిర్మించారు. ఈ మసీదులో ఒకేసారి 3000 మంది ప్రార్థన చేయవచ్చు. ప్రధాన మసీదుకు దక్షిణంగా మొత్తం 14 సమాదులున్నాయి. ఇందులో ఐదు సమాధులు నిజాం అలీఖాన్‌ నుంచి మహబూబ్‌ అలీఖాన్‌ వరకు కాగా మిగిలినవి వారి కుటుంబ సభ్యులవి. ఔరంగ జేబు ఏర్పాటు చేసిన సౌర గడియారం (సన్‌డయల్‌) ఇప్పటికి అక్కడే ఉంది.