హైదరాబాద్‌ నగరానికి వాటర్‌ ప్లస్‌ అవార్డు

By: కన్నోజు మనోహరాచారి

భవిష్యత్తులో తమ లక్ష్యం ఏమిటి.. ఎన్ని రోజుల్లో ఈ లక్ష్యాన్ని సాధించాలి అని ప్రతి మనిషి అనుకున్నట్లుగానే, ప్రతి దేశానికి ఒక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సాధించడానికి తీసుకోవాల్సిన నిర్మాణాత్మకమైన చర్యలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు అనేకమైన సమస్యలతో వున్నాయి. ఆకలి, పేదరికం, దారిద్య్రం, పోషకాహారలేమి,  విద్య, వైద్యం, తాగునీటి సమస్య మొదలైన సమస్యలతో బాధపడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ సుస్థిరాభివృద్ధిని సాధించాలంటే పేదరికాన్ని నిర్మూలించి, అందరికీ ఆహార భద్రతను కల్పిం చడం, వైద్య రంగాన్ని పెంపొందించి అందరికీ ఆరోగ్యకరమైన జీవితాలను అందించడం, అందరికీ సమానమైన విద్యావకాశాలు కల్పించడం, మహిళా సాధికారతను సాధించడం, నీరు, పారిశుధ్య నిర్వహణలో సాంకేతికతను జోడించడం మొదలైన 17 లక్ష్యాలతో యునైటెడ్‌ నేషన్స్‌ 2000 సంవత్సరంలో మిలీనియం డెవలప్‌ మెంట్‌ గోల్స్‌  పేరుతో ప్రపంచదేశాలకు తెలియచేయడం జరిగింది. 2015 నాటికీ ఆయాదేశాల్లో ఉన్న సమస్యలను ఎదుర్కోవాలని నిర్ణయించినప్పటికీ, 2030 సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది.

సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో నీరు, పారిశుధ్య నిర్వహణ కూడా ఒకటి.  ప్రపంచంలో 97 శాతం నీరు సముద్రాల్లో ఉంటుంది. తాగేందుకు ఈ నీరు పనికి రాదు. మరొక 2శాతం నీరు మంచు పర్వతాల్లో గడ్డకట్టి వుంటుంది. మిగిలిన 1శాతం నీరు భూమి పొరల్లో ఉంటుంది. ఈ ఒక్క శాతం నీరు మాత్రమే ప్రపంచ ప్రజలందరూ తాగాలి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే కురిసే వర్షాల వలన ఈ నీరు చెరువుల్లో, బావుల్లో కాలువల్లో ఉంటుంది. పెరుగుతున్న భూతాపం, ఉష్ణోగ్రతల ప్రభావం, మారుతున్న వాతావరణ ప్రభావాలతో ప్రపంచంలోని 17 దేశాలు తీవ్ర నీటి ఎద్దడి వున్న దేశాలుగా గుర్తించడం జరిగింది. ఈ 17 దేశాల్లో భారతదేశం 13 వ దేశంగా వుంది. రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో ఒక బిందెడు మంచినీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు వున్నాయి. రెండేళ్ల కింద చెన్నయ్‌ నగరంలో గుక్కెడు మంచినీరు దొరక్కపోతే కేరళ రాష్ట్రం నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని లాతూర్‌ ప్రాంతాలకు కూడా రైల్వే వ్యాగన్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది.

సౌత్‌ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో కొన్నేళ్ల కింద ‘‘జీరో డే’’గా ప్రకటించడం మనకు తెలుసు. పోలీస్‌ రక్షణతో రేషన్‌ పద్ధతిన అక్కడి ప్రజలకు రోజుకు 25 లీటర్ల నీటిని మాత్రమే ఇచ్చిన రోజులున్నాయి. రాబోయే రోజుల్లో నీటి తీవ్రత ఎక్కువగా వుండే సమస్యను తొలగించుకోవాలంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యం-6గా అందరికీ సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటుగా బహిరంగ మల విసర్జనను నియంత్రించడం, నీటి నాణ్యతను పెంచే విధంగా నీటిలో కలిసిపోయే కాలుష్యాన్ని తగ్గించడం, ప్రమాదకరమైన రసాయనాలను నీటిలో కలవకుండా చేయడం లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. 

నీటిని గౌరవించడం, నీటి వృధాను తగ్గించడం, నీటిని రీ ఛార్జ్‌ చేయడం, నీటిని శుద్ధి చేయడం, నీటిని రీ సైకిల్‌ చేయడం, నీటిని రీ యూస్‌  చేయడం  (water must be Respect, Reduce, Re charge, Re treat, Re cycle, and Re use) లో హైదరాబాద్‌ జలమండలి ముందు వరసలో వుంది. జలసంరక్షణ కోసం గత అయిదేళ్లుగా కృషి చేయడం జరుగుతున్నది. మున్సిపల్‌శాఖా మంత్రి కేటీ రామారావు ‘జలం జీవం’ పేరుతో 2016లో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ప్రజా ప్రతినిధుల సహకారంతో నగరంలోని వివిధ బస్తీల్లో మూడు వేలకు పైగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. నీటిని సంరక్షించు కోవడం, నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటివృధాను తగ్గించడం తదితర విషయాలకు సంబంధించి వాటర్‌ లీడర్‌ షిప్‌ అండ్‌ కంజర్వేషన్‌ ‘‘వాక్‌’’ కార్యక్రమాలు, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు అవగాహనా సదస్సులు నిర్వహించడం వలన నగర ప్రజల్లో నీటి సంరక్షణ పై అవగాహన ఏర్పడింది.

బహిరంగ మల విసర్జనను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్‌’ కింద ఇప్పటికే వేలాది టాయిలెట్స్‌ను నిర్మించడం జరిగింది. దేశంలోని 4130 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 500 అమృత్‌ నగరాలు,  100 స్మార్ట్‌ సిటీల్లో స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ లక్ష్యాలను సాధించే దిశలో వున్నాయి. దేశంలోని ఆరు లక్షల గ్రామాలకు, సుమారు అయిదు లక్షల గ్రామాల్లో ఎక్కడైతే సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణాలు లేని ప్రతి ఇంటికి ఇప్పటికే సెప్టిక్‌ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. గ్రామాల్లోనే కాదు, నగరాల్లో ఎక్కడా బహిరంగా మల విసర్జన జరగడం లేదు. హైదరాబాద్‌ నగరానికి ఒడిఎఫ్‌, ఒడిఎఫ్‌ ప్లస్‌,  ఫీకల్‌ స్లడ్జ్‌ సెప్టెజ్‌ మేనేజ్‌ మెంట్‌లో ఓడిఫ్‌ డబుల్‌ ప్లస్‌ అవార్డులు గతంలోనే వచ్చాయి. వీటన్నింటిని విజయవంతంగా అమలు చేస్తూనే వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి ఉపయోగించుకోవడంలో కూడా హైదరాబాద్‌ నగరం ముందు వరసలో ఉండటం వలన కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్‌ 20, 2021న ‘వాటర్‌ ప్లస్‌’ అవార్డు ఇవ్వడంలో హైదరాబాద్‌ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి (జలమండలి) కిచ్చిన ప్రతిష్ఠాత్మక పురస్కారం. జి.హెచ్‌.ఎం.సి, హెచ్‌. ఎం.డి.ఏల సహకారం కూడా ఇందులో ఎంతో వుంది.

స్వచ్ఛ నగరాల జాబితాలో ఈ పురస్కారం ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది.  తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సాధించిన అభివృద్ధి ఎంతో వుంది. హైదరాబాద్‌ నగర వైశాల్యం 1450 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. నగర ప్రజలకే కాకుండా ఔటర్‌ రింగ్‌రోడ్‌ లోపలి 190 గ్రామాలకు కూడా జల మండలి తాగునీటిని అందిస్తున్నది. కృష్ణా గోదావరి నదుల నుండి పెద్ద పెద్ద పైపుల ద్వారా తీసుకుని వస్తున్న ఈ నీటిని క్వాలిటీ అస్యూరెన్సు అండ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌లో పరిశోధించి నీటిలోని మలినాలను శుద్ధిచేసిన తరువాతనే ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం జరుగుతోంది. వాటర్‌ క్వాలిటీ టెస్టింగ్‌లో కూడా హైదరాబాద్‌ నగరానికి గతంలోనే అవార్డు రావడం జరిగింది

ఒక కోటి ముప్పై లక్షల మంది వాడిన నీరు మురికి రూపంలో నాలాల ద్వారా సీవరేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్స్‌ (ఎస్టీపీ)కు చేరుతుంది. రోజుకు 1400 మిలియన్‌ గ్యాలన్ల మురికి నీటిలో జలమండలి నిర్వహిస్తున్న 25 ఎస్టీపీల ద్వారా 700 మిలియన్‌ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదలడం జరుగుతున్నది. శుద్ధిచేసిన ఈ నీటికి గార్డెనింగ్‌లకు, పార్కులకు, రోడ్లు, నర్సరీలు, వివిధ నిర్మాణ పనుల్లోనూ.. ఇంకా వ్యవసాయ అవసరాలకు ఉపయోగించడం జరుగుతున్నది. పబ్లిక్‌ టాయిలెట్‌ క్లీనింగ్‌, రోడ్లవెంబడి మొక్కలకు, పార్కులకు, మ్యాన్‌ హోల్స్‌ క్లీనింగ్‌లో మినీ జెట్టింగ్‌ మిషన్‌ కోసం శుద్ధిచేసిన ఈ నీటిని రీ యూస్‌  చేయడంతో పాటుగా జల సంరక్షణ, నీటిని పునర్వినియోగం చేయడంలో జలమండలి ప్రతి నీటి బొట్టును సక్రమంగా వాడటం జరుగుతున్నది. రైల్వేస్‌, పరిశ్రమలకు తక్కువ ధరలకు శుద్ధి చేసిన నీటిని విక్రయించడం జరుగుతున్నది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపలి గ్రామాల్లో సెప్టెజ్‌ ట్యాంకుల నిర్వహణలో కూడా జల మండలి నిర్వహిస్తున్నది. సెప్టిక్‌ ట్యాంక్‌ నిండితే వెంటనే శాస్త్రీయ పద్ధతిలో శుభ్రం చేసుకోవడానికి వీలుగా జలమండలి జారీచేసిన లైసెన్స్‌ కలిగిన కార్మికులతో  84 సెప్టిక్‌ ట్యాంకులను సిద్ధంగా ఉంచడం జరిగింది. డయల్‌ -ఎ-సెప్టిక్‌ టాంకర్‌ కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 155313/ 14420ని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. 14 స్వచ్ఛంద సంస్థలు, స్లమ్‌ లెవెల్‌ ఫెడరేషన్స్‌ సభ్యులు, స్వయం సహాయక సభ్యులతో సెప్టిక్‌ ట్యాంకుల నిర్వహణ కోసం ప్రచారం చేయించడం జరుగుతున్నది. సెప్టిక్‌ ట్యాంకుల నిర్వహణలో కార్మికులు భద్రతా దుస్తులు ధరించాలని, లోపలికి దిగకుండా యంత్రాల ద్వారా మాత్రమే సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయాలనీ పేర్కొనడం జరిగింది. పారిశుధ్య కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం వహించరాదని, వారి సంక్షేమం కోసం శ్రద్ధ వహించాలన్నారు. వివిధ కరపత్రాలు, పోస్టర్లు, స్ట్రీట్‌ ప్లేల ద్వారా సెప్టిక్‌ ట్యాంకుల సక్రమ నిర్వహణ కోసం అవగాహన కలిగించడం జరుగుతున్నది. సెప్టిక్‌ ట్యాంక్‌ కలిగివున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వాళ్ళ సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రత కోసం తగిన జాగ్రత్తలు చెప్పడం జరుగుతున్నది. ఈ విధంగా చేయడం ప్రజల్లో అవగాహన కల్పించడం వలన వాటర్‌ ప్లస్‌ అవార్డు రావడం జరిగింది. వాటర్‌ ప్లస్‌ అవార్డు రావడం వలన హైదరాబాద్‌ నగర ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుంది.