|

మనుషులకే కాదు.. పశువులకూ ఓ హాస్టల్‌..! 

By: మామిడాల రామాచారి

రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేట జిల్లాలో గ్రామీణ ఉపాథి హామీ పథకం, కమ్యూనిటీ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్‌ రెండు కోట్ల రూపాయలతో  రాష్ట్రంలోనే మొట్టమొదటి పశువుల హాస్టల్‌ పొన్నాలలో నిర్మాణమైంది. పొన్నాల గ్రామ యూనిట్‌గా పశువుల హాస్టల్‌ను ఏర్పాటు చేసి ఆ గ్రామంలోని పశువులను అక్కడే వుంచి హాస్టల్‌ నిర్వహణ బాధ్యతలని రైతులు, మహిళాసంఘాల సభ్యులకి అప్పగించారు. ఒక్కో దానిలో 160 గేదెలు, ఆవులకు వసతి కల్పించి.. పాడి పరిశ్రమ అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ హాస్టల్‌లో ఎస్సీ కార్పోరేషన్‌, స్త్రీనిధి రుణాల ద్వారా మహిళలకు అందించిన గేదెలు, ఆవులను పెంచి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 

పొన్నాలలో  ఆరు ఎకరాల స్థలంలో 160 పశువుల కోసం మొత్తం  పది షెడ్లను నిర్మించి ఒక్కొక్క షెడ్‌లో 16 పశువులను ఉంచటానికి ఏర్పాట్లు చేశారు. ఎస్సీ కార్పోరేషన్‌, స్త్రీ నిధి రుణాల ద్వారా పొన్నాల గ్రామంలోని రైతులు, 30 మహిళా సంఘాల సభ్యులకు పాడి బర్రెలు కొనుక్కోవటానికి రుణాలు ఇచ్చారు. ఇప్పటికి 32 మంది కొనుక్కున్న 64 పాడి బర్రెలను హాస్టల్లో ఉంచి రోజుకు 150 లీటర్ల పాలు తీస్తున్నారు. మరికొన్ని రోజుల్లో హాస్టల్లో 160 పశువులు ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. పశువులు ఉండి వాటిని పెంచటానికి సరైన ఏర్పాట్లు చేసుకోలేని వాళ్లు ఇక్కడ వాళ్ల పశువులని కట్టేసుకోవచ్చు. 

సకల సౌకర్యాలతో

పశువుల హాస్టల్‌ అంటే ఏదో ఆవులు, బర్రెలని కట్టేసుకోవటానికి ఓ షెడ్‌ వేశారు అనుకోవద్దు. మంచి స్టాండర్డ్‌తో షెడ్లు కట్టడమేకాదు, నీటి తొట్లు, వాటర్‌ ట్యాంక్‌,  డ్రైనేజీ, కరెంట్‌ సప్లై ఉన్నాయి. వీటితో పాటు గడ్డి కోసే యంత్రాలు, పాలు స్టోర్‌ చేయటానికి ఒక గది, పాలు పితికే యంత్రాలు, వెటర్నటీ హాస్పిటల్‌, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌ కోసం క్వార్టర్లు, దోమలు కుట్టకుండా ఫ్యాన్లు, మ్యూజిక్‌ సిస్టమ్‌ ఉన్నాయి. వెటర్నరీ డాక్టర్‌ పశువులను పరీక్షించటానికి వీలుగా ప్రత్యేకమైన స్టాండ్‌తో పాటు హాస్టల్‌ చుట్టు ప్రహారీ గోడ, సీసీ కెమెరాలతో  హాస్టల్‌ కట్టారు. ఇంతకుముందు గొర్రెల కోసం ఇలాంటి హాస్టల్స్‌ ఏర్పాటు చేశారు. అదే పద్ధతిలో పాల మీద ఆధారపడే రైతుల కోసం ఇప్పుడు ఈ పశువుల హాస్టల్‌ కట్టాలనే ఆలోచనని ఇలా అమలు చేశారు. పొన్నాల పశువుల హాస్టల్‌ ఆలోచన విజయవంతం కావటంతో సిద్ధిపేట నియోజకవర్గంలోనే ఉన్న ఇర్కోడ్‌, మిట్టపల్లి, ఇబ్రహీంపూర్‌, జక్కాపూర్‌, గుర్రాలగొంది, గట్ల మల్యాల, నర్మెట గ్రామాల్లో ఇలాంటి హాస్టల్స్‌ ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. 

పాడి పరిశ్రమ అభివృద్ధికి వ్యవసాయానికితోడు పాడి పరిశమ్ర అభవృద్ధి కోసం, గ్రామాల్లోని చిన్న, సన్నకారు  రైతులు పశువుల్ని  పెంచేందుకు ఇబ్బంది పడకుండా ఈ హాస్టల్స్‌ చాలా ఉపయోగపడతాయి. పశువులు కొనుక్కోవాలనుకున్నా సరైన స్థలం లేక కొనకుండా ఉన్నవాళ్లకి రుణాలు ఇచ్చి పశువులని కొనేలా చేశారు. వాళ్లకోసం ఈ హాస్టల్‌ చాలా ఉపయోగపడుతోంది. పశువుల మేతకు అవసరమైన గడ్డి పెంపకానికి ఉమెన్‌ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌కి పశు సంవర్థక శాఖ తరపున  సాయాన్ని అందించనున్నారు.

అందరిదీ.. బాధ్యత..! 

పశువులకు మేత, పాలు పితకడం, పేడ ఏరడం వంటి విషయాలను రైతులు చూసుకుంటుంటే,  మిల్క్‌ ప్రొడక్షన్‌, అమ్మకాలు, లాభాల లెక్కలను మహిళా సంఘం సభ్యులు చూసుకుంటారు. పొన్నాలలోని 30 మహిళా సంఘాలు పశువుల హాస్టల్‌  నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు. ఉత్పత్తి అయిన పాలను కొందరు ప్రైవేటుగా అమ్ముకుంటే మరి కొందరు విజయ డైరీకి అమ్ముతున్నారు. హాస్టల్‌ నిర్వహణను, పర్యవేక్షించడానికి పది మందితో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా ఎస్సీ కార్పోరేషన్‌, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకొని వచ్చిన పాలను విక్రయించడం, వాటిని ఖాతాలకు జమచేయడం అంతా మహిళలు చూసుకుంటారు. పాలను విజయ డెయిరీ సిబ్బంది నేరుగా హాస్టల్‌ వద్దకే వచ్చి సేకరించడం, వారం వారం డబ్బులు జమచేయడం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన పొన్నాల గ్రామంలోని పశువుల హాస్టల్‌ నుంచి రోజుకు 57 గేదెల ద్వారా 150 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు.

వినూత్న ఆలోచనతో పశువుల హాస్టల్స్‌ నిర్మాణానికి శ్రీకారం: మంత్రి హరీశ్‌ రావు 

ఈ హాస్టల్‌ నిర్మాణాలు వినూత్నంగా ఉండాలని సరికొత్త ఆలోచనతో అధికారులకు దిశానిర్దేశం చేశాం. ఇప్పటికే గొర్రెల పాకలను లబ్ధిదారుల వారీగా కాకుండా సిద్ధిపేట జిల్లాలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని నిర్మించాలని నిర్ణయించాం. ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ హాస్టల్స్‌లో సకల వసతులు ఒకే చోట ఉండటంతో గొర్రెల కాపరులు లాభాలు పొందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిద్ధిపేట జిల్లాలోని ఇర్కోడ్‌, పొన్నాల, నర్మెట, మిట్టపల్లి, గుర్రాలగొంది, ఇబ్రహీంపూర్‌, జక్కాపూర్‌, గట్లమల్యాల గ్రామాల్లో నిర్మాణాలకు కోటి రూపాయల ఈజీఎస్‌ నిధులు, మరో కోటిరూపాయలను సీఎస్‌ఆర్‌ ద్వారా సేకరిస్తున్నాం. ఈ నిధులతో పెద్ద షెడ్లు, కాంపౌండ్‌, నీటికోసం బోర్లు, వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్‌, గడ్డికోసే యంత్రం, పాలు నిల్వచేసే గది, కాపలా కోసం వచ్చిన వారు ఉండే గది, పశువులను పరీక్ష చేసేందుకు స్టాండ్‌ మొదలైనవి నిర్మించాం. ఇప్పటికైతే.. పొన్నాల గ్రామంలో హాస్టల్‌ను ప్రారంభించాం. దశల వారీగా మిగిలిన గ్రామాల్లో ప్రారంభిస్తాం. 

బాగా ఆదాయం పెరిగింది 
స్త్రీ నిధి రుణంతో రెండు పాడి బర్రెలు కొనుక్కొని హాస్టల్లో పెట్టడం బాగుంది. ప్రతి రోజు రెండు పాడి బర్రెలు 14 లీటర్ల పాలు ఇస్తున్నాయి. హాస్టళ్ళలో పశువులను పెట్టడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంతకుమునుపు వీటి కోసం సరైన వసతి లేకపోవడంతో ఇబ్బందులు అయ్యేవి. పొద్దున్న, సాయంత్రం పాలు పితుక్కుని వెళ్తున్నా: మర్కంటి యాదగిరి, రైతు

పాడి రైతులకు మంచి ఉపాధి
పశువుల హాస్టల్‌ ఏర్పాటుతో చిన్న, సన్నకారు రైతులకు మంచి ఉపాధి దొరికింది. బర్రెలు కొను కున్న పాడి రైతులకు పాల ఉత్పత్తితో ఆదాయం కూడా పెరు గుతుంది. హాస్టల్‌ నిర్వహణతో పాటు వాటికి సమయానికి మేత వేయడం, క్లీనింగ్‌ లాంటి విషయాలన్నీ మహిళా సంఘాల వాళ్ళం వంతుల వారీగా చూస్తున్నాం: కంబోజీ వాణి, మహిళా సంఘ సభ్యురాలు