టీకా కేంద్రంగా హైదరాబాద్‌

భారత దేశంలో వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పారిశ్రామిక యూనిట్లు – భారత బయోటెక్‌ లిమిటెడ్‌, బయోలాజికల్‌ సంస్థలను 64 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు సందర్శించారు. భారత దేశం తీసుకుంటున్న కొన్ని కీలక పరిశోధన – అభివృద్ధి కార్యకలపాలను విదేశీ రాయబారులు, హైకమిషనర్లకు తెలియజేయడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ పర్యటన ను నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ విదేశీ ప్రముఖులను స్వాగతిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతితక్కువ సమయంలోనే దేశంలోనే అద్భుతమైన పురోగతి సాధించిందని అన్నారు. గత ఆరు సంవత్సరాలలో దేశంలో సులభతర వ్యాపారం చేయడంలో రాష్ట్రం ముందున్నదని అన్నారు. హైదరాబాద్‌ నగరం భౌగోళికంగా దేశానికి మధ్యలో వున్నదని, విమాన, రోడ్డు రవాణా వ్యవస్థలతో అనుసంధానమై వున్నదని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అగ్రశ్రేణి సంస్థలైన గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌ బుక్‌, అమెజాన్‌, మైక్రోసాప్ట్‌ వంటి సంస్థలు అతి పెద్ద యూనిట్లను హైదరాబాద్‌లో నెలకొల్పినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పరిశ్రమల, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ రాష్ట్రం పెట్టుబడి సామర్థ్యాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సందర్శించే ప్రముఖులకు వివరించారు. హైదరాబాద్‌ ఫార్మా నగరం రాబోయే కొన్ని నెలల్లో పనిచేయనున్నట్లు తెలిపారు. ఆదేవిధంగా అవుటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓ.ఆర్‌.ఆర్‌) కు సమీపంలో 500 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వినయ్‌ కుమార్‌, జి.ఎ.డి.(పోలిటికల్‌) ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి, బయోలాజికల్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.ఎస్‌. మహిమ దాట్ల, భారత బయోటెక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ఎల్లా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.