పేదల ఆత్మగౌరవ సౌధాలు
రెండు పడక గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఓల్డ్ మారెడ్ పల్లిలో 5.18 ఎకరాలలో ఒక్కొక్కటి 560 స్క్వేర్ ఫీట్ల తో ఒక్కొక్క యూనిట్ రూ. 7.75 లక్షల ఖర్చుతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళ సముదాయాన్ని కెటిఆర్ ప్రారంభించారు. మొత్తం రూ. 36.27 కోట్ల వ్యయంతో 22 బ్లాక్ లలో 468 గృహాలను నిర్మించారు.
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, హోమ్ శాఖ మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, శాసనసభ్యులు సాయన్న, శాసన మండలి సభ్యులు సురభి వాణీ దేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గతంలో హౌసింగ్ శాఖకు సంబంధించిన రూ. 350 కోట్ల విలువ గల 5.18 ఎకరాల స్థలాన్ని జిహెచ్ఎంసి కి బదిలీ చేసి 468 గృహాలను 22 బ్లాక్‌లలో నిర్మించి పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న రెండు పడక గదుల గృహాలు డిగ్నిటీ కాలనీలు దేశంలో ఏ రాష్ట్రంలో మరెక్కడా లేవని మంత్రి అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనస్సు గల వ్యక్తి కాబట్టి పేదల కోసం ఎంత ఖర్చయినా పర్వాలేదు కానీ పేదల సొంతింటి కలను నెరవేర్చాలని అన్నారన్నారు. రాష్ట్రంలో 18 వేల కోట్ల వ్యయంతో 2.72 లక్షల రెండు పడకల గదుల గృహాలు అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 1 లక్ష గృహాలు అద్భుతంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూంలు చూసి, ఇతర రాష్ట్రాల ప్రజలు ‘ఇలాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు’ అంటున్నారని తెలిపారు. ‘ఇళ్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా’ అని కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. కేటాయింపు చేసిన డబుల్ బెడ్ రూమ్‌లను అమ్మడం, కొనడం చేయవద్దని, కాలనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పచ్చదనం పెంచుకోవాలన్నారు.

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ… రూ. 350 కోట్ల విలువ గల స్థలం ఒక్కొక్క డబుల్ బెడ్ రూం ఈ ప్రాంతంలో ఒక కోటి 20 లక్షలకు తక్కువగా ఉండదని అన్నారు. ఈ కాలనీ వాసులకు నల్లా బిల్లులు కూడా ఉండవన్నారు. కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నివసించే ప్రజలకు అవసరమైన పనులు చేస్తున్నారని, కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా ఇంటికి 20 వేల లీటర్ల త్రాగు నీరు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి వివరించారు. దేశ చరిత్రలో ఇలాంటి ఇళ్లు మరెక్కడా లేవని మనస్సున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రూపాయి ఖర్చు తీసుకోకుండా ఇండ్లు కట్టిస్తున్నారన్నారు. వరద నివారణ కోసం రూ. 10 కోట్ల వ్యయంతో హస్మత్ పేట్ నాలాను బాగు చేస్తున్నట్లు చెప్పారు.
కంటోన్మెంట్ శాసనసభ్యులు జి.సాయన్న మాట్లాడుతూ… గతంలో ఇక్కడ నివాసం ఉన్న వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేస్తామని అన్నారు. కొంచెం ఆలస్యం అయినా, పేదలకు నయా పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో ఉచితంగా అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు. పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు సాయన్న తెలిపారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కె. దీపిక నరేష్, హౌసింగ్ సి.ఈ. సురేష్, కిషన్ ఎస్.సి విద్యాసాగర్, ఆర్డీవో వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.