విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలు అధిక దిగుబడులతో పంటలు

-By వై. వెంకటేశ్వర్లు

తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో వ్యవసాయరంగం ముఖ్యభూమిక పోషిస్తున్నది.రైతులు, వ్యవసాయ సమస్యల పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో  ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది.

2021-22 అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 18.3 శాతాన్ని వ్యవసాయరంగం అదనంగా జమ చేసింది. వ్యవసాయరంగంపై 48.4శాతం జనాభా ఆధారపడి జీవిస్తున్నది. రాష్ట్ర పారిశ్రామిక, సేవా రంగాలకు వ్యవసాయ రంగం ఊతంగా నిలుస్తున్నది.

అందులో భాగంగా స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి దోహదపడే పంటలు, ఆయా ప్రాంతాల భూముల తీరుకు అనువైన రకాల పంటల విత్తనాలను రైతులకు అందించడానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కృషిచేస్తున్నది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆశయాల మేరకు అధిక దిగుబడులు, అత్యధిక ఆదాయాన్నిచ్చే 18 పంటలకు చెందిన 60 రకాల విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. రాష్ట్ర వాతావరణ పరిస్థితులు, చీడపీడలను తట్టుకునే రకాలపై ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. 2021-22 లో 33,619 ఎకరాల విస్తీర్ణంలో 1,60,441 క్వింటాళ్ళ విత్తనాలను సంస్థ ఉత్పత్తి చేసింది. విత్తనాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తున్న పంటల రకాల్లో ప్రధాన పంటలయిన వరి, మిర్చి, పత్తితో పాటు వేరుశనగ, కంది, మొక్కజొన్న, రాగి, కొర్రలు తదితర పంటల విత్తనాలు ఉన్నాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కృషితో వైవిధ్యమైన లాభదాయక పంటల సాగువైపు తెలంగాణ రైతులు మళ్ళుతున్నారు.

రాష్ట్ర రైతులతో పాటు దేశంలో వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, బెంగాల్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశాలకు వివిధ రకాల విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎగుమతి చేస్తున్నది.

అధిక దిగుబడులు ఇచ్చే వైవిధ్యభరిత పంటల సాగును ప్రోత్సహిస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశ రైతాంగానికి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంగా నిలుస్తున్నది.