పారిశ్రామికవాడల్లో ప్రోత్సాహకాలు

తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగడమే కాకుండా, పరిశ్రమలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపేణా రాబడి సమకూరుతుంది. అందువల్ల రాష్ట్రంలో ఇప్పటికే టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో పలు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి, అక్కడ నీరు, విద్యుత్‌, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతి సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఉద్యోగులు, కార్మికుల వసతి కోసం భూములు కేటాయించారు. సరుకు రవాణా కోసం తగిన ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల్లో 15 ఎకరాల నుంచి 2,500 ఎకరాల విస్తీర్ణంలో లేఔట్లను అభివృద్ధి చేశారు. పలువురు పారిశ్రామికవేత్తలు ఎన్నో బడా పరిశ్రమలను వాటిలో స్థాపించి ఉత్పత్తులను ప్రారంభించారు. ఇంకా వివిధ పారిశ్రామిక వాడల్లో కొన్ని ప్లాట్లు పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని సౌకర్యాలు కలిగి ఉండడంతో పరిశ్రమ స్థాపించడానికి అన్ని విధాల అనువుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడానికి గాను వివిధ పారిశ్రామిక వాడల్లో ఉన్న ప్లాట్లను కేటాయించడానికి నిర్ణయించుకున్నది. ఆయా ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవాడల్లోని ప్లాట్లను అర్హతలు, రిజర్వేషన్లు, ప్రాజెక్టు నివేదిక తదితర అంశాల ఆధారంగా కేటాయించనున్నారు. ప్రత్యేకంగా నిర్ణయించిన జోన్లలో నిర్దేశించిన పరిశ్రమలను స్థాపించాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో స్థానిక అవసరాలు, ముడిసరుకు లభ్యత ఆధారంగా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. ఆయా పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వం సూచించిన పరిశ్రమలనే స్థాపించాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని సైబరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మేడ్చల్‌-సిద్ధిపేట, నిజామాబాద్‌, పటాన్‌చెరు, శంషాబాద్‌, వరంగల్‌, యాదాద్రి మొత్తం తొమ్మిది జోన్లుగా విభజించింది. ఆయా జోన్లలో ఏఏ పరిశ్రమలు స్థాపించాలో నిర్దేశించింది. 

జోన్లవారీగా ఏఏ పరిశ్రమలు స్థాపించాలో తెలియచేసింది. సైబరాబాద్‌ జోన్‌ వికారాబాద్‌ పరిధిలో జనరల్‌ ఇంజనీరింగ్‌, స్టీల్‌రేరోలింగ్‌, ఆటోమోటివ్‌ ఆధారిత యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కరీంనగర్‌ జోన్‌ కుందనపల్లిలో ఆటోమోటివ్‌ ఆధారిత యూనిట్లు, ఖమ్మం పరిధిలోని భద్రాచలం, కొత్తగూడెంలలో ఏవైనా పరిశ్రమలు పెట్టుకోవచ్చు. బుగ్గపాడులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యునిట్లు పెట్టుకోవాలి. మేడ్చల్‌-సిద్ధిపేట పరిధిలోని బండమైలారంలో ఆటో ప్రాసెసింగ్‌ యునిట్లు, బీటీపార్క్‌లో బయోటెక్‌, కర్కపట్లలో బయోఫార్మా, జీడిమెట్లలో హౌజింగ్‌, తూఫ్రాన్‌లో ఆటోమోటివ్‌ యునిట్లు నెలకొల్పాలి. మిగిలిన చోట్ల ఏవైనా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. 

నిజామాబాద్‌ జోన్‌ బోధన్‌లో ఆటోమోటివ్‌ పరిశ్రమలు పెట్టుకోవాలి, మిగతాచోట్ల ఏవైనా పరిశ్రమలు ఏర్పాటు చేసు కోవచ్చు. పటాన్‌చెరు జోన్‌లో పాశమైలారం, ఐడీఏ ఇంద్ర కరణ్‌, బుచినేపల్లిలో మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌, ఎలుమల టెక్స్‌టైల్‌ పార్క్‌, ఇవికాక ఆయిల్‌, మెడికల్‌, కార్గో తదితర పరిశ్రమలకు రిజర్వు చేశారు. శంషాబాద్‌ జోన్‌ పరిధిలో ఆదిభట్ల, మహేశ్వరం, కొంగరకలాన్‌, ఇబ్రహీంపట్నం, నాదర్‌ గుల్‌, మంకాల్‌, జడ్చర్ల ప్రాంతాలలో ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్‌ సోలార్‌, రైస్‌హబ్‌, ప్లాస్టిక్‌, గ్రీన్‌ ఇండస్ట్రీలకు, మహేశ్వరం, ఐసీపాలెంలలో జనరల్‌ కేటగిరీ పరిశ్రమల కోసం కేటాయిం చారు. వరంగల్‌ జోన్‌లో రాంపూర్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, మడికొండ టెక్స్‌టైల్‌ పార్క్‌ కల్లెమ్‌లలో టెక్స్‌టైల్‌, ఐటీ, జనరల్‌ కేటగిరీ పరిశ్రమలకు ప్లాట్లు కేటాయిస్తారు. యాదాద్రి లోని ఐడీఏ కోదాడలో జనరల్‌ కేటగిరీకి, రాయిరావ్‌పేటలో ఎస్‌ఎంఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్లాట్లకోసం టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ఐఐసీ వారు కోరారు.