రంగుల పండుగ

రంగుల-పండు242వసంతం ఋతువులలో భగవత్స్వరూపంగా ప్రశంసింపబడినది. భగవద్గీతలో ‘‘ఋతూనాం కుసుమాకర:’’ అనడం దీని వైభవాన్ని చాటడమే. వసంతశోభను ప్రకటించే ఉత్సవాలలో ఉగాదికంటె ముందు వచ్చేది కామదహనం (హోలి), వసంతపంచమి. మాఘశుద్ధ పంచమికే వసంత పంచమి అనిపేరు. ఇది సరస్వతీదేవి జయంతిని జరుపుకొనే పరమ పవిత్రమైన దివసం. చైత్ర, వైశాఖ మాసాలు వసంతర్తువుగా పరిగణింపబడుతున్నా, విరగబూసిన మామిడిగున్నలు, చిగురుటా కులతో ఒప్పే వృక్షసంతతి, కుహూనాదాలు చేసే కోకిలలు పుష్య మాఘమాసాల్లోనే వసంతలక్ష్మికి స్వాగతం పలుకడం గమనించ వచ్చు. కాలం వెనుకకు నడుస్తుందట! అతి ప్రాచీనకాలంలో వసంత సంపాతం మృగశిరకార్తిలో జరిగేదట. ఇపుడు చైత్రాన్ని కూడా దాటి పుష్యంలోకి వెళ్ళింది. లోకమాన్య తిలక్‌ చెప్పిన ఈ ఘటన నిజమనితేలింది.

ఆపై వచ్చే వసంతోత్సవం కాముని పున్నమ. కామదహనం జరిగేది ఇప్పుడే. ఇదే హోళీ పండుగగా అఖిలభారతం ప్రసిద్ధిగాంచింది. ప్రాణులలో గల భయం తొలగుటకై ఫాల్గుణ పూర్ణిమనాడు ఢుంఢా అనే రాక్షసి ప్రీత్యర్థం దొంగిలించి తెచ్చిన కట్టెలు, పిడకలతో అగ్నిని వ్రేల్చి, నారికేళ ఫలాదులను అందువేసి, ఎదుటివారిని బూతుకూతలుకూస్తూ, పరిహాసం చేస్తూ క్రీడించవలెనని ధర్మశాస్త్రం చెపుతున్నది. బుక్క గులాలు చల్లుకోవడం, రంగులు చిమ్మడం వసంతమాడుకోవడమే. తెలంగాణలో ఈ పండుగకు కామదహనమనే ప్రసిద్ధి.

సర్వలోక కంటకుడైన తారకాసురుని వధ శివపార్వతులకు కలిగిన కుమారుని వల్లనే సాధ్యమని బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలకు చెపుతాడు. సతీదేవి తండ్రివలన పరాభవం పొంది, ఆత్మార్పణ కావించుకొన్నతర్వాత దక్షాధ్వరం ధ్వంసమైంది. పరమశివుడు హిమాలయం చేరుకొని ఘోరమైన తపస్సులో నిమగ్నుడౌతాడు. శివుని తపస్సులను భగ్నంచేసి, అతనికి పరిచర్య చేస్తున్న సౌందర్య రాశియైన పార్వతిపై అనుంక్తుణ్ణి చేయవలసినదిగా మన్మధుని ఆజ్ఞాపిస్తాడు ఇంద్రుడు. రతీవసంతులు తోడురాగా మదనుడు శివుని తపోభూమి చేరుకొని, అకాల వసంతశోభను ప్రసరింప జేసి, చెరుకువింటితో పుష్పబాణాలను ఆ తపస్విపై ప్రయోగిస్తాడు. తపస్సు ముగించి కన్నులు తెరచినంతనే పరిచర్య చేస్తున్న పార్వతిపై చూపులు ప్రసరించినవి. పరమశివుని యెడదలో అనురాగ తరంగాలు చెలరేగినవి. ఈ భావ వికారానికి కారణమేమని ప్రక్కకు చూచేసరికి పుష్పబాణాలను వేస్తున్న మన్మధుడు కంటబడ్డాడు. క్రోధంతో రుద్రుని తృతీయనేత్రం విచ్చుకొని వెడలిన మంటలకు మన్మధుడు భస్మమైనాడు. ఇదే కామదహనం. భగవంతుడు భౌతిక సౌందర్యానికి లోబడడు. తపోమహత్యంవల్ల వ్యక్తమైన ఆత్మసౌందర్యం వల్లనే వశుడౌతాడని తెలిసిన పార్వతి, నారచీరలు దాల్చి, పంచాగ్ని మధ్యంలో తపమాచరించి, పరమేశ్వరుని మెప్పించి అర్థాంగియై మదనుని పునరుజ్జీవింపజేయడం తర్వాతి సంగతి.

పల్లెపట్టులలో నేటికీ ఫాల్గుణ శుక్ల పక్షంలో కామదహనానికి పూర్వరంగంగా, అప్పటి వసంతోదయానికి గుర్తుగా మునిమాపు యువకులు జింకలు, ఎలుగుబంట్ల వేషాలు వేసుకొని వీధులలో పాటలు పాడుతూ ప్రదర్శనలిస్తుంటారు. యువతులు మట్టితో కాముని మూర్తినిచేసి, పళ్ళెంలో పెట్టి ‘‘మురుచుకుంటరావోయ్‌ కామయ్య నా ముత్యాల పందిరికిందీకి’ అని పాటలు పాడుతూ, కాముని ఊరేగిస్తారు. రాత్రి కామదహనం చేసిన తర్వాత మరునాడు రంగులు చల్లుకొంటూ వసంతోత్సవం జరుపుకొంటారు.ఫాల్గుణకృష్ణ ప్రతిపదనాడు వసంతోత్సవం జరుపుకోవలెనని ధర్మశాస్త్రం నిర్దేశిస్తున్నది. స్నానానంతరం నూత్నవస్త్రంపై కూర్చొని, ముత్తైదువలచే మంగళహారతి తీసుకొని చందన మిశ్రితమైన మామిడి పూతను భక్షించాలి.

అంకెల్లో ఉగాది

రంగుల-పండుగ22ఉగాది శబ్దం యుగాదికి వికృతి. కర్ణాటకులు దీన్ని యుగాది అనే పిలుస్తున్నారు. ఇప్పటి కలియుగం చైత్రశుక్ల ప్రతిపదనాడు ప్రారంభమైంది కనుక దీన్ని ఉగాది అని అంటున్నాం. ప్రభవాది సంవత్సరాలు కూడా నేటితోనే మొదలైన కారణంగా సంవత్సరాదియని పేర్కొంటున్నాం. యుగం అనేది కాలగణనకు సంబంధించింది. కాలం పరమాత్మునివలె అనంతం, సర్వవ్యాపకం అయినందు వల్ల మహాకాలునిగా ఆరాధిస్తున్నాం. సృష్టి, స్థితి, లయాలకు ఈ కాలమే కారణం. కాలం అఖండమైనా క్షణం, ఘటిక మొదలుకొని కల్పం వరకు అనేక భేదాల్లో విభక్తమైంది. మన వ్యవహారం కొరకు కాలాన్ని సంవత్సరం, అయనం, ఋతువు, మాసం, పక్షం, దివసం అనే ఆరు భేదాలుచేసి కర్మాచరణకై సంకల్పాదులందు ఉపయోగిస్తున్నాం.

అందు సంవత్సరం చాంద్రమానం, సౌరమానం, సావనమానం, నక్షత్రమానం, బార్హస్పత్యమానం, అనే ఐదుమానాలు మనదేశంలో ప్రచలితమై ఉన్నవి. అందు చాంద్రమాన సంవత్సరానికి శుక్లప్రతిపద మొదలుకొని కృష్ణ`అమావాస్యతో అంతమయ్యే మాసాలు పన్నెండు చైత్రాది నామాలతో పేర్కొనబడుతున్నవి. ఇందులో దినాలు 354. అధికమాసం వచ్చినపుడు 13 మాసాలుంటవి. ఈ చాంద్ర సంవత్సరానికే ప్రభవాది అరవైపేర్లు వాడుతున్నాము.

సౌరమాన వత్సరానికి సూర్యుడు మేషం మొదలు 12 రాసులలో సంచరించేసరికి పన్నెండు మాసాలకు 364 దినాలు అవుతవి. సావన సంవత్సరానికి 360 దినాలు. నక్షత్రమాన సంవత్సరానికి 324 దినాలు. మేషం మొదలైన వాటిలో ఒక రాశిలో బృహస్పతి సంచరించుసరికి బార్హస్పత్యమాన వత్సరమవుతుంది. దీనికి 361 దినాలు. ఈవిధంగా సంవత్సరం ఐదు విధాలైనా కర్మా చారణలో చాంద్రమాన సంవత్సరాన్నే వాడడం శాస్త్ర సమ్మతం.

దక్షిణాయనం, ఉత్తరాయణం అని అయనాలు రెండు విధాలు. సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించి క్రమంగా ఆరు రాసులు సంచరిస్తే అది దక్షిణాయనం. మకర సంక్రాంతి మొదలుకొని ఆరు సంక్రాంతులు అయ్యేసరికి ఉత్తరాయణం అనబడుతుంది. ఇక అశ్విని, భరణ్యాది నక్షత్రాలు, వసంతాది ఋతువులు అందరికి తెలిసినవే.

చైత్రాది మాసాలపేర్లు పొద్దువోక పెట్టుకొన్నవి కావు. అవి శాస్త్రీయమైన సార్థకనామాలు. ఏ పూర్ణిమనాడు చిత్రానక్షత్రంలో చంద్రుడు కూడి ఉంటాడో ఆ నెలకు చైత్రమని పేరు. అట్లే ఏ పూర్ణిమకు జ్యేష్ఠా నక్షత్రంతో చంద్రుడు కూడి ఉంటాడో అది జ్యేష్ఠమాసమని, కృత్తికతో కూడి ఉంటే కార్తికమాసమని పేర్లు వచ్చినవి. తక్కిన నెలలపేర్లు కూడా ఇట్లే ఏర్పడ్డవి. ఆంగ్లమాసా లైన జనవరి మొదలైన వాటి పేర్లకు ఈ శాస్త్రీయతలేదు. ఆగస్టస్‌ అనే రాజు పేర ఆగస్టు వచ్చింది. అట్లే తక్కిన మార్చ్‌ మొదలైన నెలల పేర్లు వచ్చినవి. దక్షిణాపథంలో శాలివాహనశకం, వింధ్యకు ఉత్తరాన విక్రమశకం ప్రచారంలో ఉన్నవి.

మనుస్మృతిలోను, శ్రీమద్భాగవతంలోను యుగాలకు కాలగణనచేస్తూ కృతాదియుగాలకు లక్షలకొలది, వేలకొలది సంవత్సరాలు చెప్పబడినవి. కొందరను కొన్నట్లు ఇవి పుక్కిటి పురాణాలుకాని, అభూత కల్పనలుకాని కావు. జ్యోతిశ్శాస్త్ర, గణితశాస్త్రాల ఆధారంగా జ్యోతి శ్శాస్త్రజ్ఞు లు భూమికి, సూర్యుని, గ్రహ నక్షత్రాలకు గల సంబం ధాలను తరచి, ప్రామాణికంగా ఈ కాలాదులను నిర్ణయించి నారు. ఆధునిక ఖగోళ శాస్త్రంతో సమన్వయించి చూస్తే వాటి ఔచిత్యం వెల్లడి కాగలదు.

యుగాలు: ఆధునిక ఖగోళ శాస్త్ర నిర్ణయాలతో సమన్వయం:-

రంగుల-పండుగ2ఉగాదిని చైత్రశుద్ధ ప్రతిపదనాడు జరుపుకొంటాం. ఇది ప్రస్తుత కలియుగ ప్రారంభ దివసం కనుక ప్రతి ఏడు ఈ దినాన్ని యుగాదిగా, ఆ సంవత్సరానికి మొదలుగా నిర్ణయింపబడినది. సంవత్సరంలో, కాలంలో వచ్చే మార్పు ఋతువుల రూపంలో కనిపిస్తుంది. వాటిలో వసంతర్తువు నూతన త్వానికి చిహ్నం కనుక వత్సరారంభం వసంతంలో జరుపబడుతుంది. కలియుగ` ఉత్తరాయణంలో భాగంగా సూర్యుడు భూమధ్య రేఖను దాటగా వసంత విషువత్తు (Spring equinox) తర్వాత వచ్చిన మొదటి పాడ్యమి చైత్ర మాసానికి సంబంధించింది కావడం వల్ల చైత్రమాసం మొదలుగా సంవత్సరాలను గణిస్తున్నట్లు గుర్తించవచ్చు. విషువత్తంటే రాత్రిం బవళ్లు సమంగా ఉండేకాలం.

యుగాలు రెండు విధాలు: (1) మానవయుగాలు (2) దివ్యయుగాలు. మనుస్మృతినిబట్టి ఒక చతుర్యుగం (మహాయుగం) 12000 ఏండ్లు. దానిని పది భాగాలు చేస్తే ఒక భాగం (1200 ఏండ్లు) మానవ కలియుగం. దాని రెండు భాగాలు (2400 ఏండ్లు) మానవ ద్వాపరయుగం. మూడు భాగాలు (3600 ఏండ్లు) త్రేతాయుగం, నాలుగు భాగాలు (4800 ఏండ్లు) మానవుల కృతయుగం.

ఆధునిక ఖగోళశాస్త్రాన్ని అనుసరించి భూమి ఆత్మ భ్రమణ అక్షం ఒక ప్రక్కకు వంగి బొంగరపు అక్షంవలె తిరుగుతుంది. ఈ అక్షం (ఇరుసు) ఒక చుట్టు తిరుగుటకు 24000 సంవత్సరాలు పడుతుంది. ఈ అక్ష భ్రమణం కారణంగానే విషువత్తులు సంభవించే దినాలు మారుతుంటవి. అందు 12000 ఏండ్లకు తిరిగి మళ్ళీ అదే సమయంలో, అదే దినంలో విషవత్తులు వస్తవి. ఈ కాలాన్నే మానవుల చతుర్యుగం (మహాయుగం)గా పేర్కొనటం గమనించవచ్చు. (One arc of precession of equinoxes is one mahayuga) ఇటువంటి 365 మహాయుగాలు కలిసిన దేవతలకు ఒక మహాయుగం అవుతుంది. దీనికే దివ్యయుగం అనిపేరు. భాగవతంలో చెప్పబడి జగద్వితీయమైన ఈ దివ్యయుగానికే ఆ తర్వాత యుగం అని వ్యవహారం కలిగింది.

మహాయుగం – 43,20,000 సం॥లు (R10 కలియుగాలు)
కలియుగం – 4,34,000 సం॥లు (R 1 కలియుగం)
ద్వాపరయుగం – 8,64,000 సం॥లు (R2 కలియుగాలు)
త్రేతాయుగం – 12,96,000 సం॥లు (R3 కలియుగాలు)
కృతయుగం – 17,28,000 సం॥లు (R4 కలియుగాలు)

ఆధునిక ఖగోళశాస్త్రాన్ని బట్టి భూమి, సూర్యునిచుట్టూ తిరిగే కక్ష్యలు (ఆర్బిట్స్‌) స్థిరంగా ఉండక వృత్తాకారంగా ఉండి, దీర్ఘవృత్తాకారాలుగల, వివిధ దైర్ఘ్యములుగల వృత్తాలలో తిరుగుతుంది. (orbits of different eccentricity) ఈ కక్ష్యలలోని మార్పుకూడా ఒక క్రమపద్ధతిననుసరించి మారుతూ మరల మరల పునరావృత్తమవుతుంది. ఆధునిక ఖగోళ శాస్త్రపు లెక్కల ప్రకారం ఈ కక్ష్యలలోని దైర్ఘ్యాలలో కలిగే మార్పు 4,13,000 ఏండ్ల కొకసారి మరల మరల పునరావృత్త మవుతుంది. ఇది దివ్యచతుర్యుగంలో 10వ భాగానికి, అనగా, మనం సాధారణంగా చెప్పుకొనే కలియుగానికి సరిపోతుంది. అదేవిధంగా మన్వంతరాలు, కల్పాలు మొదలైన స్థూల కాలమానాల వివేచన చేయదగి ఉన్నది.

దినం అనగా భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుటకు పట్టేకాలం.

మాసం – చంద్రుడు భూమిచుట్టూ తిరుగుటకు పట్టేకాలం
అయనం – సూర్యోదయం తూర్పున ఒకవైపు ఉత్తరంనుండి, మరోవైపు దక్షిణంనుండి కలుగుటకు మధ్యన పట్టుకాలం. 6 నెలలు. ఇది భూమి అక్షం 23% ఒకవైపుకు వంగి ఉండడంవల్ల సంభవిస్తుంది.
సంవత్సరం – భూమి సూర్యునిచుట్టూ తిరుగుటకు పట్టే కాలం
మానవయుగం – భూమి అక్షం తన చుట్టూ తాను తిరుగుటకు పట్టేకాలం
దివ్యయుగం – భూమి సూర్యునిచుట్టూ తిరిగే కక్ష్యల దైర్ఘ్యం మారుతూ, మరల పునరావృత్తం అగుటకు పట్టే కాలం.
ఉగాది పండుగ కాల ప్రాధాన్యాన్ని తెలియజేసే పర్వం కనుక తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల యుక్తమైన పంచాంగాన్ని శ్రవణం చేయడం. ఆ సందర్భంగా బ్రహ్మసృష్టి మొదలు యుగాలు, గ్రహగతులు, వర్షాదులనుగూర్చి తెలుసుకోవడం సంప్రదాయం కనుక జ్యోతిశ్శాస్త్రంలోని కొన్ని రహస్యాలు ఇందు చర్చించనైనది.