రాష్ట్రంలో మలబార్ కంపెనీ భారీ పెట్టుబడులు

రాష్ట్రంలో రూ. 750 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన బంగారం, అభరణాల తయారీ సంస్థ దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ గ్రూప్ అధినేత ఎండీ అహ్మద్, మంత్రి కేటీఆర్‌ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తన సమ్మతిని తెలియచేశారు. ఆభరణాల తయారీ పరిశ్రమతో పాటు గోల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలియచేశారు. ఈ పరిశ్రమ స్థాపించడం వల్ల రాష్ట్రంలోని సుమారు 2,500 మంది స్వర్ణకారులకు ఉపాధి లభిస్తుందని అహ్మద్ తెలియచేశారు.
తమ వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రంగా తాము తెలంగాణను భావించామని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చామని మలాబార్ గ్రూప్ అధినేత అహ్మద్ పేర్కొన్నారు. దీంతోపాటు నాణ్యమైన మానవ వనరులు కూడా ఇక్కడ లభిస్తాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిదారులతో స్నేహపూర్వకమైన దృక్పథాన్ని కలిగి ఉందన్నారు. అందుకే ఇక్కడ పెట్టుబడులకు తాము ముందుకు వచ్చామని తెలిపారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతోపాటు, ఇక్కడి వ్యాపార అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించడం నిరుద్యోగ యువకులకు ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఆభరణాల తయారీలో అద్భుతమైన నైపుణ్యం గల స్వర్ణకారులు ఉన్నారని, వారి సేవలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వైపున మలబార్ గ్రూపునకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ మలబార్ గ్రూప్ అధినేత అహ్మద్‌కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.