అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ ‘గ్రీనరీ’
హైదరాబాద్ నగరంలో గ్రీనరీకి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. 987 పార్కులు, 700 ట్రీ పార్కులు, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ అభివృద్ధి, రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, ప్రజలకు ఉచితంగా మొక్కల పంపిణీ, 119 అర్బన్ పారెస్ట్‌లను అభివృద్ధి చేయడం వలన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ‘‘ట్రీ సీటీ ఆఫ్ ద వరల్డ్‌గా’’ గుర్తింపు వచ్చిందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు.

‘‘అర్బన్ గ్రీనరి, హెల్దీయర్, హ్యాపీయర్ ప్లేసెస్’’ అనే అంశంపై ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఏసియా, పసిఫిక్ (FAO – RAP) సంయుక్తంగా ఏర్పాటు చేసిన మూడవ ఏసియా`పసిఫిక్ అర్బన్ ఫారెస్ట్రీ సమావేశంలో ఏసియా పసిపిక్ దేశాలైన ఇండోనేషియా, చైనా, బ్యాంకాక్ తదితర దేశాల ప్రతినిధులతో విజయలక్ష్మి గూగుల్ మీట్‌లో ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. మన దేశం నుండి హైదరాబాద్ నగర మేయర్ మాత్రమే ఈ ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… 119 అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్‌లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం ప్రపంచంలో మరెక్కడాలేదని, 185 చెరువులు, కుంటలలో బఫర్ జోన్ ప్లాంటేషన్ మొక్కలు నాటేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 42 చెరువుల వద్ద మొక్కలు నాటి సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతోందన్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మానసపుత్రిక అయిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారని, తెలంగాణ ఏర్పడినప్పుడు అడవులు 24 శాతమే ఉండగా 33 శాతానికి పెంచే సంకల్పంతో ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నదని, ఇప్పటివరకు అటవీ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం కోసం ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడమే గాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయని ఆమె తెలిపారు. దేశంలో మరెక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్న తీరును అందరూ ప్రశంసిస్తున్నారని, స్థానిక సంస్థలైన పంచాయితీరాజ్, మున్సిపాలిటీ, నగర పాలక సంస్థలు ప్రత్యేక గ్రీనరీ బడ్జెట్ రూపొందించాయని, స్థానిక సంస్థలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులలో పదిశాతం నిధులను గ్రీనరి కోసమే వినియోగించుకునే విధంగా ప్రభుత్వం చట్టం చేసిందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేయడంతోపాటు నాటిన మొక్కలు 90 శాతం బ్రతికుండేలా చర్యలు తీసుకుందని మేయర్ తెలిపారు.
అనంతరం ఏసియా పసిఫిక్ ప్రతినిధి మాట్లాడుతూ … హైదరాబాద్ ‘‘ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్’’గా గుర్తింపు పొందడం హర్షణీయమని, అంతర్జాతీయంగా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాలు గ్రీనరిపై చేపట్టిన చర్యలను వివరించారు.