80 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ
నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో 81 ఆలిండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతున్నది. 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు సందర్శించారు.
ఈ ప్రదర్శనను ప్రముఖ కూచిపూడి నృత్య కారిణి శ్రీమతి దీపికా రెడ్డి ప్రారంభించారు. ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ ఆదిత్య మార్గం, జాయింట్ సెక్రటరీ ఎం.చంద్రశేఖర్, ఆర్ట్ ఎగ్జిబిషన్ కన్వీనర్ డి. వెంకట హన్మంతరావులు హాజరయ్యారు.

ఆర్ట్ సొసైటీ ద్వారా సామాన్య ప్రజలకు కళలపై అవగాహన కల్పించడానికి ఎగ్జిబిషన్ సొసైటీ స్థాపకులు ఈ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీని 1941లో స్థాపించారు. నవాబ్ సలార్‌జంగ్ మొదటి అధ్యక్షులుగా ప్రారంభమైన ఈ సొసైటీకి ఎందరో ముఖ్యులు అధ్యక్షులుగా కొనసాగారు. ఇందులో పి.టి. రెడ్డి, కాపు రాజయ్య, తోట వైకుంఠం లాంటి ప్రముఖులు అధ్యక్షులుగా తమ సేవలందించారు. ప్రస్థుతం ఎం.వి. రమణారెడ్డి అధ్యక్షులుగా తమ సేవలందిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆర్ట్ సొసైటీ ప్రజా బాహుళ్యానికి దగ్గరై తమ కళలను ప్రజలకు అందించడంలో కృషి చేస్తున్నది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ కళలను నేటి యువతకు తెలియపరిచి వారి నుంచి మంచి మంచి కళాకారులను సమాజానికి పరిచయం చేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
81వ ఆలిండియా ఆర్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా 500 కళాకారులు తమ ఎంట్రీలను పంపించారు. ఇందులో నుంచి 200 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఎంపిక చేయడం జరిగింది. వీరి చిత్రాలు, శిల్పాలను ప్రదర్శనలో ఉంచి, ఇందులో నుంచి 20 మంది కళాకారులకు రూ. 35వేల నుంచి రూ. 10వేల వరకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మార్చి 13న ప్రారంభమైంది, ఏప్రిల్ 10 వరకు కొనసాగుతుంది. ఇందులో 3 అవార్డులను బంగారు, రజత, కాంస్య పతకాలను అలాగే రూ. 35 వేల, రూ. 30 వేల, రూ. 25వేల నగదు బహుమతులను ఎగ్జిబిషన్ సొసైటీ వారు ఇవ్వడం జరుగుతుంది.