టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌

హైదరాబాద్‌లో బలమైన ఏరోస్పేస్‌ ఎకో సిస్టం ఉన్నందునే పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారవు అన్నారు. శంషాబాద్‌లోని జీఎమ్మార్‌ ఏరోస్పేస్‌ పార్క్‌లో శాఫ్రాన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ పవర్‌ ఫ్యాక్టరీ, శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ పరిశ్రమను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరోస్పేస్‌ రంగంలోని ఇతర కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ పరిశ్రమ ప్రారంభం దోహదపడుతుందన్నారు.  హైదరాబాద్‌ నేడు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన టెక్నాలజీ హబ్‌గా ఎదిగిందని, అందుకే శాఫ్రాన్‌ ఇక్కడ తమ ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ రూపంలో అత్యంత మెరుగైన పారిశ్రామిక పాలసీని అమలుచేస్తున్నదని అన్నారు. పలు ఏరోస్పేస్‌ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లు ఇక్కడికి వచ్చాయని చెప్పారు. నైపుణ్యంగల సిబ్బందికి కొరతలేదని ‘టాస్క్‌’ ఆధ్వర్యంలో నైపుణ్యాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

వెయ్యికి పైగా ఎంఎస్‌ఎంఈలు ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ సప్లయ్‌ చెయిన్‌లో ఉన్నాయని చెప్పారు. టీహబ్‌, టీవర్క్స్‌, వీహబ్‌ ద్వారా నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయన్నారు. ఈవోడీబీలో రాష్ట్రం అగ్రభాగంలో నిలుస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం ఏరోస్పేస్‌ రంగంలో మోస్ట్‌ ప్రోగ్రెసివ్‌ ఔట్‌లుక్‌ అవార్డులకు 2018, 2020, 2022లో తెలంగాణను ఎంపిక చేసిందని గుర్తుచేశారు. అంతేకాకుండా కాస్ట్‌ ఎఫెక్టివ్‌నెస్‌లో, ఎఫ్‌టీఎఫ్‌డీఏ ఏరోస్పేస్‌ సిటీస్‌ ర్యాంకుల్లో గ్లోబల్‌  నంబర్‌-1 ర్యాంకును హైదరాబాద్‌ సొంతం చేసుకున్నదని గుర్తుచేశారు. విమాన ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు డిసెంబర్‌ నాటికి మరింత విస్తరిస్తుందని చెప్పారు. త్వరలో హైదరాబాద్‌నుంచి ఐరోపా, అమెరికా దేశాలకు డైరెక్ట్‌ ఫ్లైట్‌ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా మరిన్ని ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏరోస్పేస్‌ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నామని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

తాజాగా శాఫ్రాన్‌ సంస్థ ఎమ్మార్వో ప్రాజెక్టును ప్రకటించిందని, ఇది 2025 వరకు పూర్తిస్థాయిలో కార్యకలాపాలను ప్రారంభిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. 15 కోట్ల డాలర్ల పెట్టుబడితో కూడిన శాఫ్రాన్‌కు ఈ ఎమ్మార్వో అతిపెద్ద కేంద్రమని, భారత్‌లో కూడా ఇదే అతిపెద్ద ఎమ్మార్వో అవుతుందని చెప్పారు. దీనికోసం 2020 నుంచి చర్చలు జరుపుతున్నామని తెలిపారు. తగిన మార్కెట్‌ కోసం ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లతో కూడా చర్చలు జరిపామని చెప్పారు. ఎమ్మార్వో సేవల్లో ప్రపంచ పోటీని తట్టుకొనేందకు జీఎస్టీలో సడలింపులు ఇవ్వాలని కేంద్రంతో చర్చలు జరిపి, సాధించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ ఎమ్మార్వో కేవలం భారత్‌లోని వైమానిక సంస్థలకే కాకుండా పశ్చిమాసియా, ఆగ్నేయాసియాకు చెందిన విమాన సంస్థలకు కూడా సేవందిస్తుందని చెప్పారు.

రక్షణ రంగానికి కూడా విస్తరణ: శాఫ్రాన్‌ సీఈవో

శాఫ్రాన్‌ సీఈవో ఒలివియర్‌ ఆండ్రీస్‌ మాట్లాడుతూ వచ్చే 20 ఏండ్లలో భారత్‌లో ప్రయాణికుల రద్దీ రెట్టింపుకన్నా అధికమవుతుందని, ఈ నేపథ్యంలో ఎమ్మార్వోకు మంచి గిరాకీ ఉంటుందని అన్నారు.  వాణిజ్య ఇంజిన్ల కోసం నిర్మిస్తున్న ఈ ఎమ్మార్వో సేవలు భవిష్యత్తులో రక్షణరంగానికి కూడా విస్తరిస్తామని చెప్పారు. వచ్చే నాలుగేండ్లలో తమ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్యను మూడు రెట్లు పెంచుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సానుకూల వ్యవస్థతో తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

రాష్ట్ర ఏరోస్పేస్‌ ఇండస్ట్రీ ప్రగతి

  • టాటా బోయింగ్‌ సంస్థ 100వ అపాచీ హెలికాప్టర్‌ ప్రధాన బాడీ(ఫ్యూజ్‌లేజ్‌)ని అమెరికాలోని బోయింగ్‌ కంపెనీకి డెలివరీ చేసింది.
  • టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ యూనిట్‌ 150వ సూపర్‌ హెర్క్యులస్‌ హెలికాప్టర్‌కు సంబంధించిన ఎంపన్నేజ్‌ను అమెరికాలోని లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థకు డెలివరీ చేసింది. మొదటి ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ వింగ్స్‌నూ పంపింది.
  • వెమ్‌ టెక్నాలజీస్‌ సంస్థ తన తొలి మధ్యతరహా ఎల్‌సీఏ తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఫ్యూజ్‌లేజ్‌ను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌కు డెలివరీ చేసింది.
  • జహీరాబాద్‌లో వెమ్‌ టెక్నాలజీస్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడితో సమీకృత రక్షణ పరికరాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నది. ఇందులో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
  • స్పెయిన్‌కు చెందిన రోల్స్‌రాయిస్‌ గ్రూప్‌ విమానాల ఇంజిన్ల తయారీకి సంబంధించిన ఐటీపీ ఏరోను హైదరాబాద్‌లో ప్రారంభించింది.
  • ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌తోపాటు ఎంబీడీఏ, థేల్స్‌, ఏడీపీ తదితర కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సంప్రదింపులు జరిపారు.
  • ఏరోస్పేస్‌ రంగంలో స్థానిక కంపెనీలకు సహకారం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఫ్రాన్స్‌కు చెందిన బోర్డియక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఏరోక్యాంపస్‌ ఎక్యుటైన్‌.
  • ఏరోస్పేస్‌, డిఫెన్స్‌కు సంబంధించి టీ-హబ్‌, ఏడీఈఎక్స్‌ యూఎస్‌ కాన్సులేట్‌, మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాప్స్‌.