భాగ్యనగర వైభవం మరింత పెంచండి: ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌

విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్‌ మహానగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపు నిచ్చారు. కొత్తగా ఎన్నికైన మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా రెడ్డి, టి.ఆర్‌.ఎస్‌ కార్పొరేటర్లు ముఖ్యమంత్రిని ప్రగతిభవన్‌లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి, కర్తవ్యబోధ చేశారు.

ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ మాట్లాడుతూ…. కోట్లాది మందిలో కేవలం కొద్దిమందికి మాత్రమే సందర్భం కలసివచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి హితవు పలికారు.

పదవిలో ఉన్నవారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరంలేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాలలో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీదగ్గరికి వచ్చే వాళ్ళ కులం, మతం చూడవద్దు. ప్రతి ఒక్కరినీ ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓప్పిగా వినాలి. చేతనయినంత సాయం చేయాలి. అబద్ధాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ‘గల్లీ చిన్నదీ గరీబోళ్ళ కథ పెద్దది’ అనే గోరేటి వెంకన్న పాట వినండి. నేను వందసార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్‌, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారిబాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలని సి.ఎం చెప్పారు.

హైదరాబాద్‌ నగరానికి అనేక అనుకూలతలు ఉన్నాయి. మంచి భవిష్యత్తు ఉంది. నిజమైన విశ్వనగరం ఇది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేకమంది ఉన్నారు. నగరంలో సింథ్‌ కాలనీ ఉంది. గుజరాతీ గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాలీలున్నారు. మార్వాడీలు న్నారు. ఖాయస్సులున్నారు. ఇలా విభిన్న ప్రాంతాలవారు, విభిన్న మతాలవారు, విభిన్న సంస్కృతులవారు ఉన్నారు. వారంతా హైదరాబాదీయులుగా గర్విస్తున్నారు. హైదరాబాద్‌ ఓ మినీ ఇండియాలాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు  కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లమీద ఉంది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. అన్నివర్గాల ప్రజలను ఆదరించాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. కానీ, ఒక్కరికే మేయర్‌ గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్‌ కావాల్సిన అర్హతలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ, అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకొని, అందరూ కలసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలని సి.ఎం చెప్పారు.

కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

అంతకుముందు జీ.హెచ్.ఎం.సి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రిసైడింగ్ ఆఫీసర్, హైదరాబాదు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. కార్పొరేటర్లు ఆయా భాషల్లో సామూహికంగా ప్రమాణస్వీకారం చేశారు. మొదట తెలుగులో, తర్వాత ఉర్దూ, హిందీ, ఇంగ్షీషు భాషలలో ప్రమాణస్వీకారం చేశారు.