వరాల వసంతం పవిత్ర రమజాన్‌ మాసం

By: మహమ్మద్‌ వహీదుద్దీన్‌

పవిత్ర రమజాన్‌ అత్యతంత శుభప్రదమైన మాసం. శుభాల సిరులు వర్షించే వరాల వసంతం. ఈ మాసంలోనే పవిత్ర అంతిమ దివ్యఖుర్‌ఆన్‌ అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది. వేయి మాసాల కన్నా విలువైన రాత్రి  అని చెప్పబడిన ‘లైలతుల్‌ ఖద్ర్‌’ ఉంది. ఈ మాసంలో చేసే ఒక్క సత్కార్యానికి అనేక రెట్లు అధికంగా పుణ్యఫలం లభిస్తుంది. ఒక విధిని ఆచరిస్తే డెబ్బై విధులు ఆచరించిన దానితో సమానమైన పుణ్యం లభిస్తుంది. సమాజంలో మంచి మార్పు కనిపిస్తుంది. ‘ఫిత్రా’ ఆదేశాలు కూడా ఈ మాసంలోనే అవతరించాయి. ఫిత్రా అన్నది పేదసాదల హక్కు. ఫిత్రాల వల్ల వారికి ఆర్థికంగా కాస్త ఊరట లభిస్తుంది. జకాత్‌ కూడా ఈ మాసంలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదసాదల ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. ‘తరావీహ్ నమాజులు’ కూడా ఈ మాసంలోనే ఆచరించబడతాయి. అదనపు పుణ్యాలు మూటగట్టుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. ఈ పవిత్ర మాసంలో ఎవరైతే రోజాలు పాటిస్తారో వారు గతంలో చేసిన పాపాలను అల్లాహ్ మన్నిస్తాడు.

సహనం వహించవలసిన నెల రమజాన్‌

రమజాన్‌ మాసం సహనం, నిగ్రహం పాటించవలసిన నెల. సహనానికి ప్రతిఫలం స్వర్గం. ఇది సమాజంలోని ఉపేక్షితుల పట్ల, బాధితుల పట్ల సానుభూతిని చూపించాల్సిన నెల. శారీరక సాధనాలు, ఆరాధనలు, ఉపాసనలు, గ్రంథపారాయణాలు మనిషి ఆంతర్యంలో పరివర్తన తెస్తాయి. మనిషి ఆలోచనా తీరు మారుతుంది. ఉన్నత ప్రమాణాలు అలవడతాయి. ఫలితంగా మనిషి ప్రవర్తనలో నైతికత, మంచితనం, ప్రశాంతత, నిష్ఠా గరిష్టత, సదాచారం చోటు చేసుకుంటాయి.

మనిషి ఆధ్యాత్మికతకు, సర్వతోముఖాభివృద్ధికి, మనోవికాసానికి రమజాన్‌ దారి చూపిస్తుంది. ఇది విశ్వ ప్రభువు సందేశమైన ఖుర్‌ఆన్‌ పవిత్ర రమజాన్‌ మాసంలో అవతరించింది. మానవాళికి ఈ మాసంలోనే అందించింది. ఈ అంతిమ దివ్యఖుర్‌ఆన్‌ అవతారం సాధారణ విషయం కాదు. ఆజ్ఞానాంధకారంలో మగ్గుతున్న ఆనాటి అరబ్బులను విజ్ఞాన పథంలోకి మార్చి, వారిని విద్యా పోషకులుగా, క్రమశిక్షణా దురంధరులుగా, సంస్కారవంతులుగా చేసింది. బాధితులు అణగారిన వారికోసం, పోరాడే వారిగా మనుషుల్ని తీర్చిదిద్దింది. పవిత్ర ఖుర్‌ ఆన్‌ అవసరార్థుల కోసం, ప్రేరణాత్మక, విప్లవాత్మకమైన జీవన విధానాన్ని, నిరాడంబరమైన నైతిక జీవితాన్ని ప్రపంచానికి అందించింది.

సౌమ్‌ అంటే ఉపవాసం

ఉపవాసాన్ని అరబీ భాషలో ‘సౌమ్‌’ అంటారు. దీని అర్థం ‘ఆగిపోవడం’, నియంత్రించుకోవడం’, ఈ నెలలో ఆహార పదార్థాలకు కొంచెం దూరంగా ఉండటమే కాదు, తమకు తాము చెడు నుండి కూడా దూరంగా ఉంటారు.

సహారీ: రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు మీరు తినండి, త్రాగండి ఆ తరువాత వాటన్నింటిని త్యజించి చీకటిపడే వరకు మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి.

ఇఫ్తార్‌ : సూర్యుడు అస్తమించిన తరువాత ఉపవాసం విరమించడాన్ని ‘ఇఫ్తార్‌’ అంటారు. ఇఫ్తార్‌లో తొందర చెయ్యటం సున్నత్‌. సూర్యుడు అస్తమించినట్లు తెలిస్తే ఉపవాసాన్ని వెంటనే విరమించాలి. అనవసరంగా ఆలస్యం చేయడం ధర్మ సమ్మతం కాదు. సూర్యుడు అస్తమించిన వెంటనే ఇఫ్తార్‌ చెయ్యమని ప్రవక్త (స) ఆదేశించారు కాబట్టి సూర్యుడు అస్తమించిన వెంటనే ఇఫ్తార్‌ చెయ్యడమే ఉత్తమం.

ఫిత్రా నిరుపేదల హక్కు :

ఫిత్రా దానం పేదల పాలిట పెన్నిధి. వారు పండగపూట పస్తులుండకుండా అందరితో పాటు వారు కూడా సంతోషంగా పండుగ పూట గడిపేందుకు దైవం దీన్ని విధిగా చేశాడు. ఫిత్రా దానం వల్ల మూడు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి విశ్వాసి ఫిత్రా చెల్లించి తన ఆనందాన్ని ప్రకటిస్తూ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. రెండు, ఉపవాస స్థితిలో జరిగిన పొరపాట్లు ఫిత్రా చెల్లించడం వల్ల దూరమవుతాయి. మూడు, ఇది నిరుపేదల ఇళ్లల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతుంది. వారు సంతోషంగా పండుగ జరుపుకునేందుకు ఉపయోగపడుతుంది.

సమాజంలో అసమానతలను తొలగించే సాధనం జకాత్‌ :

జకాత్‌ అన్న పదం ‘జక’ నుండి వచ్చినది జక అంటే అర్థం పెరుగుట, ఎదుగుట, వృద్ధి చెందుట, అభివృద్ధి, వ్యాపించుట మొదలైనవి. ఇస్లాంలోని 5 మూల స్థంభాలలో, జకాత్‌ ఒకటి, జకాత్‌ అంటే ప్రతి ధనవంతుడు తన ధనం నుండి కొంత ధనాన్ని అవసరమైన వారికి ఇవ్వడం. నిర్ణీత సమయంలో నిర్ణీత ధనము నుండి నిర్ణీత ప్రజల కొరకు ఇచ్చే ధనమే జకాత్‌.

సదఖా అంటే దాన ధర్మాలు :

విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాదించిన ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవమార్గంలో ఖర్చు పెట్టండి (పవిత్ర అంతిమ దివ్య ఖుర్‌ ఆన్‌) ‘అల్లాహ్ ప్రజలపై ‘సదఖా’ను విధించాడు. అది ధనికుల నుండి వసూలు చెయ్యబడుతుంది. నిరుపేదలకు తిరిగి అందజేయ బడుతుంది’. అని ప్రబోధించారు. అంతిమ దైవ ప్రవక్త (స అసం) ముత్తఫకున్‌ అలైహ్)

తరావీహ్ నమాజ్‌

రమజాన్‌ నెలలోని తరావీహ్ నమాజు పుణ్యం రీత్యా ఎంతో ఘనమయిన నమాజు. దాన్ని నెరవేర్చమని హదీసుల్లో తాకీదు చేయబడిరది. అయినప్పటికి అది సఫిల్‌ నమాజు మాత్రమే.

ఈ సఫీల్‌ నమాజును రమజాన్‌ నమాజుగా పేర్కొనటం జరిగింది. కాని తర్వాతి కాలంలో ఇది ‘తరావీహ్ నమాజ్‌’గా నామాంతరం జరిగింది. తరావీహ్ అనేది తర్వీహ అనే పదానికి బహువచనం. తరావీహ్ అంటే విశ్రాంతి, విరామం అని అర్థం. మహా ప్రవక్త (స) అనుచరులు ఆయన సంప్రదాయానుసారం చాలా సేపు నిలబడి నమాజు చేసేవారు. ఆ విధంగా నాలుగు రకాతుల తరువాత కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. ఎవరయితే ధర్మ నిష్ఠలతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో తరావీహ్ నమాజ్‌ చేస్తాడో, అతడు పూర్వం చేసిన అపరాధాలను అల్లాహ్ క్షమిస్తాడు. (ముత్సఫకున్‌ అలైహి)

లైలతుల్‌ ఖద్ర్‌ : లైలతుల్‌ ఖద్ర్‌ అంటే సౌభాగ్యం, దౌర్భాగ్యాల నిర్ణయం జరిగే రాత్రి. అదృష్టాలను మెరుగుపరిచే లేదా వాటిని చెరిపివేసే రాత్రి అని అర్థం.

హజ్రత్‌ ఉబాదు బిన్‌ సామిల్‌ (ర) ఉల్లేఖనం ప్రకారం, దైవ సందేశ హరులు (స) లైలతుల్‌ ఖద్ర్‌ రమజాన్‌ చివరి పదిరాత్రుళ్లలోని బేసి రాత్రులు 21,23,25,27,29వ రాత్రి అని అంటారు.

ఏతి కాఫ్‌ : రమజాన్‌ చివరి పది రోజులు ఒక నిర్ణీత సమయం, తన దైనందిన కార్యకలాపాలన్నిటి నుండి దూరమై ఉపవాసంతో మస్జిద్‌లోనే ఉండి తన హృదయాన్ని, ఆత్మనూ కలిపి ఏకాగ్రతతో ఆరాధనతో మునిగిపోవడమే ‘‘ఏతికాఫ్‌’’.

దైవ ప్రవక్త (స) రంజాన్‌ మాసం చివరి పది రోజులుపతేకాఫ్‌ చేసే వారని అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (ర) తెలిపారు. (బుఖారి, ముస్లిమ్‌) హజ్రత్‌ ఆయిషా (రజిఅన్‌) ఇలా ఉల్లేఖించారు.

దైవ సందేశహరులు (స) రమజాన్‌ చివరి పది రోజులు రాగానే రాత్రిళ్ళు ఇతోధికంగా జాగరణ చేసి దైవారాధనలో గడిపేవారు. తన సతీమణుల్ని కూడా మేల్కొపేవారు. అధికోత్సాహంతో దైవరాధనలో నిమగ్నులయ్యేవారు.

తఖ్వా (దైవభీతి) అంటే ఏమిటి?

పవిత్ర రమజాన్‌ మాసం వచ్చిందంటే ప్రతి మోమీన్‌ హృదయం నిష్ఠతో, తఖ్వా (దైవభీతి) సంపూర్ణంగా నిండుకుంటుంది. దైవ ప్రవక్త (స) తమ వేలితో ఛాతివైపు చూపుతూ మూడు సార్లు ‘అత్తక్వా హాహ్రనా’ అని అన్నారు. అంటే ఇది హృదయంలో ఉంటుంది అని అర్థం.

ఒకసారి ఉమర్‌ (గ) కఅబ్‌ (ర)తో తఖ్వా అంటే ఏమిటి అని అడగ్గా ఆయన ఇలా జవాబిచ్చారు. ఇరువైపులా ముళ్ళ కంచెతో నిండిన ఒక సన్నని బాట. ఆ బాట పై నడిచేవాడు తన దుస్తులను ముళ్ళలో చిక్కుకోకుండా ఎంతో జాగ్రత్త పడతాడు. అతని ఆ జాగ్రత్తయే ‘తఖ్వా’ అన్నారు.