హైదరాబాద్‌ బాధ్యత అందరిది

  • అండర్‌ పాస్‌, ఫ్లై ఓవర్‌లు ప్రారంభించిన మంత్రి కే.టీ.ఆర్‌

అందరూ కలిసికట్టుగా హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బిజెపి కార్పొరేటర్‌లు మేము అభివృద్ధికి పోటీ పడుదామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం ఉండాలని, ఎన్నికల సందర్భంలో మీ ప్రభుత్వం మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి చెబితే ఎవరు విజయం సాధిస్తారో తెలుస్తుందన్నారు.

వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000 కోట్ల తో పనులు చేపట్టిన నేపథ్యంలో చిన్న రాష్ట్రంలో రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తుంటే పెద్ద ప్రభుత్వం రూ. 10,000 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి మంజూరు చేసి తీసుకురావాలని కోరారు. వరద సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వరద ముంపుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నిధులు తెస్తే హైదరాబాద్‌ నడిబొడ్డున పౌర సన్మానం చేస్తామన్నారు.

ఎల్‌.బి నగర్‌ నియోజకవర్గంలో రూ. 103 కోట్ల వ్యయంతో చేపట్టే 8 నాలా అభివృద్ధి పనులకు మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, శాసన మండలి సభ్యులు బి.దయానంద్‌, శాసనసభ్యుడు, సుధీర్‌ రెడ్డి, కమిషనర్‌ డి.ఎస్‌. లోకేష్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డిలతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్‌ నగరాన్ని నలువైపులా ఒకే విధమైన అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎల్‌.బి నగర్‌ నియోజకవర్గంలో రూ. 672 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్‌ లు, అండర్‌ పాసులు చేపట్టినట్లు అదే విధంగా రూ. 103 కోట్ల వ్యయంతో వరద ముంపు నివారణ కు నాలా అభివృద్ధి పనులు, రూ. 33.34 కోట్ల వ్యయంతో స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ పనులు నియోజకవర్గంలో మంచినీటి వసతి కోసం 47.5 ఎం.ఎల్‌.డి సామర్థ్యం గల 12 రిజర్వాయర్‌ లు 353 కిలోమీటర్ల పైప్‌ లైన్‌ మొత్తం పనులకు రూ. 313 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మురుగు నీరు శుద్ధి, సీవరేజ్‌ పనుల కోసం రూ. 43 కోట్ల రూపాయలు, సమీకృత వైకుంఠధామం చేపట్టేందుకు రూ. 4.58 కోట్లు, ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ను రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టారు. సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం మొత్తానికి నియోజకవర్గంలో రూ. 2500 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వివరించారు. రెండు పడకల గదుల నిర్మాణాలను 1000 గృహాలు పూర్తయినట్లు మిగతావి కూడా వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. ఎస్‌.ఆర్‌.డి.పి పథకం ద్వారా ఎల్‌.బి నగర్‌ నియోజకవర్గంలో చింతల్‌ కుంట చెక్‌ పోస్ట్‌ వద్ద అండర్‌ పాస్‌, కామినేని ఆసుపత్రిలో లెఫ్ట్‌, రైట్‌ ఫ్లైఓవర్‌ లు, ఎల్‌.బి నగర్‌ ఫ్లైఓవర్‌, కుడి వైపు అండర్‌ పాస్‌, బైరామల్‌ గూడ రైట్‌ ఫ్లైఓవర్‌, అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఎల్‌.బి నగర్‌ లెఫ్ట్‌ అండర్‌ పాస్‌, బైరామల్‌ గూడ రైట్‌ సైడ్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌.బి నగర్‌ ఫ్లైఓవర్‌, నాగోల్‌ చౌరస్తా వద్ద 6 లైన్‌ ల ఫ్లై ఓవర్‌, బైరామల్‌ గూడ రెండవ స్థాయి లో ఫ్లైఓవర్‌ రైట్‌ లెఫ్ట్‌ సైడ్‌ రెండు లూప్‌ పనులు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు.

ఉప్పల్‌లో కూడా ఇటీవల రూ.450 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్‌ను చేపట్టినట్లు నగరంలో అభివృద్ధి ఒకే వైపు కాకుండా వికేంద్రీకరణ చేసి నలువైపులా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ ప్రాంత ప్రజలు గాంధీ, ఉస్మానియాకు వెళ్లకుండా ఇక్కడే ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. మన బస్తీ, మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేయనున్నట్లు ఇంగ్లీష్‌ మీడియం కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందన్నారు. 58, 59 జిఓల ద్వారా నిరుపేదలకు గతంలో ఒక లక్ష మందికి పట్టాలు పంపిణీ చేసినట్లు మిస్సయిన నిరుపేదలకు తిరిగి అందించేందుకు మరోసారి అవకాశం ఇచ్చినట్లు, గత ఉమ్మడి ప్రభుత్వంలో జరిగిన తప్పిదం వల్ల బి.ఎన్‌ రెడ్డి నగర్‌, వనస్థలిపురం సమస్య ఏర్పడిరదన్నారు. కొత్త పెన్షన్‌ త్వరలో పంపిణీ చేస్తామన్నారు.

అండర్‌ పాస్‌, ఫ్లైఓవర్‌ లు ప్రారంభం
వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (SRDP) ద్వారా రూ. 40 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎల్‌.బి నగర్‌ ఆర్‌.హెచ్‌.ఎస్‌ అండర్‌ పాస్‌ ను, రూ. 29 కోట్ల వ్యయంతో చేపట్టిన బైరామల్‌ గూడ ఎల్‌.హెచ్‌.ఎస్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలను మంత్రి కే.టీ.ఆర్‌ ప్రారంభించారు. మంత్రి వెంట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ పంకజ, కార్పొరేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.