ప్రజలకు సేవ చేసే దేవాలయాలు కావాలి
By:- ఎస్. శ్రీనివాస రావు

నూతనంగా నిర్మించుకున్న కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలు ప్రజలకు సేవచేసే దేవాలయాలు కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీఎం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొబ్బరికాయ కొట్టి జిల్లా కలెక్టర్ ఛాంబర్‌ను సీఎం ప్రారంభించారు. కలెక్టర్ ఈ అనుదీప్‌ను కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ సీఎంకు దేవతాప్రతిమను అందించి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఈ రోజు రాష్ట్రంలోనే అత్యద్భుతమైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించుకున్నందుకు యావత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను, అధికారులను అభినందిస్తున్నాను. ప్రజలకు మేలు చేసే పవిత్రమైన దేవాలయంలాగా ఈ కార్యాలయాలు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. మెడికల్ కాలేజీ వచ్చింది. ఇక్కడే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది. ఇంకా చాలా చాలా వచ్చాయి. భవిష్యత్ లో ఇంకా వస్తాయి. సింగరేణి కొత్తగూడెం నుండే విస్తరించి ఈ రోజు అద్భుత ఆదాయ వనరుగా, ఉద్యోగాల వనరుగా సింగరేణి సిరుల కల్పవల్లిగా మన తెలంగాణ కొంగుబంగారంగా నిలిచిన గడ్డ మన కొత్తగూడెం ఇల్లందు గడ్డ’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
‘‘భద్రాద్రి కొత్తగూడెం ప్రజాచైతన్యం ఉన్న జిల్లా. కమ్యూనిస్టు విప్లవభావాలతో అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొంటూ, అద్భుతమైన ప్రగతిశీల కార్యక్రమాలను ఈ ప్రాంతం చేపట్టింది. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు నన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెడితే ఇదే ఖమ్మం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేసి కడుపులో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాద బలం, ఐక్య పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది’’ అని అన్నారు.
‘‘ఏడున్నరెనిమిదేండ్ల క్రితం ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు అసలు పోలిక, పొంతన లేదు. ఆనాడు మన తలసరి ఆదాయం 87 వేల రూపాయలు. ఈనాడు మన తలసరి ఆదాయం 2 లక్షల 78 వేల రూపాయలు. ఆనాడు మన జీఎస్డీపి కేవలం 5 లక్షల కోట్ల రూపాయలు. ఈనాడు మన జీఎస్డీపి 11.5 లక్షల కోట్ల రూపాయలు. భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ. 33 జిల్లాల్లో జిల్లా పరిపాలన కేంద్రాలతో పాటు మెడికల్ కాలేజీలను కూడా మంజూరు చేసుకున్నాం. అందులో భాగంగానే కొత్తగూడెం జిల్లాకు కూడా మెడికల్ కాలేజీ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. కులాలు, మతాలు, వర్గాలకు భిన్నంగా సమాజాన్ని దేవాలయంగా భావించి అందరి సంక్షేమాన్ని కాంక్షించి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కేసీఆర్ కిట్‌ను పేదింటి మహిళల క్షేమాన్ని కాంక్షించి పూర్తి మానవీయ కోణంలో అమలు చేస్తున్నాం. ప్రజల నుండి డిమాండ్లు లేకపోయినా అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. అన్ని రంగాల్లో దూసుకుపోతూ దేశానికే ఆదర్శంగా నిలిచాం’’ అని సిఎం చేప్పారు.
జిల్లాకు సిఎం వరాల జల్లు

కాళేశ్వరం పూర్తి చేసుకోవడంతో పాటు, ఖమ్మం జిల్లాలోని ప్రతీ ఇంచుకు నీరు వచ్చే విధంగా సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుకున్నాం. ఇది పూర్తయితే ఖమ్మం జిల్లా యావత్తు సస్యశ్యామలమవుతుంది. భద్రాద్రి దేవాలయానికి సమీపంలోనే 37 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో సముద్రాన్ని తలపించే విధంగా సీతమ్మవారి ఆనకట్ట కట్టుకుంటున్నాం, మిషన్ భగీరథతో ప్రతీ గ్రామానికి, తండాకు, కోయగూడానికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం అని సిఎం చెప్పారు.
మనిషి పుట్టినప్పటి నుండి మరణించేవరకు ఏదో రకంగా సహాయం అందే విధంగా కార్యక్రమాలను అమలుచేస్తున్నాం, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎంఆర్‌ఎఫ్ కింద ఎమ్మెల్యేల సహకారంతో పేదలకు సాయం అందుతున్నది, ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వర్ రావు నియోజకవర్గ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు కొత్తగూడెం పట్టణానికి ముర్రేడు వాగు వరద బాధను తొలిగించేందుకు ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.
అంతకుముందు ఇండ్ల స్థలాల మంజూరులో స్థలాలు రాని జర్నలిస్టులకు సింగరేణి స్థలంలో కేటాయించేందుకు త్వరలో కార్యాచరణ చేపడతాం, కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాను. వెంటనే ఆ నిధులు అందుబాటులోకి వస్తాయి, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్కో మున్సిపాలిటీకి రూ. 40 కోట్ల చొప్పున, ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల చొప్పున ప్రత్యేక ఫండ్ ను మంజూరు చేస్తున్నాం. త్వరలోనే ఈ నిధులను విడుదల చేస్తాం. ఇక్కడి మైనింగ్ ఇన్సిట్యూట్ ను ఇంజనీరింగ్ కాలేజీగా ప్రకటించారు. ఇది సమగ్రంగా లేదు. దీన్ని పూర్తిస్థాయి ఇంజనీరింగ్ కాలేజీగా అభివృద్ధి చేస్తాం.
మీ అందరి దీవెనతో ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలో కుల,మత,వర్ణ,వర్గ రహితంగా మౌలిక వసతుల కల్పన, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామో అదే విధంగా అందరినీ కడుపులో పెట్టుకుని ముందుకు సాగుతాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం శాసనసభ్యుల నుంచి వచ్చిన వినతులను త్వరలోనే పరిష్కరిస్తాం అని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, ఒద్దిరాజు రవిచంద్ర, కవితా నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూధన్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర రావు, రేగా కాంతారావు, రాములు నాయక్, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వర రావు, బాల్క సుమన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, పూల రవిందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డి.రాజేందర్, డిసిసిబి ఛైర్మన్ కె.నాగభూషణం, కలెక్టర్ అనుదీప్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, నిర్మాణ సలహాదారు సుద్ధాల సుధాకర్ తేజ, తదితరులు పాల్గొన్నారు.

సకల హంగులు…. అధునాతన సౌకర్యాలు
సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా అందరికీ అందుబాటులో ఉండేలా కొత్తగూడెం నుండి పాల్వంచ వెళ్ళే జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్) నిర్మించారు. నూతన జిల్లాలు ఏర్పాటు తదుపరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 26 ఎకరాల కె.ఎస్.ఎం స్థలంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం 56.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఐడీవోసి లొనే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించినట్లు చెప్పారు. ఐడిఓసిలో 56 శాఖలకు గదులను నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల కోసం మూడు ఛాంబర్లను, విజిటర్స్ వెయింటింగ్ హాల్‌తో పాటు, ఇంటిగ్రేటెడ్ మీటింగ్ హాల్‌ను నిర్మించారని కలెక్టర్ అనుదీప్ చెప్పారు. కలెక్టర్, ఇద్దరు అదనపు కలెకర్లు, పరిపాలనా అధికారి ఛాంబర్లను కేస్ట్ సీలింగ్ (సెంట్రల్ ఏసీ) చేశారు. సమీకృత సమావేశ మందిరాన్ని సైతం సెంట్రల్ ఏసీగా మార్చారు. జిG2 పద్ధతిన నిర్మించిన కలెక్టరేట్‌లో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. కలెక్టరేట్ పై భాగంలోకి చేరుకునేందుకు రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మాణామైన ఐ.డి.ఓ.సి భవనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలువనుందని కలెక్టర్ చెప్పారు.
ఇంద్రభవనంలా కలెక్టరేట్లు

గతంలో కలెక్టరేట్ భవనాల్లో అరకొర వసతులు ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవికావు.వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు కూడా ఉండేవి కావు. అధికారులతోపాటు కలెక్టరేట్లకు వచ్చే ప్రజలు ఎన్నో అవస్థలు పడటం చూశాను. ప్రస్తుత కలెక్టరేట్లు ఇంద్రభవనంలా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు.
విశాలమైన స్థలంలో చక్కని భవన సముదాయాలు, విశాలమైన కార్యాలయ గదులను నిర్మించారు.ప్రభుత్వం ఇంతమంచి కలెక్టరేట్లను నిర్మించడం వలన ఉద్యోగులు ఆహ్లాదకర వాతావరణంలో బాగా పనిచేస్తారన్న నమ్మకం ఉంది. ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించిందని శాంతికుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రజల హర్షాతిరేకాల మధ్య ప్రారంభించారు. మహబూబాబాద్‌లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మానుకోట జిల్లాకు ఆయన పలు వరాలు ప్రకటించారు.మహబూబాబాద్‌కు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కేటాయించారు.వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు కేటాయించారు. తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలకు 25 కోట్ల రూపాయల వంతున నిధులను ప్రకటించారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయల వంతున నిధులు ప్రకటించారు.
ఖమ్మం కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రారంభించిన సందర్భంగా ఆ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, తదితర జాతీయ నాయకులు, మన రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి పలు వరాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధినుంచి జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయలవంతున ప్రకటించారు.పెద్దతాండా, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు 30 కోట్ల రూపాయల వంతున మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, మునేరు నదిపై కొత్త బ్రిడ్జి, ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు.