‘తెలంగాణ’ అవతరణోత్సవాలకు భారీ సన్నాహాలు

telanganaతెలంగాణ రాష్ట్రం అవతరించి వచ్చే జూన్‌ 2వ తేదీనాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణోత్సవాలను వారం రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతుంది. జూన్‌ 2నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర మంతటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. రాష్ట్ర మంతటా పండుగ వాతావరణం నెలకొనేలా రాష్ట్ర అవతరణోత్సవాలను నిర్వ హించేందుకు వీలుగా జిల్లాకు కోటి రూపాయలు తక్కువ కాకుండా మొత్తం 20 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ఏప్రిల్‌7న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

ఈ ఉత్సవాలలో భాగంగా మండలస్థాయిలో వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి రూ. 10,116, జిల్లా స్థాయిలో నిష్ణాతులైన వారికి రూ. 50,116, రాష్ట్రస్థాయిలో నిష్ణాతులైన వారికి 1 లక్షా 116 రూపాయల పారితోషికంతో సత్కరించనున్నారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వారం రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించి, చివరి రోజున హైదరాబాద్‌లో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. విద్యాసంస్థలలోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పాటల పోటీలు జూన్‌ చివరి వారంలో నిర్వహించాలని నిర్ణయించారు.

పోలీస్‌ కుటుంబాలకు పరిహారం పెంపు

తీవ్రవాదుల హింసాత్మక సంఘటనలలో మరణించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి చెల్లించే పరిహారాన్ని రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సంఘటనల్లో గాయపడిన ఇతరులకూ, ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారం ఎంత చెల్లించాలో నిర్ణయించేందుకు హోంశాఖామంత్రి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘంలో ఆర్థికశాఖామంత్రి, పంచాయతిరాజ్‌ శాఖామంత్రి సభ్యులుగా ఉంటారు.

సిరిసిల్లలోని పవర్‌లూమ్‌ వీవర్స్‌కి 2010`2014 సంవత్సరాలకు సంబంధించి 7 కోట్ల 19 లక్షల టారిఫ్‌ కన్సిషన్‌ మంజూరు చేసింది.

విద్యుత్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పోలీస్‌శాఖలో ఖాళీగా ఉన్న 3,620 కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ వేసవి కాలంలో గ్రామాలు, మున్సిపాలిటీలలో నెలకొన్న నీటి ఎద్దడిపై ఈమంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నీటి ఎద్దడి నివారణకు తీసుకోవలసిన కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన నిధులు వ్యయపరచాలని నిర్ణయించారు.