ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం (ఎస్‌.ఆర్‌.డి.పి) ద్వారా హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. ఈ పథకం ద్వారా రూ. 333.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన షేక్‌ పేట్‌ అతి పెద్ద ఫ్లైఓవర్‌ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబిత ఇంద్రా రెడ్డి, మహమూద్‌ అలీలతో కలిసి మంత్రి కే.టీ.ఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కే.టీ.ఆర్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన ఎస్‌.ఆర్‌.డి.పి ద్వారా చేపట్టిన పనులలో ఫ్లై ఓవర్లు, అండర్‌ పాసులు, ఆర్‌.ఓ.బిలు తదితర 24 పనులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇందుకోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు, దీనివల్ల హైదరాబాద్‌ నగరం ట్రాఫిక్‌ వ్యవస్థ చాలా వరకు మెరుగుపడిరదన్నారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఏడేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నాం. ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రిజర్వు బ్యాంక్‌ నివేదిక ప్రకారం భారత దేశంలో చిన్న వయస్సు గల తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 11వ రాష్ట్రం, ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్న రాష్ట్రాలలో 4వ స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఎస్‌.ఆర్‌.డి.పి, సి.ఆర్‌.ఎం.పి పథకాలతో పాటుగా హైదరాబాద్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా కూడా 132 లింక్‌ మిస్సింగ్‌ రోడ్లను కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగిందన్నారు.

సి.ఆర్‌.ఎం.పి ద్వారా ఐదేళ్లలో 709 కిలో మీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు సుమారు 5 వందల కిలోమీటర్లను అభివృద్ధి చేయడం జరిగింది. రానున్న రెండేళ్లలో మిగతా రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందన్నారు.ఇటీవలనే ఔటర్‌ రింగురోడ్డు మొత్తం ఎల్‌.ఇ.డి లైటింగ్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి కే.టీ.ఆర్‌ చెప్పారు.

కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్న 21 రోడ్లను కంటోన్మెంట్‌ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా మూసివేశారని, ఈ విషయం గత ఏడేళ్ల నుండి కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణశాఖ నల్గురు మంత్రులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, ఈ విషయంలో కేంద్రమంత్రి అయిన కిషన్‌రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడాలని, మూసివేసిన రోడ్లను తెరిపించాలని మంత్రి కే.టీ.ఆర్‌ కోరారు. ఎస్‌.ఆర్‌.డి.పి ద్వారా కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో చేపట్టే రోడ్లకు రక్షణశాఖ భూములు అవసరం ఉంటాయని అన్నారు. ప్యాట్ని నుండి కొంపల్లి వరకు జె.బి.ఎస్‌ నుండి తుర్కపల్లి వరకు ఫ్లై ఓవర్‌ నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశామని, రక్షణశాఖ భూములు కేటాయించాలని మంత్రి కోరారు. ఉత్తరప్రదేశ్‌లో రక్షణ శాఖ భూములు ఇచ్చారు. కానీ తెలంగాణలో గత ఏడేళ్లుగా కోరినా ఇవ్వడం లేదని, వాటిని అప్పగించేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా హైదరాబాద్‌ చారిత్రాత్మక నగరంగా ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో, హెరిటేజ్‌ సిటీగా నగరం వారసత్వ సంపద కాపాడాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఈ నగరానికి యూనిసెఫ్‌ ద్వారా గుర్తింపు తేవాలని కోరారు. సైన్స్‌ సిటీ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేసి ఇస్తామని, సంబంధిత మంత్రికి చెప్పి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సమష్టి కృషి చేసి భవిష్యత్‌ తరాల వారికి మంచి హైదరాబాద్‌ను అందించే భాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతిఒక్కరికీ మంత్రి కే.టీ.ఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత 70 యేళ్ల కాలంలో ఎప్పుడూ రాష్ట్రానికి రాని రోడ్లు నరేంద్రమోడీ ప్రధానమంత్రి హయాంలో వచ్చాయని, మంజూరైన జాతీయ రహదారులను కేంద్ర మంత్రి గడ్కరీతో త్వరలో పనులను ప్రారంభించేందుకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. సైన్స్‌ సిటీ ఏర్పాటుకు 25 ఎకరాల భూమి సేకరణ చేయాలని ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ వ్రాయడం జరిగిందని, ఎంత తొందరగా భూసేకరణ చేసి ఇస్తే అంత తొందరగా ప్రారంభిస్తామన్నారు.

రీజనల్‌ రింగు రోడ్డుకు కూడా భూసేకరణ తొందరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఇతర జిల్లాల వారు హైదరాబాద్‌లో స్థిర పడుతున్నారు.

7 టూమ్స్‌ అభివృద్ధికి స్వదేశీ దర్శన్‌ పథకం క్రింద నిధులు మంజూరు చేశామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏ కార్యక్రమమైనా కరోనా ప్రోటోకాల్‌ పాటించాలన్నారు.

రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో నగర అభివృద్ధికి ముందు చూపులేక ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వరద శాశ్వత నివారణకు ప్రత్యేక చొరవ చేస్తున్నామని, నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి 10 వేల కోట్ల నిధులు ఇప్పించాలని తలసాని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, ఆరికెపూడి గాంధీ, ముఠా గోపాల్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, జి.హెచ్‌.ఎం.సి కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌ కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ శ్రీధర్‌, సి.ఈ దేవానంద్‌, ఎస్‌.ఈ వెంకటరమణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.