|

యాదాద్రి చుట్టూ చారిత్రక ప్రదేశాలు

By: శ్రీ డి. సూర్య కుమార్‌

తెలంగాణ రాష్ట్రం సాకారమై అవతరించిన అనంతరం, జిల్లాల పునర్విభజన జరిగింది. ఫలితంగా నల్లగొండ జిల్లా మూడుముక్కలయింది. అవి నల్లగొండ జిల్లా కేంద్రంగా నల్లగొండ జిల్లా, సూర్యాపేట కేంద్రంగా సూర్యాపేట జిల్లా, భువనగిరి కేంద్రంగా యాదాద్రి భువనగిరి జిల్లాలు.

యాదాద్రి భువనగిరి జిల్లాకి పేరు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పేర వచ్చింది. నిజానికి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక చారిత్రక అవశేషం శాసనమో, స్మారక శిలో, వీరగల్లో, ఆవాసపాటిదిబ్బో, చరిత్రపూర్వయుగ సమాధులో, ప్రాచీన ఆలయాలో, రాజమందిరాలో, కోటలో, గడీలో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. యాదగిరి గుట్టతోపాటు ఇతర ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలున్నాయి. మతపర నిర్మాణాలకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి ప్రాంతం జైన మత నిర్మాణాలు, సూర్యాపేట జిల్లాలో బౌద్ధ మత నిర్మాణాలు, నల్లగొండ జిల్లాలో అధికంగా హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. ఆయా ప్రాంతాల్లో ఇతర మత నిర్మాణాలు లేవనికాదుగానీ తక్కువ. యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకి జైన మత క్షేత్రాలే అధికంగా కనిపిస్తాయి. బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు చాలా కొద్దిగా కన్పిస్తాయి. అలాగే హైందవ క్షేత్రాలు. (అనంతర కాలంలో హైందవంగా మార్చబడిన జైన క్షేత్రాలే ఎక్కువ. భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరి చారిత్రకంగా చాలా ప్రముఖమైనది. హైదరాబాద్‌ నుండి వరంగల్‌ రహదారిపై 50 కి.మీ. దూరంలో ఉన్న ఈ పట్టణం అద్భుతమైన గిరి దుర్గం. సుమారు 40 ఎకరాలలో విస్తరించివున్న ఈ కోట, భువనగిరి పట్టణం, మధ్యయుగాల ఆరంభంనించి జరిగిన అనేక సమరాలకి సంఘటనలకి, సభలకి, సమావేశాలకి ప్రత్యక్ష మౌన సాక్షిగా మిగిలింది. భువనగిరి దుర్గం నిర్మాణంపైన, ఆపేరు రావడం వెనుక జన బాహుళ్యంలో ఒక గాథ ప్రచారంలో ఉంది. వెనకటికి ఒక రాజు భువనగిరి సమీపంలోని రాయగిరి గుట్టపై దుర్గ నిర్మాణం ఆరంభించగా బోనడు, గిరమ్మ అనే గొల్లదంపతులు ఆ ప్రాంత కోటకి అంత సురక్షితం కాదని, తీగెలు ఆకులతో నిండి వున్న భువనగిరి కొండను చూపించి తీగెల మొదలు నరికి, నాలుగు రోజుల తర్వాత ఎండిన తీగెను తగలబెట్టగా నున్నటి గుట్ట బైటపడ్డదని, దానిపై శత్రుదుర్భేద్యమైన కోటని, చుట్టూ నగరాన్ని నిర్మించి, ఆ గొల్ల దంపతుల పేరు మీద ‘బోనగిరి’ అని పేరు పెట్టాడని, కాలక్రమేణ అదే భువనగిరిగా మారిందని చెబుతారు. అట్లే కళ్యాణీ చాళుక్య రాజైన త్రిభువనమల్ల 4 పేరుమీద దీనికి త్రిభువనగిరి, భువనగిరి అన్నపేరొచ్చిందని మరొక వాదన.

అండాకారంలో వున్న ఏకశిలా పర్వతంపై శత్రుదుర్భేద్యమైన కోట నిర్మింపబడివున్నది. ఈ కొండపైకి చేరడానికి ఉత్తర, పశ్చిమ దిక్కుల నుండి మెట్ల దారి వున్నది. పైకి వెళ్ళే కొద్దీ కోట అందచందాలు నిర్మాణాలు మనల్ని బాగా ఆకర్షిస్తాయి. రాజభవనం, ద్వారాలు, సైనికుల ఆయుధాగారాలు, రాతి స్తంభాల మండపాలు, నీటి కొలనులు, గుర్రపు శాలలు ఆకర్షణీయంగా ఉన్నాయి. సభా భవన మందిరపు గోడలపై అందమైన లతలు, పుష్ప గుచ్చాలు చెక్కబడ్డాయి. రాజభవన రక్షణకుపయోగించిన ఫిరంగుల శిథిలాలు కనిపిస్తాయి. రాజభవనానికి మరోకవైపున ఏనుగుల బావి వున్నది. రాణీ వాసం కోసం ఈ బావి నుండి ఏనుగులతో నీరు తోడించేవారు గనుక దీనిని ఏనుగుల బావి అంటారని చెబుతారు. కళ్యాణీ చాళుక్యులు, కాకతీయులు, మసునూరి వంశస్థులు, కుతుబ్‌షాహిలు మొఘలుల కాలంలో జరిగిన అనేక యుద్ధాలలో కీలకమైన భువనగిరి కోట అనేక మార్పులు చేర్పులకు లోనై నేడు శిథిలావస్థకు చేరిందని చెప్పవచ్చును. భువనగిరి దుర్గంలోను, నగరంలోను అనేక శాసనాలు లభించాయి.

కొలనుపాక
యాదాద్రి భువనగిరి జిల్లాలో గల ప్రముఖ పర్యాటక కేంద్రం జైన క్షేత్రం కొలనుపాక. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ శ్వేతాంబర జైన క్షేత్రం రాష్ట్రకూట, కళ్యాణీ చాళుక్యుల కాలంలో ప్రాంతీయ రాజధానిగా వుండేది. కాకతీయుల కాలంలో రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుని శాసనం ఇక్కడ ఉన్నది. తెలంగాణాలోనే బహుశ అత్యధిక, శాసనాలు లభించిన నగరం ఈ కొలనుపాక. చారిత్రకంగా కొలనుపాకని కొల్లిపాక, కుత్‌పాడ్‌, కొట్టచపాక, కుల్పాక అని వివిధ పేర్లతో పేర్కొన్నారు. అలాగే ఛింతావతీపురం, వాఖ్యనగరం, సరోవర కుటీరం, సోమశేఖరపురం, కుదుటపురం అని పురాణాల్లో పిలిచేవారని పరిశోధకుల అభిప్రాయం. ఆ జైన క్షేత్రాన్ని మేఘ చంద్రమలధారి వారి శిష్యపరంపరలోని నందసూరి, పద్మప్రభ, సిద్ధాంత దేవముని, మాదవేందు, జయ చంద్ర సూరి వంటి ప్రధానాచార్యులు దర్శించి, కొంతకాలం నివసించి జినాలయ నిర్మాణ నిర్వహణలలో ప్రముఖ పాత్ర వహించారు. దీని నిర్మాణాన్ని తొలిసారిగా కాలచూరి వంశస్థులు ఆరంభించారు. తర్వాత రాష్ట్ర కూటులు, కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలంలో దినదినాభివృద్ధి చెందింది. పరమారవంశానికి చెందిన జగద్దేవుడీ ప్రాంతాన్ని పాలించాడని శాసనాధారాలున్నాయి.

కొలనుపాకలో జైనతీర్థంకరులందరి విగ్రహాలు, వారి శాసన దేవతలతో ఉండేవని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడ మాణిక్యదేవ్‌, ఆదినాధ్‌దేవ్‌ (రిషభదేవ్‌) శ్రీ మహావీర్‌, పార్శ్వనాథ్‌ జీ, శాంతినాథ్‌, చంద్రప్రభు, మణిభద్ర, ద్వాదశ భుజ పద్మావతి, చక్రేశ్వరిల విగ్రహాలున్నాయి. ఈ పాలరాతి ఆలయంలో ప్రధానమైన మహావీరుని విగ్రహం అత్యంత విలువైన జైడ్‌ రాయితో చెక్కబడి ఫిరోజ్‌ రత్నాలతో అలంకరింపబడి వున్నది. అలాగే ఆదినాథ్‌ విగ్రహం ‘కసూటి’ అన్న రాయితో చెక్కబడినది. ఇది ధగ ధగ మెరిసే వెండి కిరీటంతో ఆలయంలో వింత కాంతితో శోభిస్తోంది.

కొలనుపాకలో జైన ఆలయంతో పాటు స్వయంభూ సోమనాథ ఆలయం, వీరనారాయణ ఆలయం కోటి లింగాల శివాలయంతో పాటు రాష్ట్ర వారసత్వ శాఖవారి ప్రాంతీయ వస్తు ప్రదర్శనశాల వున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఇది తొలి ప్రాంతీయ ప్రదర్శన శాల. దీనితో కళ్యాణీ చాళుక్యుల ద్వార తోరణంతోపాటు, వారి కాలం నాటి శిలాదీపస్తంభం, చక్కటి వినాయకుని విగ్రహాలు, సూర్య సరస్వతి, షణ్ముఖ రామ విగ్రహాలతో పాటు హనుమంతుని కుమారుడుగా చెప్పబడే మత్స్య వల్లభుని నిలువెత్తు శిల్పం ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడాలేదు. వీటితో పాటు చాముండి, గజలక్ష్మి నటరాజ, భైరవ, బ్రహ్మ, సప్త మాతృకల విగ్రహాలున్నాయి. అనేక రాజవంశాలకు చెందిన రాజులిచ్చిన శాసనాలు అనేకం ఇక్కడ భద్రపరచబడ్డాయి.

రాచకొండ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మరొక పర్యాటక ప్రదేశం రాచకొండ. ఇది చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌లో నారాయణపురం మండలంలో మండల కేంద్రానికి 12 కి.మీ. దూరంలో ఉన్నది. ఇది కూడా గిరి దుర్గమే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కి ఆగ్నేయ దిశలో 4కి.మీ. దూరంలో, అత్యంత సమీపంలో ఉన్న హిందూ దుర్గమిది. కాకతీయులకు సామంతులుగా, తదనంతరం స్వతంత్ర రాజులుగా రాజ్యాన్ని ఏర్పరచుకున్న ‘ఆమనిగంటి పురవరాధీశ్వరుగా’ చెప్పుకున్న పద్మనాయకుల రాజధాని ఇది. వెలుగోటి వారి వంశావళి ప్రకారం ఈ పద్మనాయకులు ఈ రాచకొండ నుండే రాజ్యపాలన ఆరంభించి తర్వాత దేవరకొండ తదితర ప్రాంతాలకు విస్తరించారు. ఈ రాచకొండనే రాజిరి, రాజాచలము అని కూడా అనేవారు.

రాచకొండ దుర్గాన్ని మొదటి సింగమనాయకుని కుమారుడైన అనపోతానీడు నిర్మించాడు. ఈ రాచకొండ ఎత్తు పల్లములు గల లోయ చుట్టూ వున్న పర్వత సముదాయం. ఇది పడమర నుండి తూర్పుకు ఏటవాలుగా వున్న రెండు పర్వతాల ఉపరితలంపై నిర్మించబడ్డ కోట. ఉత్తరం వైపున పర్వతానికి గుర్మాల కోనేరుకొండ అని పేరు. ఈ కొండ పై కోనేటిలో గుర్రాలు నీరు తాగేవి కనుక దీని గుర్రాల కోనేటి కొండ అంటారు. దీన్ని నాగనాయని కొండ అని కూడా అంటారు. ఈ నాగనాయడు మొదటి అన పోనీడు పిన తండ్రి కుమారుడు. ఇక దక్షిణం వైపున్న పర్వతానికి కచేరీ కొండ అని పేరు. దీన్ని రాచకొండ అని కూడా అంటారు. రాచకార్యక్రమాలు ఇక్కడి నుండే జరుగుతాయి గనుక దీనికాపేరు వచ్చింది.

భూమి నుండి సుమారు 800 అడుగుల ఎత్తునగల దీని పైభాగానికి చేరడానికి అనేక దర్వాజాలు మెట్లు వున్నాయి. ఈ దర్వాజాలకు అష్ట దిగ్బంధయంత్రాలు చెక్కబడ్డాయి. ఇక్కడ అనేక భైరవ, ఆంజనేయ విగ్రహాలు కన్పిస్తాయి. పద్మనాయకులు వైష్ణవులైనా కూడా ఈ భైరవుల విగ్రహాలను దుర్గ రక్షకులుగా ఏర్పరచినారు. అలాగే అక్కడక్కడ రాతి గుండ్లపై గరుడ విగ్రహాలు కన్పిస్తాయి. కొండపై విశాల వీధుల గుర్తులు శిథిల గృహాలు, నాట్యమండపాలు, కచేరీ మండప మందిర శిథిలాలు, ఆలయాల శిథిలాలు, ధాన్యాగారాల ఆనవాళ్ళు కన్పిస్తాయి.

ఇక్కడున్న ఒక మందిరంలోనే పోతన, భోగినీ దండకం రాశాడని ఒక మండపాన్ని చూపిస్తారు. కచేరి చావిడికి కొద్ది దూరంలో సంకెళ్ళ బావి వున్నది. దీనితో పాటు గుట్టలపై అనేక సరస్సులు, నీటి చెలమలు కనిపిస్తాయి. ఈ రాచకొండ వద్ద అనేక తెలుగు, పార్శీ, అరబ్బీ శాసనాలు లభించాయి.

ఇంద్రపాల నగరము లేక ఇంద్రపాల పురం
యాదాద్రి జిల్లాలో మరొక ప్రముఖ చారిత్రక ప్రదేశం ఇంద్రపాల నగరం లేక ఇంద్రపాలపురం. కీ.శే. బి.యన్‌. శాస్త్రి పరిష్కరించి, ప్రకటించిన తుమ్మ గూడెం తామ్ర శాసనాలు ఈ ఇంద్రపాల నగర ఘనతని వెలుగులోకి తెచ్చాయి. తెలుగు వారిని ఏకంచేసి పరిపాలించిన విష్ణుకుండినుల తొలి రాజధాని ఈ తుమ్మల గూడెం అని పిలవబడుతున్న ఇంద్రపాలపురం లేక ఇంద్రపాల నగరం. చిట్యాల భువనగిరి మార్గంలో వున్న ఈ గ్రామాన్ని ఆనుకొని వున్న చెరువు కట్టను ఆనుకొని మూసీనది పొడవునా రెండు కి.మీ. మేర ఇంద్రపాల నగర శిథిల చిహ్నాలు కన్పిస్తాయి. ఈ ఇందప్రాల నగరం నుండే విష్ణు కుండి వంశ స్థాపకుడైన మహారాజేంద్ర వర్మ తన పాలననారంభించాడు. ఇంద్రపాల నగరం గుట్టపైకి మెట్లున్నాయి. గుట్టపైన విహార శిథిలాలుగా ఇటుకల ముక్కలు తదితరాలు కన్పిస్తాయి. ఇంద్రపాల నగరంలోనే మహాదేవి విహారం ఉండేది. వ్యవసాయ కార్యకలాపాల వల్ల చారిత్రక ఆనవాళ్ళు నశించిపోయినవి. అట్లే తుమ్మల గూడెం ఉత్తరంగా నాగారానికి ఈశాన్యంగా మూసీ నదిని ఆనుకొని వున్న గుట్టపైన విష్ణు కుండినుల నాటి బలిష్టమైన దుర్గమున్నది. ఈ దుర్గానికి 12 బురుజులున్నాయి. గుట్ట మీదకు పోతుంటే 12 స్తంభాల మండపం కనిపిస్తుంది. మండపానికి వున్న ద్వారం సింహ ద్వారంలా కనిపిస్తుంది. గుట్టమీదనే పడమటి దిశలో పెద్ద కోనేరున్నది. దీన్ని ఏనుగులబావి అంటారు. గుట్టమీదనే అమరేశ్వరాలయం అని పిలవబడే శివాలయం, ఎల్లమ్మ గుడి వున్నాయి. ఇక్కడే పరుశురాముని పాదాలు చెక్కబడి వున్నాయి. గుట్టపై ఆలయంలోనే రాష్ట్ర కూటుల నాటి శాసనాలు 2, మరొక తెలుగు శాసనం ఉన్నాయి.

గుట్ట కింది భాగంలో కొద్ది దూరంలో పంచలింగేశ్వరాలయం, తదితర ఆలయాలు శిథిల ఆలయ మండపాలు ఉన్నాయి. ఇక్కడే గుట్టకు జైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఇంద్రపాల నగరం చారిత్రక యుగంలో బౌద్ధ, జైన, హైందవ మతాల సమ్మేళనంగా విరాజిల్లినదని చెప్పవచ్చు.

రాజపేట, సంస్థాన్‌ నారాయణపురం, నిజాం రాష్ట్రంలో గద్వాల, వనపర్తి, అమరచింత వంటి సంస్థానాలకు స్వంత పరిపాలనాధికారాలుండేవి. కానీ మరి కొన్ని సంస్థానాలకు ఇలాంటి అధికారాలు వుండేవి కావు. అట్లా స్వయం పాలనాధికారాలు లేని సంస్థానాలు రాజపేట సంస్థాన్‌ నారాయణపూర్‌లు, ఇవి రెండూ నిజాం కాలంలో రెడ్డి కులస్థుల ఏలుబడిలోనే ఉన్నాయి.

కొలనుపాక నుండి 28 కి.మీ. దూరంలో వున్న రాజపేట కోట (గడి) యాదాద్రి జిల్లాలోని మరొక పర్యాటక కేంద్రం దీన్ని రాజారాయన్న 1775లో నిర్మించాడు. రాయన్న దట్టమైన అడవిలో కోటని, నగరాన్ని నిర్మించి దానికి రాయన్న పేట అని పేరు పెట్టాడు. అదే కాలక్రమేణ ‘రాజపేట’గా మారింది. శత్రుదుర్భేద్యమైన రాతిగోడలు, కోట చుట్టూ లోతైన కందకం ఉన్నాయి. కోట ముఖద్వారం పెద్ద పెద్దతలుపులతో, ఇనుప గుబ్బలతో బాగా బలిష్ఠంగా ఉన్నది. ముఖద్వారం నుండి లోపలికి రాచమార్గం చక్కగా నిర్మితము. కోటలోపల సుందరభవనాలు, రాణుల అంతఃపురాలు, స్నాన వాటికలు, అతిథి గృహాలు, అద్దాలమేడ (ప్రస్తుతం ఇవి పూర్తిగా కూలిపోయాయి) బావులు, చెరువులు మున్నగువాటితో చక్కని దర్శనీయ స్థలంగా మారింది. ఇక్కడే నిజాం కాలంనాటి ఐపి (పోలీస్‌ అధికారి) భూపాల్‌ సమాధి ఉన్నది. ప్రస్తుతం రాజవంశీయులు హైదరాబాద్‌లో ఉండటంతో కోట పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.