|

తెలంగాణ చరిత్ర – విహంగ వీక్షణం

Telanganaవృత్తిరిత్యా జర్నలిస్టు కాకపోయినా, జర్నలిస్టుకన్నా రెండాకులు ఎక్కువగా సమకాలీన రాజకీయాలను, సామాజిక పరిణామాలను నిరంతరం అధ్యయనంచేస్తూ నిష్పక్షపాతంగా విశ్లేషిస్తున్న ఆధునిక చరిత్రకారుడు, పరిశోధకుడు`జి. వెంకటరామారావు.

ఎంతోకాలం క్రితం ‘‘ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర`సంస్కృతి, రాజకీయాలు’’, ‘‘ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ప్రధాన ఘట్టాలు’’, ‘‘చరిత్ర`ఆధునికయుగం’’, ‘‘ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ చరిత్ర’’, ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్ర’’లాంటి పలుగ్రంథాలు రచించిన వెంకటరామారావు కొంతకాలం క్రింతం ‘‘తెలంగాణ విద్యా సాంస్కృతిక రంగాల చరిత్ర’’ శీర్షికన ఒక లఘుగ్రంథాన్ని రచించారు. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తాజాగా ఆయన ‘‘తెలంగాణ చరిత్ర’’ గ్రంథాన్ని వ్రాశారు. ఎనభై సంవత్సరాల వయస్సు అనారోగ్యాన్ని ప్రక్కనపెట్టి యువరచయితలతో పోటీపడుతూ అతి తక్కువ సమయంలో ఈ 362 పేజీల బృహత్‌ గ్రంథాన్ని రచించడం విశేషం. ఈ గ్రంథాన్ని చదవడం ప్రారంభిస్తే ఒక నవల చదువుతున్నంత ఆసక్తిగా, అది పూర్తయ్యేవరకు విడవకుండా అందులోనే మునిగిపోయే సరళ సువివరమైన శైలిలో రచించారు.
రెండు భాగాలుగా రచించిన ఈ గ్రంథంలో మొత్తం 52 శీర్షికలున్నాయి. తొలిభాగం క్రీ.పూ. 225నాటి శాతవాహనులతో ప్రారంభించి`ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయకులు, హిందూమత పునరుద్ధరణ `భక్తి ఉద్యమం, బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీ నవాబులు, నిజాం రాజ్యస్థాపన`ఏడుగురి పాలన దాకా ప్రాచీన రాచరిక వ్యవస్థ గురించే సుమారు వందపేజీల్లో వివరించారు.

‘‘చాళుక్యుల’’ గురించి చెప్పినప్పుడు`‘‘రాజరాజ నరేంద్రుడు నన్నయభట్టారకునిచేత మహాభారతాన్ని తెనిగించడానికి ముందే బోడ వంశపురాజైన నన్నెచోడుడు ‘‘కుమార సంభవము’’ అనే గ్రంథాన్ని రచించాడని’’ (పేజీ : 23, పంక్తులు : 13`15) స్పష్టం చేసిన వెంకటరామారావు ఈ అంశాన్నే తీసుకుని ప్రత్యేక శీర్షికపెట్టి నిజాలు బయటపెడుతూ వివరణాత్మకంగా వ్రాసి ఉంటే చాలా బాగుండేది. శ్రీమదాంధ్ర మహాభారతాన్ని తెనిగించిన నన్నయ ప్రధమాంధ్రకవి కాదని కీర్తిశేషులు బి.ఎన్‌. శాస్త్రి సిద్ధాంత వ్యాసం వ్రాశారు. అయితే నన్నయ ప్రథమాంధ్రకవి కాదన్న సత్యం మింగుడుపడని ఉస్మానియా విశ్వవిద్యాలయం అప్పటి ఆచార్యుల వైఖరికి నిరసనగా బి.ఎన్‌. శాస్త్రి తనకు పి.హెచ్‌డి అక్కరలేదని ఆ పరిశోధన సామగ్రిని అటకెక్కించారు.

ఇకపోతే`‘‘బహమనీ సుల్తానులు’’లో ఫిరోజ్‌షా అనతికాలంలోనే విషయలోలుడుగా మారిపోయాడు. ప్రతిరోజూ ఎనిమిది వందల మంది నెరజాణలను చేర్చుకునేవాడు. (పేజీ : 55Ñ పంక్తులు : 1`3) అని వ్రాశారు. ప్రతి రోజు అంతమంది నెరజాణలు దొరికేవారా? అని అనుమానం వస్తుంది. హైదరాబాద్‌ నగర నిర్మాత`మహ్మద్‌ కులీకుతుబ్‌షా గురించి వ్రాసిన అధ్యాయంలో ఎక్కడా ఆయన ప్రేయసి భాగమతి ప్రస్తావన ఎందుకు చేయలేదో! తెలియదు.

ఆబుల్‌ హసన్‌ తానీషా… వాళ్ళ నృత్యాన్ని చూసి ఇంకా అభివృద్ధి పరచండి అంటూ ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరు కుటుంబాల వారికి కూచిపూడి అగ్రహారాన్ని దానమిచ్చాడు. (పేజీ : 69Ñ పంక్తులు 9`10) అని ఉంది. తానీషా ఇనాముగా ప్రకటిస్తూ ఫర్మానా జారీచేసిన కూచిపూడి అగ్రహారం భూములు కేవలం ఆరు కుటుంబాలకు మాత్రమే కాదు. అక్కడ వర్థిల్లిన వేదాంతం, వెంపటి, హరి, భాగవతుల, పసుమర్తి, జోశ్యుల, మహంకాళి, ఏలేశ్వరపు, చింతా, తాడేపల్లి, బొక్కా వారికి చెందిన పదకొండు వంశాలవారికి ఆ భూపంపిణీ జరిగింది.

మొదటి నిజాం ఢిల్లీ నుండి దక్కను వస్తున్నప్పుడు ఆకలి దప్పులతో ఖుల్దాబాద్‌ సమీపంలో ఒక ఫకీరు కుటీరంలోకి వెళ్ళాడట. అప్పుడు ఆ ఫకీరు కొన్ని రొట్టెలు తెచ్చి నిజాం ముందు పెట్టాడట. ఏడు రొట్టెలు తినగానే నిజాం కడుపు నిండిపోయిందట. మరొకటి తినమని ఫకీరు ఎంతచెప్పినా నిజాం ఒక్క ముక్కయినా తినలేకపోయాడట. అప్పుడు ఆ ఫకీరు`నీ వంశం ఏడో తరంతో అంతరించి పోతుందని జోస్యం చెప్పి, తన భుజంమీద ఉన్న పసుపుపచ్చబట్ట నిజాం తలకు చుట్టి ఆశీర్వదించి పంపాడట. ఆనాటి పసుపు పచ్చబట్ట, దాని మధ్య గుండ్రటి రొట్టెముక్క నిజాం ప్రభుత్వ పతాకమైంది. (పేజీ:80, పంక్తులు: 19`27)అని ఆసక్తి దాయకంగా నిజాం పతాకం వెనకగల కథను పసందుగా చెప్పారు. ఇలా ఇంకా ఎన్నో కథలు సందర్భోచితంగా ఆయన ప్రస్తావించారు.

ఇరవయ్యవ శతాబ్దం రెండో దశాబ్ది ప్రారంభంలో గద్దెనెక్కిన ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలన నుంచి నవ తెలంగాణ ఆవిర్భావందాకా సమకాలీన చరిత్ర 262 పేజీలు సాగింది. రెండోభాగం`ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంతో ప్రారంభించి పెద్దమనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ, తెలంగాణ ఉద్యమం, పి.వి. పాలన, జలగం వెంకళరావు పాలన, ఐదేండ్లలో నలుగురు ముఖ్య మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ముగ్గురు ముఖ్యమంత్రులు, ఎన్టీఆర్‌ పతనం, చంద్రబాబునాయుడు రెండవపాలన, తెలంగాణ రాష్ట్ర సమితి, నవ తెలంగాణ ఆవిర్భావం అంశాలను కేవలం తొంభై పేజీల్లో కుదించారు.

మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలననుంచి విద్య, విజ్ఞానం, సంస్కృతి, ఆంధ్రజన సంఘం, ఆంధ్రమహాసభలు, గ్రంథాలయాలు, పత్రికలు, ముల్కీ కథనం, మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముసల్మాన్‌ రాజకీయాలు, ఆర్య సమాజ్‌ పోరాటాలు, స్వాతంత్య్రోద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం, సోషలిస్టు పోరాటాలు, తెలంగాణలో గాంధీ పర్యటనలు, స్టేట్‌ కాంగ్రెస్‌ ఉద్యమాలు, పరిటాల ప్రజా ఉద్యమం, పోలీసు చర్య, సైనిక`సివిల్‌ ప్రభుత్వాలు, స్టేట్‌ కాంగ్రెస్‌ వ్యవహారాలు, మొదటి సార్వత్రిక ఎన్నికలు, బూర్గుల మంత్రివర్గం, భూదాన ఉద్యమం, భాషా రాష్ట్రాల ఆందోళన, నాటి ప్రభుత్వం దాకా దాదాపు 170 పేజీలు సాగింది. ఒకటి రెండు స్వల్ప అక్షరదోషాలు మినహా ఈ గ్రంథం ఆసాంతం అపూర్వమైంది. అందరూ పఠించదగింది.